– విభజన వల్ల రాష్ట్రానికి జరిగిన నష్టం కంటే, జగన్ రెడ్డి 32 నెలల పాలనలో జరిగిన నష్టమే ఎక్కువ
– విధ్వంసంతో పాలన ఆరంభించాడు… రాష్ట్ర వినాశనంతో ముగించేలా ఉన్నాడు
– ముఖ్యమంత్రి దోపిడీ, అవినీతికి వ్యతిరేకంగా, భావితరాల భవిష్యత్ కోసం పోరాడే వారికి
5 కోట్ల మంది ప్రజలు అండగా నిలవాల్సిన సమయం వచ్చింది
– రాష్ట్ర ప్రజలందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు
– తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు
ఈ సంక్రాంతితో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 32 నెలలు పూర్తి అవుతుంది. ఈ పాలనను ఒకసారి విశ్లేషించుకుంటే, 5కోట్లమంది ప్రజలు ఇప్పటికే ఏవిధంగా నష్టపోయారు… భవిష్యత్ లో ఇంకెంత నష్ట పోతారనే దానిపై మనమందరం ఆలోచించుకోవాలి. సీనియర్ నాయకుడిగా, రాష్ట్రంపై బాధ్యత గల వ్యక్తిగా కొన్ని విషయాలు చెప్పాలి. నమ్మి ఓట్లేసిన ప్రజల నమ్మకాన్ని వమ్ముచేసేలా ఈ ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తోంది? భవిష్యత్ లో ఏం జరగబోతోందనేది ప్రజలకు తెలియచేయడం నా బాధ్యత కాబట్టి, ఆ విషయాలను మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎవరికివారు ఇది నావిషయం కాదు.. మీడియా, పార్టీల విషయమని, లేకపోతే కొందరికే పరిమితమని మీరు అనుకుంటే దాని వల్ల అందరూ నష్టపోతారు.
అధికారంలోకి వచ్చీ రాగానే మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్ గా మారాడు:-
ఎప్పుడైనా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఎలా చేయబోతున్నామో, ఏమేం చేయబోతున్నామో చెబుతారు. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే విధ్వంసకుడిగా మ్యాన్ ఆఫ్ డిస్ట్రక్షన్ గా మారాడు. ప్రజలకోసం, ప్రజల సొమ్ముతో ప్రజా వేదికను నిర్మిస్తే, దాన్ని నేల మట్టం చేశారు. అక్కడే కలెక్టర్ల తో కాన్ఫరెన్స్ పెట్టి, దాన్ని కూల్చేయబోతున్నామని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేటికీ కూల్చివేయబడ్డ ప్రజావేదిక శిథిలాలు అక్కడే ఉన్నాయి. ఆ చర్యను ప్రజలు అంగీకరిస్తారా? మేథావులు దానిపై ఏవిధంగా సమాధానం చెబుతారు? ప్రజావేదిక నిర్మాణంలో ఏవైనా అవకతవకలు జరిగి ఉంటే, వాటిని బహిర్గతం చేయాలి. అంతేగానీ ప్రభుత్వ ఆస్తిని అంత దారుణంగా నేలకూలుస్తారా? ఈ చర్యలో ఒక మనిషి యొక్క క్యారెక్టర్, ఉన్మాదం, స్థితి ఏమిటో అర్థమవుతున్నాయి.
అమరావతి విషయంలో మీ మాటలు, మీ చర్యలు విధ్వంసానికి పరాకాష్ట కాదా?
ప్రజారాజధాని అమరావతి కోసం 50 వేల ఎకరాల భూమిని సిద్ధం చేశాం. ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు ప్రాణసమానమైన భూములు రాజధాని కోసం ఇవ్వడమనేది ప్రపంచానికే ఆదర్శం. ఎక్కడా ఎలాంటి వివాదాలు లేకుండా, 34 వేల ఎకరాల భూమిని 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ఇచ్చారు. వారిలో అన్ని కులాల వారు, అన్ని మతాల వారు ఉన్నారు. ఇక్కడ లేనిది భూమే. అలాంటి భూమిని రాష్ట్ర ప్రయోజనాల కోసం రైతులు ఇస్తే, ఈముఖ్యమంత్రి ప్రవర్తించిన తీరు ఎలా ఉంది? ఎన్నికలకు ముందు మీరేం చెప్పారు? అమరావతి ఇక్కడే ఉంటుందని, ఇక్కడే ఇల్లు కట్టుకున్నామని చెప్పారా లేదా?
