గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో పెంచిన పెన్షన్లను లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం వైయస్.జగన్.
ఈ సందర్భంగా సీఎం వైయస్.జగన్ ఏమన్నారంటే…:
మేనిఫెస్టో తూచా తప్పకుండా… ఈ ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఈరోజు మీ అందరి ఎదుట ఈ కార్యక్రమం జరగడం.. ఈరోజు అవ్వాతాతలకు ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో.. ఏరకంగా ఈ రెండు పేజీల మేనిఫెస్టో విడుదల చేశామో… ఇందులో చెప్పిన ప్రతి అంశమూ… నెరవేరుస్తున్నాం.
అవ్వాతాతలకు పెన్షన్ రూ.3వేలు వరకు పెంచుకుంటూ పోతాం అని ఇచ్చిన మాట తూచా తప్పకుండా మీ అందరి సమక్షంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2250కు సంతకం చేసి, రెండున్నర సంవత్సరాలు అవుతుంది. ఈరోజు రూ.2500 పెన్షన్ పెంచుతూ దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో మంచి కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది.
ఇక్కడకు వచ్చిన, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ ప్రతి అవ్వకూ, తాతకూ, సోదరుడికీ, స్నేహితుడుకీ చేతులు జోడించి, శిరస్సు వంచి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.
ప్రతి ఒక్కరికీ హ్యాపీ న్యూఇయర్
ఈరోజు జనవరి 1 కాబట్టి, రాష్ట్రంలో ఉన్న ప్రతి అవ్వకూ, ప్రతి తాతకూ, ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడికీ, ప్రతి స్నేహితుడికీ, గుండెల నిండా ప్రేమతో ప్రతి ఒక్కరికీ మీ బిడ్డ హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తున్నాడు.
సమాజం కోరుకునేది…
ఏ సమాజమైనా ఏం కోరుకుంటుంది అన్నది ఒక్కసారి ఆలోచన చేస్తే… చీకటి నుంచి వెలుగులోకి రావాలని ఆరాటపడుతుంది. వెనుకబాటు నుంచి అభివృద్ధి వైపు అడుగులు పడాలని ఆరాటపడుతుంది. అసమానతల నుంచి సమానత్వం అందాలి, సమానత్వంతో ఆత్మాభిమానంతో బతకాలని ఆరాటపడుతుంది, అరాచకం నుంచి చట్టబద్ధపాలన వైపు పాలకులు ప్రయాణం చేయాలి, చేయించాలని తాపత్రయపడుతుంది. అలాగే ఏ మనిషైనా, ఏ కుటుంబమైనా ఏం కోరుకుంటుందని చెప్పి ఒక్కసారి ఆలోచన చేస్తే… నిన్నటి కంటే నేడు బాగుండాలని కోరుకుంటారు. నేటి కంటే రేపు బాగుండాలని ఎవరైనా కోరుకుంటారు. రేపటి కంటే నా భవిష్యత్ ఇంకా బాగుండాలని కోరుకుంటారు. అటుంటి పాలన కోసం ఆరాటపడతారు. అటువంటి పాలన చూడాలని ఏ కుటుంబమైనా ఆరాటపడుతుంది. ఈరోజు ఆ దిశగా అడుగులు వేస్తూ… అభివృద్ధి బాటలో నడిపించగలుగుతున్నామని చెప్పి గర్వంగా మీ బిడ్డగా తెలియజేస్తున్నాను.
ఆ అభాగ్యుల గురించి వీళ్లకు తెలుసా?
