November 12, 2026

మన చరిత్రను తెలుసుకుందాం..మన మూలాలను గౌరవిద్దాం.. భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడుకుందాం

భారతదేశ చరిత్రను పరిశీలించినప్పుడు ఒక విషయం గుర్తుంచుకోవాలి. చరిత్రలో దేవతలు, రాక్షసులు అనే విభజనలు కేవలం ఆధ్యాత్మిక కథనాలుగానే కాకుండా, అప్పటి సామాజిక, సాంస్కృతిక ఆధిపత్యాల ప్రతిబింబాలుగా కూడా చూడాల్సిన అవసరం ఉంది.

బలవంతులు రాసిన చరిత్రలో తమను దేవతలుగా, తమకు భిన్నమైన సంస్కృతులను రాక్షస సంస్కృతులుగా చిత్రీకరించారనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. ఉత్తరాది సంప్రదాయాల్లో ఇంద్రుడికి ప్రాధాన్యత, దక్షిణాది సంప్రదాయాల్లో శివారాధన, స్థానిక మూల సంస్కృతుల ప్రాధాన్యత వంటి అంశాలను చారిత్రక దృష్టితో పరిశీలించాలి.
నా ఈ పోస్టు ఉద్దేశం ప్రజలను విడదీయడం కాదు.

మన తాతముత్తాతలను, మన పూర్వీకులుగా భావించే పాత్రలను రాక్షసులుగా చిత్రీకరించిన కథనాలను ప్రశ్నించకుండా అంగీకరించడం, అదే సమయంలో దసరా రోజున వారిని దహనం చేయడంలో భాగస్వాములు కావడం వెనుక ఉన్న చారిత్రక, సాంస్కృతిక కోణాలను ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పడమే నా ఉద్దేశం.

మన దేశ సంస్కృతి ఒక్క సంప్రదాయంతో ఏర్పడలేదు. వైదిక సంప్రదాయం, శైవ సంప్రదాయం, జైనం, బౌద్ధం, సిక్కు మతం, అలాగే ఈ నేలపై వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న స్థానిక మూల సంస్కృతులు, అమ్మవారి ఆరాధనా సంప్రదాయాలు… ఇలా ఎన్నో వైవిధ్యాల సమ్మేళనమే మన భారతీయ నాగరికత.

ఉత్తరాది ప్రజలు రావణుడి దహనాన్ని తమ సంప్రదాయంగా జరుపుకుంటే మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అది వారి విశ్వాసం, వారి సంస్కృతి.

అయితే రావణుడిని తమ పూర్వీకుల సంస్కృతికి ప్రతీకగా భావించే దక్షిణాది ప్రజలు కూడా అదే ఆచారాన్ని ఆలోచించకుండా అనుసరించాలా? మన చారిత్రక మూలాలు, సాంస్కృతిక ఆత్మగౌరవం గురించి ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదా?

ఒకరి ఆచారం మరొకరికి అవమానంగా మారకూడదు. ఒకరి విశ్వాసం మరొకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు.
మన ధర్మాన్ని మనం ఆచరిస్తూనే ఇతర ధర్మాలను గౌరవించాలి. ఏ సంప్రదాయంలోనైనా ఇతరులను కించపరిచే అంశాలు ఉంటే వాటిని సమీక్షించుకుని, పరస్పర గౌరవంతో కలిసి జీవించే సంస్కృతిని పెంపొందించుకోవాలి.
భారతదేశం బలపడాలంటే మతాల మధ్య ఆధిపత్య పోరు కాదు, పరస్పర గౌరవం అవసరం. విభజనలు కాదు, ఐక్యత అవసరం.

మన మూలాలను తెలుసుకుందాం. మన సంస్కృతిని గౌరవిద్దాం. ఇతరుల విశ్వాసాలను గౌరవిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధిద్దాం.

ఇదే నా అభిప్రాయం. ఈ పోస్టును మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నంగా కాకుండా, చరిత్రను తెలుసుకోవడానికి, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి, సామాజిక ఐక్యతను పెంపొందించడానికి చేసే ఒక ఆలోచనగా చూడాలని కోరుతున్నాను.

  • నేతి మహేశ్వరరావు
    (ఆమ్ ఆద్మీ పార్టీ, కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం)
Total Visitors: 3,366,442