దీపావళి రోజునే ఎన్నికల ప్రకియ ఎందుకు?:చంద్రబాబు

అమరావతి: ఏపీలో అరాచక పాలన కొనసాగుతోందని తెదేపా అధినేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్రంలో మిగిలిన స్థానిక సంస్థల్లో ఎన్నికల నిర్వహణ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) నేటి నుంచే ప్రారంభించడంపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు.
హిందువులు దీపావళి పండగ చేసుకోకుండా పైశాచికంగా ప్రవర్తిస్తున్నారని ఆక్షేపించారు. దీన్ని బట్టి సీఎం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చని వ్యాఖ్యానించారు. ఇతర మతాల పండగలు ఉంటే ఎన్నికల ప్రక్రియ చేపట్టేవారా? అని నిలదీశారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) స్వతంత్రంగా వ్యవహరిస్తోందా అని ప్రశ్నించారు.
‘‘ఫలానా తేదీలోపు ఎన్నికలు జరగాలని కేబినెట్‌ సమావేశంలో సీఎం చెబితే.. దానికి తానా తందానా అన్న రీతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దీపావళి అయ్యాక ప్రక్రియ మొదలు పెడితే కొంపలు కూలిపోతాయా? ఎందుకు వెంటనే పెట్టాల్సి వచ్చింది. దీనికి సమాధానం చెప్పగలరా?ఒక మతం మనోభావాలు దెబ్బతీసే విధంగా.. కనీసం దీపావళి జరుపుకోనీయకుండా అదేరోజున నామినేషన్లు వేసేలా చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా.
రాష్ట్రాన్ని పిచ్చివాళ్ల రాజ్యం చేస్తారా?
ఎస్ఈసీ స్వతంత్రంగా పని చేస్తుందా?లేదంటే ఎవరైనా ఒత్తిడి తెచ్చారా?స్థానిక సంస్థల ఎన్నికల్లో దౌర్జన్యాలు, అరాచకాలు సృష్టించారు. రాష్ట్రాన్ని పిచ్చివాళ్ల రాజ్యం చేస్తారా? నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్ధతిగా వ్యవహరించాలి. నాటకాలాడితే వదిలిపెట్టం.. వెంటాడతాం. అభ్యర్థులు నామినేషన్ల విషయంలో జాగ్రత్తలు తీసుకొని దాఖలు చేయాలి. నామినేషన్ల దాఖలుకు ముందు, తర్వాత సోషల్‌ మీడియాలో పెట్టాలి. జాగ్రత్తలతో నామినేషన్లు వేయాలని పార్టీ నేతలకు సూచిస్తున్నా. చిన్న తప్పులు చేసినా నామినేషన్లు చెల్లకుండా చేసే ప్రమాదం ఉంది. నామినేషన్లు దాఖలు చేసే సమయంలో న్యాయవాదుల సలహాలు తీసుకోవాలి. బెదిరింపు ఫోన్‌ కాల్స్‌ వస్తే రికార్డు చేయాలి. బెదిరింపులకు పాల్పడే వారిని వదిలిపెట్టేది లేదు. డబ్బులు కూడా కొంతమేర పని చేస్తాయని అనే సంఘటనలు రుజువు చేశాయి. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరిని నియమించుకున్నారు.
దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలి
సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తే తగిన బుద్ధి చెబుతాం. ఎన్నికలు పకడ్బందీగా జరిగితే వైకాపా గెలవలేదు. దమ్ముంటే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు రావాలి. గతంలో ఎన్నికల ప్రక్రియను అపహస్యం చేసేలా వ్యవహరించారు. ఉన్మాదులు తప్ప ఎవరూ చేయని రీతిలో దారుణాలకు పాల్పడ్డారు. ఈసారైనా పకడ్బందీగా ఎన్నికలు జరగాలని ఇప్పటికే కొందరు కోర్టును ఆశ్రయించారు. జాగ్రత్తలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు తెదేపా వినతిపత్రం ఇచ్చింది. నామినేషన్‌ పత్రాలు ఆన్‌లైన్లో దాఖలు చేసే వెసులుబాటు కల్పించాలని కోరాం. స్కాన్‌ చేసి ప్రతిని ఆర్వోకు ఈ మెయిల్‌ చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పాం’’ అని చంద్రబాబు అన్నారు.
