November 12, 2026

ఆ కుటుంబాల ఆధిపత్యం వద్దు

  • ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతుల్లో ఉండకూడదు
  • పాత పద్దతులకు, దుష్ట పాలనకు సవాల్ విసురుతున్నం
  • విధేయత అంటే బానిసత్వం కాదు
  • నాయకత్వాన్ని గౌరవించాలి
  • కానీ నాయకుడి ప్రతి తప్పును సమర్థించాల్సిన అవసరం లేదు
  • జగన్ .. ప్రజలు తిరస్కరించింది ప్రశ్నలను సహించని మీ రాజకీయ సంస్కృతిని
  • వైసీపీ కార్యకర్తలూ.. మా పార్టీలోకి వచ్చేయండి
  • బాబు పాలన పెద్దలకు సకల సౌకర్యాలు.. పేదోళ్లకు మాత్రం వడ్డింపులు
  • కోట్ల విరాళాలిచ్చే బిజినెస్ మాగ్నెట్స్ కు 99 పైసలకు భూమూలిస్తుంటే.. ఓట్లేసే ప్రజల్ని మాత్రం ట్యాక్సుల, ధరల పెంపుతో నడ్డి విరుస్తున్నరు
  • మేం అధికారంలోకి వస్తే వెయ్యి కాళ్ల మండపం పునర్ నిర్మిస్తాం
  • ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు
  • వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు
  • ఏపీ మరో తమిళనాడు ఎందుకు కాకూడదు?
  • పరివర్తన రాజనీతి పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ వేణుంబాక విజయసాయిరెడ్డి
  • కొత్త పార్టీ పేరు ప్రకటించిన విజయసాయిరెడ్డి

విజయవాడ: కనకదుర్గమ్మ తల్లి కొలువైన విజయవాడకు నా హృదయపూర్వక నమస్కారం. నా ఇష్టదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ, ఆ దైవాల ఆశీస్సులతో ఈ కొత్త రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాను.
ఈ పవిత్రమైన నేల మీద నా మొదటి మాట అబద్ధం కాకూడదు. నేను ఒక్కడినే ఆంధ్రప్రదేశ్‌ని మార్చేస్తాను అని చెప్తే, ఈ వేదికపై నేను చెప్పే మొదటి అబద్ధం అదే అవుతుంది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ ఒక్క నాయకుడి చేతుల్లో ఉండకూడదు. నా చేతుల్లో కూడా కాదు. అది మీ చేతుల్లో ఉండాలి. ప్రజల పాత్ర ఓటు వేసిన రోజుతో ముగియదు. అక్కడే మొదలవుతుంది.
కానీ ఇవాళ ప్రభుత్వం తాను చేసిన మంచి పనుల గురించి మాత్రమే చెప్తోంది. తన తప్పును తానే ఆడిట్ చేసుకునే వ్యవస్థ కనిపించడం లేదు. విపక్షానికి ప్రభుత్వం చేసిన ప్రతిదాంట్లో తప్పే కనిపిస్తోంది. మంచి జరిగిందని ఒప్పుకోవడం అవమానం అనుకుంటోంది. మంచి పని ఎవరు చేసినా అభినందించాలి. తప్పు ఎవరు చేసినా రుజువుతో ప్రశ్నించాలి. అది నేనైనా.. బాబు గారైనా ..జగన్ గారైనా.

ఈ పార్టీమీకు ఇంకో నాయకుడిని ఇవ్వడానికి కాదు. మీలోని నాయకత్వానికి చోటివ్వడానికి. ఆ భాగస్వామ్యానికి, ఆ సంకల్పానికి ఈరోజు మనం పెట్టుకున్న పేరు పరివర్తన రాజనీతి పార్టీ ఐదు కోట్ల ఆంధ్రుల్ని ఓ రెండు కుటుంబాలే శాసిస్తున్నయన్నది నా ఆవేదన. ఆ కుటుంబాల ఆధిపత్యం వద్దు. ఆ అహంకారపు నాయకత్వం వద్దే వద్దు. భారీ తుపాన్ కు ముందు గంభీరమైన ప్రశాంతత ఎట్లుంటదో, రాబోయే రాజకీయ ప్రక్షాళనికి ముందు అట్లాంటి ప్రశాంతతే ఇక్కడ కన్పిస్తోంది.