అలా చెప్పిన మీరు ఎన్నికల తర్వాత ఏవిధంగా మాట మార్చారు.. అలా ప్రవర్తించినందుకు మీకు, మీ నాయకులకు సిగ్గు అనిపించలేదా? మీ చర్యలు విధ్వంసానికి పరాకాష్టకాదా? రూ.10వేల కోట్లతో అమరావతిలో నిర్మాణాలు చేపట్టాము. ఆ సొమ్ము ప్రజల సొమ్ము కాదా? నేడు అమరావతిలోని భవనాలన్నీ పాడుపడే పరిస్థితికి తెచ్చారు. దానికి ఎవరు సమాధానం చెబుతారు? అక్కడున్న ఆస్తుల విలువ సంగతేమిటి? అమరావతి నగరాన్ని పూర్తి చేసి ఉంటే, పరిస్థితి ఇలా ఉండేదా? ఈ రోజు ముఖ్యమంత్రి
ఢిల్లీలో రెవెన్యూ లోటు గురించి మాట్లాడుతున్నారు. రూ.22వేలకోట్ల పైన లోటు ఉందంటున్నారు. అంత రెవెన్యూ లోటు ఉన్నప్పుడు సమర్థవంతంగా ఐదేళ్ల పాటు పాలన చేసి, భవిష్యత్ బాగుండాలనే దిశగా ఎలాంటి నిర్ణయాలు అయినా తీసుకున్నారా? రాష్ట్రానికి ఆస్తులను ఏర్పాటు చేయాలని, పరిశ్రమలు కావాలని, ఆదాయం రావాలని, భవిష్యత్ బాగుండాలని అమరావతి లాంటి ప్రాజెక్ట్ ను తీసుకొస్తే, మీరేం చేశారు? ప్రజలకోసం, రాష్ట్రంకోసం భూమిలిచ్చిన పాపానికి రైతులు నిత్యం అవమానాలు, వేధింపులు భరిస్తున్నారు. మీరు చేసే అరాచకాలు, ఆడవారిపై అసభ్యంగా ప్రవర్తించడం, వాటిని తట్టుకోలేక న్యాయంకోసం కోర్టులకు వెళ్లి ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో చూస్తున్నాం కదా?
పక్క రాష్ట్రంలోనే హైటెక్ సిటీ ఉంది. గతంలో సైబరాబాద్ నిర్మాణాన్ని హైటెక్ సిటీతో ప్రారంభించాము. అనతికాలంలోనే సైబరాబాద్ తో ముందుకువెళ్లి, హైదరాబాద్, సికింద్రాబాద్ లకు తోడు సైబరాబాద్ ను ప్రపంచపటంలో తెలుగుదేశంపార్టీ పెట్టింది. ఆనాడు కూడా సైబరాబాద్ ను గ్రాఫిక్స్ అని ఎగతాళిచేసుంటే, ఈరోజు హైదరాబాద్ నగరం రూపురేఖలు మారేవా? ఆనాడు నా తర్వాత అధికారంలోకి వచ్చిన మిగిలిన ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి సహా దాన్ని విధ్వంసంచేసి ఉంటే, హైదరాబాద్ ఎక్కడుండేదని ప్రశ్నిస్తున్నాం? దీనికి సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా? సమాధానం చెప్పకపోగా ఎదురుదాడి చేస్తాడు.
అందుకే ప్రజలను ఆలోచించమంటున్నాం. మేం తీసుకున్న నిర్ణయాలు, చేసిన అభివృద్ధి మీ భవిష్యతో కోసమా..కాదా? మీ పిల్లలు, భావితరాల భవిష్యత్ కోసం చేసిందా..కాదా? విధ్వంసంతో ప్రారంభించి వినాశనంతో ముగిస్తారా? మీరు చేస్తున్న అరాచకాల సంగతేమిటి? ఒకవ్యక్తి 2లక్షలకోట్ల విలువైన సంపదను విధ్వంసం చేసినప్పుడు ప్రజల్లో చైతన్యం రావాలా…లేదా? దీనికి ప్రజలే సమాధానం చెప్పాలంటున్నా. రాష్ట్రంలోని పరిస్థితులపై మేథావులు కూడా ఆలోచనచేయాల్సిన అవసరం ఉంది.
పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేయాలి:-
అమరావతి, పోలవరం రెండూ రాష్ట్రానికి రెండు కళ్లని, వాటిని పూర్తి చేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని పనులు ముమ్మరం చేశాం. మనకున్న వనరులను వినియోగించుకొనే అభివృద్ధి దిశగా, ప్రగతి దిశగా రాష్ట్రం ముందుకు పోతుందని చెప్పాం. పోలవరాన్ని జాతీయప్రాజెక్ట్ గా ప్రకటించి, దాన్ని పూర్తిచేయడానికి కేంద్రం కూడా ఒప్పుకుంది, ఆ క్రమంలోనే విభజన చట్టంలో దాని గురించి పేర్కొన్నారు. అలానే అమరావతికి కూడా కేంద్రం డబ్బు ఇచ్చింది. కేంద్రం వేసిన కమిటీనే అమరావతి ఎక్కడుండాలో నిర్ణయించింది.
మెజారిటీ ప్రజల నిర్ణయం ప్రకారమే సదరు కమిటీ వ్యవహరించింది. గుంటూరు-విజయవాడ మధ్యలో రాజధాని ఉండాలని చెప్పారు. అలాంటి అమరావతిని విధ్వంసం చేశారు. మరోపక్క పోలవరంపై ఎన్నిఆరోపణలు, ఎంత విష ప్రచారంచేశారు. పోలవరం నిర్మాణ టెండర్లు కాంగ్రెస్ హాయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పిలిచారు. ధరలు తక్కువ ఉన్నాయని కాంట్రాక్టర్లు ఎవరూ పనులు చేయడానికి ముందుకు రాకపోతే, దానిపై కేంద్ర మంత్రిని సంప్రదించాము. కాదు..కూడదు తాము రేట్లు పెంచలేము.. పాత ధరలకు ఎవరైనా ముందుకొస్తే పనులు చేయిస్తామని చెప్పాము. ఆక్రమంలో నవయుగ సంస్థ ముందుకొస్తే నిర్మాణ పనులు వారికి అప్పగించాము. అది కూడా కేంద్రమే చేసింది. .తామేమీ చేయలేదు.
కానీ ఈరోజు మీరు ఏంచేశారు? రివర్స్ టెండరింగ్ అన్నారు.. రూ.750కోట్లు ఆదాచేశామన్నారు కాని రూ.8వేలు, 10వేలకోట్లవరకు నిర్మాణంలో ఎక్కువయ్యే పరిస్థితి వచ్చింది. పోలవరం నిర్మాణంలో కాలయాపన చేశారు. కాంట్రాక్ట్ సంస్థను దొడ్డిదారిన తీసుకొచ్చారు.. రేట్లు పెంచారు. భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకొని ముందు జాగ్రత్తగా నిర్మించిన పట్టిసీమ నిర్మాణాన్ని తప్పుపట్టారు. ఈరోజు ఆ పట్టిసీమ నీరు తప్ప, మీకు మరో గత్యంతరం లేదు. ఆరోజు ప్రతిపక్షంలో ఉండి దానిగురించి విమర్శించిన మీరు, ఇప్పుడు ఎందుకు నోరెత్తడంలేదు? పోలవరం డీపీఆర్ ను ఎందుకు ఫైనలైజ్ చేయలేకపోయారు? ఆ రోజు గిరిజనులకు నోటికొచ్చినట్లు హామీలు ఇచ్చారు. ఆర్ అండ్ ఆర్, ల్యాండ్ అక్విజేషన్ గానీ, ఇతర ప్యాకేజీలు టీడీపీ ప్రభుత్వం కంటే మెరుగ్గా ఇస్తామన్నారు, ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇప్పటికీ వాటిని ఎందుకు చేయలేకపోయారు? పోలవరం 2021 డిసెంబర్ కి పూర్తిచేస్తామన్నారు… ఇప్పుడు 2022 అంటున్నారు. 2022లో అవుతుందో లేదో తెలియదు?
పోలవరం అసలు పూర్తవుతుందా అన్న ప్రశ్న ప్రజల మెదళ్లను తొలుస్తోంది? పూర్తిచేయడం మీకు చేతనవుతుందా? ల్యాండ్ అక్విజేషన్ చేశారా? దానికోసం గిరిజనులకు ఇస్తామన్నవి…చేస్తామన్నవి ఎంత వరకు పూర్తి చేశారంటే ఏమీ జరగలేదు? పోలవరంపై పూర్తి స్థాయి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయగల దమ్ము, ధైర్యం ఈ ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఉన్నాయా అని నిలదీస్తున్నా. పోలవరం అథారిటీ వారు దీన్ని క్లియర్ చేసే పరిస్థితుల్లో లేరు. నిన్నకూడా ఈ ముఖ్యమంత్రి డీపీఆర్ ను అప్రూవ్ చేయమని వేడుకుంటున్నాడు. పోలవరాన్ని 2021లోనే పూర్తిచేస్తామని గొప్పులు చెప్పిన ముఖ్యమంత్రి, మంత్రి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం. సమాధానం చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నాం.