ఈ రోజు పెన్షన్‌లు పెంచుకుంటూ పోతున్నాడు జగన్, గత ప్రభుత్వంలో రూ.1000 ఉన్న పెన్షన్‌ను వస్తూనే రూ.2250కి చేశాడు. ఈరోజు రూ.2500 కూడా చేస్తున్నాడు. ఈ జగన్ చేస్తా ఉన్న ధోరణి సరిగా లేదు అని చెప్పేవాళ్లు చాలామంది ఉంటారు. మంచి చేస్తుంటే దాన్ని విమర్శించే వాళ్లూ ఉంటారు. వీళ్లందరికి నేను ఒక్కటే చెప్పదల్చుకున్నాను.. తమకు తాముగా జీవితమంతా కష్టపడినా కూడా నాలుగు రూపాయలు కూడా మిగులించుకోలేని నిర్భాగ్యులు ఎంతమంది ఉన్నారో వీళ్లెవరికైనా తెలుసా ? అని అడుగుతున్నాను. కన్నపిల్లల నుంచి ఎటువంటి సహాయం లేని అభాగ్యులు, భర్తను కోల్పోయి తమకు తాము సంపాదించుకునే శక్తి లేని వితంతువులు, వివిధ సాంప్రదాయ కులవృత్తులలో తమ జీవితాలనే ధారపోసి, వయస్సు మల్లుతున్న దశలో ఈరోజు ఆ కులవృత్తి కొనసాగించలేక ఆర్ధికంగా ఆధారం లేక జీవితం ప్రశ్నార్ధకంగా మారిన వృత్తులు ఎన్ని ఉన్నాయో వీళ్లందరికి ఎవరికైనా తెలుసా? అని అడుగుతున్నాను.
ఇటువంటి అన్యాయమైన పరిస్థితుల్లో, ఇటువంటి పండుటాకులున్న ఈ పరిస్థితుల్లో వారికి ఏదైనా మనం చేస్తే దాన్ని మంచి అంటారా ? అది చేయడం చెడు అంటారా ? అని నేను మిమ్నల్నే అడుగుతున్నాను. విమర్శించే ఇటువంటి వాళ్లకందరికీ మీరే సమాధానం చెప్పాలని కోరుతున్నాను.
గర్వంగా చెపుతున్నా….
ఈ రోజు సామాజిక పించన్లు నెలకు రూ.2250 నుంచి రూ.2500కు పెంచబోతున్నామని సగర్వంగా తెలియజేస్తున్నాను. ఈ సమావేశం తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు.. ప్రతి ఇంటివద్దకు వెళ్లి పొద్దున్నే గుడ్ మార్నింగ్ చెప్పి చేయవలసిన ఈ కార్యక్రమాన్ని ఈరోజు మధ్యాహ్నం నుంచి చేపడతారు. వీరే కాక పుట్టుకతో కానీ, పుట్టిన తర్వాత కానీ అంగవైకల్యానికి గురైన అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు, తీవ్ర కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నవారికి, తలసేమియా, సికిల్‌సెల్ ఎనీమీయా, హీమోఫీలియా, బోధకాలు, చివరికి పక్షవాతం వచ్చి మంచానికో, వీల్ చెయిర్‌కో పరితమితమైన బ్రతుకులు… ఇటువంటివాళ్లకు, కండరాల క్షీణత, కుష్టువ్యాధి, కిడ్నీ, కాలేయం గుండె వంటివి ట్రాన్స్ ప్లాంట్ జరిగిన నిరుపేదలకు.. వీళ్లందరికీ కూడా దేశంలోనే ఏరాష్ట్రంలోని కూడా ఇవ్వని విధంగా వీళ్లకు కూడా పెన్షన్ ఇస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే.
62 లక్షల కుటుంబాల్లో చిరునవ్వులు…
ఈ రోజు కేవలం క్యాలెండర్లు మాత్రమే మారటం లేదు. దాదాపు 62 లక్షల కుటుంబాల్లో మరిన్ని చిరున వ్వులు ఈ ఒకటో తారీఖు నుంచి రాబోతున్నాయి. పెన్షన్లు కోసం ఇచ్చిన మాట ప్రకారం రూ.3వేల వరకు పెంచుకుంటూ పోతామన్న మాటకు కట్టుబడి, రూ.2250తో మొట్టమొదటి సంతకం చేసి, రెండున్నర సంవత్సరాలు తిరక్కమునుపే ఈ రోజు రూ.2500కు పెంచుకుంటూ పోయాం.
