– రాత్రిపూట సోయి తప్పి మాట్లాడిండేమో
– కేసీఆర్…..ఇంటికో ఉద్యోగం ఏమైంది?
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్
కమలాపూర్ మండల కేంద్రంలో భారీ ఎత్తున హాజరైన జన సందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు : మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు, నందీశ్వర్ గౌడ్, కూన శ్రీశైలం గౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి, రావు పద్మ తదితరులు…..బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు….
బండి సంజయ్ మీటింగ్ కు 20 మంది కూడా రాలేదని కేసీఆర్ చెబుతుండు. మరి రాత్రిపూట సోయి తప్పి మాట్లాడిండేమో. ఇక్కడున్న జనాన్ని చూసి మాట్లాడితే మంచిది. ఈరోజు దేశంలో 100 కోట్ల డోసుల వ్యాక్సిన్ ఉచితంగా ఇఛ్చిన ఘనత నరేంద్రమోదీదే. పేదల కోవిడ్ తో ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతోనే 9 నెలల్లోనే 100 కోట్ల మందికి ఉచితంగా వ్యాక్సిన్ అందించిన ఘనత నరేంద్రమోదీదే.
ఏనాడైనా కేసీఆర్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవాలని ఏనాడైనా చెప్పిండ్రా? కేసీఆర్ ఏ వ్యాక్సిన్ తీసుకుంటాడు? కేసీఆర్ తీసుకునేది 90 ఎంఎల్ వ్యాక్సిన్. ఇప్పుడు డోసు పెంచిండు. కేసీఆర్ ఏనాడూ పేదల క్షేమం కోరుకోని వ్యక్తి. కోవిడ్ వస్తే ఆదుకున్న వ్యక్తి ఈటల రాజేందర్ మాత్రమే.
కోవిడ్ సమయంలో రాత్రింబవళ్లు ఆసుపత్రులు తిరుగుతూ కోవిడ్ వార్డులను సందర్శిస్తూ ప్రజలను కాపాడిన లీడర్ రాజేందర్. కుటుంబ సభ్యుల కంటే ప్రజలే తనకు ముఖ్యమంటూ ప్రాణాలకు తెగించి తిరుగుతూ కష్టపడి పనిచేసిన నాయకుడు ఈటల రాజేందర్. కేసీఆర్ మాత్రం జల్సాలు చేస్తూ ఫాంహౌజ్ కే పరిమితమైండు. పేదల తరపున ప్రశ్నిస్తున్నందునే ఈటల రాజేందర్ ను బయటకు పంపిన వ్యక్తి కేసీఆర్.
ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ డిపాజిట్ గల్లంతు కావడం ఖాయం. ఇది గమనించే కేసీఆర్ ఓటుకు రూ.20 వేలు ఇచ్చి గెలిచేందుకు కుట్ర చేస్తున్నడు. కేసీఆర్ ఇస్తున్న సొమ్ము ప్రజలదే. ఆ సొమ్మును టీఆర్ఎస్ నేతలు దోచుకుని ఇప్పుడు పంచుతున్నరు. బీజేపీ కార్యకర్తల తాకిడి, ఈటల రాజేందర్ దెబ్బకు తట్టుకోలేక ఓటుకు రూ.20 వేలు ఇచ్చి గెలిచేందుకు టీఆర్ఎస్ కుట్ర చేస్తోంది. ఆ డబ్బులు తీసుకుని నిజాయితీ, ధర్మంవైపు నిలబడి ఓటు వేయాలి.
కమలాపూర్ కు కేంద్రం అనేక నిధులిచ్చింది. ఉపాధి హామీ పథకం కింద రూ.1.54 కోట్లు, మౌలిక సదుపాయాల కోసం రూ. 1.94 కోట్లు, మొక్కల పెంపకానికి రూ.22 లక్షలు, ఆర్దిక సంఘం ద్వారా రూ.3.30 కోట్లు, మరుగుదొడ్ల కోసం రూ.39 లక్షలు, స్మశాన వాటికకు 11,13,700లు, రైతు వేదికకు రూ.10 లక్షలు, డంప్ యార్డుకు రూ.2.5 లక్షలు, నర్సరీలకు రూ.లక్షకుపైగా నిధులు ఇచ్చింది కేంద్రమే. మరి కమలాపూర్ కు కేసీఆర్ చేసిందేమిటో చెప్పాలి.
పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయని చెబుతున్న కేసీఆర్ …..ఒక్కో లీటర్ కు రూ.41లు పన్నుల పేరిట దోచుకుంటున్నారు. నిజంగా ప్రజలపై చిత్తశుద్ది ఉంటే కేసీఆర్ …ఆ రూ.41లు మినహాయించుకుంటే ప్రజలకు లీటర్ కు రూ.60 కే అందుతుంది. అభివృద్ధి, సంక్షేమానికి కేంద్రం నిధులిస్తుంటే తప్పుదోవ పట్టిస్తున్నడు కేసీఆర్ దళితులను కూడా వంచిస్తున్నడు.
ఒక్కో దళితుడికి కేసీఆర్ రూ.50 లక్షలు బాకీ పడ్డరు. ఆ డబ్బు దళితులకు ఇవ్వాలంటూ మేం డిమాండ్ చేస్తే భయపడి దళిత బంధు పేరుతో కొత్త డ్రామాలకు తెరదీసిండు. హైదరాబాద్ లో వరదలొస్తే పేదల ఇండ్లు మునిగితే….ఒక్కో ఇంటికి రూ.10 వేలు ఇస్తానంటూ మోసం చేసిన వ్యక్తి కేసీఆర్. పైగా ఎన్నికల్లో గెలిచేందుకు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తనవల్లే సాయం ఆగిందంటూ మాయ మాటలు చెప్పిన నీచుడు కేసీఆర్. తాను లేఖ రాసినట్లు నిరూపించేందుకు భాగ్యలక్ష్మీ అమ్మవారి వద్ద ప్రమాణం చేద్దాం రా…అంటూ సవాల్ చేస్తే తోకముడిచిన కేసీఆర్.
ఇప్పుడు కూడా బీజేపీవల్లే ‘దళిత బంధు’ ఆగిందంటూ కేసీఆర్ మరో కొత్త డ్రామాకు తెరదీసిండు. దళితుల అకౌంట్లో వేసిన డబ్బును ఆపే హక్కు కేసీఆర్ కు ఎక్కడిది? కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తారంటూ మొదటి నుండి తాను చెబుతూనే ఉన్నాను. ఈరోజు అది నిజమైంది.
ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు సొమ్ము ఇవ్వాలని మొదటి నుండి డిమాండ్ చేసిన పార్టీ బీజేపీ మాత్రమే. కేసీఆర్ కు దమ్ముంటే….యాదాద్రికి వచ్చి దళిత బంధు బీజేపీ ఆపిందని ప్రమాణం చేయాలని సవాల్ చేస్తే నోరు మెదపడం లేదు.
దళిత బంధు పథకాన్ని ఈసీ పేరుతో నిలిపివేసింది కేసీఆరే. దళితులు ఇంకా కేసీఆర్ మోసాలను భరించే స్థితిలో లేదు. కేసీఆర్ వైన్స్, బార్లు, తాటి, ఈత చెట్ల ద్వారా పెద్ద ఎత్తున కమీషన్లు దొబ్బుతున్నారని బాధితులు మొత్తుకుంటున్నారు. కుల వ్రుత్తులను దెబ్బతీస్తున్నడు. రైతులను కూడా మోసం చేస్తున్న కేసీఆర్. రైతులు తమ పొలంలో ఏ పంట వేసుకోవాలో నిర్ణయించుకునేది రైతులే. ఏ పంట వేయాలో చెప్పడానికి కేసీఆర్ ఎవరు?
కేసీఆర్…నిన్ను ముఖ్యమంత్రి చేసింది ఎందుకు? రైతులు ఏ పంట పండించినా కొనాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. బియ్యంకు, రైతులకు సంబంధం ఏముంది? వాళ్లు అమ్మేది వడ్లు మాత్రమే. కేసీఆర్ బ్రోకర్ గా వ్యవహరిస్తూ రైస్ మిల్లర్ల కోసం ‘వరి వేస్తే ఉరి’ గతి అంటూ రైతులను భయపెడుతున్నరు. ఈరోజు రైతుల ఆత్మహత్యలకు కేసీఆరే బాధ్యత వహించాలి. రైతులకు యూరియా ఫ్రీగా ఇస్తానంటూ ప్రగతి భవన్ లో ప్రకటించిన కేసీఆర్…..చేసిందేమిటి?
