జన ఆగ్రహ సభ – స్వీయ ఆవేశ సభ

బి జె పి ఆధ్వర్యంలో జరిగిన జన ఆగ్రహ సభ లక్ష్యాన్ని సాధించింది అనటంలో నాకు కొన్ని సందేహాలు కలిగాయి. రాజకీయ పార్టీలు ఏవైనా కోరుకునేది, ప్రజలకు విజ్ఞప్తి చేసేది ఎప్పుడైనా ఒక్కటే. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు కానీ ప్రజలను ఇబ్బంది పెట్టాయి. మేము అధికారంలోకి వస్తే ఇంకా గొప్పగా అభివృద్ధి చేసి చూపుతాము అని. ఈ రోజు మాట్లాడిన వక్తలు కూడా అదే రీతిలో ప్రస్తుత వై సి పి ప్రభుత్వాన్నీ అలాగే గత తెలుగుదేశం ప్రభుత్వాన్నీ విమర్శించారు. ఇది అర్ధం చేసుకో తగినదే.

ఐతే ఆ క్రమంలో తమ స్వంత ఆవేశాలను నియంత్రించుకుంటూ పార్టీని ప్రజలకు చేరువ చేసే విధంగా వాస్తవాలను, తమ బలాలను ప్రజలకు అర్ధమయ్యే విధంగా వివరించి వారి మద్దతు సాధించేలా ప్రయత్నించటం పార్టీ బలోపేతానికి ఉపయోగ పడుతుంది. గతంలో జరిగిన విషయాలకు ఇప్పుడు బదులు తీర్చుకునే దృక్పథం తోనే ముందుకు వెళితే సామాన్య కార్యకర్త కు కీలక స్ధానంలో ఉన్న నాయకులకు పెద్ద తేడా ఉండదు. అందువల్ల పార్టీకి లాభం మాట అటుంచి నష్టం జరిగే అవకాశం ఉంది.
బిజెపి 2014 నుండి 2018 వరకూ తెలుగుదేశంతో కలిసి ఉంది. భవిష్యత్తులో మరలా ఎలా ఉంటుందో తెలియదు. కానీ మిత్రత్వం విడిపోగానే అప్పటి వరకూ మంచి ఐనవి ఒక్కసారిగా చెడ్డవి అయిపోవు.ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.

అలాగే బిజెపి రాష్ట్ర నాయకులు పదే పదే చేబుతున్న కేంద్ర పధకాల గురించి రాష్ట్రంలో ఎంతమందికి అవగాహన ఉంది? ఆ విషయంలో రాష్ట్ర పార్టీ కృషి ఎంత? ఏ విధంగా వీరు గొప్పగా చెప్పే మోడీ నమూనాను ప్రజల్లోకి తీసుకెళ్ళ గలుగుతున్నారు? ఈ రాష్ట్రానికి ప్రత్యామ్నాయం మేమే అని ప్రజలను ఎలా నమ్మించ గలరు?

నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వాడిని కాదు. రాజధానికి భూమిని ఇచ్చిన రైతును. రాజధాని ప్రాంత రైతులకూ మహిళలకూ రాజకీయాలు అవసరం లేదు. ఉద్యమం మొదలైనప్పుడు వాస్తవంగా అమరావతి ప్రజలందరూ మోడీ వైపు ఆశావహంగా చూసారు. ఆయన శంకుస్థాపన చేసిన అమరావతిని ఆయనే
amaravati-sankusthapana కాపాడతారని. శంఖుస్థాపన దినానికి ఐదవ వార్షికోత్సవానికి కూడా మోడీ గారి మాస్కులనే ధరించారు. ఉద్యమం తొలి రోజుల్లో మా దగ్గర ఎక్కువగా ఉన్నవి మోడీ గారి మాస్కులూ, ప్లకార్డులే. అవన్నీ క్రమంగా కనుమరుగవటానికి కారణం రాష్ట్ర నాయకుల అసమర్ధతే. జగన్మోహన్రెడ్డి ఆడిన మైండ్ గేమ్ ని ఖండించలేక పోవటమే.

నేను తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కేంద్రం ఆమోద ముద్ర ఉంది అని ప్రకటించినప్పుడే ఖండించి ఉంటే అమరావతి ప్రజలకు బిజెపిపై అనుమానాలు వచ్చేవి కావు. దానికి తోడు కారణాలు ఏవైనా కొంతమంది రాష్ట్ర నాయకులు అప్పుడు చేసిన ఇప్పటికీ చేస్తున్న వ్యాఖ్యలు అమరావతి ప్రజలకు బిజెపిపై విపరీతమైన అనుమానాలు కలుగజేసాయి. ఇందుకు అపరిపక్వ మనస్కులైన రాష్ట్ర నాయకులే కారణం.

కానీ ఏది ఏమైనా ఒక్కటి మాత్రం నిజం. అమరావతిని సాధించే వరకూ మేము పోరాడుతూనే ఉంటాం. మేము ఏ పార్టీకి అనుకూలం కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. మా భవిష్యత్తు కోసం మేము అందరి మద్దతూ ఆశిస్తున్నాం అదే సమయంలో మమ్మల్ని ఒక రాజకీయ సాధనంగా ఉపయోగించు కుందామనే వారికీ మా నిస్సహయాతను అడ్డు పెట్టుకొని స్వప్రయోజనాలు పొందుదామని ఆలోచించే వారికి నాదొక విజ్ఞప్తి. అమరావతి ప్రజలు ప్రభుత్వాన్ని నమ్మి చేసిన త్యాగాలను గుర్తించని వారికి తిరిగి సమాధానం చెప్పగల సత్తా ఉంది. రెండు సంవత్సరాలుగా మేము ఎన్నో ఎదుర్కొన్నాం . ఇంకా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాం.
జై అమరావతి
జై జై అమరావతి

– g. బుచ్చి తిరుపతి రావు
తుళ్ళూరు గ్రామ రైతు.

Leave a Reply