శత్రువుకు ఒక కన్నైనా పోవాలన్నట్లుంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. హుజురాబాద్ లో టీఆరెస్ ఓడింది..బీజేపీ గెలిచింది అనే విషయాలను వదిలేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధికి మూడువేల చిల్లర ఓట్లు మాత్రమే రావడం ఆ పార్టీ సీనియర్ నాయకులను ఆనందాంబుధిలో ముంచెత్తింది. దీపావళి పండుగ రెండు రోజులు ముందే వచ్చినదని సంతోషంతో ఎగిరి గంతులేస్తున్నారు.
ఓటుకు నోటు కేసులో వీడియో సాక్ష్యంతో దొరికిపోయి, ఆ తరువాత చంద్రబాబు సలహాతో కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాక, చంద్రబాబు సిఫార్సుతో ఏకంగా టిపిసిసి అధ్యక్షపదవి కూడా చేపట్టడాన్ని కాంగ్రెస్ పాతకాపులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోయారు. పార్టీ అధ్యక్షుడు అయ్యాక రేవంత్ రెడ్డి శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించుకునే అవకాశం హుజురాబాద్ ఉపఎన్నిక రూపంలో కలిసివచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటే రేవంత్ రెడ్డికి పట్టపగ్గాలు ఉండవని, అందుకని కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు కూడా రాకూడదని వారంతా దేశంలోని దేవుళ్లందరికి మొక్కున్నారు.
వారి మొక్కులు ఫలించి బల్మూరి వెంకట్ కు కనీసం గౌరప్రదమైన సంఖ్యలో కూడా ఓట్లు రాకపోవడంతో పార్టీ సీనియర్ నాయకులు, రేవంత్ రెడ్డిని వ్యతిరేకిస్తున్నవారందరు సంతోష సాగరంలో మునిగిపోయారు! తనమీదున్న కేసులనుంచి రక్షించుకోవడానికై రేవంత్ రెడ్డి బీజేపీతో రహస్యంగా కుమ్మక్కై కాంగ్రెస్ పార్టీ సాంప్రదాయ ఓట్లన్నీ బీజేపీకి వేయించారని చాలామంది చెవులు కొరుక్కుంటున్నారు. మూడేళ్ళక్రితం జరిగిన హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అరవైవేల పైచిలుకు ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు వాటిలో ఇరవయ్యో వంతు కూడా రాలేదంటే ఎవరు అందుకు కారకులు?
ఏడేళ్లక్రితం వరకూ అధికారపార్టీగా వెలిగిపోయిన కాంగ్రెస్ పార్టీ చివరకు అంగుష్ఠమాత్రుల చేతుల్లో పడి పాతాళానికి జారిపోవడం విషాదకరం. అటు ఆంధ్రాలో, ఇటు తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి అయిదు అంకెల ఓట్లు కూడా రాకపోవడం చూస్తుంటే ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అనేది చరిత్రపుటల్లో మాత్రమే మిగిలిపోతుందేమో?
– murali mohan rao. ilapawoovluri