పీకే.. పని ప్రారంభించారా?

– డ్రగ్స్ మరక దారిమళ్లించే ఎత్తుగడేనా?
– డ్రగ్స్ పోయి తిట్లు వచ్చె ఢాం ఢాం ఢాం
– పీకే వ్యూహానికి మళ్లీ చిక్కిన తెలుగుమీడియా
– పాత అనుభవాలతో మేల్కొన్న టీడీపీ
– పోసాని పాత్ర పీకే వ్యూహంలోనే భాగమేనా?
( మార్తి సుబ్రహ్మణ్యం)
వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఏపీలో తన పని మొదలుపెట్టేశారా? త్వరలో పీకే టీమ్ వస్తుందని, క్యాబినెట్ మీటింగ్‌లో ప్రకటించిన జగన్ మాటలకు తగినట్లే, పీకే రంగంలోకి దిగేశారా? తాజాగా పవన్-పోసాని-మంత్రుల మధ్య జరుగుతున్న మూడుముక్కల పొలిటిల్ గేమ్.. విజయవాడ వేదికగా దేశాన్ని దిగ్భ్రమ పరిచిన డ్రగ్స్ కేసు తీవ్రతను తగ్గించే మాయోపాయమేనా? ఆంధ్రా.. డ్రగ్స్ డెన్‌గా మారిందని, అప్పులమయం- సమస్యల నిలయమయిందంటూ విపక్షాలు-మీడియా, జమిలిగా చేస్తున్న గత్తరకు బ్రేక్ వేసి, వారిని పక్కదారి మళ్లించేందుకే.. హటాత్తుగా పోసాని కృష్ణమురళీని పవన్‌పై ప్రయోగించారా? ఈ దారిమళ్లించే ఎత్తగడ తెలియకుండానే పవన్… ‘మరో పీకే’ ఉచ్చులో పడిపోయారా? పవన్ మాత్రమే కాదు.. పీకే రాజకీయ వ్యూహాలేమిటో ఒకసారి రుచిచూసిన తెలుగు మీడియా కూడా ఆయన ట్రాప్‌లో పడి.. డ్రగ్స్ కేసును వదిలేసి, పనికిమాలిన తిట్ల ఎపిసోడ్ వైపు మళ్లాయా? ఈ మొత్తం యవ్వారంలో, పీకే దెబ్బేమిటో ఆల్రెడీ రుచిచూసిన టీడీపీ మేల్కొని డ్రగ్స్ పైనే దృష్టి కేంద్రీకరించిందా?… గత కొద్దిరోజుల నుంచి కొంచెం బుద్ధి-బుర్ర ఉన్నవారి మస్తిష్కంలో మొదలయిన సందేహాల వంటి ప్రశ్నలివి!
దేశాన్ని దిగ్భ్రమపరిచిన డ్రగ్స్ దిగుమతి కేసు విజయవంతంగా జనం దృష్టి మళ్లించేందుకు ప్రశాంత్ కిశోర్ మేధస్సు బాగానే అక్కరకొచ్చినట్లుంది. అదొక్కటే కాదు. ఏపీ సర్కారు చేస్తున్న అప్పులు, లెక్కలేకుండా చేస్తున్న సలహాదారుల నియామకాలు, కోర్టు అక్షింతలు, రోడ్డు సమస్యలను ‘గంపగుత్తగా దారిమళ్లించేందుకు’, పీకే వేసిన కొత్త స్కెచ్ ప్రాధమిక ఫలితాలు ఆసక్తికరంగానే కనిపిస్తున్నాయి. నిజానికి సాధారణ పరిస్థితిలో అయితే.. బెజవాడ కేంద్రంగా జరుగుతూ, బయటపడ్డ డ్రగ్స్ దందా, పాలకులను ఉక్కిరిబిక్కిరి చేయాలి. ఏం చేయాలో తెలియక చేష్టలుడిగేలా చేయాలి. పాలకపార్టీ వైఫల్యం వల్లే రాష్ట్రానికి డ్రగ్స్ మరక అంటిందంటూ విపక్షాలు కోడై కూసి, నింగీనేలను ఏకం చేయాలి. మీడియా దాని చుట్టూనే పరిభ్రమిస్తూ, మరిన్ని సంచలనాలు పోగేసే పనిలో ఉండాలి. ఎలక్ట్రానిక్ మీడియా శూలశోధనలో బిజీగా ఉండాలి. అన్నింటికీ మించి.. ఇన్ని వ్యవస్థల ప్రభావం పడిన ప్రజలు, పాలకపార్టీని దుమ్మెత్తిపోయాలి.తిట్లతో శపించాలి. కానీ.. విచిత్రం. ఆంధ్రాలో అలాంటివేమీ జరగడం లేదు. ఎవరి పని వాళ్లు పనిచేసుకుంటున్నారు. బార్లు- వైన్ షాపులు, మార్కెట్లు, మాల్స్, మంగలిషాపులు, మటన్‌కొట్ల దగ్గర.. అంతా ఊహించినట్లు డ్రగ్స్‌కు సంబంధించిన ఎలాంటి ముచ్చటా వినిపించడం లేదు. కారణం ఏమిటి?
