మౌంట్ ఎల్ బ్రస్ శిఖరాన్ని అధిరోహించిన భువన్కు రజత్ భార్గవ కితాబు
అమరావతి: ఇటీవల యూరప్ ఖండంలోనే అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్ బ్రస్ (ఎత్తు 5642 మీటర్లు)శిఖరాన్ని అధిరోహించి వచ్చిన రాష్ట్ర మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు వారి తనయుడు మాస్టర్ గంధం భువన్ జై ను రాష్ట్ర రెవెన్యూ, పర్యాటక మరియు క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ అభినందించారు.
సోమవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకులో మాస్టర్ భువన్ తన తండ్రి గంధం చంద్రునితో కలిసి ఆయనను కలిశారు.ఈ సందర్భంగా రజత్ భార్గవ మాట్లాడుతూ ఎనిమిదేళ్ళ మూడు మాసాల వయసు లోనే యూరప్ ఖండంలోని అత్యంత ఎత్తైన మౌంట్ ఎల్ బ్రస్ శిఖరాన్ని అధిరోహించడం పట్ల ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.ముఖ్యంగా ప్రపంచ పర్యాటక దినోత్సవమైన నేడు తనను కలిసినందుకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ రాష్ట్రానికి చెందిన చిన్నారి ఈవిధమైన ఘనత సాధించడం రాష్ట్రానికే గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మాస్టర్ భువన్ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని రజత్ భార్గవ ఆకాంక్షించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి క్రీడలను ముఖ్యంగా సాహస యాత్రలను అన్ని విధాలా ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు.మాస్టర్ భువన్ మిగతా చిన్నారులందరికీ ఎంతో స్పూర్తిదాయకమని రజత్ భార్గవ కొనియాడారు.
మైనార్టీ సంక్షేమశాఖ ప్రత్యేక కార్యదర్శి గంధం చంద్రుడు మాట్లాడుతూ రాష్ట్రం నుండి తన తనయుడు భువన్ అతిచిన్న వయస్సులో మౌంట్ అల్ బ్రస్ శిఖిరాన్ని అధిరోహించడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.ప్రభుత్వం కూడా క్రీడలు,సాహస యాత్రలు చేసే వారిని అన్నివిధాలా ప్రోత్సహిస్తోందని అన్నారు.రానున్న రోజుల్లో మాస్టర్ భువన్ మరిన్ని శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు.మాస్టర్ భువన్ మాట్లాడుతూ మౌంట్ ఎల్ బ్రస్ శిఖరాన్ని అధిరోహించడం తనకు ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు.