Suryaa.co.in

Andhra Pradesh

డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయింపు

– అన్ని కార్పోరేషన్లలో మహిళలకు సగం పైగా పదవులు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని
గుడివాడ, సెప్టెంబర్ 6: రాష్ట్ర ప్రభుత్వం 47 కార్పోరేషన్లకు ప్రకటించిన 481 మంది డైరెక్టర్ల పదవుల్లో 58 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించడం జరిగిందని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. సోమవారం కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం రాజేంద్రనగర్లోని నివాసంలో ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ డైరెక్టర్ నగుళ్ళ సత్యనారాయణ, ఏపీ స్టేట్ బ్రాహ్మిణ్ కార్పోరేషన్ డైరెక్టర్ తుర్లపాటి కనకదుర్గలను అభినందించిన అనంతరం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. 481 మంది కార్పోరేషన్ డైరెక్టర్ల పదవుల్లో మహిళలకు 52 శాతం పదవులను కేటాయించారన్నారు. అన్ని కార్పొరేషన్లలో సగానికి పైగా మహిళలకు డైరెక్టర్ల పదవులను ఇవ్వడం జరిగిందన్నారు. సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. జగన్మోహనరెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 15 మంది ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారని తెలిపారు. వీరిలో 11 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన వారని చెప్పారు. అలాగే బీసీ కులాల కోసం 56 ప్రత్యేక కార్పోరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కార్పోరేషన్లు , మున్సిపాలిటీలు, నగర పంచాయతీల చైర్మన్ల ఎంపికలో సగానికి పైగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు కేటాయించడం జరిగిందన్నారు. 137 నామినేటెడ్ పదవుల్లోనూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు 58 శాతం పదవులను ఇవ్వడం జరిగిందన్నారు.
సామాజిక న్యాయమే లక్ష్యంగా సీఎం జగన్మోహనరెడ్డి పనిచేస్తున్నారని తెలిపారు. అట్టడుగు వర్గాల ప్రజలకు కూడా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తున్నారని తెలిపారు. పురుషుల కంటే మహిళలకు అన్నింటా ప్రాధాన్యం ఇస్తున్నారని చెప్పారు. మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేసేందుకు సీఎం జగన్మోహనరెడ్డి కృషి చేస్తున్నారని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ప్రభుత్వ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. గత 26 నెలల కాలంలో డీబీటీ ద్వారా బీసీలకు రూ. 50 వేల 495 కోట్లు, ఎస్సీలకు రూ. 17 వేల 012 కోట్లు, ఎస్టీలకు రూ. 5 వేల 383 కోట్లు, మైనార్టీలకు రూ. 4 వేల 383 కోట్లను ప్రభుత్వం నేరుగా అందించిందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సీఎం జగన్మోహనరెడ్డి అన్ని అవకాశాలను కల్పిస్తున్నారని చెప్పారు. నామినేటెడ్ పదవులు పొందిన ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేసి సీఎం జగన్మోహనరెడ్డికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి కొడాలి నాని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ గుడివాడ రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు తుర్లపాటి రవి, మొండ్రు వెంకటేశ్వరరావు, పిళ్ళా శేఖర్, గొరుముచ్చు సురేష్, చిట్టి, కాళ్ళకూరి హరిప్రసాద్, అగస్త్యరాజు కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE