ఏపీ.. ఇండియాలోనే నెంబర్ 2

- ‘సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్’ విడుదల చేసిన ‘యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ 2026’ నివేదికలో వెల్లడి
రాష్ట్ర విభజన గాయాలు, ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు… సంక్షేమం, అభివృద్ధిని పట్టాలెక్కించాల్సిన బాధ్యత మరోవైపు. అయినా ఎక్కడా తగ్గలేదు ఆంధ్రప్రదేశ్. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టి, సమర్థవంతమైన పాలనతో ఏపీ మరోసారి జాతీయ స్థాయిలో సత్తా చాటింది. ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడంలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది.
ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీకి చెందిన ‘సెంటర్ ఫర్ న్యూ ఎకనామిక్స్ స్టడీస్’ విడుదల చేసిన ‘యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ 2026’ నివేదిక ఆంధ్రప్రదేశ్ పాలనా తీరుకు అద్దం పట్టింది. దేశంలోని 28 రాష్ట్రాల్లో 0.66 స్కోరుతో ఏపీ రెండో ర్యాంక్ సాధించింది. చిన్న రాష్ట్రమైన గోవా 0.68తో మొదటి స్థానంలో ఉండగా… దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో మాత్రం ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్‌గా నిలవడం విశేషం. సిక్కిం, కేరళ, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాలను వెనక్కి నెట్టి మరీ ఏపీ ఈ ఘనత సాధించింది.
విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక-ఆర్థిక భద్రత, న్యాయ సేవలు.. ఇలా ఐదు ప్రధాన అంశాల్లోని 60 సూచికలను పరిశీలించి ఈ ర్యాంకులు ఇచ్చారు. ఇందులో ప్రజలకు సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ 0.69 స్కోరుతో దేశంలోనే మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. రెండో స్థానంలో ఉన్న గోవా కంటే ఏపీ ఏకంగా 0.19 పాయింట్లు అధికంగా సాధించి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. మిగతా నాలుగు విభాగాల్లోనూ ఏపీ అగ్రస్థానంలో నిలవడం విశేషం.
ఈ నివేదికలో మరో ఆసక్తికరమైన అంశం ఏంటంటే… తలసరి ఆదాయంలో ఏపీ 13వ స్థానంలో ఉన్నప్పటికీ, ప్రజలకు అవకాశాలు కల్పించడంలో మాత్రం రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్ర ఆదాయ స్థాయికి తగ్గట్టుగా ఏపీకి 0.51 స్కోరు రావాల్సి ఉండగా, అంచనాలను తలకిందులు చేస్తూ 0.66 స్కోరు సాధించింది. అంటే ఉన్న వనరులను అత్యంత సమర్థవంతంగా ప్రజల సంక్షేమం కోసం వినియోగించడంలో చంద్రబాబు ప్రభుత్వం దేశంలోనే అత్యుత్తమ పనితీరు కనబరిచిందని ఈ నివేదిక స్పష్టం చేసింది.
గత రెండున్నరేళ్ల కూటమి ప్రభుత్వ పాలనకు, సంక్షేమం-అభివృద్ధి సమన్వయానికి ఈ ర్యాంక్ ఒక నిదర్శనమని సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ఆకర్షణతో సంపద సృష్టిస్తూనే, సామాన్యుడికి మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా సాగుతున్న చంద్రబాబు మార్క్ పాలనకు ఈ జాతీయ గుర్తింపు మరింత బలాన్నిచ్చింది.
