Suryaa.co.in

Family

మనం పోతే..ఏమీ వెంట రావు!

మనమెంతో కష్టపడి ఈ లోకంలో సంపాదించిన వాటిలో ఏదీ మరణించినపుడు మనతో వెంటరాదని గ్రహించాలి. సకల స్థావర జంగమ రూపభూతాలలో మానవజన్మ దుర్లభమైనది. అట్టినరజన్మంలో పురుష శరీరప్రాప్తి అత్యంత దుర్లభమైనది. పురుషజన్మ లభించిన వైదికధర్మాచరణాసక్తి కలుగుట చాలా అరుదు. అందువలన మానవజన్మ మెత్తినపుడే పరమార్థాన్ని సాధించాలి. లేకపోతే ‘పునరపి జననం పునరపి మరణం’ అన్నట్లు పుట్టటం గిట్టటం మళ్లీ పుట్టటం గిట్టటం తప్పదు.
సంపాదించిన ధనమంతా ఇక్కడే నిలిచిపోతుంది. ఏనుగులు, గుఱ్ఱాలు మొదలైన వస్తువాహనాలన్నీ దొడ్లోనే ఉంటాయి. ప్రాణ సమానురాలైన భార్య వాకిట్లోనే నిలిచిపోతుంది.బిడ్డలు, సోదరులు, బంధువులు, స్నేహితులు శ్మశానం వరకే వస్తారు. ఎంతో అభిమానం పెంచుకొన్న ఈ దేహం చితిపై పెట్టి నిప్పును రగిలించేవర కుండి బూడిదై పోతుంది.
జీవుడొక్కడే ఏకాకిగా పరలోక ప్రయాణం చేస్తాడు. ఆహారం, నిద్ర, భయం, మైధునం మొదలైనవి మృగపశుపక్ష్యాదులకూ మనుష్యలకూ సమానమే. అందువలన ఉత్తమమైన మానవజన్మను చరితార్ధం చేసికోవాలని శ్రీకృష్ణపరమాత్ముడు చెప్పాడు.ఎనభై నాలుగు లక్షల జీవకోటిలో పుణ్యబలం వలన ఉత్తమ మానవ జన్మ లభించి, సర్వేంద్రియ పుష్టి కలిగినా ఆత్మజ్ఞానసాధనకు ప్రయత్నించని మనుష్యుడు ఆత్మఘాతకుడన్నాడు.
మానవజన్మలో పుణ్యకార్యాలు చేయటానికి భగవంతుడు మానవులకు జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆజ్ఞానాన్ని వ్యర్ధం చేసినవాళ్లు సముద్రస్నానానికి పోయి అలలు తగ్గిన తరువాత స్నానం చేద్దామనుకొని స్నానం చేయనివాళ్ల వంటి వారౌతారు.సంసారమున్నంతవరకు శుభాశుభాలుంటాయి గనుక తగిన తరుణంలో ఆత్మజ్ఞాన సాధన చెయ్యాలి. మానవులు భగవద్భక్తి కలిగి ఉంటారు. దేవతలు సైతం మానవ జన్మ కోసం ఎదురు చూస్తుంటారు.
బ్రహ్మవిద్యాపారంగతులపటానికి, బ్రహ్మోపాసన చేయటానికి మానవజన్మలోనే అధికారం లభిస్తుంది. దేవతాదులలో బ్రహ్మవిచారానికి అవసరమైన హృదయసృష్టిలేదు.బ్రహ్మకూడా అన్యసృష్టికి అసంతృప్తి చెందినట్లు, మానవ సృష్టికి సంతోషించినట్లు విశదమౌతుంది.వృక్ష పశుపక్ష్యాదుల వంటి స్థావర జంగమ సృష్టిలో దేనికీ ఆత్మజ్ఞానం పొందే శక్తి లేనందున తన సృష్టి అంతా వ్యర్థమైనదని విచారించాడు.తిరిగి దీర్ఘాలోచన చేసి బ్రహ్మతన తపశ్శక్తిని, ధీశక్తిని, ఆత్మశక్తిని కేంద్రీకరించి భూలోకంలో బుద్ధిగల మానవులను సృష్టించాడు.బుద్ధిమంతులైన మానవులను చూచి బ్రహ్మ పరమానంద భరితుడై నాడు. దీనివల్ల మానవజన్మ మెంత గొప్పదో తెలిసికోవచ్చు.జగత్సృష్టిలో కట్టకడపటిది మానవ సృష్టి గనుక దేవతలకన్న మానవులే శ్రేష్ఠులు, వాళ్లలో ఆత్మజ్ఞానం గలవాళ్లే శ్రేష్ఠులని గ్రహించాలి.ఈ విషయమే కఠోపనిషత్తులో మరొక రీతిగా వివరింపబడింది. మానవజన్మ బ్రహ్మ సాక్షాత్కారజ్ఞానాన్ని పొందటానికి అద్దం వంటిది. అద్దంలో శరీరం యథాతథంగా కనిపిస్తుంది.పితృలోకం స్వప్నలోకం లాగా కనిపిస్తుంది. దేవలోకం నీటిలోని నీడలాగా కనపడుతుంది. కనుక మోక్షం పొందాలంటే భూలోకంలో విశేషించి భరతఖండలో మానవుడై జన్మించి ఆత్మజ్ఞాన విచారం చేయాలి.

LEAVE A RESPONSE