డ్రామాలాడితే వదిలిపెట్టం… వెంటాడతాం
నామినేషన్ల విషయంలో ఆర్వోలు పద్దతిగా వ్యవహరించాలని… ఆర్వోలు డ్రామాలు ఆడితే వదిలి పెట్టే ప్రసక్తే లేదని…వెంటాడతామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. నామినేషన్ పత్రాలు ఆన్‌లైన్‌లో దాఖలు చేసే వెసులుబాటు కల్పించటంతో పాటు స్కాన్ చేసిన ప్రతిని ఆర్వోకు ఈమెయిల్ చేసే వెసులుబాటు కల్పించాలని కోరామని తెలిపారు. కొంత మంది ఆర్వోలు నామినేషన్లను చెల్లకుండా చేసేందుకు కొన్ని డాక్యుమెంట్లను చించేసిన సంఘటనలు జరిగాయన్నారు. అభ్యర్ధులు నామినేషన్ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుని దాఖలు చేయాలని సూచించారు. నామినేషన్ల దాఖలుకు ముందు..తర్వాత సోషల్ మీడియాలో నామినేషన్ పత్రాలను పెట్టాలని టీడీపీ అధినేత అన్నారు.
ఎన్నికలు పకడ్బందీగా జరిగితే గెలవలేదన్నారు. డబ్బులు కూడా కొంతమేర పనిచేస్తాయని అనేక సంఘటనలు రుజువు చేశాయని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేసేలా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను నిర్వహించారని విమర్శించారు. ఉన్మాదులు తప్ప ఎవ్వరూ చేయని రీతిలో వ్యవహరించారన్నారు. ఈసారైనా ఎన్నికల ప్రక్రియ పకడ్బంధీగా జరగాలని ఇప్పటికే కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించాని అన్నారు. 16 పాయింట్లతో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ లిఖిత పూర్వకంగా వినతిపత్రం ఇచ్చిందని చెప్పారు. దొంగ ఓట్లను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు అనువుగా కొందరు అధికారుల్ని ముందుగా నియమించుకున్నారంటూ చంద్రబాబు ఫోటోలు ప్రదర్శించారు.
అలాగే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనుచరుడిని కుప్పంలో నియమించారని ఫోటోలు ప్రదర్శించడంతో పాటు గురజాల సంఘటనలపై వీడియోలు ప్రదర్శించారు. రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇంతకంటే ఉదాహరణలు ఏం కావాలని అన్నారు. ఫిర్యాదులు ఉన్న అధికారిని ఎలా నియమిస్తారని ప్రశ్నించారు. జగన్ రెడ్డి చెప్పిందల్లా చేద్దామనుకుంటే తమ అంతం ప్రారంభమవుతుందని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు. ఎన్నికల కమిషన్, ఎన్నికల అధికారులు సహకరిస్తోందని, ఇష్టం వచ్చినట్లు చేద్దాం అనుకుంటే ఊరుకునేది లేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే చర్యలను అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.
ఎన్నికలయ్యే వరకు ఇక్కడే ఉంటా
టీడీపీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి రోజు కనబరిచిన ఆవేశాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కనబరిచి వీరోచితంగా పోరాడాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. ‘‘ఎన్నికలయ్యే వరకూ నేను ఇక్కడ ఉంటా.. అవసరమైతే నేనే ఎన్నికల కమిషనర్ వద్దకు, క్షేత్రస్థాయికి వెళ్లి పోరాడతా’’ అని తెలిపారు. ఇప్పుడు జరిగే ఎన్నికలు ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్నికలని టీడీపీ శ్రేణులు గుర్తించాలని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్
నామినేషన్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలు తిరగబడితే బట్టలు కూడా మిగలవ్.. పారిపోతారు ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. గురజాల మున్సిపాల్టీలో నామినేషన్ పత్రాలను లాక్కెళ్లినా పోలీసులు, అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు చట్టాన్ని వేరే వాళ్లకు అప్పజెబితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు. రంపచోడవరం అసెంబ్లీ పరిధిలోని కాచవరం గ్రామంలో నామినేషన్లు విత్ డ్రా చేసుకోవాలని అధికార పార్టీ నేత బెదిరిస్తూ ఆంబోతుల్లా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఇవ్వమని బెదిరింపులకు గురి చేస్తున్నారన్నారు. ఎన్నికల నిర్వహణలో హైకోర్టు ఆదేశాలను కూడా ఫాలో కావడం లేదని చంద్రబాబు అన్నారు.