నిండు మనస్సుతో…
దీని ద్వారా నిండు మనస్సుతో మానవత్వాన్ని కొనసాగిస్తూ… దేశంలోనే అత్యధిక పెన్షన్‌లు ఇస్తున్న రాష్ట్రంగానూ, అత్యధిక మొత్తాన్ని కూడా పెన్షన్‌లుగా ఇస్తున్న రాష్టం కూడా మనదే అని తెలియజేస్తున్నాను. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. గత ప్రభుత్వం దిగిపోయేనాటికి అంటే ఎన్నికలకు కేవలం రెండు నెలలు ముందువరకు ఇస్తున్న పెన్షన్ ఎంతనేది మీ అందరికీ జ్ఞాపకం ఉండే ఉంటుంది. ఒకవేళ లేకపోతే కాస్త జ్ఞాపకం తెచ్చుకొమ్మని ప్రాధేయపడుతున్నాను. ఎన్నికలకు ముందు వరకు గత ప్రభుత్వంలో ఇస్తున్న పెన్షన్ రూ.1000 అయితే మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంటే నేను ముఖ్యమంత్రిగా మొదటి సంతకం పెట్టిననాటినుంచి గత నెల వరకు మనం ఇచ్చిన పెన్షన్ రూ.2250.
అయితే.. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి ఆరునెలల ముందు వరకు ఇచ్చినపెన్షన్ల సంఖ్య ఎంత అంటే కేవలం 39 లక్షలు మాత్రమే. ఈ రోజు మనందరి ప్రభుత్వం దాదాపుగా 62 లక్షల మందికి పెన్షన్‌లు ఇస్తున్నామని సగర్వంగా మీ బిడ్డలా చెబుతున్నాను.
ఎక్కడ రూ.1000 ?, ఎక్కడ రూ.2250 ?, అక్కడ నుంచి రూ.2500 ఎక్కడ ?
ఎక్కడ 39 లక్షలు ? ఇవాళ ఇస్తున్న 62 లక్షల ఎక్కడ ? అని ఆలోచన చేయమని అడుగుతున్నాను.
గత ప్రభుత్వం– ఇప్పటికీ పెన్షన్ ఖర్చు..
గత ప్రభుత్వ హయాంలో పెన్షన్‌లపై చేసిన ఖర్చు ఎంతో తెలుసా? నెలకు కేవలం రూ.400 కోట్లు మాత్రమే. ఈ రోజు మనందరి ప్రభుత్వం అవ్వాతాతలు, వికలాంగులు, వితంతవులు, ఇతర పెన్షన్ల మీద చేస్తున్న ఖర్చు ఏకంగా నెలకు రూ.1450 కోట్లు.
ఈ రూ.1450 కోట్లు ఇకమీదట నుంచి రూ.1570 కోట్లకు పెంచుతున్నాం.
కరోనా కష్ట కాలంలోనూ పేదవాడికి…
ఈ 31నెలల పాలనలో ఇంతటి కరోనా కష్ట కాలంలో కూడా ఇలా పెన్షన్ల రూపంలో ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులు కన్నా కూడా ఆ పేదవాడికి ఉన్న ఇబ్బందులు ఇంకా ఎక్కువ, ఆ పేదవాడికి ఇంకా తోడుగా ఉండాలని చెప్పి, ఒక్క పెన్షన్ల కోసమే దాదాపుగా రూ.40వేల కోట్లపై చిలుకు ఖర్చుచేశాం. ఈ రోజు ఈ పెన్షన్లకు కోటాల్లేవు, గతాన్ని ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాలి.
కులం, మతం పార్టీలు సైతం చూడలేదు
గతంలో మాదిరిగా ఈ రోజు పెన్షన్లకు కోటాల్లేవు, కోతల్లేవు. ఎంత ఎక్కువమందికి ఎగ్గొట్టాలి అన్న కుతంత్రాలు మన ప్రభుత్వంలో లేవు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎలా అందించాలన్న బాధ్యత మనందరి ప్రభుత్వంలో ఈరోజు కనిపిస్తుంది. కాబట్టే ఈ రోజు కులం చూడ్డం లేదు, మతం, వర్గం చూడ్డం లేదు. ఆఖరుకి మనకు ఓటు వేసినా వేయకపోయినా ఫర్వాలేదు.. మనకు ఓటు వేయని వారికి కూడా ఇవ్వాలని చెప్పి ఏకంగా రూల్ తీసుకొచ్చి ఇస్తున్నాం. అర్హులందరికీ కూడా అర్హత ఉంటే చాలు… పెన్షన్ వాళ్ల గడపవద్దకే వచ్చేట్టు కార్యక్రమాలు చేస్తున్నాం.
