Home » బడుగుల వంచనలో మహా ఘనుడు జగన్‌!

బడుగుల వంచనలో మహా ఘనుడు జగన్‌!

బడుగుల నయవంచకుడు సీఎం జగన్మోహన్‌రెడ్డి…ఎన్నికలు సమీపించడంతో నా పేదలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ కీర్తిస్తూ విన్యాసాలు చేస్తున్నారు. దళిత జనోద్ధారణకు జీవితాంతం కృషి చేసిన జాతిపిత మహాత్మాగాంధీ కూడా ఇంతలా మొసలి కన్నీరు కార్చలేదు. మహాత్మాగాంధీ వారి అభ్యున్నతికి చిత్తశుద్ధితో పనిచేశారు తప్ప జగన ్‌రెడ్డిలా సొల్లు మాటలు చెప్పి వారిని మోసం చేయలేదు.

బడుగు బలహీన వర్గాలకు ఇచ్చిన హామీలను అటకెక్కించారు. గత ప్రభుత్వాలు అమలు చేసిన పథకాలు రద్దుచేశారో ఇప్పటికీ కళ్లకు కనబడుతూనే ఉంది..జగన్‌రెడ్డి అబద్దాల దుకాణం రోజురోజుకూ కళకళలాడిపోతుం ది. సంక్షేమం మాటున గుట్టుగా ప్రజాధనం దోపిడీకి లాకులెత్తింది ప్రభుత్వం. బడుగులకు చూడబోతే వెండిగిన్నె ముందు పెట్టి తాగబోతే వెలితి గిన్నెగా మార్చారు. బడుగు బలహీన వర్గాల ఓట్లు కావాలి కనుక జగన్మోహనరెడ్డి..నా అనే పాట అందుకున్నారు. తన పల్లకి మోసే బోయీలుగానే ఆ వర్గాలు ఉండిపోవాలని ఆయన కోరిక. అందుకే బడుగు బలహీన వర్గాల వారిని అధికార కేంద్రాల దరిదాపుల్లోకి కూడా వారిని రానివ్వరు.

రాజకీయంగా, ప్రభుత్వ పరంగా తన తరఫున వ్యవహారాలను చక్కదిద్దుతున్న వారిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎంత మంది ఉన్నారో జగన్‌ రెడ్డి సమాధానం చెప్పగలరా? ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ధనుంజయ్‌రెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి, జవహర్‌రెడ్డి ఎవరు? అట్లాగే పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న సజ్జల రామకృష్ణారెడ్డి, వై.వి.సుబ్బారెడ్డి, మిథున్‌ రెడ్డి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఎవరు? తనకు నెల నెలా వివిధ రూపాల్లో వసూళ్లు చేసి పెడుతున్న గనుల శాఖ డ్కెరెక్టర్‌ వెంకటరెడ్డి, మద్యం సరఫరా చేసే సంస్థ ఎండీ వాసుదేవరెడ్డి ఎవరు? కీలకంగా వ్యవహరిస్తున్న రెడ్డి వారి స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎందుకు లేరో జగన్‌ రెడ్డి సమాధానం చెప్పగలరా?

జగన్‌ కీర్తిస్తున్న ఆయా వర్గాల్లో సమర్థులు లేరా? లేక ఆయా వర్గాల వారిపై జగన్‌ కి నమ్మకం లేకనా? ఊరి వెలుపల దళితవాడలను ఏర్పాటు చేసినట్టుగా తాడేపల్లి ప్యాలెస్‌కు దళిత వర్గాలను ఆమడ దూరంలో ఎందుకు ఉంచారు? ఆయా వర్గాలను మభ్యపెట్టేందుకు విధిలేని పరిస్థితులలో కొన్ని పదవులు విదిల్చి వారిని అధికార కేంద్రాల దరిదాపుల్లోకి కూడా రానివ్వంది నిజం కాదా? ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నిజంగా నీ వాళ్లయితే ఆ వర్గాలతో ఎందుకు బంధుత్వం పెట్టుకోలేదు? ఐదేళ్లలో పేదలకు, అక్క చెల్లెమ్మలకు రూ.2,75 లక్షల కోట్లు పంచిపెట్టానని జగన్‌ రెడ్డి గొప్పలు చెప్పుకొంటున్నారు. మరి ఐదేళ్లలో రూ.10 లక్షల కోట్లు అప్పు చేసి రూ 2.75 లక్షల కోట్లు పంచడం గొప్పనా?

