Suryaa.co.in

Andhra Pradesh

ఫేక్ నేతలతో రైతులను తిట్టిస్తున్నారు

– అమరావతి మహిళా జేఏసీ నేత సుంకర పద్మశ్రీ
విజయవాడ: రాజధానిపై ముఖ్యమంత్రి జగన్ వైఖరి ఏరు దాటే వరకు ఓడ మల్లన్న, ఏరు దాటిన తరువాత బోడి మల్లన్నలా ఉంది.రాజధాని నిర్మాణంపై గత ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని గగ్గోలు పెట్టిన ముఖ్యమంత్రి, నేడు అదే అమరావతి రైతులను రోడ్డుమీదకు లాగేశారు.
అమరావతి రాజధానికి తాము వ్యతిరేకం కాదని, అసెంబ్లీ సాక్షి చెప్పిన మాటలు ముఖ్యమంత్రి గారు మర్చిపోయారా ? నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను, ఇక్కడే పార్టీ ఆఫీసు పెట్టాను, ఇక్కడే ఉంటాను అన్నారు కదా? నేను మాట ఇస్తే అమలు చేయడమే గానీ, మడమ తిప్పేది లేదని అంటారు. మరి రాజధాని విషయంలో మీరు చేసింది ఏంటి ? వ్యవసాయం తప్ప మరొకటి తెలియని అమాయక రైతులు, రాజధాని కోసం భూములు ఇస్తే వారిని మోసం చేయడం దారుణం. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, అలుపెరుగని పోరాటం చేస్తున్న రైతులను అవహేళన చేయడం సిగ్గుచేటు. రైతుల పై దాడులు చేయడం, వారిపై అక్రమ కేసులు పెట్టడం పిరికిపంద చర్య.
అమరావతిలో ఎటువంటి అవకతవకలు జరగలేదని న్యాయస్థానం చెప్పినా, ముఖ్యమంత్రిలో మార్పు రావడం లేదు. రైతులకు సమాధానం చెప్పే దమ్ము లేక ఫేక్ నేతలతో రైతులను తిట్టిస్తున్నారు. రాజధానికి కులం మతం రంగుపూసి, నాశనం చేయాలని చూస్తున్నారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వికృత చేష్టలను, కేంద్రం చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే బీజేపీ, వైసీపీకి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు.

LEAVE A RESPONSE