Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ ప్రభుత్వం తెలుగుకు తెగులు పట్టిస్తోంది

– తెలుగు అకాడమిలో రూ. 43 కోట్లు కొట్టేసిన దొంగలెవరో తేలాలి
– ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న నిధులు ఇప్పుడే ఎందుకు మాయమయ్యాయి ?
– తెలుగును నిర్లక్ష్యం చేయడమంటే తెలుగు జాతిని అవమానించడమే
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకట్రావు
వైసీపీ ప్రభుత్వం తెలుగు భాషకు, తెలుగు సంసృతికి తూట్లు పొడిచేలా వ్యవహరిస్తోంది. పక్క రాష్ట్రాలు మాతృభాషకు పెద్దపీట వేయడంలో పోటీ పడుతుంటే ఇక్కడ మాత్రం తెలుగు భాష పూర్తిగా నిర్లక్ష్యంలో కొట్టుమిట్టాడుతోంది. జగన్ ముఖ్కమంత్రి అయిన నాటి నుంచి తెలుగు భాషను, తెలుగు అకాడమినీ నిర్ల్యక్ష్యం చేస్తూ తెలుగుకు తెగులు పట్టిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలుగు అకాడమిలో పలు ఘటనలు చోటుచేసుకుంటున్నాయి.
తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జాబితాలో ఉన్న తెలుగు అకాడమిలో నిధులు మాయమయ్యాయి. కార్వన్‌లో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో నకిలీ పత్రాలు సృష్టించి రూ. 43 కోట్లు కాజేశారు. బ్యాంకుకు నకిలీ పత్రాలు సృష్టించి ఈ డబ్బులు కాజేశారంటే అకాడమి చైర్మన్లు, అధికారులు ఏం చేస్తున్నారు? ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న తెలుగు అకాడమి నిధులు ఇప్పుడు కొట్టేయటం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇన్నాళ్లు ఉన్న నిధులు ఇప్పుడే ఎందుకు మాయమయ్యాయి? మాతృభాష నిధుల్లో అవినీతికి పాల్పడటమంటే అంటే ఆ భాషను మాట్లాడుతున్న కోట్లాది మంది మనోభావాలకు, భావోద్వేగాలకు, అభివృద్ధికి ద్రోహం చేసినట్లే. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలి. నకిలీ పత్రాలు సృష్టించిందెవరో, అందుకు సహకరించిందెవరో తెలుగు అకాడమిలో రూ. 43 కోట్లు కొట్టేసిన దొంగలెగవరో తేలాలి.
దేశ భాషల్లోనే కాకుండా ప్రపంచ భాషలలోనే అత్యంత ప్రాచీన భాషగా, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్‌గా ప్రపంచ ప్రఖ్యాతి పొందిన మన తెలుగు భాష జగన్ ప్రభుత్వం వచ్చాకే నిర్లక్ష్యానికి గురవుతోంది, తెలుగు మీడియం రద్దు చేయాలని ప్రయత్నించారు, కానీ కోర్టులు మొట్టికాయలు వేయటంతో వెనక్కి తగ్గారు, తెలుగు భాష అభివృద్ధి, వినియోగం కోసం కృషి చేయాల్సిన అకాడమీ అస్తిత్వాన్ని దూరం చేసేలా ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న తెలుగు అకాడమిని తెలుగు – సంసృత అకామిగా పేరు మార్చారు. తెలుగు అకాడమీ పేరు మార్చడం జగన్ రెడ్డి భావ దారిద్ర్యానికి నిదర్శనం. ప్రాచీన భాషగా తెలుగు వర్ధిల్లుతూ ఉంటే.. తెలుగు భాషను కించపరిచేలా ప్రభుత్వం వ్యవహరించడం తెలుగు ప్రజానీకానికి అవమానకరం. జగన్ రెడ్డికి తెలుగు భాష గౌరవం, తెలుగు విశ్వవిద్యాలయం గొప్పతనం తెలియకపోవడం తెలుగు ప్రజల దురదృష్టం. తెలుగులో జీవోలు ఇవ్వమంటే అసలు జీవోలే ప్రజలకు అందుబాటులో ఉండకుండా చేశారు. వైసీపీ ప్రభుత్వ వ్యవహారశైలిపై ప్రతీ తెలుగువారు ఆత్మవిమర్శ చేసుకోవాలి. తెలుగు భాషా పరిరక్షణకోసం ప్రతీ తెలుగువాడు ఒక గిడుగు వారిలా నడుం బిగించాల్సిన సమయం ఆసన్నమయ్యింది.

LEAVE A RESPONSE