Suryaa.co.in

Editorial

మన మీడియాది గుడ్డికన్నా..మెల్లకన్నా?

-‘గాంధారి వారసుల’ మాదిరిగా పెద్ద గొంతు గుడ్డి మీడియా
– ఆఫ్ఘన్‌లో ముస్లింలపై దాడులపై మౌన సెక్యులర్ వ్రతం
– చైనాలో ముస్లిం మహిళల అత్యాచారాలపై కదం తొక్కని ‘లెఫ్ట్’ లేడీ హీరోయిన్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)
ధృతరాష్ట్రుడంటే పుట్టి గుడ్డివాడు. కాబట్టి సహజంగా ఎదురుగా జరిగేవి కనబడవు. పక్కన ఎవరైనా ట్రాన్స్‌లేటర్లు ఉంటే తప్ప. దాన్ని తప్పు పట్టలేం. సరే.. భర్త చూడని ఈ పాడు లోకాన్ని తానెందుకు చూడాలని, భార్య గాంధారి ఆజన్మాంతం కళ్లకు గంతలతోనే జీవించింది. అదొక త్యాగం. మరి కళ్లుండీ చూడని మన మీడియాను ఏమనాలి? గుడ్డి కన్నా? మెల్లకన్నా? గాంధారేయమా? అసలు మీడియాది ఏ ఇజం? కమ్యూనిజమా? కాంగ్రెసిజమా? సెక్యులరిజమా? గాంధారిజమా? దృతరాష్ట్రీయిజమా? తాజాగా దసరా రోజున చత్తీస్‌గఢ్‌లో హిందువుల ఊరేగింపుపై జరిగిన హత్యాకాండ.. అంతకుముందు యుపీలో రైతులపై జరిగిన అలాంటి హత్యాకాండ ఘటనపై మీడియా పక్షపాతం వార్తలు. అంతేకాదు. ఆఫ్ఘన్‌లో మసీదుపై ముస్లిం తీవ్రవాదుల దాడులు, చైనాలో ముస్లిం మహిళలపై అక్కడి కమ్యూనిస్టు కార్యకర్తల అత్యాచారాలపై మీడియా మౌనవ్రతం. ఇవి చూసి తరించే మెదడున్న ఎవరికయినా మన మీడియాపై వచ్చే సందేహాలే మరి!
మీకు గుర్తుందా? ఇటీవల ఉత్తరప్రదేశ్ లఖింపూర్‌లో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ప్రయాణించే కారు, రైతుల మధ్య నుంచి దూసుకుపోయిన వైనం దేశంలో దుమారం సృష్టించింది. ఆ ఘటనలో నలుగురు రైతు సహా 8 మంది మృతి చెందారు. ఆ ఘటనపై రంగంలోకి దిగిన సీఎం యోగి ఆదిత్యనాధ్, నిందితుడైన కేంద్రమంత్రి కుమారుడిని అరెస్టు చేసి, రిమాండుకు పంపించారు.
ఈ ఘటనపై దేశంలో ఉన్న ‘పెద్ద గొంతు మీడియా’ నిద్రాహారాలు మాని, మేకప్పులు కూడా వేసుకోకుండా మోదీ సర్కారుకు వ్యతిరేకంగా అవిశ్రాంతంగా ఉద్యమించింది. డిబేట్ల పేరంటం పెట్టి, ఫోన్ ఇన్ మంత్రాలతో, వన్‌టు వన్-మాక్ లైవ్‌లతో యుపీ అంశాన్ని గత్తరచేసింది. యుపి సీఎం యోగిని సర్ఫు- డెట్టాల్‌తో కడిగేసింది. అక్కడ మానవహక్కులు మంటకలుస్తాయని టన్నుల కొద్దీ క న్నీరు కార్చింది. ప్రజాస్వామ్యం కూలిపోతోందని తీరికూర్చిని మరీ కుమిలిపోయింది. అది రైతాంగంపై జరిగిన హత్యగా అభివర్ణించింది. యాంకరమ్మలు, యాంకరన్నల ముక్కుచీదుతూ చేసిన వ్యాఖ్యానాలతో.. టీవీ స్టూడియోల్లో నీళ్లు నిండిపోయాయి. మోదీ సర్కారు రైతు వ్యతిరేక విధానాలు అమలుచేస్తుంటే, దానిని నిరసించిన రైతులపై హత్యాకాండకు దిగడం ఏం ప్రజాస్వామ్యమని, వామపక్ష పెద్దముత్తయిదవులు, పెద్దగొంతుల సెక్యులరిస్టు మేధావులూ.. వారితోపాటు, చేతులూపుతూ గత్తర చేసే బిత్తర జర్నలిస్టులూ నానా యాగీ చేశారు. వారి హృదయవిదారక రోదనలు, ఆపసోపాలను యావద్భారతం వీక్షించింది.
సరే. యుపి ఘటనలో కేంద్రమంత్రి కొడుకు నిందితుడయితే అతగాడిని కచ్చితంగా శిక్షించాల్సిందే. దేశభక్త బీజేపీ చట్టానికి అతీతురాలనుకుంటే అది భ్రమే. సీన్ కట్ చేస్తే.. అదే యుపిలో బుధవారం అయోధ్య నగరంలో పూజ పండల్‌లోకి నలుగురు యువకులు తుపాకులతో వచ్చి, కాల్పులు జరిగితే ఒకరు మృతి చెందగా, మరో ఇద్దరు చిన్నారులు గాయాలపాలయ్యారు. కానీ, మన దేశభక్త సెక్యులరిస్టు మీడియా దానికి కించిత్తు కూడా ప్రాధాన్యం ఇవ్వలేదు. డిబేట్లూ పెట్టలేదు.
తాజాగా చత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జస్పూర్ జిల్లా పాతల్‌గావ్‌లో దుర్గాదేవి నిమజ్జనం వేడుకలు జరుగుతున్నాయి. అంతలో ఒక వాహనం శరవేగంగా ఆ ఊరేగింపు మధ్య నుంచి జనాలను ఛేదించుకుని