ఈ ఐదేళ్లలో జగన్‌ జేబు నుంచి ఒక్కరికైనా పది రూపాయలు సహాయం చేశానని చెప్పగలరా? ఈ ఐదేళ్లలో జగన్‌ రెడ్డి కంపెనీల లాభాలు పెరిగినట్టుగా పేదల ఆదాయం ఎందుకు పెరగలేదు? ఎన్ని సార్లు బటన్లు నొక్కినా ఒక్క పేదవాడ్కెనా పేదరికం నుంచి బయటకు వచ్చి పన్ను కట్టే స్థాయికి ఎదిగాడా? ఒక పక్కన బడుగులను మోసం చేస్తూ మరో పక్క నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అంటూ వారికే టోకరా వేస్తున్నారంటే జగన్‌ ఎంత గుండెలు తీసిన బంటో బడుగులు అర్థం చేసుకోవాలి.

ఐదేళ్లుగా వివిధ పన్నులు, పప్పులు, నూనెలు, కోడిగుడ్లు, పాలు, చికెన్‌, నిత్యావసర ధరలు సామాన్య జనానికి అందనంతగా పెరిగిపోతే సంక్షేమ మంత్రాన్ని జపిస్తూ పేదల ప్రతినిధిగా చెప్పుకుంటున్న జగన్‌ ఒక్కసారైనా ధరలపై సమీక్షించి తగ్గించే ప్రయత్నం చేశారా? ఐదేళ్లలో ప్రజలపై పన్నులు, చార్జీల రూపంలో రూ.లక్షా పది వేల కోట్ల భారం మోపి పేదల ప్రభుత్వం అని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడం లేదా? తానూ పేదల ప్రతినిధిగా చెప్పుకుంటున్న జగన్‌రెడ్డికి ఊరికి రెండు విలాసవంతమైన రాజ ప్రాసాదాలు ఊరూరా అవసరమా?

విశాఖపట్నంలో తన నివాసం కోసం ఐదు వందల కోట్లు ఖర్చు చేసి మరో విలాస వంతమైన భవనం నిర్మించుకోవడంలో ఔచిత్యం ఏమిటి? పేదలు మాత్రం సెంటు స్థలంలోనే ఇల్లు కట్టుకుని రాజప్రసాదంగా భావించాలని కోరుకోవడం వంచన కాదా? మీ పిల్లలు విదేశాల్లో చదువుకోవాలి కానీ, పేదల పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకోవాలని కోరుకోవడం పేదల ప్రతినిధి చేసే పనేనా? పేదల ప్రతినిధిగా మీ పిల్లల వలె పేదల పిల్లలను కూడా ప్యారిస్‌, లండన్‌లో ఎందుకు చదివించరు?

ఆరు లక్షల పెన్షన్లు రద్దు చేయడం, ప్రతినెలా పేదలకు ఇస్తున్న రెండు కిలోల కందిపప్పును కిలోకి కుదించడం, కిలో రూ.40కే ఇస్తున్న కంది పప్పును రూ.67కి పెంచడం, పండగ సమయాల్లో ఇచ్చిన సంక్రాంతి, క్రిస్మస్‌, రంజాన్‌ కానుకలు రద్దు చేయడం పేదలపై ఉన్న ప్రేమతోయేనా? అన్న క్యాంటీన్లు రద్దు చేయడం ప్యాక్షన్‌ మనస్తత్వానికి పరాకాష్ట కాదా? వారి పొట్టగొట్టడం పేదల పక్షపాతమా? ప్రతిభ ఉన్న ఎస్సీ,ఎస్టీ విద్యార్థులను గత ప్రభుత్వం కార్పొరేట్‌ పాఠశాలల్లో చేర్పించే బెస్ట్‌ ఎవైలబుల్‌ స్కూల్‌ పథకం కింద 2014 -19 మధ్య 1,40 లక్షల మందికి పైగా లబ్ధి పొందితే జగన్‌ అధికారంలోకి వచ్చాక కేవలం 9-10 తరగతులకే పరిమితం చేయడం పేదల పక్షపాతమా?

గత ప్రభుత్వం విదేశీ విద్య పేరుతో విన్నూత్న పథóకాన్ని అమలు చేసింది. గత ప్రభుత్వం ప్రవేశ పెట్టిందన్న కారణంతో ఎస్సీ, ఎస్టీల పేద విద్యార్థు లకు విదేశాల్లో ఉన్నత విద్యకు గత ప్రభుత్వం చేసిన ఆర్థిక సాయం రద్దు చేయడం పేదల పక్షపాతమా? సంక్షేమ రాజ్య భావనకు గండికొట్టి ఫ్యాక్షనిస్టు కసాయితనానికి పదును పెట్టి జగన్‌ సాగిస్తున్న దుష్పరిపాలన బడుగుల జీవితాలను అంధకారం చేసింది నిజం కాదా?