పాలకుల అరాచక పాలనపై విస్పోటనం ఏ స్థాయిలో ఉంటదో వాళ్ల ఊహకే వదిలేద్దాం. ఇక్కడ ఓ పార్టీని ప్రారంభించడం లేదు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పాత పద్దతులకు, దుష్ట పాలనకు సవాల్ విసురుతున్నం. పొలిటికల్ స్క్రీన్ పై కొత్త సంస్కృకితి పునాది వేస్తున్నం. ఇది నా ఒక్కడి ప్రయాణం కాదు. ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవ పోరాటం. నా రాజకీయ ప్రయాణం – పదవులు వారసత్వంగా రాలేదు. ఈ పొలిటికల్ లైప్ లో ఓ విషయం గర్వంగా చెప్పగలను. నాకొచ్చిన పదవులు తాత, తండ్రుల నుంచి వచ్చిన వారసత్వపు కానుకలు కావు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఓ చార్టెర్డ్ అకౌంటెంట్ గా జీవితం ప్రారంభమై, నా కష్టంతో, నా అనుభవంతో, నా రాజకీయ నిబద్ధతతో ఎంపీ స్థాయికి ఎదిగాను.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణంలో నేను ఒక భాగస్వామిని. ఆ పార్టీని ఇటుక ఇటుక పేర్చి నిర్మించడంలో నా కృషి ఉంది. ఆ పార్టీ కోసం పనిచేశాను. ఆ నాయకత్వం కోసం నిలబడ్డాను. కార్యకర్తలతో కలిసి ప్రయాణించాను. కానీ చివరకు నాకు దక్కింది ఏమిటి? గౌరవమా? గుర్తింపా? బాధ్యతా? కానే కాదు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడిన వ్యక్తికి అవమానం…
కొలిమిలో కాలిన ఇనుముకు సైతం సమ్మెట పోటు తప్పలే.. జగన్ తో నా అనుబంధం అట్లాంటిందే. నేను ఒక విషయం స్పష్టంగా చెప్పదల్చుకున్నా. నేను ఎవరి దగ్గర పదవుల కోసం భిక్ష అడగలేదు. నా ఆత్మగౌరవాన్ని ఎవరి దగ్గరా తాకట్టు పెట్టలేదు. రాజకీయాల్లో విధేయత ఉండాలి. కానీ విధేయత అంటే బానిసత్వం కాదు. నాయకత్వాన్ని గౌరవించాలి. కానీ నాయకుడి ప్రతి తప్పును సమర్థించాల్సిన అవసరం లేదు

జగన్ గారూ.. 2019లో 151 స్థానాలతో ప్రజలు మీకు అద్భుతమైన విజయాన్ని ఇచ్చారు. 2024లో అదే ప్రజలు మిమ్మల్ని కేవలం 11 స్థానాలకు పరిమితం చేశారు. ఒక్కసారి ఆలోచించండి. 151 నుంచి 11కి ఎందుకు పడిపోయారు? ప్రజలు సంక్షేమాన్ని తిరస్కరించారా? కాదు. ప్రజలు .. పేదలకు అందించిన సహాయాన్ని తిరస్కరించారా? కాదు. ప్రజలు తిరస్కరించింది మీ అహంకారాన్ని. ప్రజలకు దూరమైన… మీ నాయకత్వాన్ని. ప్రశ్నలను సహించని మీ రాజకీయ సంస్కృతిని.

ప్రజాస్వామ్యంలో నాయకుడు ప్రజల మధ్య ఉండాలి. ప్రజల సమస్యలు వినాలి. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవించాలి. కానీ నాయకుడి చుట్టూ గోడలు కట్టుకుంటూ పోతే ప్రజలకు నాయకుడికి మధ్య దూరం పెరిగిపోతే, చివరకు ఆ ప్రజలే ఇట్లాంటి తీర్పు చెబుతారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు నా విజ్ఞప్తి ఒక్కటే. మీరు పార్టీ కోసం కష్టపడ్డారు. మీ కుటుంబాలను పక్కన పెట్టి పనిచేశారు. మీ చెమటతో పార్టీని బలోపేతం చేశారు. మీకు గౌరవం కావాలంటే, మీకు… నాయకత్వంలో భాగస్వామ్యం కావాలంటే, మీకు ప్రజాసేవ చేయాలనే సంకల్పం ఉంటే, మీకు మా తలుపులు తెరిచే ఉంటాయి.

