– దివ్యాంగ వాలంటీర్ కుటుంబాన్ని ఆదుకున్న ప్రభుత్వం
– రూ.3లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి మంజూరు
– కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతులమీదుగా చెక్కు అందజేత
మంగళగిరి: వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడిన దివ్యాంగ వాలంటీర్ కుటుంబాన్ని రాష్ర్ట మహిళా కమిషన్ చొరవతో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు టౌన్ కు చెందిన దివ్యాంగ వాలంటీర్ ఉమ్మనేని భువనేశ్వరి వ్యక్తిగత సమస్యలతో కిందటేడాది డిసెంబర్ నెలలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని సజీవ దహనం చేసుకుంది. ఆమె దివ్యాంగురాలవడంతో ఆర్ధికంగా ఇబ్బందులు… తండ్రి చిన్నతనంలో చనిపోవడం.. తన సోదరి కూడా అనారోగ్యం పాలవ్వడంతో ఆమె తీవ్ర మనోవేదనకు గురవడంతో ఆత్మహత్యకు పాల్పడింది.
ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. భువనేశ్వరి ఆత్మహత్యకు గల కారణాలను ఆరాతీసి బాధితురాలి కుటుంబాన్ని మానవతాదృక్పథంతో ఆదుకోవాలని కోరుతూ ప్రభుత్వానికి సిఫార్సు లేఖతో ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3లక్షల ఆర్ధిక సాయం మంజూరు చేసింది. ఈమేరకు మంగళవారం మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ చేతులమీదుగా బాధితురాలి తల్లి ఉమ్మనేని జానకి కి రూ.3లక్షల చెక్కును అందించి ఆమెకు ధైర్యం చెప్పారు.
ముఖ్యమంత్రికి మహిళా కమిషన్ ధన్యవాదాలు
రాష్ట్రంలో చోటుచేసుకున్న వివిధ ఘటనల్లో బాధిత మహిళల పక్షాన ప్రభుత్వం సత్వర స్పందనతో ఆదుకుంటుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మహిళా కమిషన్ సిఫార్సుల మేరకు ఈనెలలో మూడు బాధిత కుటుంబాలు ప్రభుత్వ సహాయాన్ని అందుకున్నట్లు చెప్పారు. వారిలో కడప జిల్లా బద్వేలు మండలం చింతలచెరువుకు చెందిన విద్యార్ధిని గొడుగునూరు శిరీష ప్రేమోన్మాది చేతిలో దారుణహత్యకు గురికాగా… నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన విద్యార్ధిని తేజశ్విని కూడా ప్రేమోన్మాది కత్తివేటుకు బలైంది.
ప్రకాశం జిల్లా ఒంగోలు టౌనుకు చెందిన దివ్యాంగురాలైన వాలంటీర్ ఉమ్మనేని భువనేశ్వరి వ్యక్తిగత సమస్యలతో ఆత్మహత్యకు పాల్పడింది. ఆయా ఘటనల్లో బాధిత మహిళల కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్ధిక సహాయం అందించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ధన్యవాదాలు తెలిపారు.