గత ఎన్నికల్లో జగన్ గెలుపు లెక్కలివి…

మానవ సమాజం పరిణామ క్రమంలో…మనిషి తన భద్రత కోసం,సామూహిక ప్రయోజనం కోసం కొన్ని విలువలను ఏర్పరచుకుంటాడు. ఆ విలువల సముదాయమే ఒక భావజాలంగా రూపొందుతుంది.

చరిత్ర పొడవునా ఒక్కో దశలో ఒక్కొక్క భావజాలం మానవ సమాజాన్ని ప్రభావితం చేస్తాయి.
కొన్నాళ్లు సామ్యవాదం,కమ్యూనిజం, పెట్టుబడిదారీ వ్యవస్థ, రాజరికం, నియంతృత్వం, ప్రజాస్వామ్యం….. ఇలా అనేక రకాల భావజాలాలు లేదా వ్యవస్థలు మానవ సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి.

మానవ సమాజాన్ని,ముఖ్యంగా భారతీయ సమాజాన్ని సుదీర్ఘకాలం అత్యంత తీవ్రంగా ప్రభావితం చేస్తున్న రెండు వ్యవస్థలు లేదా రెండు రకాల భావజాలాలు— కులం మరియు మతం.

వివిధ రాజకీయ భావజాలాల ప్రభావం కొన్ని దశాబ్దాల తర్వాత తగ్గిపోవడం మనం చూశాం.
ఉదాహరణకిమన దేశ రాజకీయాలలో దాదాపు 50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఏకచత్రాధిపత్యం. బెంగాల్లో కమ్యూనిస్టు మార్క్సిస్టు ప్రభుత్వం,
తమిళనాడులో డీఎంకే రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీ ప్రభావం.

రాబోయే లోక్సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా ఎన్ని స్థానాలు వస్తాయి…అనే అంశం మీద రాష్ట్రాల వారీగా నేను గత మూడు నెలలుగా కొంత పరిశోధన చేస్తున్నాను. ఈ క్రమంలో….బిజెపి సీట్లు తగ్గితేనే కాంగ్రెస్ కి పెరుగుతాయి… అని అర్థమైన తర్వాత… అసలు బిజెపి ఇంత పెద్ద రాజకీయ శక్తిగా… ఎలా ఎదిగింది? అని తెలుసుకునే ప్రయత్నం చేశాను.
దాదాపు 60 ఆర్టికల్స్ చదివాను.

ఆ క్రమంలో…గుజరాత్ లో బీజేపీ వరుస విజయాలకు కారణం తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు…..గుజరాత్ రాజకీయాలలో మతం ఎంత కీలకంగా మారిందో అర్థమైంది.

గత నాలుగు దశాబ్దాలుగా గుజరాత్ రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాలు మరియు గ్రామీణ ప్రాంతాలలో మెజారిటీ ప్రజలు, హిందూ మతంలోకి మారారు. ఫలితంగా హిందుత్వ ఎజెండాతో కాంగ్రెస్ పార్టీతో పోటీపడిన భారతీయ జనతా పార్టీకి, అక్కడి ప్రజలు కేవలం మతం కారణంగా మద్దతు ఇస్తూ వస్తున్నారు. గుజరాత్ రాష్ట్రానికి సహజంగా ఉన్న భౌగోళిక అనుకూల పరిస్థితుల వల్ల జరుగుతున్న అభివృద్ధిని , బిజెపి తాను చేసిన అభివృద్ధిగా ప్రచారం చేయటంలో విజయం సాధించడం కూడా….బీజేపీ వరుస విజయాలకు దోహదం చేస్తుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే….గుజరాత్ రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు, హిందూ మతాన్ని ఆచరించడం బిజెపికి రాజకీయంగా ఉపయోగపడుతూ వస్తుంది.

ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రండి.
2014 శాసనసభ ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఎస్టీ నియోజకవర్గాలు అన్నింటిలో వైఎస్ఆర్సిపి గెలిచింది. ఎస్సీ నియోజకవర్గాలలో తెలుగుదేశం-వైఎస్ఆర్ సీపీ తీవ్రస్థాయిలో పోటీ పడ్డాయి. 2019 కల నాటికి….ఎస్టీ నియోజకవర్గాలు మొత్తం(7) వైఎస్ఆర్సిపి గెలుచుకోవడమే కాకుండా… 29 ఎస్సీ నియోజకవర్గాలలో… రాజోలు, కొండేపి మినహా… మిగిలిన 27 స్థానాలలో వైఎస్ఆర్సిపి విజయం సాధించింది.

ఒక్క ముక్కలో చెప్పాలంటే…ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలలో వైఎస్ఆర్సిపి క్లీన్ స్వీప్ చేసింది. ఈ అంశం మీద లోతుగా అధ్యయనం చేసిన తర్వాత….గుజరాత్ లో బిజెపి విజయానికి కారణమైన మత ప్రభావం, ఆంధ్రప్రదేశ్ లో కూడా కనిపించింది. గుజరాత్లో హిందువులు బిజెపి హిందుత్వ ఎజెండాకు మద్దతుగా నిలిచినట్లే… ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీలు( మతపరంగా మెజారిటీ క్రైస్తవులు) క్రైస్తవుడైన జగన్ కు మద్దతు పలికారు.

ఆంధ్రప్రదేశ్ ఎస్సీ ఎస్టీలలో మతపరంగా మెజారిటీ ప్రజలు క్రైస్తవులు అన్న క్షేత్రస్థాయి వాస్తవాన్ని, చాలామంది రాజకీయ నాయకులు అర్థం చేసుకోవడం లేదు. అత్యంత పేదరికం కారణంగా ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీ ప్రజలు, క్రైస్తవ మత సంస్థల సేవా కార్యక్రమాల కారణంగా,అదే సమయంలో హిందూ సమాజంలో సరైన గౌరవం లేని కారణంగా, క్రైస్తవులుగా మారుతున్నారు. ఈ మతపరమైన అంశం జగన్మోహన్ రెడ్డికి కలిసి వచ్చింది.. అదేవిధంగా …ఎస్సీలలో… సర్టిఫికెట్లు ఏమున్నప్పటికీ…. ఆచరణలో మెజారిటీ క్రైస్తవ మతాన్ని ఆచరించడం వలన, జగన్మోహన్ రెడ్డితో వారు కనెక్ట్ అయ్యారు.

హిందువులకు దేవాలయం,క్రైస్తవులకు చర్చి, సిక్కులకు ….కేవలం మత కేంద్రాలు మాత్రమే కాదు. వారి జీవితాలలో ఇతర అంశాలను కూడా….వ్యక్తిగత సమస్యలతో సహా…ఉపశమనం కోసం మతాధికారులతో పంచుకుంటారు. ఫలితంగా…ఎన్నికల సమయంలో చర్చిలలో రాజకీయ ప్రభావం కనిపిస్తుంది.

జగన్మోహన్ రెడ్డి పాలనలో జరుగుతున్న ఆర్థిక అభివృద్ధి గురించి,అంశాల గురించి…. ముఖ్యంగా జగన్ పరిపాలన వైఫల్యం గురించి…మీడియాలో ఎంత చర్చ జరిగినా…. వాటి ప్రభావం… ఓటింగ్ లో కనిపించడం లేదు. దీనికి తోడు…ఆంధ్రప్రదేశ్లో బిజెపి రాజకీయాలు…క్రైస్తవులైన మెజారిటీ ఎస్సీ ఎస్టీలను, అలానే ముస్లింలను… గత రెండు ఎన్నికలలో జగన్ కు దగ్గర చేశాయి. ఇది ఒక చేదు వాస్తవం. గణాంకాలు చూస్తే….క్రైస్తవులు మరియు ముస్లింలు కలిసి సుమారు 35 శాతం.

జగన్ ఎన్ని తప్పులు చేసి నా…ప్రతి పక్షాలు ఎన్ని ఉద్యమాలు చేసినా….ఎస్సీ ఎస్టీల అభివృద్ధి- సంక్షేమ పథకాలు రద్దు చేసినా….జగన్ రాజకీయంగా ఎందుకు బలంగా ఉన్నాడో… ఈ కోణం అర్థం చేసుకుంటే తెలుస్తుంది. మతం పునాదిగా ఏర్పడ్డ ఈ ఓటు బ్యాంకు తోపాటు, తన సామాజిక వర్గం మరియు ఇతర సామాజిక వర్గాలలో ప్రత్యర్థి పార్టీ వ్యతిరేక ఓటు …. జత కలవడం వలన జగన్ 150 యొక్క సీట్లు సాధించి ముఖ్యమంత్రి అయ్యాడు.

జగన్ ని ఓడించాలని కోరుకునే ఎవరైనా…ఈ వాస్తవాన్ని అర్థం చేసుకొని….
ఎస్సీ ఎస్టీలను మరియు ముస్లింలను ముందు పెట్టి , రాజకీయ వ్యూహాన్ని రూపొందించుకోవాలి.

– డాక్టర్ కొలికపూడి శ్రీనివాస రావు

Leave a Reply