చంద్రబాబు గారికి కూడా మా ప్రశ్నలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారూ.. మీరు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మారు. మీకు అధికారం అప్పగించారు. ఇప్పుడు ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీపై, మీ ప్రభుత్వంపై ఉంది. ఎన్నికల ముందు పోస్టర్లలో కనిపించిన హామీలు, అమల్లో ఎందుకు కన్పించడం లేదు? రాష్ట్ర అప్పులు పెరుగుతున్నాయి. అభివృద్ధి వేగం ఎక్కడా మరీ ?

యువతకు ఉద్యోగాలు ఎక్కడున్నాయి? రైతులకు శాశ్వత భరోసా ఎక్కడ? ప్రభుత్వం ప్రజల సమస్యల పరిష్కారానికి అసలు సమయం కేటాయిస్తోందా? లేదంటే రాజకీయ కేసులు, ప్రత్యర్థులపై విమర్శలు,దాడులు పైనేనా ? ప్రజలకు కావాల్సింది రాజకీయ ప్రతీకారం కాదు. పాలనలో ఫలితాలు. పోస్టర్లలో అభివృద్ధి చూపించడం కాదు.ప్రజల జీవితాల్లో అభివృద్ధి చూపించండి.

ఆనాటి మీ వెన్నుపోటు కాలం కాదు ఇదీ బాబు గారు. మీ రౌడీయిజం, గుండాయిజం,మందు బలం, మంద బలం, డబ్బు బలమే.మీ బలంగా, మీ పార్టీ బలంగా, మీ పాలన బలమని నమ్మితే ఇదీ ప్రశ్నించినోళ్లపై రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తమంటే మీ పార్టీ పాతాళానికి పతనం కావడానికి ఎక్కువ రోజులు లేవనిపిస్తోంది. మేం అధికారంలోకి వస్తే మీలాగా ఉత్తుత్తి కాగితం బాండ్లు ఇవ్వం సీబీఎన్ గారు..ఇంటికో పారిశ్రామికవేత్త అనే పాల్స్ ప్రామిసెస్ చేయ్యం. చిత్తశుద్దితో నా రాష్ట్ర ప్రజలను స్వయం సమృద్దిలుగా చేయడమే మా ఉద్దేశ్యం… మా ఆశయం..మా పార్టీ లక్ష్యం.

ఇక చంద్రబాబు గారి పాలన ఏట్లుంది అంటే.. ఐన వారికి అరటి ఆకుల్లో , కాని వారికి కంచాల్లో అన్నట్లు పెద్దలకు సకల సౌకర్యాలు, పేదోళ్లకు మాత్రం వడ్డింపులు. కోట్ల విరాళాలిచ్చే బిజినెస్ మాగ్నెట్స్ కు 99 పైసలకు భూమూలిస్తుంటే, ఓట్లేసే ప్రజల్ని మాత్రం ట్యాక్సుల, ధరల పెంపుతో నడ్డి విరుస్తున్నరు.

మన ఆంధ్ర రాష్ట్ర దురదృష్టమేంటంటే.. ఒక నాయకుడు విజనరీ అని డప్పుకొట్టుకుంటే, ఇంకో నాయకుడు ప్రజా నాయకుడని ప్రచారం చేసుకుంటడు. కానీ ప్రజల నాయకుడు ఎలా ఉండకూడదో వీళ్లద్దర్ని బెస్ట్ ఎగ్జాంపుల్ గా చూపొచ్చు. లీడర్ అనే వాడికి ప్రజల బాధను అర్థం చేసుకునే ఎమోషనల్ కనెక్టివిటీ ఉండాలి. సమస్యలను విశ్లేషించి పరిష్కారం చూపించే లాజికల్, రేషనల్ థింకింగ్ ఉండాలి. ఆలోచనలను కార్యరూపంలో పెట్టి ఫలితాలు సాధించే ఎగ్జిక్యూషన్ సామర్థ్యం ఉండాలి. ఇవన్నీ ఉన్నట్లు గోబెల్స్ప్రచారం చేసుకోవడంలో బాబు గారు మాత్రం దిట్ట.