చిరునవ్వుతో గడప వద్దకే….
లంచాలకు తావులేదు, వివక్షకు తావులేదు. మధ్యలో దళారులు లేరు. బ్రోకర్లకు చోటే లేదు. అయినవారు, కానివారు అంటూ పక్షపాతం చూపిన జన్మభూమికమిటీలు అసలే లేవు. ఇలాంటి కమిటీల ముందు తమ ఆత్మాభిమాన్ని చంపుకుని అవ్వా తాతలు, అక్కచెల్లెమ్మలు మోకరిల్లాల్సిన పరిస్థితి ఈరోజు లేనేలేదు. ఒక్కసారి తేడా చూడమని చెప్పి అడుగుతున్నాను. ప్రతినెలా మొదటి రోజునే మీ గడపముందుకు వచ్చి ఆ రోజు ఆదివారమైనా, సెలవుదినమైనా సరే నెల ఒకటో తేదీన సూర్యోదయానికి ముందే మీ గడపముందుకు వచ్చి చిక్కటి చిరునవ్వుతో వాలంటీర్ తలుపుతట్టి.. గుడ్ మార్నింగ్ చెప్పి, ఈసారైతే హ్యాపీ న్యూఇయర్ కూడా విష్ చేస్తూ… పెన్షన్లు ఇస్తున్నారు. ఇలాంటి పరిస్థితి మనకు వస్తుంది, ఇంత మంచి మనకు జరుగుతుంది అని చెప్పి ఏరోజైనా ఊహించగలిగారా ? అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేసుకోమని అడుగుతున్నాను.
ఈ రోజు గతంలో మాదిరిగా చేంతాడంత క్యూలు లేవు.. వృద్ధులు, వికలాంగులు సైతం నిలబడాల్సిన అవస్థలేదు. ఆత్మాభిమానాన్ని చంపుకోవాల్సిన అవసరం అంతకన్నా లేని పరిస్థితి ఈరోజు ఉంది.
ఆసుపత్రిలో ఉంటే అక్కడే పెన్షన్
ప్రతినెలా కచ్చితంగా ఒకటో తేదీన ఆదివారమైనా, సెలవు దినమైనా కానీ వచ్చి, ఎక్కడైనా చివరకు అనారోగ్యం వల్ల ఆస్పత్రిలో చికిత్స పొందుతుంటే కూడా నా వాలంటీర్ అక్కచెల్లెమ్మలు, వాలంటీర్ అన్నదమ్ములు స్వయంగా అక్కడికి వెళ్లి చిరునవ్వుతో అక్కడ కూడా పెన్షన్ ఇస్తున్న గొప్ప వ్యవస్ధ మన రాష్ట్రంలో ఉంది. దాదాపుగా 2.70 లక్షల మంది గ్రామ, వార్డు వాలంటీర్లు ఇవాళ పెన్షన్ల పంపిణీ అనే యజ్ఞంలో పనిచేస్తున్నారు.
ప్రతినెలా ఒకటో తారీఖున అది పూర్తికాకముందే దాదాపుగా 95 శాతం మందికి పెన్షన్లు వాళ్ల చేతుల్లో పెడుతున్నారు. ప్రతినెలా 5వ తారీఖు వరకు.. వాళ్లు వెళ్లినప్పుడు ఎవరైనా లేకపోతే కనీసం మూడు సార్లు వాళ్ల ఇంటికి వెళ్లి కచ్చితంగా వాళ్ల పెన్షన్ వాళ్ల చేతుల్లో పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది గొప్పగా జరుగుతుంది.