మరి అక్కడ ఏం వినిపిస్తున్నాయంటే.. పవన్ కల్యాణ్ తిట్లు, దానికి ప్రతిగా మంత్రుల బూతులు. అక్కడితో ఆగిన చర్చ పవన్-పోసాని మురళీకృష్ణ ఎపిసోడ్ వైపు విజయవంతంగా పయనిస్తోంది. తెలుగు టీవీ జీడిపాకం సీరియళ్లు కూడా, అసూయపడే స్థాయిలో జరుగుతున్న ‘పవన్-పోసాని’ ఎపిసోడ్, హీనపక్షం మరో నెల-రెండు నెలలు నడవడం ఖాయం. మధ్యలో మరికొన్ని ఆసక్తికరమైన క్యారెక్టర్లు రంగప్రవేశం చేసినా హాశ్చర్యం లేదు. అంటే పంజాబీ హీరోయిన్‌ను.. పాలకపార్టీ ప్రభావిత టీవీ చానెళ్లు ప్రవేశపెట్టి, ఆమెతో పవన్ కల్యాణ్‌పై టన్నులకొద్దీ బురద, గ్యాలన్ల కొద్దీ కన్నీరు టీవీ తెరపై కార్చినా కార్పించేయవచ్చు. ఎన్నికల ముందు శ్రీరెడ్డి, తర్వాత కత్తి మహేష్ మాదిరిగా అన్నమాట!
అప్పుడు ఆ ఎపిసోడ్‌లో కొద్దిరోజులు పోసానికి విశ్రాంతినిచ్చి, మరికొన్నిరోజుల పాటు పంజాబీ హీరోయిన్ పాత్ర నడిపించవచ్చు. ఆ పంజాబీ హీరోయిన్‌కు ‘పచ్చపార్టీ’ ప్రభుత్వంలో బ్రాండ్ అంబాసిడర్‌గా ఎవరు సిఫార్సు చేశారు? అన్న కూపీలతో, ఆ ఎపిసోడ్‌ను మరంత రక్తి కట్టించినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ అది సర్దుమణిగితే, ‘ప్లాన్ బీ’లో… సుఖనిద్రపోతున్న ఏ ముద్రగడ పద్మనాభం లాంటి కాపు నేతలు సడన్‌గా నిద్రలేవవచ్చు. సో.. దానితో డ్రగ్స్ వ్యవహారం అటకెక్కి, పాలకులు హాయిగా ఊపిరిపీల్చుకుంటారు. ఇదేనా అసలు ప్లాన్? నిజంగా అదే అయితే, ఇంత స్కెచ్ వేసిన వ్యూహకర్తలెవరు? అసలు ఇంత లాంగ్ స్కెచ్ వేయడానికి కారణం ఏమిటి?