ఇక మనం పురిటిలో ఉన్నప్పుడే మనపై .. మన పార్టీపై అసత్య ప్రచారాలతో మీడియా, సోషల్ మీడియాలో తమ అనుకూల వేదికల్లో అప్పుడే విమర్శలకు తెర లేపారు. మనది జగన్ వదిలిన బాణమని ఒకరు ప్రచారం చేస్తూంటే, బాబు బ్యాచే అంటూ ఇంకో పార్టీ ప్రచారం చేస్తుంది. మీ అందరి ముందు ప్రమాణం చేస్తున్నా. మన పార్టీ ఎవరికీ బీ-టీమ్ కాదు. ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం పుట్టిన పార్టీ అసలు కాదు. ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మాత్రమే జవాబుదారీ …

2029 ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని చోట్ల పోటీ చేద్దాం.. పోటీ చేసిన అన్ని చోట్ల సత్తా చాటుదాం. మన పార్టికి మరో ప్రధానాంశం సామాజిక న్యాయం.బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల ప్రజలు ఎన్నికల సమయంలో గుర్తుకొచ్చే ఓటర్లు మాత్రమే కాదు. వారు ఈ రాష్ట్రాన్ని నిర్మిస్తున్న శక్తులు. వారి ఓట్లు కావాలి. వారి శ్రమ కావాలి. వారి జనసమీకరణ కావాలి. కానీ వారికి నాయకత్వం ఇవ్వడంలో వెనకడుగు ఎందుకు? స్వలాభం కోసం ఆ రెండు పార్టీలు కులాల మధ్య కుంపట్లు రాజేస్తున్నయి. ఈ రచ్చ మన రాష్ట్రంలోనే ఎందుకు ? ఈ పరిస్థితి మారాలి. ఈ కుల వ్యవస్థను పటాపంచలు చేసే బాధ్యత తీసుకుంటానని మాటిస్తున్నా…

ఆంధ్ర రాష్ట్ర దేవాలయాల విషయానిస్తే చాలా బాధకరమైన విషయాలు చెప్పుకోవాలి. ఆలయా లపై పెత్తనం చెల్లాయిస్తూ, టెంపుల్ ఆదాయాల్ని పందికొక్కుల్లా మెక్కుతూ సామాన్య భక్తుల దర్శనాలను సైతం పైసామే పరమాత్మలా మార్చేశారు. మన పార్టీ అధికారంలోకి వస్తే దేవాలయ పాలకమండళ్లు రాజకీయ నిరుద్యోగులకు ఆవాస కేంద్రాలుగా కాకుండా హిందూ ధర్మం , హిందూ దేవుళ్లపై అత్యంత విశ్వాసం కల్గిన ధర్మబద్దులకు ఆ బాధ్యతలు అప్పగిస్తం. తిరుపతిలో వెయ్యి కాళ్ల మండపం తిరిగి పునర్నిమిస్తాం. ఈ రెండు పార్టీలు చివరకు ఎంత తెగించాయంటే కోట్లాది హిందువుల అత్యంత విశ్వాసమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని సైతం వాళ్ల రొచ్చు రాజకీయాల్లోకి లాగారు. లడ్డు కల్తీ పేరుతో హిందూ మనోభావాలతో ఆటలాడుకున్నారు.

తెలుగు రాజకీయ చరిత్రలో విధ్వంసకర ఈ రెండు కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాల్సిన తరుణం ఆసన్నమైంది. 2014లో రాష్ట్ర అప్పులు సుమారు లక్ష కోట్లుంటే, ఈ పుష్కర కాలంలో రాష్ట్ర అప్పులు పది లక్షల కోట్ల స్థాయికి చేరాయన్నది బహిరంగ రహస్యమే. ఇంత భారీ అప్పులు చేసినా …ఈ రాష్ట్రం అభివృద్దికి ఏమైనా నోచుకుందా ..సంపద ఏమైనా సృష్టించిందా? రైతు సమస్యలు అట్లే ఉన్నయి.

పాలనలో భాగంగా ప్రభుత్వం అప్పులు చేయవచ్చు. కానీ ఆ అప్పులతో సంపద సృష్టించేలా ఉండాలే. పరిశ్రమలు రావాలి. ఉద్యోగాలు రావాలి. సాగునీరు అందాలి. ప్రజల ఆదాయం పెరగాలి. అప్పులు మాత్రమే పెరగడం అభివృద్ధి కాదు. ప్రజల జీవితాలు మెరుగుపడటమే నిజమైన అభివృద్ధి.

