హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధాన్యం కొనుగోలు చేయాల్సిందే అని తెలంగాణ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. ధాన్యం కొనుగోళ్లు, రైతుల సమస్యలపై ఆ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. నగరంలోని పబ్లిక్ గార్డెన్స్ నుంచి వ్యవసాయ కమిషనరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహా, సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో గత ప్రభుత్వాల హయాంలో రాని సమస్య ఇప్పుడెందుకు వచ్చిందని భట్టి విక్రమార్క ప్రశ్నించారు. కొనుగోలు చేయాల్సిన ప్రభుత్వమే ధర్నా చేయడం ఏంటని ఆయన నిలదీశారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులతో ఆడుకుంటున్నాయని భట్టి విక్రమార్క ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయకుండా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేసి కార్పొరేట్లకు అప్పగించే కుట్ర జరుగుతోందని ఆయన ఆక్షేపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి నెపం వేసుకొని అన్నదాతలకు అన్యాయం చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ది దొంగ దీక్ష చేస్తున్నారని సీతక్క విమర్శించారు. రైతులు నష్టపోతారనుకున్నప్పుడు పరిష్కారం చూపకుండా దీక్షలకు దిగడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ప్రభుత్వమే వడ్లు కొనాలని ఆమె డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ధర్నా నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.