Home » మీ చీరలు మాకెందుకు?..మీ సోమరి పథకాలు మాకెందుకు?

మీ చీరలు మాకెందుకు?..మీ సోమరి పథకాలు మాకెందుకు?

మా రైతులకు గిట్టుబాటు ధర ఇస్తే మా డబ్బులతో మేమే సంవత్సరానికి 10 చీరలు కొనుక్కుంటాం మాకు ఎవరి సాయం అక్కర్లేదు. ప్రజలారా ఆలోచించండి.
ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?
పన్నులు పెంచడం వల్ల.
పన్నులు ఎందుకు పెరుగుతున్నాయి?
సంక్షేమ పథకాలు ఇవ్వటం వల్ల..
సంక్షేమ పథకాలు ఎందుకు ఇస్తున్నారు?
రాజకీయ పార్టీలకు ఓట్లు….సీట్లు …..అధికారం కావాలి.
అంటే పార్టీలు అధికారంలోకి రావడానికి, ఓటర్లకు ఎడమ చేత్తో పథకాలు ఇచ్చి , ధరలు పెంచి కుడి చేత్తో పైసలు లాగుతున్నారు.మరి సంక్షేమ పథకాలు అనుభవిస్తూ ధరలు పెంచారనడం అవివేకమే కదా?
ముందు పోరాటం చేయాల్సింది ధరల తగ్గుదల పై కాదు. సంక్షేమ పథకాలు వద్దని .
అవును. నిజంగా ప్రజలకు కష్టం విలువ నేర్పి, వారి నుంచి ఉత్పత్తి పొంది దానిని జాతిప్రయోజనాలకు ఉపయోగించే పాలకుడు ఉంటే.. ఆ రైతు ఎంత ఆనందంగా ఉంటాడో, ఇదిగో ఉత్తరప్రదేశ్ చెరకు రైతును చూస్తే తెలుస్తుంది. ప్రజలను సోమరిపోతులను చేసి, ఓటుబ్యాంకు రాజకీయాలతో సంక్షేమ మైకంలో దింపి గద్దెనెక్కుతున్న పాలకులకు.. యుపి సీఎం యోగి పాలన చెంపపెట్టు. పాలకుడు ప్రయోజకుడయితే, పాలితులూ ప్రయోజకులవుతారు. పాలకుడు సోమరిపోతులను తయారుచేసేవాడయితే, పాలితులూ సోమరిపోతులవుతారు. పాలకులు విదిలించే పథకాల కోసం ఎదురుచూస్తుంటారు. కడకు పైకి కూడా లేచే శక్తి లేని వీర సోమరిపోతులవుతారు. ఇప్పుడు దేశంలోని అనేక రాష్ట్రాల్లో కనిపిస్తున్న సోమరిపోతు దృశ్యాలివే. ఒక్క యుపీ మినహా! ఎందుకంటే అక్కడ ఉంది యోగి కాబట్టి!! నిజం. కావాలంటే ఇది చదవండి.
రైతు సంక్షేమం అంటే ప్రజల ట్యాక్సుల డబ్బులతో, వంద ఎకరాలు ఉన్న భూస్వాములకు దోచిపెట్టడం కాదు. రైతు సగర్వంగా తన సొంత కష్టంతో, ఎవ్వడి దయాదాక్షిణ్యాలమీద ఆధారపడకుండా బ్రతికే పరిస్థితి కల్పించడం.
మన తెలుగు రాష్ట్రాలలో సంక్షేమం అంటే దోచిపెట్టడం , లేదా బిక్షం వేసి జనాలను సోమరులుగా చేయడం. మరి రైతు సంక్షేమం అంటే ఇంకేం చేయాలండీ అంటే మనం నిత్యం ఏడ్చి చచ్చే, కుళ్ళు జోకులు వేసుకునే యోగి మహారాజ్ ఉత్తర ప్రదేశ్ లో ఏమి చేసాడు అనేది చూద్దాం పదండి.
