Suryaa.co.in

Andhra Pradesh

పారదర్శకంగా పంట నష్టం అంచనాలు

– ముంపునకు గురైన ప్రాంతాల్లో శాస్త్రవేత్తల , అధికారులు పర్యటించాలి
– టెలి కాన్ఫెరెన్స్ లో మంత్రి కన్నబాబు
అమరావతి: గులాబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి, కృష్ణా జిల్లాల్లో కుండ పోతగా కురుస్తున్న వర్షాల ప్రభావానికి గురైన అన్నదాతలకు అండగా నిలబడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు.
పారదర్శకమైన పంట నష్ట అంచనాలు పూర్తి చేసి ముంపుకు గురైన ప్రాంతాల్లో రైతులకు సహాయంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు మంత్రి తెలిపారు . సోమవారం తుఫాన్‌ ప్రభావానికి గురైన జిల్లాల జాయింట్‌ కలెక్టర్లు, వ్యవసాయ శాఖ జేడీలతో మంత్రి కన్నబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కన్నబాబు మాట్లాడుతూ ఈఆరు జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా ఉందన్నారు. ప్రాధమిక అంచనా ప్రకారం 1.63 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు ముంపునకు గురైనట్టుగా గుర్తించారన్నారు. ముంపునీరు పూర్తిగా తగ్గితే కానీ వాస్తవ నష్టాన్ని అంచనా వేయలేమన్నారు.
ముంపునకు గురైన వర్షపునీరు సాధ్యమైనంత త్వరగా కాలువల ద్వారా పోయేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.జలవనరుల శాఖ ఎస్‌ఈలతో చర్చించి కాలువల్లో వర్షపు నీరుపోయేటట్టు చూడాలని జిల్లాల జాయింట్ కలెక్టర్లను మంత్రి ఆదేశించారు .
ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాలు, వ్యవసాయ, ఉద్యాన వర్శిటీలు, కృషి విజ్ఞాన కేంద్రాలకు చెందిన శాస్త్రవేత్తల బృందాలు ఆయా జిల్లాల్లో విస్తృతంగా పర్యటించి ముంపునకు గురైన పంట పొలాలు, తోటలను పరిశీలించి నష్ట తీవ్రతను తగ్గించేలా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలన్నారు.
గులాబ్ ప్రభావం ఎక్కువగా వున్న శ్రీకాకుళం , విజయనగరం జిల్లాల్లో సీనియర్ వ్యవసాయ శాఖా అధికారులు పర్యటించి ఆయా జిల్లాలు , రాష్ట్ర స్థాయి అధికారులతో సమన్వయము చేసుకోవాలని సూచించారు .
వ్యవసాయ సలహా మండళ్ల సభ్యులు కూడా గ్రామాల్లో పర్యటించి రైతులకు అండగా నిలవాలన్నారు. ఆర్‌బీకే స్థాయి వరకు వ్యవసాయ, ఉద్యాన సిబ్బంది క్షేత్ర స్థాయిలో రైతులకు 24 గంటలూ అందు బాటులో ఉంటూ వారికి ధైర్యం చెప్పాలన్నారు.
ముంపునీరు దిగి పోగానే ఎన్యుమరేషన్‌ బృందాలను రంగంలోకి దింపి ఏ ఒక్క రైతు నష్టపోకుండా పూర్తి పారదర్శకంగా తుది అంచనాలు రూపొందించాలన్నారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య
వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు హెచ్‌.అరుణ్‌కుమార్, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE