Home » జగననన్నపై సానుభూతి కరిగిపోయిందేమిటి?

జగననన్నపై సానుభూతి కరిగిపోయిందేమిటి?

– ఇప్పుడిక అభివృద్ధి లేకపోతే ఇంటికేనట
ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్కు సానుభూతి తగ్గుపోయిందా? గతంలో ఉన్న విధంగా ఇప్పుడు జగన్పై సానుభూతి లేకుండా పోతోందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. వచ్చే ఎన్నికల నాటికి సానుభూతి అస్త్రం పనిచేయదని అంటున్నారు. అంతేకాదు.. ప్రజలు ఆయన పాలనను నిశితంగా గమనిస్తున్నారని.. అభివృద్ధి మంత్రం పఠించకపోతే.. వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రం ఎక్కడం కష్టమేనని అంటున్నారు. మరి ఎందుకు ఇలా జరిగింది? ఆయనపై ఎందుకు సానుభూతి తగ్గుముఖం పట్టింది? అనే విషయాలు ఆసక్తిగా ఉన్నాయి.
ఇక్కసారి గత ఎన్నికల విషయాన్ని పరిశీలిస్తే.. 2019 ఎన్నికల్లో వైసీపీపైనా.. జగన్పైనా సానుభూతి వర్షం కురిసిందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా వైఎస్ మృతి చెందడం.. హెలికాప్టర్ ప్రమాదం.. ఓదార్పు యాత్రల విషయంలో జగన్కు కాంగ్రెస్ నుంచి వచ్చిన అడ్డంకులు.. వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందనే భావన ప్రజల్లోకి బలంగా వెళ్లడం వంటివి బాగా కలిసి వచ్చాయి. మరీ ముఖ్యంగా వైఎస్ మరణం తర్వాత.. జగన్ను ముఖ్యమంత్రిని చేయకపోవడం కూడా ప్రజలు జీర్ణించుకోలేక పోయారనే వాదన ఉంది. ఇదేసమయంలో వైఎస్ సోదరుడు.. వివేకానందరెడ్డి.. జగన్కు దూరం కావడం.. జగన్ను వివిధ కేసుల్లో పెట్టి.. జైలుకు పంపించడం.. వంటివి సింపతీగా మారాయి.
సీబీఐ ఈడీ కేసులు పెట్టడం.. కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీ అధినేత చంద్రబాబు తెరచాటు స్నేహం చేసుకోవడం.. వంటివి కూడా కలిసి వచ్చినా.. 2014లో వైసీపీకి అధికారంలోకి రాలేకపోయింది. కేవలం 67 సీట్లలో విజయం దక్కించుకుని.. ప్రతిపక్షానికి పరిమితం అయింది. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను ఆయన తీసుకున్నారు. అంతేకాదు.. నలుగురు ఎమ్మెల్యేలకు.. మంత్రి పదవులు కూడా ఇచ్చారు. ఇదేసమయంలో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతోనే జగన్ను తిట్టించారు. దీంతో జగన్ ఏమనుకున్నారో.. ఏమో.. తాను.. ఇక అసెంబ్లీలో అడుగు పెట్టేదిలేదని ప్రకటించకపోయినా.. అదే పనిచేశారు.
ఎన్నికలకు రెండున్నర సంవత్సరాల ముందుగానే.. ఆయన ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలతో మమేకం అయ్యారు. సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు. అదేసమయంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బృందాన్ని రంగంలోకి దింపారు. బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకున్నారు. ఇక మరోవైపు.. అప్పటి టీడీపీ సర్కారులో కులాల రగడ డబ్బు యావ వంటివి.. చోటు చేసుకోవడంతో.. ఆపార్టీపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలోనే సింపతీ పెరిగి.. జగన్ అధికారంలోకి వచ్చారు.
జగన్ చెప్పిన మాటలు కావొచ్చు.. ఆయన ఇచ్చిన హామీలు కావొచ్చు.. రెడ్డి సామాజిక వర్గం.. మనోడు ముఖ్యమంత్రి కావాలని నిర్ణయించుకోవడం కావొచ్చు.. జగన్ మాతృమూర్తి విజయమ్మ సోదరి షర్మిలలు ప్రజల్లోకి వచ్చి.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని కోరడం కావొచ్చు.. ఏదేమైనా.. ఇన్ని పరిణామాలు కలిసి వచ్చాయి. దీంతో ఎవరూ ఊహించని విధంగా జగన్ 151 ఎమ్మెల్యే సీట్లలో గెలిచి.. అధికారం చేపట్టారు. అయితే.. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమకు న్యాయం జరగడం లేదని.. ఎవరైతే.. ఆయన అధికారంలోకి రావాలని కలలు కన్నారో.. వారే ఇప్పుడు వాపోతున్నారు.
ఇటీవల జరిగిన ఓసర్వేలో.. ప్రకాశం నెల్లూరు రాయల సీమ జిల్లాల్లోని రెడ్డి వర్గం తీవ్రంగా వాపోతోందట. 90 శాతం పథకాలు.. తమకు చేరడం లేదని. వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరికి మాత్రం ఈ ప్రభుత్వం పరిమితమైందని వారు బాహాటంగానే చెబుతున్నారు. మరోవైపు.. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి అప్పుల కుప్పగా మారడం వలంటీర్ వ్యవస్థ అంతా అనుకున్నా.. సరిగా పనిచేయకపోవడం.. గ్రామ సచివాలయాల్లోనూ పనులు లేకపోవడం.. వంటివి.. నాయకులకు, రెడ్డి వర్గానికి కూడా ఇబ్బందిగా మారింది.
ఇక ఉద్యోగుల పరిస్థితి మరింత దారుణంగా మారింది. తమకు నెల నెలా 1న ఇవ్వాల్సిన జీతాలను కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోవడం.. పీఆర్సీ సహా.. ఎన్నికల సమయంలో బలమైన హామీ ఇచ్చిన సీపీఎస్ రద్దుపై సీఎం మౌనంగా ఉండడం వంటివి వారిని తీవ్రంగా వేధిస్తున్నారు. అంతేకాదు.. ఉద్యోగ సంఘాల నాయకులు కూడా ప్రభుత్వంతో సంప్రదించేందుకు డిమాండ్లు సాధించేందుకు ప్రయత్నించకపోవడంపైనా.. సర్కారు ఒత్తిళ్లు ఉన్నాయనే ప్రచారం ఉంది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దుస్థితి.. ఏ చిన్నపాటి రోడ్డు కూడా సరిగా లేకపోవడం.. ఇలా.. అనేక విషయాల్లో ప్రభుత్వానికి సెగ తగులుతోంది.
ఈ పరిణామం 2024 ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని అంటున్నారు పరిశీలకులు. కనీసం ఇప్పటికైనా.. అభివృద్ధి మంత్రం పఠించాలనేది విశ్లేషకుల మాట. దీనిని పక్కన పెడితే.. ఇలానే అప్పులు చేస్తే.. ప్రత్యామ్నాయం వైపు ప్రజలు మొగ్గు చూపే పరిస్థితి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. సింపతీ అన్ని విషయాల్లోనూ.. అన్ని సందర్భాల్లోనూ సాధ్యం కాదని.. అంటున్నారు. మరి ఈ నేపథ్యంలో వైసీపీ సర్కారు.. ఏమేరకు సరిచేసుకుంటుందో చూడాలి.

– సురేష్ పులగం

Leave a Reply