వ్యవసాయరంగాన్ని సుస్థిరం చేయడం కోసం నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టాము. నదుల అనుసంధానంలో భాగంగా శ్రీకాకుళం వంశధార మొదలుకొని పెన్నానది వరకు అన్ని నదుల్ని అనుసంధానంచేసి, వాటిని కలిపే చర్యలు ప్రారంభించి, రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు నీళ్లివ్వాలనే గొప్ప లక్ష్యంతో ముందుకుపోయాము. దేశంలోనే మొట్ట మొదటి సారిగా గోదావరి – కృష్ణా నదులను అనుసంధానం చేశాము. గోదావరి నీటిని కృష్ణానదికి తీసుకొచ్చి, అదే నీటిని పెన్నానదికి తీసుకెళ్లడానికి టెండర్లు కూడా పిలిచాము.
నాగార్జున సాగర్ కుడి ప్రధాన కాల్వకు అనుసంధానంచేసే ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టాము. అది ఇప్పుడు ఏమైంది? ఒక్క అంగుళం అయినా ముందుకు పోయిందా అని ప్రశ్నిస్తున్నాం? తెలుగుదేశం పార్టీ హాయాంలో జలవనరుల రంగంపై రూ.64 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాము. చేసిన పనులు కళ్ల ముందు కనిపిస్తున్నా కూడా ఈ ముఖ్యమంత్రి బుకాయిస్తాడు. ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి ఎంత ఖర్చు పెట్టారో సమాధానం చెప్పగలరా? పైసా ఖర్చుపెట్టే స్థితిలో వీళ్లులేరు. ఏప్రాజెక్ట్ లో అయినా తట్టమట్టి తీశారా? కనీసం రాష్ట్రంలోఉన్న కాలువలు ప్రాజెక్ట్ లను కూడా మెయింటెన్ చేసే స్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అన్నమయ్య ప్రాజెక్ట్ ఎందుకు కొట్టుకుపోయింది? చివరి ఆయకట్టు భూములకు నీళ్లివ్వలేని దుస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది?
విధ్వంసం చేసినంత తేలికకాదు… కంపెనీలు, పరిశ్రమలు తీసుకురావడం :-
కియా, హెచ్ సీఎల్, హీరో కంపెనీలను తెచ్చాం. పరిశ్రమలు, కంపెనీలు తీసుకురావడం విధ్వంసం చేసినంత తేలిక కాదు. అవి రావడం వెనుక చాలా శ్రమ, చొరవ, ముందు చూపు ఉన్నాయి. కంపెనీల యాజమాన్యాలను ఒప్పించి, మెప్పించి వాటిని తీసుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా చేశాము. మీరే చెప్పారు అసెంబ్లీలో టీడీపీ ప్రభుత్వంలో రూ. 5 లక్షల కోట్ల పెట్టుబడులు, 5 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చాయి. మొత్తం 16 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూలు చేసుకున్నాం.
అవన్నీ రాష్ట్రానికి వచ్చి ఉంటే 30 లక్షలకు పైగా ఉద్యోగాలు వచ్చి ఉండేవి. ఒక్కో కంపెనీ రాష్ట్రం నుంచి వెళ్లిపోతూ, చచ్చినా ఇక ఆంధ్రప్రదేశ్ కు రామని తెగేసి మరీ చెప్పాయి. లులూ గ్రూప్ లాంటి సంస్థలు ఆ మాట అన్నాయంటే, రాష్ట్రంలో ఎంత విధ్వంసం జరిగిందో యువత ఆలోచించాలి. జాబ్ క్యాలెండర్ అన్నారు.. చివరకు జాబ్ లెస్ క్యాలెండర్ తయారైంది. ప్రభుత్వ ఉద్యోగాల సంగతి తరవాత ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేకుండా పోయాయి. చివరకు యువత ఉద్యోగాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసే పరిస్థితి తెచ్చారు.