ఏ పార్టీ నుంచి వచ్చినా సరే ప్రజల కోసం పనిచేసిన చరిత్ర ఉండాలి. ప్రజల కోసం పనిచేస్తమనే ఆలోచన ఉండాలి. ప్రజల పట్ల నిబద్ధత ఉండాలి. మా పార్టీలో అవినీతికి చోటు లేదు. అక్రమాలకు రక్షణ లేదు. ప్రజల నమ్మకాన్ని ద్రోహం చేసే వారికి స్థానం లేదు. పదవులు అర్హత ఉన్నవారికే… గుర్తింపు కష్టపడేవారికి… నాయకత్వం ప్రజల కోసం పనిచేసేవారికే.

ఈ రాష్ట్ర యువతకు మాటిస్తున్నా. ఉద్యోగం కోసం, భృతి కోసం మీరెందుకు రాష్ట్రం వదిలి వెళ్లాలి? యువతను ఎన్నికల సమయంలో జెండాలు మోయడానికి మాత్రమే ఉపయోగించుకునే రాజకీయాలు మనకు వద్దు. అందుకే మా పార్టీ తరఫున పోటీ చేసే ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల్లో 66 శాతం టికెట్లు జెన్-జీ మరియు యువతకు కేటాయిస్తాం. కోట్ల రూపాయల ఆస్తులు అవసరం లేదు. యువతకు కటౌట్లు పెట్టే పని కాదు… చట్టసభల్లో కూర్చోబెట్టే పని చేయాలి!

ఆంధ్రప్రదేశ్ అంటే ఒక్క ప్రాంతం కాదు. ఉత్తరాంధ్ర మనదే. రాయలసీమ మనదే. కోస్తాంధ్ర కూడా మనదే. రాయలసీమకు సాగునీరు కావాలి. పరిశ్రమలు కావాలి. యువతకు ఉద్యోగాలు కావాలి. ఉత్తరాంధ్రకు తాగునీరు కావాలి. మౌలిక సదుపాయాలు కావాలి. స్థానిక యువతకు ఉపాధి కావాలి. ప్రాంతాల మధ్య వివక్ష ఉండకూడదు.

మన పార్టీ రైతు పక్షపాతి, మహిళ పక్షపాతి, ఉద్యోగుల పక్షపాతి, వ్యాపారుల పక్షపాతి. రైతు పంట పండించలేని రాష్ట్రంలో, రైతన్నపై రాజకీయ నాయకుల ప్రసంగాలు ఉదరగొడితే ఉపయోగం ఏమిటి? మన పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఎకరానికి రెండు పంటలకు సాగునీరు అందించేందుకు కృషి చేస్తాం. నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుతాం. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయడానికి ప్రాధాన్యత ఇస్తాం. రైతుకు గిట్టుబాటు ధర, కౌలు రైతుకు భరోసా కల్పిస్తాం. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు కల్పిస్తాం. మనం అధికారంలోకి వస్తే మూడు నెలలకోసారి ప్రభుత్వ ఆదాయం, ఖర్చులు, అభివృద్ది పనులపై శ్వేత పత్రం విడుదల చేస్తం

తమిళనాడులో మూడో ప్రత్యామ్నాయం సాధ్యమైనప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కాదు? ఆ రాష్ట్రంలో దశాబ్దాలుగా రెండు ప్రధాన రాజకీయ శక్తుల ఆధిపత్యం కొనసాగింది. అయినా కొత్త రాజకీయ శక్తులు ఆ ఆధిపత్యానికి సవాల్ విసిరే స్థాయికి ఎదగగల్గాయి.

అలాంటప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎందుకు సాధ్యం కాదు? ఇక్కడ కూడా రెండు కుటుంబ పార్టీల రాజకీయ ఆధిపత్యానికి ప్రజలు ప్రత్యామ్నాయం సృష్టించలేరా? ప్రజలు నిర్ణయించుకుంటే ఏ రాజకీయ గోడా శాశ్వతం కాదు. రెండు పార్టీలే ఉండాలి. రెండు కుటుంబాలే పాలించాలి. మూడో ప్రత్యామ్నాయం రావద్దు అని ఎవరైనా శాసించగలరా?

ఇది ఒక పార్టీ ప్రారంభం మాత్రమే కాదు. ఇది రెండు కుటుంబాల రాజకీయ ఆధిపత్యానికి ప్రజాస్వామ్య సవాల్. ఇది పాత రాజకీయాలకు ముగింపు పలికి, కొత్త రాజకీయాలకు నాంది పలికే సమయం. మేల్కో యువతరం. కదలిరా నవతరం. మన నినాదమే వందేమాతరం.

Total Visitors: 3,364,394