మన దేశం లో చెరకు పంట అనేది ఒక అతి పెద్ద వాణిజ్య పంట. దేశంలో ఎక్కువగా ఈ పంట ఎక్కడ పండిస్తారు అని అడిగితే, మనవాళ్లంతా మహారాష్ట్ర అని అంటారు. కానీ మన దేశంలో అతి ఎక్కువగా చెరకు పండించే రాష్ట్రం ఉత్తరప్రదేశ్.
2014 కు ముందు మనదేశంలోని చాల ప్రాంతాల్లో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా ఉండేది. వాళ్ళ బకాయిలు సరైన సమయంలో చెల్లించేవాళ్ళు కాదు , 2012 – 14 మధ్య రైతులకు దాదాపు రెండు సంవత్సరాల పాటు, చెరకు బాకీలు చెల్లించలేక పోయారు చెరకు ఫ్యాక్టరీలవాళ్ళు. ఆ రోజుల్లో ప్రభుత్వాలు ఒకవైపు ఫ్యాక్టరీలతో కుమ్ముక్కు అయి, రైతుల శ్రమ దోచుకునే పని చేస్తూనే అదే రైతులను ఫ్యాక్టరీ యాజమాన్యాల కు వ్యతిరేకంగా రెచ్చగొడుతూ పబ్బం గడుపుకునేవారు.
కానీ ఈ రోజున అంటే 2021 నాడు ఉత్తర్ ప్రదేశ్ లో , చెరకు రైతులకు మునపటి కంటే ఎక్కువగా మునపటికన్నా తొందరగా.. ఒక్క పైసా కూడా బకాయి లేకుండా డబ్బులు అందుతున్నాయి. ఒకప్పుడు నిత్యం రోడ్డుమీద ధర్నాలు చేసే రైతులు, ఈ రోజున సమయమంతా తమ పంట పొలాలలో గడుపుతున్నారు.మరి అసలు ఈ మార్పు ఎలా వచ్చింది , ఏమి మారింది? ఎలా మారింది? ఒక ముఖ్యమంత్రి.. ఒక ప్రధాన మంత్రి నిజంగా రైతుని బాగు చేయాలంటే ఏమి చేయగలుగుతారు అనేదానికి నిదర్శనం ఈ పరివర్తన.
ఒకప్పుడు చెరకు పంట చేతికి వచ్చే సమయానికి, మన దేశంలో చక్కెర నిల్వలు తగ్గిపోయాయి , చక్కెర రేట్లు పెరిగి ప్రజలు ఇబ్బంది పడతారు కాబట్టి, ప్రభుత్వాలు చక్కెర దిగుమతికి అనుమతి ఇచ్చి మన దేశంలో చక్కర రేట్లు తగ్గేటట్టుగా చేసేవి. దానితో చక్కెర రేటు లేదు కాబట్టి, చక్కెర ఫ్యాక్టరీలు రైతులకు చెరకు ధర చెల్లించేవి కాదు. డబ్బులు చెల్లించడం లో విపరీతమైన జాప్యం చేసేవి.
అలా చెరకు ఆడించే సీజన్ అయిపోగానే అవే ఫ్యాక్టరీలు.. మా దగ్గర విపరీతమైన చక్కెర నిల్వలు పేరుకు పోయాయి కాబట్టి, దిగుమతులు ఆపేసి మా చక్కెరకు ఎగుమతులకు అవకాశం ఇవ్వండి అని లాబీయింగ్ చేసి ఎగుమతులకు అనుమతి తెచ్చుకుని ఈ దేశంలో వున్న నిల్వలు చాలామటుకు, ఎగుమతి చేసి మిగిలిన చక్కెరకూడా ఎక్కువ ధరలకు అమ్ముకునే వాళ్ళు. ఇది కాకుండా మొలాసిస్ , ఇతర పదార్థాలు లిక్కర్ కంపెనీలకు అమ్ముకుని డబ్బులు చేసుకునేవాళ్ళు. దాదాపు చాలా చక్కెర ఫ్యాక్టరీలు రాజకీయనాయకులవే ఉండేవి కాబట్టి , ప్రభుత్వాలు వాళ్ళు ఆడించినట్టుగా ఆడేవి , చెరకు రైతు నోటిలో మట్టి కొట్టేవి.
