‘కమలం’లో కోవర్టులు?

- సీట్ల ఎంపిక, ఖరారు స్థానాలకు టీడీపీకి లీక్ చేసిందెవరు?
- చివరకు రిజర్వేషన్లు కూడా మార్చారంటూ ఆరోపణలు
- అధ్యక్షుడితో సఖ్యతగా ఉంటూనే పార్టీ అంతర్గత సమాచారం చేరవేసిన ఆ నేత ఎవరు?
- దానివల్లనే చాలా స్థానాలు పార్టీకి దక్కలేదంటున్న కమలనాధులు
- ఇటీవలి కాలంలో టీడీపీతో సఖ్యతగా ఉంటున్న ఆ నాయకుడెవరు?
- సత్యకుమార్ యాదవ్, సుజనా చౌదరిని దెబ్బతీసే కుట్ర?
- అనంతపురం, విజయవాడ వెస్ట్‌లో బీజేపీకి పనిచేయని కూటమి నాయకులు
- ఫలితాలపై భగ్గుమంటున్న బీజేపీ దళాలు
- ‘కమలం’లో కొత్త చిచ్చు
( మార్తి సుబ్రహ్మణ్యం)
తాజాగా ఏపీలో జరిగిన మున్సిపల్, జడ్పీ ఎన్నికల్లో బీజేపీ తాను కోరుకున్న స్థానాలు దక్కకపోవడానికి కారణం పార్టీలోని కోవర్టులే కారణమా? ఆ స్థానాల్లో రిజర్వేషన్లు మారి, అగ్రనేతల ఆశలు ఆవిరయ్యేందుకు కారణం కోవర్టు ఆపరేషనేనా? ఫలితంగా చాలామంది అగ్రనేతల పరువుపోయిందా? అధ్యక్షుడితో సఖ్యతగా ఉంటూనే అంతర్గత సమాచారం, గడప దాటించిన ఆ కీలకనేతపై ఇప్పుడు కమలనాధులు గుర్రుగా ఉన్నారా? వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకుండా, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వేళ్లు పెట్టిన సదరు కీలక నేత తీరుపై స్థానిక ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత పంచాయతీ పెడతారా?.. మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే సుజనా చౌదరిని దెబ్బతీసే కుట్రకు తెరలేచిందా? ఇప్పుడు బీజేపీలో జరుగుతున్న చర్చ ఇదే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ తాను కోరుకున్న సీట్లు సాధించలేకపోయిందన్న చర్చకు ఇప్పుడు తెరలేచింది. పోనీ తీసుకున్న సీట్లలోనూ పూర్తి స్థాయి విజయాలు నమోదు చేసుకోని వైఫల్యంపై బీజేపీలో అంతర్మథనం మొదలయింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కార్పొరేషన్లలో 67 మంది కార్పొరేటర్లుగా పోటీ చేస్తే, అందులో 40 మాత్రమే గెలిచారు. 179 మున్సిపల్ కౌన్సిలర్ల స్థానానికి పోటీ చేస్తే, 113 స్థానాల్లో గెలిచింది. 34 జడ్పీటీసీల్లో పోటీ చేస్తే 23 స్థానాలు గెలిచింది. 303 ఎంపీటీసీ స్థానాల్లో పోటీ చేస్తే 169 స్థానాల్లో గెలిచింది.
మామూలుగా అయితే బీజేపీకి ఒంటరిగా పోటీ చేసి ఇన్ని సీట్లు గెలిచే సీన్ లేదు. అసలు అంతమంది అభ్యర్ధులు కూడా దొరకడం కష్టం. కూటమిలో ఉన్నందుకే, బీజేపీకి ఇన్ని సీట్లు సాధించిందనేది నిర్వివాదం.
కానీ కూటమిలో బలమైన టీడీపీ-జనసేన బలాన్ని వాడుకుని, అన్ని సీట్లలో సులభంగా గెలవాల్సిన బీజేపీ.. చాలాచోట్ల చతికిలపడటం పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేసింది. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ, ఎన్నికల ప్రచారంలో సీనియర్ల సేవలు వాడుకోకపోవడమే, ఈ పరాభవానికి కారణమని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
అత్యంత విశ్వసనీయ సమాచారం మేరకు… జిల్లా పార్టీ, జోనల్ ఇన్చార్జిల నుంచి గెలిచే సీట్లు గుర్తించిన బీజేపీ నాయకత్వం ఆ మేరకు ఆ జాబితాను టీడీపీ జాబితాను అందచేసింది.
అయితే ఆ జాబితాను ముందుగానే అనధికారికంగా టీడీపీ కార్యాలయానికి, తమ పార్టీకి చెందిన ఓ రాష్ట్రస్థాయి కీలక నేత ఉప్పందించారన్న చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. రాష్ట్ర అధ్యక్షుడితో సన్నిహితంగా వ్యవహరిస్తూనే, పార్టీకి సంబంధించిన ఎన్నికల సమాచారాన్ని.. సదరు రాష్ట్ర నేత టీడీపీ కార్యాలయానికి అందించారని, అందుకే తమకు కోరుకున్న సీట్లు దక్కలేదని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
తాము కోరుకున్న సీట్లలో ఓసీలే ఎక్కువ ఉన్నారని, కానీ వాటిని విచిత్రంగా ఎస్సీ, బీసీ,మహిళగా మార్చారని, ఇదంతా తమ పార్టీకి చెందిన కీలకనేత కూటమి పార్టీతో కలసి చేసిన నిర్వాకమేనంటున్నారు.
తమకు పడని సొంత పార్టీ నేతలు సీటు ఆశిస్తే.. ఆ జిల్లా నేతలకు ఫోన్లు చేసిన ఆ కీలక నేత, ‘‘ఆ నాయకుడి పేరును సిఫార్సు చేయవద్దు. అతను గెలవడు. కేవలం ఒక్కరి పేర్లే పైకి పంపించండి. మిగిలింది నేను చూసుకుంటా’’ అని ఒత్తిళ్లు చేసినట్లు పార్టీ వర్గాలు బాహాటంగానే చర్చించుకుంటున్నాయి.
ఆ తర్వాత ఆ స్థానాన్ని కోరుకున్న బలమైన నేతల కులం కాకుండా, వేరే కులానికి అక్కడ రిజర్వేషన్ చేయించారంటున్నారు. ఆ రకంగా పార్టీలో అగ్రనేతలు కోరుకున్న స్థానాలను కావాలనే రిజర్వేషన్లు చే యించారని, సొంత పార్టీ కీలక నేత సమాచారం ఇవ్వడ ం వల్లే ఈ కుట్ర జరిగిందని బీజేపీ వర్గాలు మండిపడుతున్నాయి.
నిజానికి రాజమండ్రి, అనంతపురం వంటి స్థానాల్లో ఓసీలను నిలబెట్టేందుకు బీజేపీ అగ్రనేతలు సిద్ధమయ్యారు. ఆ మేరకు ఆ జాబితా కూడా సిద్ధమయింది. అయితే తర్వాత అంతా తారుమారయి, అందుకు భిన్నంగా రిజర్వేషన్ మారటం అగ్రనేతలను ఖంగుతినిపించింది. ముఖ్యంగా రాజమండ్రిలో ఎంపి, పురందేశ్వరి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు తమ అనుచురులకు వేర్వేరు కోణాల్లో ఆ స్థానం ఇప్పించుకోవాలని భావించారు. కానీ తీరా అది ఎస్సీ రిజర్వుడు కావడం వారిని ఖంగుతినిపించింది.
అనంతపురంలో కూడా ఓసీని నిలబెట్టాలని భావించగా, అది బీసీ అయిందని గుర్తు చేస్తున్నారు. పార్టీ రూపొందించిన జాబితాను ముందుగానే గడప దాటించి, ‘శ్రమదానం’ చేసిన సదరు రాష్ట్ర కీలక నేతకు బాగానే లబ్థి చేకూరిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర అధ్యక్షుడు కూడా.. సదరు నాయకుడిని నమ్మి, సీట్ల వ్యవహారం ఆయనతో షేర్ చేసుకున్నందుకే ఈ పరిస్థితి వచ్చిందని సీనియర్లు చెబుతున్నారు.
కాగా అనంత పురంలో మంత్రి సత్యకుమార్ యాదవ్‌ను దెబ్బతీసే కుట్ర జరిగిందన్న చర్చకు బీజేపీ వర్గాల్లో తెరలేచింది. అక్కడ బీజేపీ మేయర్ గెలిస్తే, రానున్న ఎన్నికల్లో సత్యకుమార్ అక్కడి నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరిగింది. దానిని దృష్టిలో పెట్టుకుని, వ్యూహాత్మకంగా ముందరి కాళ్లకు బంధం వేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి తాము అనంతపురం సీటు ఓసి అయితేనే తీసుకుంటామని చెప్పామని, ఆ మేరకు పార్టీ అభ్యర్ధిని కూడా ఖరారు చేశామంటున్నారు.
అయితే చివరి నిమషంలో రిజర్వేషన్ మారి అది బీసీగా మారడంతో, ఆ సీటుకు బదులు తిరుపతి కావాలని బీజేపీ నాయకత్వం టీడీపీకి సూచించిందని పార్టీ నేతలు వివరించారు. కానీ తమతోట్టుపట్టి మరీ, అనంతపురం మేయర్ సీటు తమకు అంటకట్టారని జిల్లా బీజేపీ అగ్రనేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘మాకు డబ్బులిచ్చారు. అలా ఇచ్చినట్లే ఇచ్చి, ఐదు డివిజన్లలో వాళ్ల పార్టీ నాయకులతో నామినేషన్లు వేయించారు. అంటే మేం మీరు అడిగిన సీటు, డబ్బు ఇచ్చినా కూడా మీరు గెలవలేకపోయారు కాబట్టి ఇకపై మేం ఏది ఇస్తే అది తీసుకోండని చెప్పడమే దీని అసలు లక్ష్యం. దీన్నిబట్టి ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మాకేమీ రావని’’ ఓ బీజేపీ సీనియర్ కుండబద్దలు కొట్టారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో.. తామేమీ చేయలేని నిస్సహాయ పరిస్థితిలో ఉన్నామని, ఆ నేత నిర్వేదం వ్యక్తం చేశారు.
సుజనా ఇలాకాలోనూ అదే కుట్ర?
కాగా అనంతపురంలో మంత్రి సత్యకుమార్‌ను దెబ్బతీసినట్లుగానే.. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే సుజనా చౌదరినీ దెబ్బతీసే తెరవెనక కుట్ర జరిగిందని బీజేపీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. పొత్తు ధర్మానికి భిన్నంగా, బీజేపీకి కేటాయించిన స్థానాల్లో జనసేన పోటీ చేయడంపై ఆగ్రహం వ్యక్తమయింది. చివరకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సైతం, చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా జనసేనతో పోరాడి గెలిచారని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు. పోలింగ్ రోజున కూటమి నుంచి తమకు ఎలాంటి సహకారం లభించలేదని బీజేపీ నేతలు కుండబద్దలు కొట్టారు.
నిజానికి ఎమ్మెల్యే సుజానాచౌదరి పర్యవేక్షణలో ఆయన కార్యాలయం నిరంతరం ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. ప్రభుత్వ పథకాలతోపాటు, సుజనా ఫౌండేషన్ ద్వారా నియోజకవర్గంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆ మేరకు ప్రభుత్వ పథకాల లబ్థిదారుల జాబితాతోపాటు, సుజనా ఫౌండేషన్ లబ్దిదారుల జాబితాను డివిజన్లవారీగా ప్రదర్శించారు.
అయినా నియోజకవర్గంలో టీడీపీ-జనసేన ఓట్లు బీజేపీ అభ్యర్ధులకు ఎక్కడా బదిలీ కాకపోవడం.. అది సరిపోదన్నట్లు 40, 49 వార్డుల్లో జనసేన నేతలే అభ్యర్ధుల రూపంలో బరిలోకి దిగడంతో.. సుజనా ప్రాతినిధ్యం వహిస్తున్న వెస్ట్ నియోజకవర్గంలోని 5 బీజేపీ స్థానాల్లో, నాలుగు ఓడిపోవడంపై కమలనాధులు కన్నెర్ర చేస్తున్నారు.
