Suryaa.co.in

Telangana

మేము తలుచుకుంటేమీ పీఠం కదిలిస్తాం!

రైతుల వరి ధాన్యం కొనుగోలు చేయకపోతే కేంద్రంలోనిప్రభుత్వం పీటం కదిలిస్తామని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు.
శుక్రవారం ఇందిరా పార్క్ లోని ధర్నా చౌక్ లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పిలుపు మేరకు రైతులకు సంఘీభావంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పార్టీ ధర్నా నిర్వహించారు. వరి కంకులు,వరిధాన్యం తో నిరసన తెలిపారు. ఈ ధర్నా లో హోంమంత్రి మహమూద్ అలీ, ప్రభుత్వ విప్ అరికేపూడి గాంధీ,సురభి వాణిదేవి, ప్రభాకర్, దానం నాగేందర్, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, సుదీర్ రెడ్డి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి లు తలసాని సాయి కిరణ్ యాదవ్, పూస్తే శ్రీకాంత్, నాంపల్లి, గోషామహల్, చార్మినార్ నియోజకవర్గ పార్టీ ఇంచార్జి లు చందపేట ఆనంద్ గౌడ్, ప్రేమ్ సింగ్ రాథోడ్, సలా ఉద్దిన్ లోథి, పలువురు కార్పొరేటర్ లు, మాజీ కార్పొరేటర్ లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. రైతు కంట నీరు పెట్టించిన ఏ ప్రభుత్వాలు నిలబడినట్లు చరిత్రలో ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఇది ట్రైలర్ మాత్రమేనని, రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోతే రానున్న రోజులలో అసలు సినిమా చూపిస్తామని హెచ్చరించారు. నష్టాల ఊబిలో ఉన్న ఉన్న రైతాంగాన్ని, వ్యవసాయ రంగానికి తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో వ్యవసాయం లాభసాటిగా మారిందన్నారు.
నూతన ప్రాజెక్ట్ ల నిర్మాణం, సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించడం వంటి అనేక కార్యక్రమాలతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి అత్యధిక వరిపంట ను పండిస్తూ దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిందని చెప్పారు. వ్యవసాయాన్ని, రైతులను ప్రోత్సహించాల్సిన కేంద్రంలోని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పడం తగదన్నారు. రాష్ట్రంలోని నేతలు మాత్రం వరి సాగు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయాలని డ్రామాలు ఆడుతూ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.
నిజంగా రాష్ట్ర నేతలకు రైతుల పై ప్రేమ ఉంటే కేంద్రం పై వత్తిడి తీసుకొచ్చి రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసేందుకు ఒప్పించి అనుమతులు తీసుకురావాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ సవాల్ చేశారు. రైతుల నడ్డి విరిచేలా కేంద్ర ప్రభుత్వం నల్లచట్టాలు తీసుకొచ్చి అమలు చేయాలని కుట్రలు చేస్తుందని ధ్వజమెత్తారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను గుండెల్లో పెట్టుకొని కాపాడుతుంటే, కేంద్ర ప్రభుత్వం ఆగం చేసే ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కేంద్రం పై వత్తిడి చేయడం చేతకాని రాష్ట్ర నేతలు బాధ్యత మరచి ముఖ్యమంత్రి, ప్రభుత్వం పై ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, మేము తలచుకుంటే మీరు తట్టుకోగలరా? అని మంత్రి ప్రశ్నించారు.
కార్పోరేట్ సంస్థలకు మేలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలను తీసుకొస్తుందని ఆరోపించారు. కరోనా లాక్ డౌన్ సమయంలో పండించిన పంటను ఎలా అమ్ముకోవాలో తెలియని అయోమయ పరిస్థితులలో ఉన్న రైతుల పంటలను కొనుగోలు చేసి ఆదుకున్న ఘనత తెలంగాణ ప్రభుత్వం కే దక్కుతుందని చెప్పారు. రైతులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించేలా ప్రభుత్వం ఒకవైపు కృషి చేస్తుంటే, మరో వైపు కేంద్ర ప్రభుత్వం తమ విధానాలతో రైతులను ఇబ్బందులపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు.
గులాభి సైన్యం, రైతులు తలచుకుంటే కేంద్ర ప్రభుత్వ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించుకోవాలని మంత్రి శ్రీనివాస్ యాదవ్ నేతలకు హితవు పలికారు. ఇప్పటికైనా నేతలు ద్వంద వైఖరిని మానుకొని రైతులకు అండగా నిలవాలని సూచించారు.
రైతుల నడ్డివిరుస్తున్న కేంద్రం-ఎమ్మెల్యేముఠా గోపాల్‌
తెలంగాణ ప్రభుత్వం రైతు సమస్యలను పరిష్కరించి నీళ్లు, ఉచిత విద్యుత్‌, పంట పెట్టుబడి పథకాలతో రైతులను ఆదుకుంటుంటే కేంద్రం రైతుల నడ్డివిరిచే చర్యలకు పాల్పడుతుంది. ఏడేళ్ల కేసీఆర్‌ పాలనలో తెలంగాణ సమస్యశామలమైంది. రైతులు చక్కటి పంటలు పండిస్తుంటే కేంద్రం పండించిన వరి ధన్యాన్ని కొనకుండా రాజకీయ చర్యలతో రైతులను గందరగోళానికి గురిచేస్తుంది. టీఆర్‌ఎస్ను ఎదుర్కొనే దమ్ములేక రాజకీయ లబ్ది కోసం తెలంగాణ రైతుల ఇబ్బందిపెడుతుంది.

LEAVE A RESPONSE