Home » ద్రోహం చేసింది రాజేందరే..

ద్రోహం చేసింది రాజేందరే..

‘తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టడం’ అంటే ఎలా ఉంటుందో ఈటల రాజేందర్‌ రుజువు చేశాడు. అక్కున చేర్చుకొని అందలమెక్కించిన పార్టీకి వెన్నుపొడిచిన రాజేందర్‌ తనకు అన్యాయం జరిగిందని నమ్మబలుకుతున్నాడు. నిజానికి ఈటలకు పార్టీలో, ప్రభుత్వంలో మరెవ్వరికీ దక్కని ప్రాధాన్యం లభించింది. ప్రజలను ఆదరించి అభివృద్ధి చేయమని పదవులిస్తే.. పార్టీకి, ప్రజలకు ద్రోహం చేశాడు. తన ఆస్తులపెంపుకోసం ఆరాటపడి భూ ఆక్రమణలకు పాల్పడ్డాడు.
హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారనే అంశంపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌ నియోజకవర్గంలో వివిధ పార్టీల బలాబలాలు ఏ విధంగా ఉన్నాయో చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే.. టీఆర్‌ఎస్‌కు దరిదాపులో ఉండి పోటీనిచ్చే పార్టీ ఏదీ లేదనే అనిపిస్తున్నది. సుదీర్ఘకాలం టీఆర్‌ఎస్‌లో ఉండి పదవులు అనుభవించిన ఈటల పార్టీకి వెన్నుపోటు పొడిచి బీజేపీ పంచన చేరిన తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారు.
ఉద్యమకాలం నుంచి ఈటలను టీఆర్‌ఎస్‌ అక్కున చేర్చుకున్నది. ఎన్నో ప్రభుత్వ బాధ్యతలను కూడా అప్పగించింది. ఉన్నత శిఖరాలను అధిరోహించేలా చేసింది. ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా పార్టీలో ఆయనకు మంచి గుర్తింపునిచ్చింది. అయితే వచ్చిన గుర్తింపు, ఎదుగుదల వ్యక్తిగా తనవల్లనే వచ్చిందని ఎవరైనా భావిస్తే అవివేకమే. ఈటల రాజేందర్‌ విషయంలో అదే జరిగింది. తాను చేసిన తప్పునకు తానే శిక్ష విధించుకొని ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశాడు. అంతటితో తన రాజకీయ జీవితానికి ముగింపు పలికితే బాగుండేది. కానీ తానేదో గొప్ప పని చేసినట్లుగా తిరిగి రాజకీయాలను శాసించాలనే దురాశ తో బీజేపీలో చేరారు. అది తన వ్యక్తిగతం. కానీ ఉపఎన్నికల్లో తిరిగి తానే గెలుస్తాననే అత్యాశతో ఉన్నారు. తాను కండువా కప్పుకొన్న పార్టీ బలమేందో ఈటలకు తెలియంది కాదు. తిరిగి తానే గెలుస్తానని పగటి కలలు కనడమే విడ్డూరం.
హుజూరాబాద్‌ నియోజకవర్గ రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే.. 2018లో 11 మంది పోటీ చేశారు. 84.40 శాతం పోలింగ్‌ నమోదైంది. ఈటల టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అత్యధికంగా 59.34 శాతం ఓట్లు సాధించి, 24.74 శాతం ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్‌ అభ్యర్థి కౌశిక్‌రెడ్డిపై గెలిచారు. బీజేపీ తరుపున పోటీచేసిన పుప్పాల రఘు కేవలం 1,683 ఓట్లు తెచ్చుకున్నారు. అంటే బీజేపీ 0.95 శాతం ఓట్లు మాత్రమే సాధించింది. అలాంటి పార్టీ తరుపున ఈటల ఈ ఉప ఎన్నికల్లో పోటీచేస్తే తన ఓటమి ఎలా ఉండబోతుందో చెప్పనక్కర్లేదు.
ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా విద్యార్థి ఉద్యమ నేత గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను ప్రకటించడం ద్వారా ఒక నిరుపేద బహుజన విద్యార్థి నేతకు అవకాశం ఇచ్చినట్లయింది. ఈ పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌ గెలుపు నల్లేరుపై నడకే. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని ముమ్మరం చేసి అన్ని గ్రామాలను చుట్టివేసింది. సబ్బండవర్గాలతో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్యపర్చింది. ఫలితంగా ప్రజా సంక్షేమ ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్న తీరును బట్టి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విజయం ఎప్పుడో ఖాయమైపోయింది. ఈ నేపథ్యంలోనే ప్రజల ఎజెండాతో ముందుకుసాగుతు న్న టీఆర్‌ఎస్‌లో కౌశిక్‌రెడ్డి చేరారు. ఫలితంగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ ఉన్న ఉనికిని కోల్పోయింది. మరోవైపు టీఆర్‌ఎస్‌ పార్టీకి గ్రామస్థాయిలో సంస్థాగత నిర్మాణం ఉన్నందున గెల్లు గెలుపు నల్లేరుపై నడకే.
ఈ నేపథ్యంలోంచే.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ హుజూరాబాద్‌ నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. అందులో భాగంగానే షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధికి బాటలు వేసే ‘దళితబంధు’ పథకానికి ఈ నియోజకవర్గాన్నే పైలట్‌ ప్రాజెక్టుగా ఎన్నుకున్నారు. దీంతో హుజూరాబాద్‌ ప్రజలపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. హుజూరాబాద్‌లో 41 వేలకు పైగా ఎస్సీ జనాభా ఉందని అంచనా. వారి అభివృద్ధి కోసం ఏకంగా రూ. 2 వేల కోట్లు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాలో జమచేశారు. దీంతో దళిత సాధికారత పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు.
హుజూరాబాద్‌ నియోజకవర్గంలో ఏడు మండలాలున్నాయి. ఇందులో 1.30 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభుత్వం నుంచి వివిధ సంక్షేమ పథకాల ద్వారా నేరుగా లబ్ధి పొందుతున్నవారే కావడం విశేషం. రైతుబంధుతో లబ్ధి పొందుతున్నవారు 52,888 మంది. వీరిలో కమలాపూర్‌, వీణవంక మండలాల నుంచి అధిక సంఖ్యలో ఉన్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకంతో 10,929 మంది లబ్ధిపొందారు. అలాగే ఆసరా పింఛన్లు అందుకుంటున్న వారిలో హుజూరాబాద్‌, వీణవంక, కమలాపూర్‌, ఇల్లంతకుంట మండలాల నుంచే 29,090 మంది ఉన్నారు.
ఇక షాదీ ముబారక్‌, కల్యాణలక్ష్మి అందుకున్నవారు 5,868 మంది, కేసీఆర్‌ కిట్‌ ద్వారా లబ్ధి పొందినవారు 7,289 ఉన్నారు. ఈ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లలో ప్రభుత్వం నుంచి నేరుగా ఆర్థిక సహాయం పొందుతున్నవారే 50 శాతానికి పైగా ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను అనుభవిస్తున్న వీరంతా టీఆర్‌ఎస్‌ను అక్కున చేర్చుకుంటారనటంలో సందేహం లేదు.
గతంలో బీఎస్‌పీ నుంచి పోటీచేసిన మారేపల్లి మొగిల య్య 1,024 ఓట్లు సాధించారు. ఇప్పుడు ఆ పార్టీ బరిలో ఉంటుందో లేదో తెలియదు. నోటాకు 2867 ఓట్లు పోలయ్యాయి. ఇక స్వతంత్ర అభ్యర్థులు సైతం 5,140 ఓట్లు పొందగలిగారు. కాం గ్రెస్‌కు 61,121 ఓట్లు పోలయ్యాయి కాబట్టి వాటిలో మెజారిటీ ఓట్లు టీఆర్‌ఎస్‌కు పడే అవకాశం ఉన్నది. గత ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు 1,04,840 ఓట్లు వచ్చాయి. ఇప్పు డు ఆ మెజారిటీ రెట్టింపు అయ్యే అవకాశం ఉన్నది. ఈ పరిస్థితుల్లో గెల్లు గెలుపు చారిత్రాత్మకం అవడమే కాకుండా ఈటల ఆటలకు తెర పడనున్నది.
 

డాక్టర్‌ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి
చైర్మన్‌, దివ్యాంగులకో-ఆపరేటివ్‌ కార్పొరేషన్‌

Leave a Reply