Suryaa.co.in

Features

పౌర బాధ్యత -మొదటి ఓటరు-స్ఫూర్తిదాత

ఆయనే తొలి ఓటరు!
సిమ్లా: ‘ఓటు’ దేశ పౌరుడిగా రాజ్యాంగం కల్పించిన హక్కు.. విడ్డూరం ఏమిటంటే ఓటు హక్కు ప్రాధాన్యం గురించి అధికారులు ప్రచారం చేస్తున్నారు. నేటి తరానికి అవగాహన కల్పిస్తున్నారు. అలాంటివేమీ లేని.. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్న మొట్టమొదటి భారతీయుడు శ్యాం శరణ్‌ నేగి..
హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రం మండి మహాసు పార్లమెంటరీ నియోజకవర్గానికి(ప్రస్తుతం మండి) అక్టోబర్‌ 25, 1951న జరిగిన ఎన్నికల్లో నేగి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కానీ పూర్తిస్థాయిలో ఎన్నికలు 1952 ఫిబ్రవరిలో జరిగాయి అంటే 5నెలల ముందే హిమాచల్‌ ప్రదేశ్‌ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విపరీతంగా కురిసే మంచు కారణంగా రాష్ట్రంలో ముందుగానే ఎన్నికలు నిర్వహించారు.
అప్పట్లో నేగి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. 1975లో ఉద్యోగ విరమణ చేశారు. తాజాగా నవంబర్‌ 9న హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో అదీ 100ఏళ్ల వయస్సులో తన ఓటుహక్కును వినియోగించుకునేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కిన్నౌర్‌ జిల్లా పాలనా యంత్రాంగం, ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నడవలేని స్థితిలో ఉన్న ఆయన్ను పోలింగ్‌స్టేషన్‌కు తీసుకొచ్చి తిరిగి ఇంటికి తీసుకెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.
ఈ సందర్భంగా ఆయన కోడలు మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో తన ఓటుహక్కును వినియోగించుకుంటూనే ఉన్నారని, ఇతరులకుఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
2014 ఎన్నికల సందర్భంగా గూగుల్‌ చేపట్టిన ‘ప్లెడ్జ్‌ టు ఓట్‌’ వీడియో ప్రచార కార్యక్రమంలో నేగి తన తొలి ఓటు కథను వివరించారు. ఈ వయస్సులో ఓటు వేసి, ఇతరులూ ఓటు వేయాలని చెబుతూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.

LEAVE A RESPONSE