వెళ్లింది. ఆ ఘటనలో ఒకరు గాయపడగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన జనం అక్కడి వాహనాలకు నిప్పు పెట్టారు. డ్రైవర్‌ను చితకొట్టారు. దానిపై సీఎం స్పందించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇదీ ఘటన. ఇది జరిగింది చత్తీస్‌గఢ్‌లో. అక్కడ అధికారంలో ఉంది కాంగ్రెస్ సర్కారు. ఈ దారుణ ఘటనపై కూడా సెక్యులరిస్టయిన ‘గాంధారి మీడియా’ స్పందించలేదు. అనుబంధ విప్లవమూర్తులు-విప్లవనాయకీమణులు ఖండించిందీ లేదు.
తాజాగా ఢిల్లీ-హర్యానా సింగూ సరిహద్దు ఒక యువకుడిని వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించే బ్యాచ్ చావగొట్టి, అత్యంత కిరాతకంగా చేయి నరికేసి, ఆ వీడియోను జాతికి అంకితం చేసింది. ఈ కిరాతకంపై

మీడియా ఎక్కడా డిబేట్లుగానీ, మాక్ ఇంటర్వ్యూలు గానీ తీసుకుంటే ఒట్టు.
సీన్ కట్ చేస్తే.. పక్కనే ఉన్న బంగ్లాదేశ్‌లో అదే దుర్గాదేవి మందిరంలోనే అక్కడి ముస్లిం మతోన్మాదులు దుర్గాదేవి మండపాలు, ఆలయాలపై విధ్వంసాలకు దిగారు. పోలీసులు అక్కడే ఉన్నా ఏమీ చేయని ఫలితంగా ముగ్గురు హిందువులు చనిపోయారు. ఢాకాలోని టిప్పుసుల్తాన్ రోడ్, కొత్వాలి, చిట్టగాంగ్‌లోనూ

ఇలాంటి ఘటనలే జరిగాయి. తాలిబన్లు చెరబట్టిన ఆఫ్ఘనిస్తాన్‌లోనూ విజయదశమి రోజు, దాదాపు ఇలాంటి అరాచకమే వెలుగుచూసింది. కాబూల్లోని కర్టేపర్వాన్‌లో ఉన్న సిక్కు గురద్వారా దష్‌మేష్ లోకి జొరబడిన తాలిబన్లు, గురుద్వారాను అపవిత్రం చేశారు. సిక్కు అధ్యక్షుడిని బెదిరించారు. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్