అసలు ఏం జరిగిందో కొంచెం వెనక్కి వెళదాం. పవన్‌కల్యాణ్ సినీ టికెట్ల ఆన్‌లైన్ అంశంపై ఓ సినిమా  ఫంక్షన్‌లో, జగన్ సర్కారుపై విమర్శనాస్త్రాలు సంధించారు. మంత్రిని సన్నాసి అని తిట్టారు. ఇక అక్కడ నుంచి ఈ రాజకీయ రామాయణం మొదలయింది. సరే సినిమా మంత్రి పేర్ని నాని రంగంలోకి దిగి ఆ నాకొడుకు, ఈ నాకొడుకులు అని.. చివరాఖరన ‘మేమంతా కాపు నాకొడుకులం’ అనేంత వరకూ వెళ్లి, ఎపిసోడ్‌ను రక్తికట్టించారు. దానితో జనసేన నేతలూ ప్రతివిమర్శలు ప్రారంభించేసరికి.. కాపు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిదాడి ప్రార ంభించారు. అయితే కాపును కాపులతో తిట్టిస్తుంటే, రాష్ట్రంలో ఉన్న కాపులు వైసీపీని సహించలేకపోతున్నారన్న సమాచారం సర్కారుకు వచ్చింది.
అంతే .. అసలు ఈ ఎపిసోడ్‌లో ‘ఎక్స్‌ట్రా పాత్ర’ కూడా లేని కమ్మ కులానికి చెందిన పోసాని కృష్ణమురళీ పాత్ర.. భుజాలు ఎగురేసుకుని, చొక్కా సర్దుకుని మరీ రంగ ప్రవేశం చేసింది. అది అలా అలా రాజుకుని, యవ్వారం.. కాపు-కమ్మ మధ్య కేంద్రీకృతమయ్య ప్రమాదం కనిపించింది. తాను కమ్మవాడినయినా జగన్‌ను ప్రేమిస్తున్నానంటూ, పోసాని చేసిన వ్యాఖ్యల పుణ్యాన.. ఈ మొత్తం యవ్వారంలో టీడీపీ కాళ్లు-చేతులు పెట్టకుండా దూరంగా ఉన్న ముందుచూపు వల్ల.. ఈ ఎపిసోడ్ కమ్మ-కాపు కొట్లాట కాకుండా మరో దారిలోకి వెళ్లింది. దానితో కాపు-కమ్మల మధ్య కొట్లాట పెట్టాలన్న, బీహారీబాబు పాత ఐడియా ఫ్లాపయిపోయింది. అసలు తనకు ఎలాంటి సంబంధం లేని ఈ ఎపిసోడ్‌లోకి, పోసాని ఎలా ఎంటరయ్యారు? ఆయనను ఎవరు ఎంటర్ చేయించారు?
నిజానికి ఇవేమీ భేతాళ ప్రశ్నలు కావు. సమాధానం సింపుల్. ఆయా రాష్ట్రాల్లోని కులాలను బట్టి స్కెచ్‌లు వేసే.. పీకేనే ఈ ఎపిసోడ్‌కు కథ-మాటలు-పాటలు-స్క్రీన్‌ప్లే-దర్శకుడన్నది, మెడమీద తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. సహజంగా ఒక సినిమా హిట్టయితే, తర్వాత వచ్చే సినిమాలన్నీ ఆవే ఫార్ములాతో వస్తుంటాయి. కానీ అవి ఆడవు. ఎందుకంటే ఆల్రెడీ సక్సెస్ అయిన ఒక ఫార్ములా సినిమాను, ప్రేక్షకులు ముందే చూసేశారు కాబట్టి. ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో పీకే నడిపిస్తున్న సినిమా కథ కూడా అంతే. కులాలు-మతాలు-ప్రాంతాలు-వ్యక్తులే పాత్రధారులుగా గత ఎన్నికల్లో, జగన్ నిర్మాతగా పీకే తీసిన ‘అసెంబ్లీ సినిమా’… విడుదలయిన 175 సెంటర్లలో, 151 చోట్ల సూపర్ డూపర్ హిట్టయింది. ఆ ఫార్ములా చూసే అనేక రాష్ట్రాలకు చెందిన రాజకీయపార్టీ నిర్మాతలు, పీకే డైరక్షన్ కోసం క్యూలు కడుతున్నారు.
