Home » ఆంధ్రలో ‘కరణం’ గారి రాజకీయం

ఆంధ్రలో ‘కరణం’ గారి రాజకీయం

ఒకప్పుడు గ్రామాల్లో ‘కరణం’ ఉండేవారు. అప్పటికి గ్రామాల్లో ఉండే రెండు వర్గాలకూ ‘కరణం’ గారే సలహాదారు! ప్రత్యర్థి వర్గంపై ఎలా పట్టు సాధించాలో … ఇరు వర్గాలకు ఆయనే సలహాలు ఇస్తుండేవారు . ఆ విధంగా ఆ రెండు వర్గాల వారు , వాటి నాయకులు ‘కరణం’ గారి కనుసన్నల్లో ఆయన చెప్పు చేతుల్లో ఉండేవారు.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా నడుస్తున్నది‘కరణం’ గారి రాజకీయమే! ఆంధ్రా లోని ఇరు పార్టీలు , ఢిల్లీ నాయకుల అభిమతానికి అనుగుణంగా నడుచుకునేటట్లుగా శాసిస్తున్నారు.

‘కరణం’ గారి వ్యూహాలు

1. చాణిక్య రాజకీయంలో అత్యంత ముఖ్యమైనది స్నేహితుడిని, ఆప్తుడిని , నమ్మకస్తుణ్ణి దూరంగా ఉంచినా పర్వాలేదు… కానీ శత్రువు మాత్రం ఎప్పుడూ తమ కంటి ముందు , తమ పక్కనే ఉండే విధంగా చూసుకోవడం! తద్వారా అనుక్షణం వారిని పర్యవేక్షించడానికి , పక్కకు పోకుండా కట్టడి చేయడానికి అనువుగా ఉంటుంది.

ఈ నియమాన్ని వాడి , ఆంధ్ర లో కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. అలా అయ్యేటట్లు చేయడంలో పావులు చక్కగా, చాకచక్యంగా కదిపారు.

2. పాము తన పిల్లలను తానే తింటుంది
తెలంగాణలో ఎన్నికల ముందు బండి సంజయ్ నాయకత్వంలో బాగా దూకుడుగా ఉన్న కాషాయం పార్టీ …. హఠాత్తుగా బండి సంజయ్ ని తప్పించింది. కారణం త్రిముఖ పోటీలో కాంగ్రెస్ లాభపడుతుందేమో అని , దానిని నిరోధించడానికి … గులాబీ పార్టీకి సహాయం చేసింది. అసలు ఉద్దేశ్యం కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా ఉండటం కోసం . పాము తన పిల్లల్ని తానే తిన్నట్లుగా … పార్టీని రేసుగుర్రంలా పరిగెత్తిస్తున్న నాయకుడిని హఠాత్తుగా తప్పించారు.

అలాగే ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ బలపడకూడదని , అలా జరగాలంటే ప్రస్తుత అధికార పార్టీ అధికారంలోకి రావడం గానీ , లేక ఒక వేళ ఓడిపోతే గౌరవప్రదమైన సీట్లు రావడం గానీ (60 నుండి 70 సీట్లు ) జరగాలని కాషాయం వారి ప్రణాళిక.

అందుకే ‘ పేట ‘ సభలో అధికార పార్టీని ఏమాత్రం విమర్శించకుండా జాగ్రత్తపడి ; రాష్ట్రం లో డిపాజిట్లు కూడా లేని కాంగ్రెస్ పార్టీని.. వారి కూటమిని విమర్శించడానికి చాలా సమయం వెచ్చించారు గౌరవ ఢిల్లీ పెద్దలు!! .

తామొకటి తలిస్తే – దైవం మరొకటి తలచినట్లుగా
తెలంగాణ ఎన్నికల్లో తమ పార్టీని తాము ఆత్మార్పణ చేసుకున్నా కూడా ….. వ్రతం చెడినా ఫలితం దక్కనట్లుగా … అక్కడ కాంగ్రెస్ గెలిచింది. కాంగ్రెస్ గెలవటాన్ని ఢిల్లీ పెద్దలు అంతగా ఆహ్వానించలేకపోయారు.

తెలంగాణలో జరిగినట్లుగా… ఆంధ్రప్రదేశ్లో జరగకూడదని తలంచిన ఢిల్లీ పెద్దలు, ఆంధ్ర లో అధికార పార్టీకి కావలసిన అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. అదే విషయాన్ని అధికార పార్టీ వారు మేము పైన అన్నీ మాట్లాడుకున్నాం! అంతా సెట్ చేసుకున్నామని… ప్రభుత్వ అధికార గణానికి విస్పష్టంగా చెప్పారు.

అందువలన … ఊరికే ఊసుపోక మీడియాలో సిఎస్ మార్పు, డిజిపి మార్పు, ఇంటెలిజెన్స్ ఐజి మార్పు అని ఊకదంపుడుగా చెప్పుకోవడం , రాసుకోవడం తప్ప …. అక్కడ ఏమీ జరగదని రాష్ట్ర ప్రజలకు కూడా అర్థం అయిపోయింది. ఎందుకంటే ‘కరణం’ గారి రాజకీయం అట్టా ఉంటది మరి! వారు చావగొట్టి చెవులు మూస్తారు సుమీ !!

నామినేషన్ల గడువు అయిపోయిందాకా చూద్దాం చేద్దాం !! అంటారు. తర్వాత అధికార పార్టీకి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఉంటుంది.
ఎందుకంటే ఒకవేళ కూటమి సభ్యులు రెబెల్ క్యాండిడేట్లుగా నామినేషన్ వేయకుండా అడ్డుకోవడానికి నామినేషన్ ల పర్వం ముగిసిందాక ఇలా కాలయాపన చేస్తూ చూద్దాం ! చేద్దాం ! పరిశీలనలో ఉంది అని అంటుంటారు. వారి రాజకీయ చతురత అమోఘం అద్వితీయం!

ఏది ఏమైనా ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రజలు గెలుస్తారో (లేక ) ఢిల్లీ పెద్దల ‘కరణం’ గారి రాజకీయం గెలుస్తుందో వేచిచూద్దాం!

-దామోదర ప్రసాద్ పటకమూరు

Leave a Reply