దేశంలో తొలిసారిగా…
ఇలా ఇంటింటికీ వెళ్లి గడప వద్దనే పెన్షన్ ఇవ్వడమనేది దేశంలోనే ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే జరుగుతుందని సగర్వంగా తెలియజేస్తున్నాను. దేశానికే ఇవాళ మార్గదర్శకంగా నిలబడుతున్నాం. మనం ఎలా చేస్తున్నామో మిగిలిన రాష్ట్రాలు కూడా మన మాదిరిగా చేయడానికి ఆరాటపడుతున్నాయి. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పడానికి గర్వపడుతున్నాను.
ఇంకా ఇబ్బందులు ఎదురైతే…
ఈరోజు పెన్షన్లు అందుకోవడంలో ఎవరికైనా ఇబ్బందులు ఏర్పడితే వెంటనే ఆ గ్రామ వార్డు సచివాలయాలను లేకపోతే మీ వాలంటీర్లను సంప్రదించండి. వారే దగ్గరుండి మీ చేయి పట్టుకుని నడిపించి అర్హత ఉంటే మీకు పెన్షన్ అందే విధంగా సాయం చేస్తారు. ఇలాంటి గొప్ప వ్యవస్ధ ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది.
పేదవాడి మంచి చూసి ఓర్వలేని పార్టీలు, నాయకులు..
చివరిగా రెండు మాటలు చెపుతాను. ఇంతగా మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వాన్ని.. ఇలాంటి మంచి చేసిన చరిత్ర ఎప్పూడూ కూడా లేని పార్టీలు, ఎప్పుడూ కూడా లేని నాయకులు ఈ రోజు ఓర్వలేక మనల్ని విమర్శిస్తున్నారు. ఇటువంటి పార్టీలు, నాయకులు ఏరోజూ కూడా పేదపిల్లలకు ఇంగ్లిషు మీడియం చదువులు చెప్పించాలి, మన పిల్లలు మాదిరే వాళ్లూ గొప్పగా చదవాలి ఆని ఏరోజూ ఆలోచన చేయలేదు. పైగా ఇంగ్లిషు మీడియం వద్దని అడ్డుకున్న వాళ్లు వీళ్లే.
పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తుంటే ఆ పేదలకు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల విలువ చేసే ఆస్తి వాళ్ల చేతుల్లో పెడుతుంటే… అది కూడా ఓర్వేలేక వాళ్లు గతంలో చేయక, చేసే మనస్తత్వం మంచిగా లేక, చివరకు మనం చేస్తుంటే.. దాన్ని కూడా అడ్డుకునేందుకు ఏకంగా కోర్టులకు వెళ్లి, స్టేలు తీసుకొచ్చే అధ్వాన్నమైన మనసు కలిగిన వాళ్లు మన రాష్ట్రంలో ఉన్నారు. ఇటువంటి వాళ్లు మనల్ని విమర్శిస్తున్నారు.
పేదలకు ఇళ్లు –డెమొగ్రాఫిక్ ఇంబేలన్స్ అంట
వీళ్లే… రాజధాని అని చెప్పుకుంటున్న అమరావతిలో ఇటువంటి పేదలకు అందరికీ కూడా ఇళ్ల స్ధలాలు ఇవ్వాలని చెప్పి మనం ఆరాటపడితే.. పేదలకు ఇళ్ల స్ధలాలు ఇస్తే డెమొగ్రాఫిక్ ఇంబేలన్స్ వస్తుంది అంటే దానర్ధం కులాల మధ్య మార్పులు, చేర్పులు వస్తాయని చెప్పి కోర్టులకెళ్లి ఫిటిషన్‌లు వేస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యమైన విమర్శించే నాయకులు ఉంటారా ? ఆని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇటువంటి విమర్శించే వాళ్లే చివరకు పేదలకు రిజిస్ట్రేషన్ చేసి, వాళ్లు కూడా వాళ్ల ఇంటి మీద పూర్తి హక్కులు తెచ్చుకుని, ఆ హక్కులతో వాళ్ల అవసరమొచ్చినప్పుడు ఆ ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ, తాకట్టు పెట్టుకునే స్వేచ్ఛ, లేదా ఈ పెద్దవాళ్లు చేస్తున్నట్టు వాళ్ల పిల్లలకు ట్రాన్స్‌ఫర్ చేసే స్వేచ్ఛతో… పూర్తి హక్కులతో కూడిన రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామంటే కూడా ఇటువంటి వాళ్లందరూ కూడా జీర్ణించుకోలేక విమర్శిస్తూనే ఉంటారు.