‘మాకు కేటాయించిన కార్పొరేటర్ స్థానాల్లో మేయర్ అభ్యర్ధికి ఎక్కువ ఓట్లు వచ్చి, మా పార్టీ అభ్యర్ధులకు ఓట్లు రాలేదంటే టీడీపీ-జనసేన మా దగ్గర పనిచేయలేదని అర్ధమవుతోంది. చివరకు అంత బలం లేని సీపీఎం కూడా మాపై గెలిచిందంటే ఇక్కడ ఏ స్థాయిలో కుట్ర జరిగిందో అర్ధమవుతుంద’ని జిల్లా బీజేపీ నేత ఒకరు విశ్లేషించారు. వేరే నియోజకవర్గంలోని 28వ వార్డులో బీజేపీ కూటమి ధర్మం ఉల్లంఘించి పోటీ చేస్తే, జనసేన మా నియోజకవర్గంలో మాపై పోటీ చేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
బీజేపీ కార్పొరేటర్ అభ్యర్ధులకు ఓట్లు తక్కువ వచ్చి, మేయర్ అభ్యర్ధికి ఎక్కువ వచ్చాయంటే, ఇక్కడ కూటమి నాయకులు మాకు పనిచేయలేదని అర్ధమవుతోందని బీజేపీ నాయకులు లా పాయింట్లు తీస్తున్నారు.
సీనియర్ల స్థానంలో జూనియర్లకు పెత్తనమా?
స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన టీడీపీ, క్యాడర్ బలం ఉన్న జనసేన బలాన్ని వినియోగించుకుని.. కేటాయించిన అన్ని స్థానాల్లో గెలిచి బలపడాల్సిన బీజేపీ, అందుకు భిన్నంగా చతికిలపడటంపై పార్టీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రధానంగా మంత్రి, ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాల్లో సైతం పార్టీఓడిపోవడాన్ని కమలనాధులు జీర్ణించుకోలేకపోతున్నారు.
దీనికి కూటమి పార్టీల సహకారం కరవయిపోవడం, వారి ఓట్లు బదిలీ కాకపోవడం, కూటమి పార్టీ అభ్యర్ధులు రెబల్స్‌గా దిగడం ఒక కారణమయితే.. పార్టీ నాయకత్వ అనుభవ రాహిత్యం మరో ప్రధాన కారణమన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సహజంగా ఇంత పెద్ద ఎన్నికలు జరుగుతున్నప్పుడు.. పార్టీ ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యే-మాజీ ఎంపీలు, రాష్ట్ర కమిటీ ప్రముఖులకు బాధ్యతలు అప్పగించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ ప్రకారంగా చూస్తే రాష్ట్రంలో చాలామంది సీనియర్లు ఉన్నారు. ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు.
కానీ రాష్ట్ర నాయకత్వం ఎవరికీ బాధ్యతలు అప్పగించకుండా, ఒక జూనియర్ స్థాయి రాష్ట్ర నేతకు బాధ్యతలు అప్పగించడంపై విమర్శలు వెత్తుతున్నాయి. కీలక నేతల దన్ను-లాబీతో.. రాష్ట్ర పార్టీ ఆఫీసులో పెద్ద హోదాతో తిష్ఠ వేసిన సదరు నాయకుడి వ్యవహారశైలి, పార్టీ కొంపముంచుతోందంటున్నారు.
ఇప్పటికయినా సదరు నాయకుడిని పక్కనపెట్టకపోతే.. భవిష్యత్తులో పార్టీ మరింత భారీ మూల్యం చెల్లించుకోకతప్పదంటున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు సైతం సదరు నాయకుడికి పెత్తనం అప్పగించడం, కేంద్రం నుంచి వచ్చిన పార్టీ అంతర్గత నివేదిక వివరాలు పంచుకోవడం, జోనల్ ఇన్చార్జులపై పార్టీ అభ్యర్ధుల జాబితా సిఫార్సులకు సంబంధించి ఒత్తిళ్లు చేయడం, తనకు నచ్చని నాయకులు పోటీ చేయాలనుకున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో టీడీపీ నాయకత్వంతో మాట్లాడి రిజర్వేషన్లు మార్పించడం వంటి కుమ్మక్కు రాజకీయాల వల్లే.. తిరుగులేని విజయం సాధించాల్సిన తమ పార్టీ, పరాజయాలతో కుదేలయిందని బీజేపీ సీనియర్లు మండిపడుతున్నారు.
