Suryaa.co.in

Padayatra News

పాదయాత్రకు పూలవర్షంతో అపూర్వ స్వాగతం

– పదవరోజు అదే జోరు….
◆అమరావతి రైతులకు వెన్నంటి ఉంటున్న ఎమ్మెల్యే ఏలూరి
◆జన జాతరలా సాగుతున్న మహాపాదయాత్ర
◆దుద్దుకూరు లో సంఘీభావం తెలిపిన తెనాలి శ్రావణ్ కుమార్ కొలికపూడి శ్రీనివాస్
◆స్వాగతం పలికిన అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి, దామచర్ల ముత్తమల,బిఎన్ విజయ్
◆యాత్రలో ఇసుకేస్తే రాలని జనం
◆అమరావతి పై వైసిపి కుటిలనీతి : ఎమ్మెల్యే ఏలూరి
అమరావతి రైతుల మహాపాదయాత్ర ఉరిమే ఉత్సాహంగా జనసందోహంతో సాగుతుంది. బుధవారం 10వరోజు యాత్ర పర్చూరు నియోజకవర్గం దుద్దుకూరు లో బుధవారం ఉదయం 8:30 గంటలకు ప్రారంభమైంది. పాదయాత్ర కు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. యాత్రకు మహిళలు రైతులు విద్యార్థులు ఉద్యోగ వ్యాపార వర్గాలు దళిత సంఘాలు ప్రజా సంఘాలు అడుగడుగునా నీరాజనం పలుకుతున్నారు. దుద్దుకూరు రోడ్లన్నీ అమరావతి నినాదాలతో మారు మ్రోగాయి.
చిన్నారులు సైతం అమరావతి జేఏసీ జెండాలు చేతబూని అమరావతి జై జై అమరావతి మా రాజధాని అమరావతి, మా భవిష్యత్తు అమరావతి తోనే అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాదయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. కళాకారులు డప్పు నృత్యాలతో అమరావతి గేయాలు ఆలపిస్తూ.. అగ్ర భాగాన కదం తొక్కారు. వృద్ధులు సైతం అమరావతి కోసం అలుపు సొలుపు లేకుండా పాదయాత్రలో నడుస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.
అమరావతి మహా పాదయాత్రకు ప్రజలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు.10 వ రోజు దుద్దుకూరు లో ప్రారంభమైన యాత్ర కు దారిపొడవునా రాచపూడి వరకు తండోపతండాలుగా జనం హాజరై పూలవర్షం కురిపించారు. మంగళ హారతులు ఇస్తూ గుమ్మడికాయ దిష్టి తీస్తూ అన్నదాతలకు మద్దతు పలుకుతున్నారు. అమరావతి రైతులు మొక్కవోని దీక్షతో పాదయాత్ర చేస్తూ ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద ఎత్తున ప్రజల మద్దతు లభించడంతో రైతులు ధైర్యంగా ముందుకు అడుగు వేస్తున్నారు.
ఎమ్మెల్యే ఏలూరి ప్రత్యేక పూజలు
పర్చూరు నియోజకవర్గంలో మహా పాదయాత్రకు సారధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఏలూరి ప్రతిరోజు అమరావతి సాధనే లక్ష్యంగా అమరావతి రైతులు అడుగులో అడుగు వేస్తూ అండగా నిలుస్తున్నారు. బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన యాత్రను ప్రారంభించారు. అమరావతి రైతులు చేస్తున్న అకుతిత దీక్షతో చేస్తున్న మహా పాదయాత్ర విజయవంతం కావాలని పూజలు చేశారు. ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ఏడుకొండలవాడు కరుణ చూపాలని ఆకాంక్షించారు.
మహా పాదయాత్ర మధ్యాహ్నం 12 గంటలకు రాచపూడి కి చేరుకుంది. అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు మహా పాదయాత్రకు ఎదురేగి స్వాగతం పలికారు. మహా పాదయాత్ర అద్దంకి నియోజకవర్గం లోకి ప్రవేశించగానే మహిళలు పెద్ద ఎత్తున హారతులు పడుతూ యాత్రకు సంఘీభావం తెలిపారు. వేద పండితులు యాత్ర కు స్వాగతం పలికి ఆశీర్వదించారు.
మహా పాదయాత్ర కు దుద్దుకూరు నుంచి నాగులుప్పలపాడు వరకు ప్రజలు పూలవర్షం కురిపించారు. అడుగడుగున పూలు చల్లుతూ అమరావతి ఆకాంక్షను వ్యక్తం చేశారు. అన్నదాతలు వ్యవసాయ పనుల్లో బిజీ గా ఉన్న పాదయాత్రకు స్వాగతం పలికారు. వ్యవసాయ కూలీలకు సైతం రోడ్లపైకి వచ్చి అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు.
మహా పాదయాత్రకు అడుగడుగునా జన నీరాజనం పలుకుతుండగా పలువురు నేతలు రైతులకు సంఘీభావం తెలుపుతున్నారు. కొండేపి శాసనసభ్యులు శ్రీ డోల బాల వీరాంజేయస్వామి ,గుంటూరు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్, జేఏసీ నేత కొలికపూడి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యేలు దామచర్ల జనార్ధన్, ముత్తముల అశోక్ రెడ్డి, బిఎన్ విజయ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
పర్చూరు నియోజకవర్గంలో అమరావతి రైతులు చేసిన మహా పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. ప్రజల స్పందన చూసి అమరావతి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలంతా తాము చేస్తున్న పాదయాత్రకు మద్దతు తెలుపుతూ సొంత బిడ్డల్లా చూసుకుంటున్నారని పేర్కొంటున్నారు.
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుటిల యత్నం… ఎమ్మెల్యే ఏలూరి
రాజధాని అమరావతి పై వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కుటిల నీతి కనబరుస్తున్నారని ఎమ్మెల్యే ఏలూరి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార దాహం కోసం అడ్డగోలుగా హామీలు ఇచ్చి అసెంబ్లీ సాక్షిగా అమరావతి కి మద్దతు తెలిపి రాజకీయ స్వార్థం కోసం అమరావతి ఆకాంక్షను చింద్రం చేస్తున్నాడని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని… నీకోసం స్వచ్ఛందంగా భూములు ఇచ్చిన రైతులు నడి రోడ్డుపై పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి కోసం అన్నదాతలు చేసిన త్యాగం వెలకట్టలేనిదన్నారు. అమరావతి రైతులు ఆందోళనలు అర్జీలు పట్టించుకోలేదని దీంతో దేవుడిపై భారం వేశారని పేర్కొన్నారు. అమరావతి రైతులు న్యాయమైన డిమాండ్ ను ఐదు కోట్ల ఆంధ్రుల కలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అమరావతి రైతులకు న్యాయం జరిగే వరకు ప్రజల ఆకాంక్షను నెరవేర్చే వరకు విశ్రమించేది లేదన్నారు.

LEAVE A RESPONSE