కాబట్టి డైరక్టర్ పీకే ఎంచుకునే సినిమాలకు కథా వస్తువు, పాత్రలతో ఆయన నడిపించే వ్యూహాలు ఏమిటన్నది తెలుగు ప్రేక్షకులకు ఆల్రెడీ అర్ధమయిపోయింది. అందులో తెలుగువాళ్లు మహా ముదుర్లు. సినిమాల్లో వచ్చే సీన్లను ముందే వాసన పట్టేస్తారు. రాంగోపాల్‌వర్మ బెజవాడ, వంగవీటి, రక్తచరిత్ర, రేపు కొండా మురళి సినిమాలు తీసినా అందులో సరుకేమీ ఉండదు. పబ్లిసిటీ హడావిడి..టీవీల సినిమా ప్రమొషన్ తప్ప. వర్మ సినిమాల్లో క్యారెక్టర్లు ఏం ఉంటాయని తెలుగు ప్రేక్షకులు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చేశారు. కాబట్టి ఆయన ఏం తీసినా పాత ఉత్కంఠ కొత్తగా ఏమీ ఉండదు. ఇప్పుడు బీహారీబాబు పీకే నడిపిస్తున్న కొత్త సినిమా కూడా అంతే!
తాజాగా కొత్తదనం పేరుతో.. తెరపైకి బీహారీబాబు తీసుకువచ్చిన పాత సినిమా కథ చూస్తుంటే, ఎవరికయినా ‘గత అసెంబ్లీ సినిమా’లో ఎత్తుగడ, కాపీ పేస్టు పాత్రలే కనిపిస్తున్నాయి. కానీ సినిమా రివ్యూలు రాసే పత్రికలు, దానిపై విశ్లేషించే ప్రముఖులు మాత్రం.. బీహారీబాబు కొత్తదయిన ‘పాత సినిమా ఫార్ములా’ను తమకు తెలియకుండానే, ప్రమోట్ చేస్తూ పప్పులో కాలేస్తుండటమే వింత. గత ఎన్నికల ముందు అవసరం-సందర్భానికి తగినట్లుగా శ్రీరెడ్డి-కత్తి మహేష్‌ను ప్రవేశపెట్టినట్లుగానే, ఇప్పుడు పోసానిని ప్రవేశపెట్టారన్నది బహిరంగ రహస్యమయిపోయింది. ఏదైనా గుప్పిట మూసినంతవరకే రహస్యం కదా?
టోటల్ ఎపిసోడ్‌లో.. బాగా తెలివైన వాడనుకునే ఏబీఎన్ రాధాకృష్ణ కూడా పీకే ట్రాప్‌లో పడి.. బెజవాడ డ్రగ్స్ కేసును అటకెక్కించి, టీఆర్‌పీ రేటింగ్ కోసం పోసాని ఎపిసోడ్‌కు పబ్లిసిటీ ఇవ్వడమే వింత. ఒక్క ఏబీఎన్నే కాదు.. అన్ని చానెళ్లూ పోసాని-పవన్ తిట్ల కల్యాణానికి భజంత్రీలు కొడుతుండటంతో, ఆ శబ్దాలకు డ్రగ్స్ కేసు వినిపించకుండా పోయింది. ఈలోగా బయట రాష్ట్రాల్లో బెజవాడ నుంచి-బెజవాడకు రవాణా కావలసిన డ్రగ్స్‌ను నిఘా అధికారులు పట్టుకుంటున్నారు. అవేమీ ఈ సినిమా లొల్లిలో వినిపించకుండా పోతున్నాయి. పాలకులకూ.. వారిని నడిపించే‘ పీకే’కూ కావల్సిందీ అదే. కాకపోతే.. ‘పెద్దగొంతు టీడీపీ’ ఒక్కటే పీకే ట్రాప్‌లో పడకుండా, డ్రగ్స్ కేసుపై ఉడుంపట్టుపడుతోంది. కారణం గత ఎన్నికల్లో పీకే చేతిలో తిన్న చావుదెబ్బలే. అదొక్కటే తేడా. మిగిలినదంతా సేమ్ టుసేమ్!

Leave a Reply