ఆఫ్ఘనిస్తాన్ చర్యను మన మీడియా మేధావులు,వామపక్షులు ఖండించిన పాపాన పోలేదు. పైగా ఇవన్నీ రహస్యంగా జరిగిన అరాచకాలేవీ కాదు. బహిరంగంగా సోషల్‌మీడియా సాక్షిగా వైరల్ అయిన ఘటనలే. అయినా కమ్మీ-కాంగీ అండ్ కో మౌనం ఎందుకో?
సరే.. వారి చర్యను ఖండిస్తే.. ఎక్కడ తమ సెక్కులరిజం మంటకలుస్తుందోనన్న భయం మన ‘మీడియా మేతావుల’కు ఉండటంలో తప్పు లేదు. వాటిని ఖండిస్తే సాటి సెక్యులరిస్టుల దృష్టిలో తామెక్కడ మైల పడతామోనన్న మొహమాటం ఉండొచ్చు. అలాచేస్తే వామపక్ష బ్యాచ్, లౌకిక లీగ్ తమను సెక్యులర్ సంఘం నుంచి ఎక్కడ వెలివేస్తారేమోనన్న పితలాటకం ఉండొచ్చు. తప్పులేదు. మరి ఆఫ్ఘాన్‌లో అమాయక ముస్లింలపై, ముస్లిం తీవ్రవాదులు జరిపిన హత్యాకాండపై మాట్లాడకుండా నవరంధ్రాలూ ఎందుకు మూసుకున్నారన్నదే పాయింట్.
ఆఫ్ఘాన్‌ను తాలిబన్లు చెరబట్టిన తర్వాత షియా తెగ ముస్లిములపై సున్నీల దాడులు పెరిగాయి. షియా మహిళలపై అత్యాచారాలకు అంతే లేదు. ముస్లిం మహిళలు బయకు రావడానికి వీల్లేదు. ఉద్యోగాలపై నిషేధం. ఇవన్నీ మానహ హక్కుల ఉల్లంఘనలే. మరి ఈ అరాచకాలపై మన మీడియా మేతావులు గానీ, సెక్యులర్ మేతావులు గానీ, వామపక్ష మహిళా ముత్తయిదువలు గానీ, పెద్ద గొంతు బర్ఖాదత్ లాంటి వాళ్లు గానీ నవరంధ్రాలూ ఎందుకు మూసుకున్నారన్న ప్రశ్నకు ఎక్కడా జవాబు లేదు. సెక్యులరిస్టుకు పెద్దమ్మ అయిన కాంగ్రెస్ గానీ, ఆ పార్టీకి వేలువిడిచిన బంధమున్న వామపక్ష పార్టీలు గానీ, కొత్తగా వాటితో వియ్యం అందుకున్న శివసేన గానీ, పక్కా సెక్యులర్ పార్టీ అయిన మజ్లిసు గానీ ఆ అరాచకాలను ఖండిస్తే ఒట్టు.
ఆఫ్ఘన్ కుందుజ్‌లోని ఓ మసీదులో.. అమాయక షియా ముస్లిములే లక్ష్యంగా జరిగిన ఓ మానవబాంబు దాడిలో, వందమందికి పైగా షియా ముస్లిములు హృదయ విదారకర స్థితిలో హత్యకు గురయ్యారు. దానికి కొనసాగింపుగా కాందహార్ ఇమామ్ బార్గ మసీదులో జరిగిన మరో భారీ పేలుడు మరికొందరిని బలి తీసుకుంది. మరణించిన వారంతా అమాయక షియా ముస్లిములే. పైగా ప్రార్ధన సమయంలో ఇలాంటి అమానవీయ ఘటన జరగడం మనసున్న ఎవరినయినా కదిలించేదే. మరణానికి మతం కులమేమీ ఉండదు. ప్రాణాలు పోతున్న సాటివారి గురించి కన్నీరుకార్చడం మానవధర్మం. మరి అలాంటి మానవధర్మాన్ని పాటించని మన మీడియా సెక్యులర్ ముసుగు వీరులు, ఫెమినిస్టు అక్కయ్యలు, సెక్యులర్ బాబాయిలు.. ఆ వికృత చర్యను ఎందుకు ఖండించలేదన్న ప్రశ్నకు జవాబిచ్చే ధైర్యం ఎవరికయినా ఉందా?
