Suryaa.co.in

Andhra Pradesh

ఏపీలో ఆర్ధిక విధ్వంసం

-పొత్తులపై స్పందించను
– పనిచేయనివారిని పక్కనపెడతా
– మీడియాతో చంద్రబాబు చిట్‌చాట్

అమరావతి : ఏపీలో గత రెండున్నరేళ్లుగా ఆర్థిక విధ్వంసం జరుగుతోందని, దాని వల్ల కీలకరంగాలు దెబ్బతినే ప్రమాదం వచ్చిందని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మాయమాటలు విని మోసపోయిన జనం, జగన్ తమను మోసం చేశారన్న నిజాన్ని గ్రహిస్తున్నారన్నారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం టీడీపీ ఎప్పుడూ ముందుంటుందని, ఇకపై టీడీపీ ఉధృతమైన పోరాటాలు చేస్తుందని వెల్లడించారు. ఇకపై పార్టీ అంశాల్లో కఠినంగా ఉంటానని, పనిచేయనివారిని నిర్మొహమాటంగా పక్కనపెడతానన్నారు. పనిచేయనివారి స్థానంలో కొత్తవారిని ఇన్చార్జిలను నియమిస్తామన్నారు. పొత్తుల గురించి ఇప్పుడు అప్రస్తుతమని, ఇప్పుడు తానేం మాట్లాడినా అది వేరే సంకేతాలకు దారి తీస్తుందన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా చంద్రబాబు మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఏమన్నారంటే…

రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని అంచనా వేయలేకపోతున్నా. అనేక మంది సీఎంలు పని చేసినా ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిన సీఎం ఎవ్వరూ లేరు.రాష్ట్రంలో ఇప్పుడు ఆర్థిక విధ్వంసం జరుగుతోంది. ఏపీ బ్రాండ్ ఇమేజీని దెబ్బ తీశారు. పారిశ్రామిక వేత్తలు మొదలుకుని రోజూ కూలీ వరకు పొరుగు రాష్ట్రాలకు వలస పోతున్నారు. గతంలో భువనేశ్వర్ నుంచి విశాఖకు వచ్చే వాళ్లు.. ఇప్పుడు విశాఖ నుంచి భువనేశ్వర్ వెళ్తున్నారు. ఏసీబీ, సీఐడీలను కంట్రోల్లో పెట్టుకుని అందర్నీ బెదిరిస్తున్నారు. గౌరవానికి భంగం కలుగుతుందని భయపడి సైలెంటుగా ఉంటున్నారు. ఈ గొడవలెందుకని ఇంకొందరు వలస పోతున్నారు.

ప్రభుత్వం అరాచకాలను ప్రస్తుతం ప్రజలు భరిస్తున్నారు.. ఎన్నికల్లో అన్ని తేలుస్తారు. ముందస్తు ఎన్నికలపై ప్రచారం జరుగుతోంది.. వస్తే సిద్దంగా ఉన్నాం. పొత్తులపై ప్రశ్నలు ఊహాజనితం.. నేను దానిపై స్పందించను. కరోనా కారణంగా జనం రోడ్డెక్కలేదు.. దీంతో జగన్ బతికిపోయాడు. 175 నియోజకవర్గాలతో సమావేశం అవుతాం.. ప్రజా ఉద్యమాలను తీవ్రతరం చేస్తాం.

లీడర్ల పని చేయకుంటే మారిపోతారు. పార్టీ ఎవరి కోసం త్యాగాలు చేయదు. పని చేయని ఇన్చార్ఝులను పక్కన పెట్టేస్తాం. ఏపీలో వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింది. దిగుబడులు తగ్గాయి.. పంటల పర్యవేక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఉంది. ఒకప్పుడు అన్నపూర్ణగా ఉన్న రాష్ట్రంలో దిగుబడుల్లో వెనకపడింది. మిర్చి పంట పూర్తిగా నష్టపోయింది. టీడీపీ హయాంలో బిందు సేద్యం 90 శాతం సబ్సిడీ మీద ఇచ్చాం.. ఇప్పుడు అస్సలు ఆ ప్రస్తావనే లేదు. ట్రాక్టర్లు.. వ్యవసాయ యాంత్రీకరణ విషయంలో టీడీపీ ఎంతో చేసింది. వ్యవసాయానికి జగన్ ప్రభుత్వం చేసింది శూన్యం.
టీడీపీ చేసిన అభివృద్ధి కంటే జగన్ ఏదో చేస్తాడని ప్రజలు భావించారు.. ఇప్పుడు ఆ భ్రమలు తొలుగుతున్నాయి. ఇకపై మరింత విస్తృతంగా పోరాటాలు చేస్తాం.

LEAVE A RESPONSE