– ‘మహాపాదయాత్ర’లో ప్రత్యేక కార్యక్రమాలు
అమరావతి: అమరావతినే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా కొనసాగించాలని రాజధాని రైతులు, మహిళలు చేస్తున్న ‘మహాపాదయాత్ర’ 16వ రోజుకు చేరుకుంది. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో చేపట్టిన యాత్ర ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఇవాళ్టి యాత్ర విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకు సాగనుంది. అమరావతి రైతుల ఉద్యమం 700వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో యాత్రలో ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సర్వమత ప్రార్థనలు, అమరావతి అమరవీరులకు నివాళులు అర్పించనున్నారు.
వీటితో పాటు అమరావతి లక్ష్య సాధన ప్రతిజ్ఞ, ఉదయం 10.గంటలకు మహిళల ప్రత్యేక మాలధారణ, ఎస్సీ మైనారిటీల అమరావతి సంకల్పం, ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30వరకు అమరావతి ఉద్యమ గీతాలాపన, మధ్యాహ్నం 2.30గంటలకు ఉద్యమ కాలాల్లో ముఖ్యమైన ఘాట్టాలపై వ్యాఖ్యానం, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5.30వరకు పాదయాత్ర మార్గమధ్యలో కళ్లకు గంతలతో నిరసన, సాయంత్రం 6నుంచి 7వరకు అమరావతి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నారు.
అమరావతి పరిరక్షణ సమితి, రాజధాని ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర 45 రోజుల పాటు కొనసాగనుంది. గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని 70 ప్రధాన గ్రామాల మీదుగా జరిగే ఈ యాత్ర డిసెంబరు 15న తిరుపతిలో ముగియనుంది.