మరి 2014 తరువాత మోడీ వచ్చాక.. దేశంలో చక్కర ధర పెరిగినా సరే మేము దిగుమతులను అనుమతించము అని నిర్ణయం తీసుకోవడంతో , చెరకు పంట చేతికి వచ్చే సమయానికి చక్కెర ధర బాగా పెరిగింది, దానితో చక్కెర ఫ్యాక్టరీల మధ్య పోటీ పెరిగి, మంచి ధర చెల్లించే పరిస్థితి మొదటిసారి ఉత్తర ప్రదేశ్ లో వచ్చింది.
ఇదే కాకుండా 2017 తరువాత యోగి మహారాజ్ ముఖ్యమంత్రి కాగానే, తమ రాష్ట్రం లో ముఖ్య వాణిజ్య పంట అయిన చెరకు రైతుల అభివృద్ధి కోసం, ఎన్నో సంస్కరణలు తెచ్చారు. చెరకు రైతుల కష్టాల మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారికి Co – 0238 రకం అధిక దిగుబడి రకం చెరకు సాగునీ ప్రోత్సహించి, మంచి దిగుబడి వచ్చేలా చేసింది. పైగా ఈ రకం సాగు చేయడం తో , దాదాపు 40 % అధిక దిగుబడి , దాదాపు 20 % అధిక చక్కర వచ్చే వంగడం కావడం తో , చక్కెర ఫ్యాక్టరీలు కూడా పూర్తిగా 100 % కెపాసిటీ తో ఉత్పత్తి చేయడం మొదలెట్టాయి.
చెరకు ఫ్యాక్టరీలను రైతు సంఘాల పేరుమీద ఎస్క్రో అకౌంట్ ( అంటే చక్కెర అమ్మితే అందులో వచ్చే డబ్బు ఎవరెవరి ఎలా వెళ్లాలో అనేది ముందుగానే నిర్ణయించిన అకౌంట్ , అంటే రైతు సంఘానికి 85 % ఫ్యాక్టరీకి 15 % వెళ్లాలని ముందుగా ఒప్పందం ఉంటే, ఆ అకౌంట్ లోకి వచ్చే డబ్బులు ఆటోమాటిక్ గా అలాగే పంచబడతాయి ) తెరచి చక్కెర అమ్మిన డబ్బులు, కేవలం అదే అకౌంట్లోకి వెళ్ళాలి అనే నిబంధన పెట్టారు. దీనితో చక్కెర అమ్మిన డబ్బుల మీద, డైరెక్టుగా రైతులకు అధికారం లభించి.. చక్కెర ఫ్యాక్టరీల చుట్టూ డబ్బుల కోసం తిరగాల్సిన అవసరం తప్పింది. ఫ్యాక్టరీలు తాము అమ్ముతున్న చక్కెర ద్వారా వచ్చే డబ్బులతో, తప్పనిసరిగా 85 % రైతుల అకౌంట్లకు మళ్లించాలి అనే నిబంధన పెట్టి, ఆ డబ్బులు తప్పనిసరిగా రైతులకే చేరేటట్టుగా చేశారు.
కేవలం ఇదే కాకుండా చక్కెర ఫ్యాక్టరీల లో తయారయ్యే చక్కెర ఒకవేళ ఎగుమతి చేస్తే, దానికి ఆ ఫ్యాక్టరీలకు అదనపు ఇన్సెంటివ్ ఇచ్చేటట్టుగా చేసి.. ప్రభుత్వమే మధ్యంతర రైతుల సహాయనిధి ఏర్పాటు చేసి బఫర్ నిధి తో రైతుల అకౌంట్లలోకి వెంటనే డబ్బులు వచ్చేటట్టుగా చేసింది.
ఇవే కాకుండా రైతుల పంట పండించే తీరు మార్చడానికి , కొత్త వంగడాలు , డ్రిప్ లాంటి పద్దతుల వాడడానికి ప్రోత్సహించి వారి పంట దిగుబడి కూడా, దాదాపు 30 % పెరిగేటట్టు చేసింది.
