-కరెంటు కొనుగోళ్ల భారం ప్రజలపైనే
-ట్రూ ఆప్ చార్జీలు వసూలు చేయనున్న సర్కార్
-43 శాతం పెరిగిన ఇంటి పనులు
-ఖాళీ స్థలాలపై 200 శాతం పన్ను పెంపు
-ప్రతి ఇంటి నుంచి 90 రూపాయలచెత్త పన్ను వసూళ్ళు
-హవ్వ…అది తాడేపల్లి ప్యాలెస్ అయినా… పేదవాని ఇంటికైనా ఒకటేనా?
-కోతలరాయుడు గా సీఎం జగన్
-వైయస్సార్ కాంగ్రెస్, నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు
పన్ను పోట్లు పోలీసు గాట్లతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, నర్సాపురం లోక్ సభ సభ్యుడు రఘురామకృష్ణంరాజు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పన్ను పోట్లతో ప్రజల బతుకులు భారంగా తయారయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పన్నులు ఇలాగే కొనసాగితే రాష్ట్రంలో ప్రజల మనుగడే ప్రశ్నార్ధాకం కానుందన్నారు.
బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా ఎంపీ రఘురామకృష్ణంరాజు మీడియాతో మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం గృహ యజమానుల నుంచి 43 శాతం అదనంగా ఇంటి పన్ను వసూలు చేస్తోందని చెప్పారు. గుడివాడ కు చెందిన ఒక కాంప్లెక్స్ యజమానికి 15 శాతం ఇంటి పన్ను పెంచినట్లు తొలుత నోటీసులు జారీ చేసిన అధికారులు, ఆ తరువాత మరో 28 శాతం అదనంగా ఇంటి పన్ను చెల్లించాలని తాకీదు లు జారీ చేశారన్నారు. రాష్ట్రంలోని గృహే యజమానుల పైనే కాకుండా, ఖాళీ స్థలాల యజమానుల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముక్కుపిండి పన్నులను వసూలు చేస్తోందని చెప్పారు.
గత ప్రభుత్వ హయాంలో ఖాళీ స్థలాల యజమానుల నుంచి నామమాత్రపు పన్ను వసూలు చేయగా, జగన్మోహన్ రెడ్డి సర్కారు మాత్రం ఆ పన్నును 200 శాతానికి పెంచి వసూలు చేస్తోందని తెలిపారు. ఇక పన్ను పేరిట ప్రతి కుటుంబం నుంచి నెలకు 90 రూపాయల చొప్పున వసూలు చేయడం జగన్ సర్కార్ కే చెల్లిందన్నారు. ముఖ్యమంత్రి నివసించే తాడేపల్లి ప్యాలెస్ కైనా, నాలుగు గదుల్లో వేరువేరుగా నివసించే కుటుంబాని కైన, ఇంటికి 90 రూపాయల చొప్పున ఆస్తిపన్ను వసూలు చేస్తున్నారన్నారు.. ఈ లెక్కన నాలుగు గదుల్లో వేరువేరుగా నివసిస్తున్నా కుటుంబ సభ్యులు నెలకు 360 రూపాయలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఈ వసూలు రాజాల ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని, ముఖ్యమంత్రి, మంత్రులు పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఇక ఆర్టీసీ చార్జీలను అడ్డగోలుగా పెంచారని, అలాగే పెట్రోల్ ,డీజిల్ ధరలు బిజెపి పాలిత రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువగా ఉన్నాయన్నారు.
కర్ణాటకలో కంటే ఆంధ్రప్రదేశ్ లో లీటర్ పెట్రోల్ , డీజిల్ పై 12 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారని చెప్పారు. పెట్రోలు, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వ పన్నులను తగ్గించుకోవాలని ప్రధాని మోడీ సూచించిన, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెడచెవిన పెట్టారని మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంటు కోతలు మే నెలాఖరు వరకు కొనసాగే అవకాశాలున్నట్టు స్పష్టమవుతుందని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. అయితే మంత్రులు పెద్దిరెడ్డి, రోజా వంటి వారికి ఈ కోతలు కనిపించక పోయినప్పటికీ, రాష్ట్రంలో మరొక 15 రోజులపాటు పరిశ్రమలకు పవర్ హాలిడే తప్పక పోవచ్చునని అన్నారు. ప్రస్తుత కరెంటు సంక్షోభం నుంచి ప్రజలను కాపాడేందుకన్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు 30 నుంచి 40 కోట్లు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేస్తున్నట్లుగా సాక్షి దినపత్రికలో కథనాలు రాయడం విస్మయాన్ని కలిగిస్తోందన్నారు. విద్యుత్ కొనుగోలు కోసం వెచ్చించిన ఈ మొత్తాన్ని ప్రజలపైనే ట్రూ అప్ ఛార్జీల రూపంలో మోపను న్నారని రఘురామకృష్ణంరాజు పేర్కొన్నారు. ఒక నెల విద్యుత్ కొనుగోళ్లకు దాదాపు 1200 కోట్ల రూపాయల వ్యయమైతే, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రజల నుంచి ట్రూ అప్ చార్జీల రూపంలో వసూలు చేస్తారని తెలిపారు.
రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసమని ఒక బ్యాంక్ ను సి ఆర్ డి ఎ వైస్ చైర్మన్ 3,600 కోట్ల రూపాయల రుణాన్ని కోరినట్లుగా తెలుస్తోందని రఘురామ వివరించారు. అయితే సదరు బ్యాంకర్, రాష్ట్ర రాజధాని ఎక్కడో ముందు తేల్చి చెప్పాలని అని ప్రశ్నించినట్లు తనకు సమాచారం అందిందని అన్నారు. కోర్టు తీర్పు ప్రకారం అమరావతి రాజధాని అని సి ఆర్ డి ఎ వైస్ చైర్మన్ వివేక్, బ్యాంకు అధికారులకు వివరించినట్లు తెలిసిందన్నారు. అమరావతి నిర్మాణం కోసమ ని బ్యాంకు నుంచి రుణాన్ని పొందిన తరువాత , ఆ మొత్తం సొమ్మును ఇతర మార్గాలకు మళ్ళించే అవకాశాలు లేకపోలేదని రఘురామకృష్ణంరాజు అనుమానం వ్యక్తం చేశారు. గతంలోనూ ఇలాగే జరిగిందని, అయితే కేంద్ర ప్రభుత్వం పలు మార్లు లేఖలు రాసిన తరువాత, ఇప్పుడు లెక్కలన్నీ పక్కాగా అడుగుతోందన్నారు.
ప్రస్తుత రుణాల గురించి మాత్రమే కాకుండా, గతంలో దుర్వినియోగ మైన రుణాల లెక్కలను తక్షణమే తేల్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు. రాష్ట్రంలో ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ప్రభుత్వ పెద్దలు చెప్పారని తప్పులు చేయవద్దంటూ సూచించారు. విశ్రాంత విద్యాధికారి చిన్న వీరభద్రుడు ఎదురైన పరిస్థితే, ప్రభుత్వ పెద్దలు చెబితే తప్పులు చేసే అధికారులకు ఎదురు కానుందని హెచ్చరించారు. కోర్టు ఆదేశాల తరువాత కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులను బి పెడ్ కోర్సు చేయడానికి అనుమతించని కారణంగా, వీరభద్రుడి కి కోర్టు ధిక్కరణ నేరం కింద నాలుగు వారాల పాటు జైలు శిక్ష, రెండు వేల రూపాయల జరిమానా విధించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వ పెద్దలు తమ స్వలాభం కోసం అధికారులపై ఒత్తిళ్లు తీసుకువచ్చి తప్పులు చేయించాలని చూస్తోందని, తన విషయంలో కూడా అలాగే జరిగిందన్నారు.
డీజీపీ ఎక్కడ?…
రాష్ట్ర డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ ఉన్నారంటూ రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. మంగళవారం రాష్ట్రంలో మూడు అత్యాచార, అత్యాచారయత్నం ఘటనలు చోటు చేసుకుంటే, హోంమంత్రి మినహా, డిజిపి అడ్రస్ లేకుండా పోయారన్నారు. ఇక హోం మంత్రి తానేటి వనిత ఏదో చెప్పబోయి… మరేదో మాట్లాడుతున్నా రంటూ ఎద్దేవా చేశారు. రేపల్లె అత్యాచార ఘటనలో నిందితులకు వివాహిత మహిళను రేప్ చేసే ఉద్దేశ్యం లేదని కానీ ఆమె భర్తను కొడుతుండగా, అడ్డుకునేందుకు మధ్యలో రావడం వల్లే సామూహిక అత్యాచార ఘటన చోటుచేసుకుందని చెప్పడం ఆమె పరిపక్వతను తెలియజేస్తోందని విమర్శించారు. శాంతి భద్రతలను పర్యవేక్షించే శాఖను తన వద్ద ఆర్టి పెట్టుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటి నుంచి బయటికి రారని, అటువంటప్పుడు ఉత్సాహం కొద్ది పనిచేస్తున్న తానేటి వనిత కు ఆ శాఖను అప్పగించాలని సూచించారు.
రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలు, హత్యలపై ముఖ్యమంత్రి తక్షణమే స్పందించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. గురువారం తిరుపతి పర్యటనకు వెళ్లనున్న ముఖ్యమంత్రి, రేణిగుంట నుంచి సభాస్థలి వరకు హెలికాప్టర్లో వెళ్లకుండా రోడ్డు మార్గాన ప్రయాణించాలని సూచించారు. దీని ద్వారా, ఆర్థికంగా అధోగతి పాలైన రాష్ట్ర ఖజానాకు కొద్దిగా ఊతమిచ్చిన వార వుతారన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులను తానే కడుతున్నానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వ హయాంలో శంకుస్థాపన చేసిన ఆస్పత్రి ప్రారంభోత్సవానికి తాను వెళ్తున్నానని చెప్పుకుంటే మంచిదన్నారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన గడప గడపకు కార్యక్రమం తరచూ వాయిదా పడడానికి, రాష్ట్ర ప్రభుత్వం బాధిస్తున్న పన్నులే కారణమన్నారు.. రాష్ట్ర ప్రభుత్వానికి తమ ఆదాయానికి మించి పన్నులు చెల్లిస్తున్న ప్రజలు గడపగడపకు కార్యక్రమానికి వెళ్ళే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను, ప్రజా ప్రతినిధులను తరిమికొట్టే అవకాశం లేకపోలేదన్నారు.. ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి, తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న మీడియా సంస్థలను తప్పు పట్టడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు.