ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చినట్లు చూపిస్తే రాజీనామా చేస్తా

- అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి రాజీనామా కు సిద్ధమా?
- హరీష్ రావు ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు బ్యాండ్ కొడుతూ వెళ్లిన సందర్భం మర్చిపోయావా?
- సీఎం రేవంత్‌కు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్
హైదరాబాద్: కొత్త పెన్షన్లు ఇస్తున్నామని రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు. అందుకు ఉదాహరణ నా నియోజకవర్గమే. నా నియోజకవర్గంలో 1029 పెన్షన్లు ఉల్టా తొలగించారు. నా హుజురాబాద్ లో ఒక్క పెన్షన్ కొత్తది ఇచ్చినట్టు నిరూపిస్తే నేను రాజీనామా కు సిద్ధం.
హుజురాబాద్ నియోజకవర్గం లోని మండలాల్లో భారీగా పెన్షన్లు కోత పెట్టారు. రేవంత్ రెడ్డి లబ్దిదారులను ఎలా మోసం చేయాలని అనిపిస్తుంది. బి ఆర్ ఎస్ ప్రభుత్వం లో పెన్షన్లు పెంచిన ఘనత కేసీఆర్ ది. 45 లక్షల పెన్షన్లు కేసీఆర్ ఇచ్చారు. మేము కొత్తగా ఇచ్చామని జనాన్ని మోసం చేస్తున్నారు. రేవంత్ రెడ్డి మోసం చేయడానికి సిగ్గు ఉండాలి.
అబద్ధాలు చెప్పినందుకు రేవంత్ రెడ్డి రాజీనామా కు సిద్ధమా? రాష్ట్రంలో ఒక కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదు. నా నియోజకవర్గంలో ఉన్న లెక్కలు తప్పు అని తేలితే నేను ముక్కు నేలకు రాస్తా. సిద్దిపేట లో రేవంత్ రెడ్డి పోటీ చేస్తే డిపాజిట్ కూడా రాదు. నువ్వు కొడంగల్ లో మా నరేందర్ రెడ్డి పై గెలువు.హరీష్ రావు కు, నీకు పోలిక ఎక్కడిది? హరీష్ రావు ఎమ్మెల్యే అయినప్పుడు నువ్వు బ్యాండ్ కొడుతూ వెళ్లిన సందర్భం మర్చిపోయావా?
సిరిసిల్ల, సిద్దిపేట లో జరిగిన అభివృద్ధి కంటే ఒక్క ఇంచు ఎక్కువైన అభివృద్ధి కొడంగల్ లో చేసావా? రేవంత్ రెడ్డి భాష చూసి జనం చీదరించుకుంటున్నారు. రేవంత్ రెడ్డి ఏం భాష ఏం రోత ప్రవర్తన. తెలంగాణలో వర్షాలు పడకపోవడానికి కారణం రేవంత్ రెడ్డే. ఆయన దేవుళ్ళ మీద ఒట్టు పెట్టీ రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఈ పరిస్తితి దాపురించింది.
