Suryaa.co.in

Family

సంతృప్తి చెందడమే జీవితం!

ఒకొప్పుడు మనిషి తన దగ్గర ఏముందో ఆ ఉన్నదాంతోనే సంతృప్తిగా జీవించేవాడు. కానీ ప్రస్తుతం మనిషి తన దగ్గర ఏంతో ఎంతెంతో ఉన్నా తృప్తి పడక ఇంకా ఏదేదో కావాలంటూ ఆరాట పడుతూ.. కాదు కాదు పోరాటం చేస్తున్నారు. ఈ విధంగా నిరంతరం.. లేనిదాని కోసం నీవు ఆరాటపడుతూ ఉంటే, నీ దగ్గర ఉన్నదాన్ని కూడా నీవు అనుభవించే భాగ్యాన్ని కోల్పోతారు. ఒక్కసారి ఆలోచించండి.
ఒక నిర్మానుష్య మైన, ప్రశాంతమైన ప్రదేశంలో ఒక గురువు గారు ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకొని తన వద్దకు వచ్చిన వారికి వారి వారి సందేహాలను తీరుస్తూ, వారి సమస్యలకు పరిష్కారాలు తెలియచేస్తూ వారికి స్వాంతన చేకూరుస్తూ ఉండేవారు. అంతేకాకుండా అప్పుడప్పుడు దేశ సంచారం చేస్తూ అందరికీ ఉపదేశం చేస్తుండేవాడు. అలా ఒకసారి ఊళ్లు తిరుగుతూ ఒక గొప్ప రాజ్యానికి రాజధానిగా ఉన్న నగరానికి చేరుకున్నాడు. ఆయన అక్కడి వీధులలో నడుస్తూ ఉంటే.. నేలపై పడి ఉన్న నాణెం ఒకటి అతడి కంట పడింది. వంగి ఆ నాణెన్ని తన చేతిలోకి తీసుకున్నాడు.
కానీ.. ఆ నాణెం వల్ల తనకేం ఉపయోగం లేదు అవసరమూ లేదు. తన దగ్గర ఉన్నవేవో ఉన్నాయి. అవి చాలు. ఆ నాణెం వల్ల తనకు కొత్తగా వచ్చే దినుసుల గురించి ఆయన ఆలోచించడం లేదు. అందువల్ల ఆ నాణేన్ని ఎవరికైనా అవసరమైన వారికి ఇవ్వాలని అనుకున్నాడు. దాని అవసరం ఎవరికైనా ఉందేమో అని అలాంటి వాళ్ల కోసం ఆ రోజంతా వీధి వీధినా వెతికాడు. కానీ ఆ నాణెం తీసుకునే వారు ఆయనకు ఎవరూ కనిపించలేదు! చివరికి చిరిగిన బట్టలతో కొందరు ఎదురైతే వారికి ఆ నాణెన్ని ఇవ్వబోతే వాళ్లు కూడా మాకు దాని అవసరం లేదు మేము సంతోషంగానే ఉన్నాము, మేము ఉన్నదాంతో సంతృప్తిగా జీవిస్తున్నాము మేము ఎవరి ముందు చెయ్యి చాచడం లేదు అని అన్నారు.
దానికి గురువు గారికి సంతోషం వేసింది. ప్రజలు సంతృప్తిగా ఉండడం, అతడికి సంతోషాన్ని ఇచ్చింది. ఆ రాత్రి అక్కడే ఒక చోట విశ్రమించాడు. తెల్లారి గురువు గారు నిద్ర లేవగానే ఆ దేశాన్ని పాలిస్తున్న రాజు, తన సైన్యంతో బయలు దేరి పక్కరాజ్యంపై దండెత్తి యుద్ధం చేసి గెలిచి ఆ రాజ్యాన్ని కూడా తన రాజ్యంలోకి కలుపుకోవాలి అనే ఉద్దేశంతో బయలు దేరుతూ కనిపించాడు. అతడి బలగాలు గురువు గారు ఉన్న చోటుకు రాగానే, రాజు వారిని ఆగమని సైగ చేసి, రథం నుంచి కిందికి దిగి గురువు గారికి నమస్కరించి ‘తాను రాజ్య విస్తరణ కోసం పక్క రాజ్యంపై దండయాత్ర చేయడానికి బయలు దేరి వెళుతున్నానని. నాకు విజయం కలగాలని నన్ను ఆశీర్వదించండి ‘ అని గురువు గారిని కోరాడు.
అందుకు గురువు గారు ఒక్క క్షణం ఆలోచించి తనకు దారిలో దొరికిన నాణేన్ని ఆ రాజు చేతిలో పెట్టాడు. అందుకు రాజు ఆశ్చర్యపోతూ.. నాకు నాణేన్ని దానంగా ఇవ్వడం ఏమిటి ఎందుకు అలా ఇచ్చారు. ‘ఏమిటి దీని అర్థం ’ అని గురువు గారిని అడిగాడు. గురువు గారు చిన్నగా నవ్వి, ‘ఓ మహారాజా.. ఈ నాణెం మీ రాజ్యంలోనే నాకు దొరికింది. దీని అవసరం నాకు లేకపోవడంతో, దీని అవసరం ఎవరికి ఉందా అని వెదికి ఆ అవసరం ఉన్నవాళ్లకు ఇవ్వాలని నిన్నటి రోజంతా తిరిగి తిరిగి వెతికాను. కానీ నీ రాజ్యంలో అలాంటి వాళ్లు నాకు ఒక్కరూ కనిపించలేదు. నీ రాజ్యంలో అందరూ కూడా ఉన్నదానితో సంతృప్తిగా జీవిస్తున్నారు.
కానీ.. మీరు మాత్రం ఉన్న రాజ్యంతో సంతృప్తి చెందకుండా, ఇంకొకరి రాజ్యం కావాలి అని ఆరాటపడుతూ పోరాటానికి బయలు దేరారు. అందుకే ఈ నాణెన్ని ఇంకా ఏదో కావాలి అనుకునే మీకు ఇచ్చాను ‘ అని చెప్పాడు. గురువు గారు చెప్పిన దాంట్లో ఉన్న అంతరార్థాన్ని, గూడార్థాన్ని రాజుగారు గ్రహించాడు. వెంటనే గురువు గారికి మరొక్క సారి నమస్కరించి.. వేంటనే తన దండయాత్ర ఆలోచనను విరమించుకుని వెనుదిరిగి తన రాజ్యానికి వెళ్లిపోయాడు. కాబట్టి మిత్రులారా ! అవసరమైనంత మీ దగ్గర ఉన్నప్పుడు సంతృప్తి చెంది సంతోషంగా ఆనందంగా జీవించండి. అవసరం లేకున్నా అత్యాశకు లోనై ఇంకా ఏదో సంపాదించాలని ఆరాటపడుతూ అనవసరంగా హైరానా పడితే మెంటల్ టెక్షన్ తో బిపి లకు, షుగర్ లకు, మానసిక ఒత్తిడికి లోనై మీ ఆరోగ్యాన్ని చేచేతులారా చెడగొట్టు కోకండి. ఉన్నదాంతో సంతృప్తి పడి ఆనందంగా, ఆరోగ్యంగా, మానసిక ప్రశాంతతతో దీర్ఘాయుష్షుతో జీవిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ..

రామభక్త గురూజీ ప్రొద్దుటూరు
8328170075

LEAVE A RESPONSE