అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు నల్ల బ్యాడ్జీలతో వెళ్ళండి

అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపు

విజయవాడ నగరంలో శుక్రవారం జరుగనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్న 125 అడుగుల అంబేద్కర్ విగ్రహావిష్కరణ సభకు దళిత, గిరిజన ప్రజలు నల్ల బ్యాడ్జీలు, నల్ల కండువాలు, నల్ల జెండాలతో వెళ్ళాలని, ఐదు సంవత్సరాల ఐదు నెలలుగా బెయిల్ కూడా నోచుకోని కోడి కత్తి శీను విడుదల కోరుతూ మద్దతు తెలపాలని తద్వారా ముఖ్యమంత్రి కి అంబేద్కర్ మూర్తి కంటే, స్ఫూర్తి గొప్పదని చాటాలని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య పిలుపునిచ్చారు.

గురువారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. కోడి కత్తి శ్రీను రాజమండ్రి జైలులో ఆమరణదీక్షకు కూర్చున్నాడని, శ్రీనుకు మద్దతుగా తల్లి సావిత్రమ్మ, సోదరుడు సుబ్బరాజు విజయవాడలో దీక్ష చేసే ప్రయత్నం చేస్తున్నట్లు,వారికి మద్దతుగా తాను కూడా ఉన్నట్లు ఆయన చెప్పారు. కేవలం ఓట్ల రాజకీయం కోసమే వైకాపా ప్రభుత్వం అమరావతిలోని 30 ఎకరాల అంబేద్కర్ స్మృతి వనం నాశనం చేసి, విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ బొమ్మ ఏర్పాటు చేశారని చెప్పారు.

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 125 అడుగుల విగ్రహానికి రూ.120 కోట్లు ఖర్చుపెడితే, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 125 అడుగుల విగ్రహానికి రూ. 404 కోట్లు ఖర్చుపెట్టినట్లు చెప్పారు. ఈ నిధులను సాంఘిక సంక్షేమ శాఖ నుంచి మల్లించారన్నారు. 27 రకాల సంక్షేమ పథకాలను నిలిపేసి, రూ. 28,350 కోట్ల ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దారి మళ్ళించి, అంబేద్కర్ విదేశీ విద్య పేరును జగనన్న విదేశీ విద్యగా మార్చిన ముఖ్యమంత్రి కి అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసే హక్కు ఎక్కడిదని ప్రశ్నించారు.

డాక్టర్ సుధాకర్, డాక్టర్ అచ్చన్న, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, చీరాల కిరణ్ బాబు వంటి దళితులను ఎంతోమందిని 55 నెలల వైకాపా పాలనలో పొట్టను పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో దళితులపై మూత్ర విసర్జనలు, పోలీసు స్టేషన్ లో శిరోముండనాలు జరిగాయని, ఏ ఒక్క సంఘటనకూ ప్రభుత్వం నైతిక బాధ్యత పడలేదన్నారు. కోడి కత్తి శీను విడుదల కోసం ప్రభుత్వం పెట్టిన కేసును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి సభకు వెళ్లే ఎస్సీ, ఎస్టీలు అంబేద్కర్ స్ఫూర్తితో నల్ల బ్యాడ్జీలు ధరించి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని, తద్వారా ముఖ్యమంత్రి కి జ్ఞానోదయం కలిగించాలని బాలకోటయ్య హితవు పలికారు.

Leave a Reply