భారత్‌లో మానవహక్కులు మంటకలిసిపోతున్నాయని ఇల్లెక్కి కూసే వామపక్ష మహిళా ముత్తయిదువలు, కశ్మీర్‌లో మానవ హక్కులు లేవంటూ తెగ వగచే సెక్యులర్ పెద్దమ్మ కాంగ్రెస్.. పక్కనే ఉన్న చైనా వైపు తొంగిచూసే ధైర్యం, మాత్రం చేయవు. చైనాలోని జింజియాగ్ ప్రావిన్సులో వీఘర్ ముస్లింల సంఖ్య ఎక్కువ. అక్కడ వారికి మానవహక్కులు లేశమాత్రమైనా ఉండవు. దశాబ్దాల నుంచి హక్కుల కోసం కొట్లాడుతున్న పురుషులను, చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం జైల్లో పెట్టింది. అక్కడ నివాసం ఉంటున్న వీఘర్ మహిళల ఇళ్లలో, తనిఖీలు చేసే అధికారాన్ని చైనా సర్కారు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలకు ఇచ్చింది.
దానితో మహిళల ఇళ్లలోకి చొరబడుతున్న కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు, భర్తలకు దూరంగా ఉంటున్న మహిళలపై అత్యాచారాలు చేస్తున్న వైనం అంతర్జాతీయ సమాజం దృష్టికి వచ్చింది. అక్కడ చైనా కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు చేస్తున్న లైంగికదాడుల నుంచి.. తమను రక్షించమంటూ అక్కడి మహిళలు, మానవహక్కుల దినోత్సవం సందర్భంగా అంతర్జాతీయ సమాజాన్ని దీనంగా అభ్యర్థించారు.
ఇప్పుడు ఆఫ్ఘన్ మసీదులో బాంబుదాడికి తెగబడింది, ఆ వీఘర్ ముస్లిములకు దన్నుగా ఉన్న ఐసిస్ సభ్యులే. చైనాలోని వీఘర్ తెగ ముస్లిం మహిళలపై దశాబ్దాల నుంచి శరపరంపరగా జరుగుతున్న అత్యాచారాలను, అదే మానవత్వం తోలు కప్పుకునే వామపక్ష మహిళా పెద్ద ముత్తయిదువలు గానీ, సెక్యులర్ పాటగాళ్లయిన ఇక్కడి కమ్యూనిస్టులు గానీ, వారికి భజంత్రీలు వాయించే పెద్దముసుగు కాంగ్రెస్ గానీ ఇప్పటిదాకా ఖండించకపోవడమే హాశ్చర్యం. వారి స్వరాలు పరాయి దేశాల విషయంలో పలకవు మరి. ఏం చేస్తాం?
ఇలా మానవహక్కులు, మతాలపై జరిగే దాడులకు ఒక్కో చోట ఒక్కో విధంగా స్పందించే మన మీడియా మేతావులు, కమ్మీ-కాంగీ పెద్దపులులు.. దేశంలో చొరబాటుదారులను నిలువరించేందుకు కేంద్రం ఇచ్చిన ఉత్తర్వుపై మాత్రం, ఇంతెత్తున లేచి మళ్లీ హక్కుల గొంతును సవరించుకున్నాయి. ఆ ముచ్చటేదో మీరే చూడండి.
బంగ్లా-పాకిస్తాన్ సరిహద్దులు దాటి వస్తున్న వారి ఆనుపానులు కనిపెట్టే లక్ష్యంతో.. కేంద్రం ఆయా దేశాల సరిహద్దు రాష్ట్రాలయిన అసొం, పంజాబ్, పశ్చిమ బెంగాల్‌లో బీఎస్‌ఎఫ్ జవాన్ల అధికార పరిథిని పెంచింది. అంటే పరాయి దేశం నుంచి తలదాచుకునేందుకు వచ్చిన వారు ఆశ్రయం పొందుతున్న ఇళ్లలోకి బీఎస్‌ఎఫ్ జవాన్లు తనిఖీలు చేయవచ్చన్నమాట. ఇది దేశభద్రత కోసం తీసుకున్న నిర్ణయమేనన్నది బుర్ర బుద్ధీ ఉన్న ఎవరికయినా తెలుసు. కానీ అవేమీ లేని కాంగ్రెస్, టీఎంసీ కేంద్ర నిర్ణయాన్ని నిరసించింది. అంటే పరాయి దేశాల నుంచి ఎవరు మనదేశంలో చొరబడినా, వారికి ఆశ్రయమిచ్చిన వారి ఇళ్లు సోదా చేయకుండా, సరిహద్దు దగ్గరే రెడ్‌కార్పెట్ వేయాలన్నది వారి వాదనన్నమాట. శహభాష్.. మరి ఈ దేశభక్తులందరీ వేయండి వీరతాళ్లు!

LEAVE A RESPONSE