Suryaa.co.in

Andhra Pradesh

పండగ నాడూ పస్తులే శరణ్యం

– సామాన్యుల వెన్నులో వణుకు పుట్టిస్తున్న నిత్యావసరాల ధరలు
– రాష్ట్రంలో నిర్వీర్యమైపోయిన ప్రజల కొనుగోలు శక్తి
– తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండున్నరేళ్ల చేతకాని పాలన.. ప్రజలకు దీపావళి వెలుగులు కూడా దక్కకుండా చేసింది. వెలుగులతో నిండాల్సిన దీపావళి పండగ రోజున కూడా.. సామాన్యుడు చీకట్లలో ఉండే పరిస్థితి కల్పించారు. పెరిగిన ధరలు చూసి పండుగ అంటేనే భయపడే పరిస్థితి కల్పించారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధమైన ఆర్ధిక మాంద్యం సృష్టించి.. ప్రజల జీవనాన్ని జగన్ రెడ్డి నిర్వీర్యం చేశారు.
ఆదాయం సృష్టించడం చేతకాక పప్పు బెల్లాలపై కూడా పన్నులు వేస్తున్నారు. గతం ఎన్నడూ చూడని విధంగా నిత్యావసరాల ధరలు పెరిగాయి. పప్పులు, నూనెల ధరలు తలచుకుంటేనే గుండెపోటు వచ్చేస్థాయిలో ఉన్నాయి. కూరగాయలు కూడా దాదాపు అన్నీ రూ.50కి పైనే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు పండుగలు ఎలా చేసుకుంటారు. నిత్యావసరాలను ఎలా కొనుగోలు చేస్తారు.? ఈ స్థాయిలో ధరలు పెరుగుతూ సామాన్యులకు భారంగా మారుతుంటే జగన్ రెడ్డి ఏనాడూ సమీక్షించకపోవడం దుర్మార్గం.
గతంలో నిత్యావసర ధరల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటే నేడు ధరల స్థిరీకరణ నిధి అంటూ ఆర్భాటంగా ప్రకటించి నిత్యావసరాల ధరలు ఆకాశానికి ఎగబాకుతుంటే చోద్యం చూస్తున్నారు. పైగా అగ్నికి ఆజ్యం పోసినట్లు పెరిగిన ధరలతో ప్రజలు అల్లాడుతుంటే రకరకాల పన్నులు పెంచుతూ, కొత్త పన్నులు వేస్తూ ప్రజల పాలిట పెనుశాపంగా మారారు. ప్రజల ఆదాయం పెంచకపోగా ధరలు పెంచి ప్రజలను దోచుకుంటూ రాష్ట్ర ఖజానా నింపుకోవలని చూస్తున్నారు.
గతంలో దేశంలోనే అతి తక్కువగా పెట్రోల్ డీజిల్ ధరలు ఏపీలో ఉన్నా.. నానా రాద్దాంతం చేశారు. ఇప్పుడు.. దేశంలోనే పెట్రోల్ డీజిల్ ధరల్లో ఏపీ అగ్రస్థానంలో నిలిచినా తగ్గించే చర్యలే లేవు. పెట్రోల్ డీజిల్ ధరల బాదుడు.. నిత్యావసరాలపై పడింది. దీపావళి రోజు టపాసులు పేలుతాయో లేదో గానీ.. జగన్ రెడ్డి పాలనలో పెరిగిన ధరలు చూసి సామాన్యుడి గుండెలు పేలుతున్నాయి.
పండగ నాడు.. నాలుగు రకాల పిండివంటలు వండుకుని తినాలన్నా ధరలు గుర్తొస్తున్నాయి. ఉత్తర కొరియా మాదిరి.. ఇక్కడ కూడా తినడం తగ్గించుకోవడం ఉత్తమం అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇప్పటికైనా జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలస్ లో అవినీతి సంపాదనతో ఆ వెలుగుల మధ్య గడపడం మాని.. సామాన్యుల బతుకుల్లోని చీకట్లను గుర్తించాలి. దీపావళి పండుగ నాడు.. పేదల ఇళ్లల్లో నిండుకున్న చీకట్లను చూడాలి. నరకాసురుడి వధ జరిగిన రోజున ప్రజలు దీపావళి జరుపుకుంటారు. జగన్మోహన్ రెడ్డి దిగిన నాడే.. ప్రజలకు అసలైన దీపావళి వస్తుంది.

LEAVE A RESPONSE