బడుగులను కేవలం ఓటు బ్యాంకుగా చూడటం తప్ప కనీసం మనుషులుగా గుర్తించని జగన్‌ పేదల ప్రతినిధిగా చెప్పుకోవడం సిగ్గు చేటు కాదా?జగన్‌ నిజ స్వరూపాన్ని బడుగులు గుర్తించాలి. సంక్షేమ పథకాలతోనే రాష్ట్రం రామరాజ్యంగా వర్థిల్లుతుంటే, జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ఇస్తున్న ఉచితాలతోనే పేదల బతుకు తెల్లవారితే రాష్ట్రంలో ఏర్పడ్డ దుర్భిక్ష పరిస్థితులకు రాయలసీమ నుంచి గ్రామాలకు గ్రామాలు ఎందుకు వలస బాట పట్టాయో జగన్‌ సమాధానం చెప్పాలి.

తాము మాత్రమే ప్రజాహితమని ప్రచారం చేసుకుంటున్న జగన్‌రెడ్డి మద్యం ధరలు భారీగా పెంచి పేదల జేబు కొట్టి ఆదాయం పోగేసుకోవడం ప్రజాహితమా? ప్రజా హతమా? ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన వేదిక పైనే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని హామీ ఇచ్చిన జగన్‌ తొమ్మిది సార్లు విద్యుత్తు చార్జీలు పెంచి పేదలపై రూ.60 వేల కోట్లకు పైగా భారం వేసి డబ్బు గుంజడం ఏ విధమైన ప్రజాహితమో చెప్పాలి. ఎప్పుడైతే ప్రజలు జగన్‌ మోసాలు, అబద్ధాలు గుర్తించకుండా ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోపెట్టారో అప్పుడే ప్రజలు ఉత్త అమా యకులని, వారిని పదే పదే బురిడీ కొట్టించవచ్చునని జగన్మోహన్‌రెడ్డి నిర్ధారణకు వచ్చారు.

జనం కళ్లలోకి సూటిగా చూస్తూ అలవోకగా అబద్ధాలు చెప్పగలిగే నాయకుడు ఎవరంటే జగన్మోహన్‌రెడ్డి అని చెప్పాలి. ప్రజల నెత్తి మీద కూర్చొని మీ సేవకుడిని అని గొప్పలు చెప్పి నమ్మించగలిగిన, ప్రజల ఇల్లు గుల్ల చేస్తూ పేదల ప్రతినిధిని అని మభ్యపెట్టగలిగిన, చేతితి సంకెళ్లు, నోటికీ తాళం వేసి ప్రజాస్వామ్యం అని నమ్మించగలిగిన, కొంపకు నిప్పు పెట్టి చలిమంట వేసి చలి కాచుకోమని బురిడీ కొట్టించ గలవాడు ఎవరైనా ఉన్నారంటే అది జగన్మోహన్‌రెడ్డి మాత్రమే.

అందుకే తన లాంటి వాడికి ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టిన జనాలను ఆయన వెర్రిబాగులోళ్లుగా పరిగణిస్తున్నారు. అందుకే నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. జగన్మోహన్‌రెడ్డి పాలన నిజంగా గొప్పగా ఉంటే, తాను అంత పేదల పక్షపాతి అయితే పొద్దున లేచిన దగ్గర నుంచి ప్రతిపక్షాలు, మీడియా మీద పడి ఏడవడం ఎందుకు? సొంత మీడియాకు వందల కోట్ల ప్రజాధనాన్ని దోచిపెడుతూ ప్రజల దృష్టి మళ్లించేందుకు పేదల ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్నారు.

రాష్ట్రంలో కొన్ని మీడియా సంస్థలు జగన్‌ రోత పత్రిక, ఆ రోత చానల్‌కు అనుబంధంగా మారిపోయి కూలి మీడియా జగన్‌కి భజన చేస్తూ వాళ్లు విసిరే ఎంగిలి మెతుకులకు అలవాటుపడి కొన్ని మీడియా వ్యవస్థలు ప్రతిపక్ష తెలుగుదేశంపై విషం కక్కుతున్నారు. దగాపడిన బడుగు బిడ్డలు, దళితులు, మైనారిటీలపై సామాజిక ద్రోహానికి పాల్పడినా సామాజిక న్యాయం చేస్తున్నట్టు చెప్పుకోవడం సిగ్గుచేటు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను అణచివేస్తూ వారిపై దాడులకు పాల్పడుతూ, వారినేదో ఉద్ధరిస్తున్నట్లు ఆయా వర్గాలను మోసగించాలని చూస్తున్న జగన్‌రెడ్డికి ఎన్నికల్లో బుద్ది చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

నీరుకొండ ప్రసాద్,
సీనియర్ జర్నలిస్ట్,
9849625610

Leave a Reply