November 12, 2026

కొత్త నాయకత్వం… కొత్త సామాజిక సమీకరణాలు… భవిష్యత్తుకు బలమైన పునాదులు!

  • ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో పెనుమార్పులు తెచ్చిన స్థానిక సంస్థల ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. ప్రజాభిమానం, పార్టీ పట్ల విధేయత, కార్యకర్తల నిరంతర కృషి ఫలితంగా సుమారు 45 సంవత్సరాల వయస్సు కలిగిన యువ నాయకత్వం పెద్ద సంఖ్యలో పరిపాలనా రంగంలోకి అడుగుపెట్టడం ఒక గొప్ప పరిణామం.

అదే సమయంలో మహిళలు, మరీ ముఖ్యంగా ముస్లిం మహిళలు పెద్ద సంఖ్యలో పాలనా పగ్గాలు చేపట్టేందుకు ముందుకు రావడం ప్రజాస్వామ్యానికి శుభపరిణామం. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లను అనుకున్న విధంగా పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయినప్పటికీ, పార్టీ నాయకత్వం సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ బడుగు, బలహీన వర్గాలకు అధిక సంఖ్యలో అవకాశాలు కల్పించడం అభినందనీయం.

ఇంతవరకు రాజకీయాలకు దూరంగా ఉన్న అనేక సామాజిక వర్గాల వారు రాజకీయ రంగ ప్రవేశం చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయంగా నిలిచిపోతుంది. కొత్తగా ఎన్నికైన కొందరి నేపథ్యాలను పరిశీలిస్తే , నిజంగా అద్భుతాలు జరిగినట్లు అనిపిస్తుంది. చిక్కు వెంట్రుకలు అమ్ముకుని జీవనం సాగించే ఒక సాధారణ మహిళ ZPTC సభ్యురాలిగా ఎన్నిక కావడం ప్రజాస్వామ్యం అందించిన అవకాశానికి గొప్ప ఉదాహరణ. సామాన్యుల జీవితాల్లోకి రాజకీయ అధికారం చేరువ కావడానికి ఇది నిదర్శనం.

ఇలాంటి నాయకత్వాన్ని తయారుచేసి, బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు , పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , యువత, మహిళలు, విద్యార్థుల మనస్సులను గెలుచుకుంటూ కార్యకర్తల సంక్షేమానికి అండగా నిలుస్తున్న నారా లోకేష్ నిజంగా అదృష్టవంతులు.

ఎందుకంటే వారి నాయకత్వంలో పార్టీకి ఒక కొత్త తరం నాయకత్వ సైన్యం అందుబాటులోకి వచ్చింది. వారి నాయకత్వానికి ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ కూడా రాష్ట్ర అభివృద్ధికి ఆశాజనకమైన సంకేతం. ఈ విజయాలు మరో 30 సంవత్సరాల పాటు పార్టీ పునాదులను పటిష్టం చేయగలవని చంద్రబాబు నాయుడు పేర్కొనడం ఎంతో ప్రాధాన్యత కలిగిన విషయం.

అయితే అసలు పరీక్ష ఇప్పుడే ప్రారంభమవుతుంది!

గెలిచిన వారిని అభినందించడం ఒక బాధ్యత. కానీ వారిచేత సమర్థవంతంగా పనిచేయించుకోవడం అంతకంటే ముఖ్యమైన బాధ్యత. ఇప్పుడు ప్రజల ముందున్న ఈ కొత్త ప్రజాప్రతినిధులు కడిగిన ముత్యాల్లాంటి వారు. వారికి సరైన మార్గదర్శకత్వం, పరిపాలనా అవగాహన, ప్రజాసేవ పట్ల నిబద్ధత కల్పించాలి. అదే సమయంలో ఈ కొత్త నాయకత్వంపై బురదజల్లే ప్రయత్నాలు జరగవచ్చు. రాజకీయ ఒత్తిళ్లు, వ్యక్తిగత విభేదాలు, తప్పుడు ప్రచారాల నుంచి వారిని కాపాడుకోవాలి.

వారికి గ్రామస్థాయి సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగం, పారదర్శకత, ప్రజలతో నిరంతర సంబంధాలు వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. ముఖ్యంగా అనుభవజ్ఞులైన పార్టీ కార్యకర్తలు, స్థానిక నాయకులు, పరిపాలనా పరిజ్ఞానం ఉన్న వ్యక్తులను వారికి మార్గదర్శకులుగా నియమించాలి. తెలియని విషయాల్లో సహాయం అందించే ఒక సమర్థవంతమైన సహాయక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. కొత్త ప్రజాప్రతినిధులు ప్రజలకు మంచి పనులు చేసి ప్రజాభిమానాన్ని సంపాదించాలి. తద్వారా ప్రజల విశ్వాసంతో పాటు పార్టీ గౌరవం, ప్రతిష్ఠ కూడా పెరగాలి.

పార్టీ నాయకత్వానికి ఒక నిర్మాణాత్మక సూచన

కొత్తగా ఎన్నికైన ఎంపిటిసి, జడ్పీటీ సీలు, సర్పంచులు, మున్సిపల్ వార్డు సభ్యులు, చైర్మన్లకు మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో రెండు లేదా మూడు రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించాలి. నాయకత్వ లక్షణాలు, ప్రజాసేవ, పారదర్శకత, గ్రామసభలు, ప్రభుత్వ పథకాలు, నిధుల వినియోగం, పార్టీ పట్ల బాధ్యత వంటి అంశాలపై వారికి అవగాహన కల్పించాలి. అనుభవజ్ఞులైన కార్యకర్తల సహకారంతో ప్రతి ప్రజాప్రతినిధికి మార్గదర్శకత్వం అందించాలి.

చివరగా ఒక మాట…

ఎన్నికల్లో గెలిచిన వ్యక్తులు పార్టీకి వచ్చిన విజయాలు మాత్రమే కాదు. వారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన బాధ్యత కలిగిన ప్రజాసేవకులు. వారిని గెలిపించడం మొదటి విజయం. వారిని సమర్థులైన ప్రజాప్రతినిధులుగా తీర్చిదిద్దడం రెండో విజయం. వారి ద్వారా ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం అసలైన విజయం.
కొత్త నాయకత్వాన్ని కాపాడుకుందాం… వారికి మార్గం చూపుదాం… వారి ద్వారా ప్రజలకు మంచి పరిపాలన అందిద్దాం. ఇదే తెలుగుదేశం పార్టీకి రాబోయే మూడు దశాబ్దాల బలమైన పునాది కావాలి!

  • పొన్నం శ్రీరాములు
    ( రిటైర్డ్ హెడ్మాస్టర్, టీడీపీ శాశ్వత సభ్యుడు)
    మురుగుళ్ల ఆత్మకూరు, నెల్లూరు జిల్లా.
Total Visitors: 3,364,396