సాగర్‌లో ఏపీ చేపట్టిన పనులను వెంటనే ఆపాలి

- తెలంగాణ నీళ్లను కాపాడే సోయి లేదా?
- కాంగ్రెస్‌ది నేరపూరిత నిర్లక్ష్యం
- నాగార్జునసాగర్‌లో ఏపీ చేపట్టిన పనులను వెంటనే ఆపాలి
- ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాసిన లేఖలు, వాటి డీఓ నంబర్లు బయటపెట్టాలి
- 128 టీఎంసీలు వాడాం’’ అని చెప్పడం కాదు
- ఏ ప్రాజెక్టు నుంచి ఎంత నీరు తీసుకున్నారో లెక్క చెప్పాలి
- ఆరుతడి పంటలు వేసుకోమంటున్నారు.. ఆ పంటలకు నీళ్లు ఎక్కడి నుంచి ఇస్తారు?
- మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి
నల్గొండ: తెలంగాణకు రావాల్సిన కృష్ణా జలాలను కాపాడటంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తీవ్రంగా విమర్శించారు. ‘‘ఇది సాధారణ వైఫల్యం కాదు. ప్రజల హక్కులను కాపాడాల్సిన ప్రభుత్వం చేస్తున్న నేరపూరిత నిర్లక్ష్యం’’ అని ధ్వజమెత్తారు.
నాగార్జునసాగర్‌లో ఆంధ్రప్రదేశ్ చేపట్టిన పనులను నిలువరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ‘‘ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గారు లేఖలు రాశామని చెబుతున్నారు. ఏ రోజు రాశారు? ఆ లేఖల డీఓ నంబర్లు ఏమిటి? లేఖలను బయటపెట్టండి. గాలి మాటలు కాదు, స్పష్టమైన ఆధారాలు చూపించండి’’ అని సవాల్ విసిరారు. కొత్త పథకాల విషయంలో పొరుగు రాష్ట్రానికి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు సమాచారం ఇచ్చారా అని ప్రశ్నించారు.
చెన్నై తాగునీటి అవసరాల పేరుతో శ్రీశైలం నుంచి నీటి తరలింపు మొదలైందని, ఆ తర్వాత అది భారీ స్థాయికి చేరిందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ‘‘వేలు పెట్టనిస్తే కాలు పెట్టినట్టుగా సాగర్‌లోనూ అదే పరిస్థితి రాకూడదు’’ అని హెచ్చరించారు. తెలంగాణ ఎత్తిపోతల పథకాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఆంధ్రప్రదేశ్ తనవైపు కొత్త పనులు చేపడుతోందని చంద్రబాబు నాయుడుపై విమర్శలు చేశారు.
తెలంగాణ ఎంత నీరు వినియోగించిందనే విషయంలో ప్రాజెక్టుల వారీగా లెక్కలు వెల్లడించాలని ఆయన కోరారు. ‘‘ఏ ప్రాజెక్టు నుంచి ఎన్ని నీళ్లు తీసుకున్నారు? నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద, లో లెవల్, హై లెవల్ కాలువల కింద ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారు? మహబూబ్‌నగర్ ఎత్తిపోతల పథకాల ద్వారా ఎంత నీరు అందించారు? సంవత్సరాల వారీగా లెక్క చెప్పండి’’ అని నిలదీశారు. 128 టీఎంసీలు వినియోగించామని చెప్పడం మాత్రమే సరిపోదన్నారు.
ఆరుతడి పంటలు వేసుకోవాలని రైతులకు సూచిస్తున్న ప్రభుత్వం, ఆ పంటలకు అవసరమైన నీటిపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ‘‘నీటి తడి లేకుండా ఏ గింజా మొలకెత్తదు. కూరగాయలు పండించుకోమంటున్నారు. అవి మొలవాలన్నా నీళ్లు కావాలి కదా! ఏ పంటకు ఎన్ని నీళ్లు ఇస్తారో చెప్పండి’’ అని ప్రశ్నించారు. డి–25, డి–37, డి–39, డి–40 పరిధిలోని రైతులు కనీసం చెరువులకైనా నీళ్లు ఇవ్వాలని ఎదురుచూస్తున్నారని తెలిపారు.
‘‘ప్రజల నీటి హక్కులను కాపాడే బాధ్యత తీసుకున్న ప్రభుత్వం మౌనంగా ఉండటానికి వీల్లేదు. సాగర్‌లో జరుగుతున్న పనులను వెంటనే ఆపాలి. తెలంగాణ తాగు, సాగునీటి అవసరాలకు అవసరమైన జలాలను రక్షించాలి’’ అని జగదీశ్‌రెడ్డి డిమాండ్ చేశారు.