ప్రజల తరుపున గొంతెత్తే ప్రతిఒక్కరిపైనా దాడులేనా? :-
కోర్టులు, శాసనసభ, ఫోర్త్ ఎస్టేట్ అయిన మీడియాగానీ, అన్నింటిపైనా దాడులు. ప్రతి ఒక్కరిపై దాడులు జరిగితే పరిస్థితేమిటి? నా రాజకీయ జీవితంలో ఇలాంటి ముఖ్యమంత్రిని చూడలేదు. ఈ ముఖ్యమంత్రిని ఎవరు వ్యతిరేకించినా, ప్రజా సమస్యలపై ఎవరు పోరాడినా, ప్రజల తరుపున గొంతెత్తినా, తమ వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించినా వారందరిపై దాడులు చేస్తున్నారు. ఆఖరికి రాజకీయ పార్టీలపై, రాజకీయ నేతలపై, పార్టీ కార్యాలయాలపై విమర్శలు, దాడులు చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి దారుణం ఎక్కడైనా చూశామా? అసలు ఇదేమీ చోద్యం? ఏ నాయకుడు ప్రజలతరుపున మాట్లాడినా వారిపై కేసులుపెట్టడం, అరెస్ట్ లు చేయడం, జైల్లో పెట్టడం, వేధించడం చేస్తున్నారు.
రైతులకు ఆత్మహత్యలు తప్ప మరోమార్గం లేకుండా చేశారు :-
రైతుల ఆత్మహత్యల్లో ఆంధ్రప్రదేశ్ ది దేశంలోనే మూడోస్థానం. కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండోస్థానం. వరిరైతులకు గిట్టుబాటు ధరలేదు. ఆఖరికి రాష్ట్రంలో పండే ఏ ఉత్పత్తులకు ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర లేదు. చివరకు రాష్ట్రంలో వరివేయవద్దని చెప్పిన ఏకైక ప్రభుత్వం ఈ వైసీపీప్రభుత్వం. భారతదేశానికి ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం అన్నపూర్ణ. దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రంలో వరివేయొద్దనే పరిస్థితికి వచ్చారంటే మీరు ఎలాంటి స్థితిలోఉన్నారో ఆలోచించుకోండి. తిరిగి కోలుకోలేని విధంగా రైతులు మొత్తం ఈ ప్రభుత్వంలో దారుణంగా నష్టపోయారు.. పోతున్నారు. చివరకు విధిలేక, అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వస్తున్నారు.
మీ పిల్లలు అమెరికాలో, ఇంగ్లాండ్ లో చదవాలా..పేదపిల్లలు విదేశాల్లో చదవకూడదా? :-
భగవంతుడు కొందరికి ఆస్తులు ఇస్తే, తెలివితేటలు మాత్రం సమానంగా ఇచ్చాడు. ఆ తెలివితేటలు వినియోగించుకొని జీవితంలో ఎదగాలనుకుంటే విద్య చాలా అవసరం. అలాంటి విద్యారంగంలో అవినీతిని కేంద్రీకృతం చేశారు. ఇంగ్లీష్ మీడియం, నాడు-నేడు అన్నారు. ఆ పేరుతో 6 నుంచి 7 వేల కోట్ల వరకు ఖర్చు పెట్టారు. ఆసొమ్మంతా ఏమైందంటే సమాధానం చెప్పరు. రంగులకు రూ.3వేలకోట్లకు పైగా తగలేశారు. అదీ మీరు రెండున్నరేళ్లలో విద్యారంగంలో సాధించిన ప్రగతి. విద్యా రంగంలో అవినీతిని కేంద్రీకృతం చేశారు. ఆఖరికి డోర్ ఫ్రేమ్, చిన్నస్విచ్ కావాలన్నా జగన్ రెడ్డి చెప్పిందే కొనాలి.
నాసిరకం వస్తువులతో హోల్ సేల్ కరెప్షన్ కు తెరలేపి, డబ్బులు తినేశారు. రెండో తరగతి వరకు అంగన్ వాడీ స్కూళ్లలో కలిపేశారు. మూడో తరగతి నుంచి హైస్కూళ్లలో అంటున్నారు. ఆ పని చేసే వరకు ప్రధానోపాధ్యాయులకు కూడా తెలియదు. నాడు-నేడు పేరుతో మీరుచేసింది ప్రజాధనం దుర్వినియోగంకాదా? ఎవరిచ్చారు మీకు ఆ అధికారం? జ్ఞానముండే మాట్లాడుతున్నారా? ఎక్కడైనా సరే ప్రపంచంలో ఇంగ్లీషు చదివినవారికే ఉద్యోగాలు వచ్చాయా?
అమెరికాలో అందరూ ఇంగ్లీషు మాట్లాడతారు. ఇంగ్లాండ్ లో ఇంగ్లీష్ పుట్టింది. అక్కడందరూ ఉద్యోగాలుచేస్తున్నారా? ