Suryaa.co.in

Entertainment

ఎవరో ఏదో మాట్లాడితే పరిశ్రమకు సంబంధం లేదు: నిర్మాత

మచిలీపట్నం: సినీ పరిశ్రమ సమస్యలపై ఏపీ మంత్రి పేర్ని నానితో టాలీవుడ్‌ నిర్మాతలు మచిలీపట్నంలో సమావేశమైన సంగతి తెలిసిందే. భేటీ అనంతరం మంత్రితో పాటు నిర్మాతలు మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ.. కరోనా కాలంలో సినీ పరిశ్రమ ఎంతగా నష్టపోయిందో మంత్రికి వివరించామని తెలిపారు. పరిశ్రమపై కోవిడ్‌ ప్రభావం, థియేటర్ల సమస్యలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి దృష్టికి గతంలోనే తీసుకెళ్లామని చెప్పారు. ‘గతంలో మెగాస్టార్‌ చిరంజీవి, దర్శకుడు రాజమౌళితో కలిసి సీఎం జగన్‌ను కలిశాం. మా విజ్ఙప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. సినిమా అనేది చాలా సున్నితమని, ఏ సమస్య వచ్చినా ఆ ప్రభావం నిర్మాతలపైనే పడుతుంది. అందుకే చిత్ర పరిశ్రమ సమస్యలను రాజకీయం చేయొద్దని మీడియాను కోరుతున్నా. టికెట్లు ఆన్‌లైన్‌ విధానం కావాలని పరిశ్రమ తరఫున మేమే ప్రభుత్వాన్ని కోరాం. ఆన్‌లైన్‌ విధానం ద్వారా పారదర్శకత ఉంటుంది’ అని దిల్‌ రాజు చెప్పుకొచ్చారు. అలాగే నిర్మాత సునీల్‌ నారంగ్‌ మాట్లాడుతూ.. రాజకీయం వేరు.. సినిమా పరిశ్రమ వేరని స్పష్టం చేశారు. ఎవరో ఏదో మాట్లాడితే.. తమకు సంబంధం లేదని ప్రకటించారు. థియేటర్‌లో 100 శాతం ఆక్యూపెన్సీ పెరగాలనేదే తమ ఉద్దేశమని, టికెట్లను ఆన్‌లైన్‌ చేయమని అడిగింది తామేనని గుర్తుచేశారు.

LEAVE A RESPONSE