Suryaa.co.in

Andhra Pradesh

అన్నదాతను తక్షణమే ఆదుకోవాలి

– పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
-రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు లో రైతు గర్జన ర్యాలీ
– భారీగా తరలి వచ్చిన రైతన్నలు

కర్నూలు : తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల మధ్య.. కరువుతో.. దిక్కుతోచని స్థితిలో బలవన్మరణాలకు పాల్పడుతున్న అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదుకుని భరోసా కల్పించాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు.

అన్నదాతలకు సంఘీభావంగా కర్నూలు లో రైతు గర్జన ర్యాలీని నిర్వహించారు. Cwc సభ్యులు డాక్టర్ ఎన్. రఘువీరా రెడ్డి, పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ సీడీ మయప్పన్, కేంద్ర మాజీ మంత్రులు జేడీ శీలం, చింతా మోహన్, మాజీ రాజ్యసభ సభ్యుడు తులసి రెడ్డి, రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు మస్తాన్ వలి, జంగా గౌతమ్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు లాం తాంతియా కుమారి, nsui రాష్ట్ర అధ్యక్షులు నాగమధు యాదవ్, కర్నూలు జిల్లా అధ్యక్షులు కె. బాబురావు, నంద్యాల పార్లమెంట్ డీసీసీ అధ్యక్షులు జే లక్ష్మి నరసింహ యాదవ్, కిసాన్ సెల్ అధ్యక్షులు జెట్టి గురునాధంతో పాటు భారీ సంఖ్యలో రైతులు, కాంగ్రెస్ కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని రైతుల పట్ల అన్యాయంగా వ్యవరిస్తున్న రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎండగట్టారు.

449 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలి
కలెక్టరేట్ వరకు సాగిన.. రైతు గర్జన ర్యాలీ లో భారీ సంఖ్యలో కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కలక్టరేట్ లో జాయింట్ కలెక్టర్ ద్వారా ముఖ్యమంత్రి కి అందజేయాలని… వినతి పత్రం ఇచ్చిన అనంతరం.. పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ..రైతుల వ్యవసాయ రుణాలను వెంటెనే మాఫీ చేయడంతో పాటు 449 మండలాలను కరువు మండలాలుగా పునర్ ప్రకటించాలని తెలిపారు. ఎకరానికి రూ.50 వేలు నష్ట పరిహారం చెల్లించాలని చెప్పారు. అదేవిధంగా ఉమ్మడి కర్నూలు రైతుల సాగు, తాగు నీటి అవసరాలను తీర్చే వేదవతి, గుండ్లకమ్మ రిజర్వాయర్లను వెంటనే పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగంతో అనుసంధానం చేయాలని కోరారు. ముఖ్యంగా రాయలసీమను ప్రత్యేక కరువు ప్రాంతంగా ప్రకటించి యుద్ధ ప్రాతిపదికన ప్రత్యేక నిధులు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.

అకాల విద్యుత్ కోతల వల్ల పంటలు ఎండిపోయాయిని… దీనితో చాలా ప్రాంతాల్లో ఉపాధి పనులు లేక వృద్ధులు, చిన్న బిడ్డలను ఇళ్ల వద్దే.. వదిలి ప్రజలు వలస పోతున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటక ప్రభుత్వం సెప్టెంబర్ 24నే కరువు ప్రాంతాలను ప్రకటించి… సాయం కోసం కేంద్రం ప్రభుత్వానికి పంపగా… ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం అక్టోబర్ 31న తూ తూ మంత్రంగా మొత్తం 449 కరువు మండలాలకుగానూ… 103 కరువు మండలాలను మాత్రమే ప్రకటించి చేతులు దులుపుకుందని ఆయన దుయ్యబట్టారు.

ఈ నేపద్యంలో పాత రుణాలు మాఫీ చేసి వెంటనే కొత్త వ్యవసాయ రుణాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. అదే విధంగా…ప్రత్యామ్నాయ పంటల విధానం అమలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ఉపాధి హామీ పనులను పెద్ద ఎత్తున చేపట్టి వలసలు నివారించాలని తెలిపారు. రైతులకు కోతలు లేకుండా.. నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.

ఆత్మహత్య చేసుకున్న రైతులకు రూ.25 లక్షలు
రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 25 లక్షల నష్టపరిహారం చెల్లించి, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతు ఏడ్చిన రాజ్యం ఎద్దు ఏడ్చిన సేద్యం బాగుపడదన్న పెద్దల మాటలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కర్షకుల పక్షపాతి పార్టీ అని… అన్నదాతలకు న్యాయం జరిగే వరకూ తమ పోరాటం ఆగదని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ కార్యకర్తలు, రైతులతో పాటు పలువురు పీసీసీ, ఉమ్మడి కర్నూల్ జిల్లా కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE