– తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలకు అమరావతి బహుజన జెఎసి బాలకోటయ్య మండిపాటు
ఏపీ ముఖ్యమంత్రి అడుకుంటున్నారని, ఎపీ బిక్ష మెత్తుకుంటుందని, అప్పు తెచ్చుకుంటేనే రోజు గడుస్తుందని తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను అమరావతి బహుజన జెఎసి అధ్యక్షులు పోతుల బాలకోటయ్య తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ పైనా, ఏపీ ప్రజల పైనా రాళ్ళేయక పోతే తెలంగాణ ముఖ్యమంత్రికి కానీ, ఆయన మంత్రులకు కానీ పూట గడవదని, ముద్ద దిగదనీ పేర్కొన్నారు. ఆంధ్రుల కష్టార్జితాన్ని, హైదరాబాద్ సంపదను ప్రాంతీయ వాదం పేరుతో కొల్లగొట్టారని, లక్ష కోట్ల సంపద కలిగిన హైదరాబాదును కబ్జా చేశారని గుర్తు చేశారు. ఏపీకి రావలసిన 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలను, విభజన ఆస్తులను ఇవ్వటం చేతగాని తెరాస నాయకులు ఏపీపై నీతిమాలిన వ్యాఖ్యలు చేసే హక్కు ఎక్కడిదని అన్నారు.
మోదీకి మీటర్లు పెట్టే సత్తా ఉంటే పరిగెత్తుకెళ్లి పెట్టొచ్చని, ఎవ్వరూ ఆపలేదని చెప్పారు. సొంతింటి సమస్యలపై దృష్టి పెట్టాలని హితవు చెప్పారు. బిజెపిపై విమర్శలు చేయటానికి కూడా ఎ.పిని అడ్డు పెట్టుకుంటారా? అని ప్రశ్నించారు. ఎపి సలహాదారు, మంత్రి నానీ తెలంగాణ మంత్రి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించలేక పోయారని,ఏపీ ప్రతిపక్ష పార్టీలపై, అమరావతి రైతుల పోరాటంపై ఆరోపణలు చేయటం ఒక్కటే వారికి తెలిసిన విద్య అని పేర్కొన్నారు. తెలంగాణ మంత్రి వ్యాఖ్యలపై సిఎం స్పందించాలని కోరారు. తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఎపి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.