వీళ్లు యాంటీపూర్…
చివరికి విమర్శించేవాళ్లు పేదవాడికి అందుబాటు రేటుకి వినోదాన్ని అందించాలని.. సినిమా టిక్కెట్ల రేట్లు నిర్ణయిస్తే ఆ నిర్ణయం మీద కూడా రకరకాలుగా ఈరోజు మాట్లాడుతున్నారు.ఒక్కసారి ఆలోచన చేయండి. ఇటువంటి వాళ్లు పేదల గురించి ఆలోచన చేసే వాళ్లేనా ? పేదల గురించి పట్టించుకునేవాళ్లేనా ? ఇటువంటి వారందరూ కూడా యాంటీపూర్ అంటే పేదవాడికి వీళ్లు శత్రువులు కాదా అని చెప్పి ఒక్కసారి ఆందరూ ఆలోచన చేయమని నేను సవినయంగా మీ అందరినీ కోరుతున్నాను.
ఇటువంటి చెడిపోయి ఉన్న రాజకీయాల మధ్య మన పరిపాలన కొనసాగిస్తూ ఉన్నాం. మంచి చేసేదానికి నాలుగు అడుగులు ముందుకు వేస్తే.. ఆ మంచి జరగకూడదు, ప్రజలు ఇబ్బంది పడాలని, రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయకూడదని చెప్పి రకరకాల కారణాలతో, రకరకాల కోణాలతో రాజకీయ స్వార్ధంతో అడ్డుతగిలే కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది.
ఈ యేడు అయినా మంచి ఆలోచనలు కలగాలని..
వీళ్లందరికీ 2022లో అయినా ఈ జనవరి ఒకతో తేదీన అయినా సరే మంచి ఆలోచనలు కలగాలని, పేదలకు మంచి చేస్తుంటే అడ్డు పడరాదు అన్న జ్ఞానం వీళ్లకి రావాలని, దేవుడు దయ, మీ అందరి చల్లని ఆశీస్సులు మనందరి ప్రభుత్వం మీద కలకాలం ఉండాలని, ఇంకా ఎక్కువ మంచి చేసే అవకాశం ఇవ్వాలని మనసారా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా హ్యేపీ న్యూయర్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
చివరిగా మాట్లాడుతూ…
కాసేపటి కిందట నా చెల్లి హోంమంత్రి మాట్లాడుతూ నా నియోజకవర్గం వెనుకబడిన నియోజవర్గం అని చెప్పింది. దీని అభివృద్దికి నాలుగు అడుగులు ముందుకు వేయాలని అడిగింది. పెదనందిపాడులో కొత్త పీహెచ్‌సీ భవన నిర్మాణం, సినిమా హాల్ సెంటర్ నుంచి ఆసుపత్రి వరకు సీసీ రోడ్లు, డ్రైన్లు, క్రీడావికాస కేంద్రాల నిర్మాణం, ప్రత్తిపాడుకు తాగునీటి కోసం, ప్రత్తిపాడులో డబుల్ రోడ్లు, సెంటర్ లైటింగ్ ఏర్పాటుకు
అడిగింది. గుంటూరు ఛానెల్ విస్తరణ పనులు రూ.256 కోట్లతో మంజూరు చేశాం. ఈ పనులు జరుగుతున్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ పనులు పూర్తి చేస్తాం. ఇవే కాకుండా నా చెల్లి అడిగిన అన్ని పనులు మంజూరు చేస్తున్నానని సీఎం స్పష్టం చేసారు.అనంతరం పెంచిన వైఎస్సార్ పెన్షన్ కానుకను కంప్యూటర్‌లో బటన్ నొక్కి లబ్దిదారుల ఖాతాల్లో సీఎం వైయస్.జగన్ జమ చేశారు.