రాష్ట్ర అధ్యక్షుడు సైతం సదరు నాయకుడిని గుడ్డిగా నమ్మి, బాధ్యతలు అప్పగిస్తున్న వైనంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అధ్యక్షుడి అండ చూసుకునే సదరు నాయకుడు అన్ని జిల్లాల్లో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
తొలిసారి ‘బంధు’సేవ
బీజేపీ చరిత్రలో తొలిసారి రాష్ట్రంలోని కీలక నేతలు కొందరు, తమ బంధువుల కోసం పనిచేయడం ఈ ఎన్నికల్లోనే చూశామని సీనియర్లు చెబుతున్నారు. సహజంగా ఎన్నికల్లో తమ వర్గానికో, తమ అనుచరులతో సీట్లు ఇప్పించుంటారని.. కానీ ఈసారి తమ బంధువుల కోసం పనిచేసిన ఘటనలు చూశామంటున్నారు.
వారి కోసమే ఏకంగా రిజర్వేషన్లు కూడా మార్పించడం వైనం చూస్తే, పార్టీలో బంధుప్రీతి ఏ స్థాయిలో పెరుగుతుందో అర్ధం చేసుకోవచ్చని సీనియర్లు విశ్లేషిస్తున్నారు.
అనంతపురం కార్పొరేషన్లో అసలు పార్టీ సభ్యత్వమే లేని తన బంధువు కోసం.. రాష్ర్ట కీలక నేత ఒకరు ఏకంగా మేయర్ టికెట్ ఇప్పించేందుకు, చివరివరకూ ప్రయత్నించారంటున్నారు. తీరా నాయకులు ఒప్పుకున్నా సదరు రాష్ట్ర నేత బంధువు పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు ఇష్టపడలేదని గుర్తు చేస్తున్నారు. అసలు పార్టీ సభ్యత్వం లేని వ్యక్తికి సీటు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు.
ఇక విజయనగరం జిల్లా గజపతినగరంలో జడ్పీటీసీగా పోటీ చేసిన ఒక బీజేపీ మహిళా నేత గెలవరని, స్వయంగా మంత్రి ఎన్నికలకు ముందు నుంచి చెప్పినా వినకుండా.. టీడీపీ నాయకత్వంపై పట్టుపట్టి మరీ ఆమె కోసం, బీజేపీకి సీటు ఇప్పించుకున్నారని చెబుతున్నారు. తీరా ఫలితాల్లో సదరు మహిళా నేత ఓటమి, మంత్రి ఖాతాలో పడిందని గుర్తు చేస్తున్నారు.
అంతా… ఆయనే చేశారట!
ఇక రాష్ర్టంలోని అనేక జిల్లాల్లో పార్టీ రాష్ట్ర-జిల్లా నాయకులు కార్పొరేటర్లు, మున్సిపల్ చైర్మన్ల పదవికి దరఖాస్తు చేశారు. అయితే.. అధ్యక్షుడికి సన్నిహితంగా వ్యవహరిస్తున్న ఓ రాష్ట్ర కీలక నేత.. వారి పేర్లను ప్రాధమిక దశలోనే తప్పించడం, లేదా టీడీపీ నాయకత్వంతో తనకున్న సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని, ఆ నాయకులు కోరుకున్న స్థానాల రిజర్వేషన్లు మార్పించడం చేశారన్న విషయం ఆలస్యంగా తెలుసుకున్న రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు, సదరు రాష్ట్ర కీలక నేతపై కారాలు మిరియాలు నూరుతున్నారు.
అసలు ముందు జనరల్ అనుకున్న అనంతపురం కార్పొరేషన్ తర్వాత బీసీగా మారడం వెనక చాలా పెద్ద కథ, రాజకీయం నడిచిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.