పంట దిగుబడి పెరిగి , ఎక్కువ ధర లభించి , వెంటనే ఆ పంట డబ్బులు బ్యాంకు అకౌంట్లలోకి వచ్చి రైతు బాగానే వున్నాడు. కానీ ఆ షుగర్ ఫ్యాక్టరీలు అంత సంతోషంగా లేవు . ఇంతకూ ముందటి లాగ వారి లాభాలు రావడం లేదు. అందువల్ల వాళ్ళు పంట దిగుబడికి తగినట్టుగా వారి ఫ్యాక్టరీ సామర్థ్యాన్ని పెంచడానికి ఉత్సాహం చూపలేదు , దీనితో మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చేలా అనిపించింది.
ఆ సమయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి, ఆ ఎక్కువ చెరకు దిగుబడిని చక్కెర గా మార్చకుండా ఇథనాల్ గా మార్చి, ఆ ఇథనాల్ ని పెట్రోల్ లో కలిపి అమ్ముకునే వెసులుబాటుని ప్రోత్సహించారు. ఆలా తయారు చేసిన ఇథనాల్ ని మొదట 10 % పెట్రోల్ లో కలపడానికి అనుమతి ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు దానిని 20 % దాకా చేస్తుంది. దానితో ఫ్యాక్టరీలకు మంచి లాభాలు రావడంతో పాటు, పెట్రోలు ఆదా అవడం , దానివల్ల వచ్చే పొల్యూషన్ తగ్గడం కూడా జరిగింది.
ఈ రోజున ఉత్తరప్రదేశ్ లో చక్కెర ఫ్యాక్టరీలన్నీ 100 % సామర్థ్యం తో పని చేస్తూ, ఇంకా వారి సామర్త్యాన్ని పెంచుకుంటూ , రైతుల పంట కొనడానికి పోటీ పడుతూ , చక్కెర ఎగుమతి చేయడానికి పోటీ పడుతూ , రైతుల పంట డబ్బులు సకాలంలో చెల్లిస్తూ వారు పండించిన ఎక్కువ పంటను కూడా కొనడానికి పోటీ పడుతున్నాయి. ఫ్యాక్టరీలు బాగుంటే రైతు కూడా బాగుపడతాడు అనే సిద్ధాంతాన్ని పాటిస్తూ, ఆ ఫ్యాక్టరీలు డబ్బులు సంపాదిస్తూ ఆ డబ్బులు రైతులతో కూడా పంచుకునేలా చేస్తూ, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని అతి పెద్ద వ్యవసాయమైన చెరకు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తుంది.
ఈ రోజున అక్కడ రైతులకు ఎక్కువ ధర చెల్లించడానికి ఫ్యాక్టరీలు పోటీ పడుతున్నాయి. ఎందుకంటే ఎంత చెరకు వారికి వస్తే అంత చక్కెర – ఇథనాల్ వస్తుంది, వారికి అంతగా లాభాలు వస్తాయి కాబట్టి. చెల్లింపులవిధానం సరళీకృతం చేసారు కాబట్టి , డబ్బులు డైరెక్టుగా రైతు ఖాతాలోకి వచ్చిపడతాయి. ఇద్దరూ సంతోషంగా వున్నారు. ఇదంతా కేవలం ఒక పాలకుడి చిత్తశుద్ధి, మరియు రైతులు బాగుపడాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం మూలంగా వచ్చిన మార్పు . అంతేగాని రైతులని కేవలం ఓటుబ్యాంకు గా వాడుకుందామనే దరిద్రపు రాజకీయాలవల్ల ఇలాంటి మార్పు సాధ్యం కాదు. ఇదీ రైతు సంక్షేమం అంటే , అంతేగాని ప్రజల ట్యాక్సుల డబ్బులను, భూస్వాములకు పంచేసి.. రైతులను పొలాలవైపు రాకుండా చేసి, డప్పుకొట్టుకోవడం కాదు. ఏమంటారు?

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు
9666606695

Leave a Reply