ఒక్కో ఎకరాకు రెండు బస్తాల యూరియా కోసం రూ.1800 ల సబ్సిడీ భరిస్తోంది కేంద్రమే. డీఏపీ పేరిట 1200 సబ్సీడీ అందిస్తోంది కేంద్రమే. ఈ లెక్కన ఎకరాకు దాదాపు రూ.6 వేల వరకు కేంద్రం సబ్సిడీ భరిస్తుంటే….కేసీఆర్ మాత్రం మాయ మాటలు చెబుతోంది.
రేషన్ బియ్యం సబ్సిడీ భరిస్తోంది కేంద్రమే. కిలో బియ్యానికి రూ.29లు కేంద్రం చెల్లిస్తుంటే….రాష్ట్రం భరిస్తోంది రూ.1 మాత్రమే. ఎవరికి ఓటేస్తారో ప్రజలు ఆలోచించాలి.
ఉద్యోగాలివ్వమని తాము డిమాండ్ చేస్తుంటే ఉన్న ఉద్యోగాలు తొలగిస్తున్నరు. ఇవన్నీ ప్రశ్నించినందుకే ఈటల రాజేందర్ ను బయటకు పంపిండ్రు.
కేసీఆర్…..ఇంటికో ఉద్యోగం ఏమైంది? నిరుద్యోగ భ్రుతి ఏమైంది? ఈటల రాజేందర్ చేసిన పాపమేంది? పేదల కోసం కొట్లాడటమే తప్పా? ఈ ఎన్నికలు హుజూరాబాద్ కు సంబంధించినది మాత్రమే కాదు. రాష్ట్రంలోని పేదల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు. రాష్ట్రంలో పేదలకు న్యాయం జరగాలంటే…వారు తలెత్తి తిరగాలంటే బీజేపీకి ఓటేసి ఈటల రాజేందర్ ను గెలిపించాలని పేదలంతా హుజూరాబాద్ ప్రజలకు చేతులెత్తి దండం పెడుతున్నరు.
తెలంగాణ రాష్ట్రం వస్తే పేదలకు న్యాయం జరుగుతుందని శ్రీకాంతాచారి, పోలీస్ కిష్టయ్య, సుమన్ వంటి 1400 మంది ప్రాణ త్యాగం చేస్తే పెద్దోళ్లు రాజ్యమేలుతున్నరు. తెలంగాణ కోసం కేసీఆర్ కుటుంబం చేసిన త్యాగమేముంది? కమలాపూర్ మండలంలో బీజేపీకి, ఈటల రాజేందర్ కు తప్ప మరో పార్టీకి స్థానం లేదని నిరూపించాలంటే ప్రతి ఒక్కరూ పువ్వు గుర్తుకు ఓటేయాలని కోరుతున్నా.
ఈటల రాజేందర్ నిజాయితీగా కోడిగుడ్ల వ్యాపారం చేసి సంపాదించుకున్నడే తప్ప, కేసీఆర్ లెక్క దొంగ దందాలు చేయలేదు. దేశంలో కేసీఆర్ ను మించిన అవినీతి పరుడు ఎవరూ లేరు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను చిత్తు చిత్తుగా ఓడించాలి.
కులాలు, మతాలు, వర్గాలు, సంఘాల పేరిట కేసీఆర్ ఓట్లను చీల్చే కుట్ర చేస్తున్నారు. ప్రజలంతా ఏకమై పువ్వు గుర్తుకు ఓటేసి ఈటల రాజేందర్ ను భారీ మెజారిటీతో గెలిపించాలి. నవంబర్ 2న ఎన్నికల ఫలితాలు వెలువడగానే టీఆర్ఎస్ బాక్సులను బద్దలు కావాలి. ఎన్నికల ఫలితాల తరువాత ప్రగతి భవన్ లో కేసీఆర్ కు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తాం. రాజాసింగ్, రఘునందన్ తోపాటు రాజేందర్ లతో కలిసి కేసీఆర్ భరతం పడతాం. ఈ ఎన్నికల్లో టీఆర్ఎసోళ్లు ఓటుకు రూ.20 వేలు ఇస్తున్నరట. ఆ డబ్బులన్నీ దొంగ నోట్లేమో సరిచూసుకోండి. డబ్బులు తీసుకుని ధర్మంవైపు నిలబడండి. నిజాయితీగా ఓటేయండి.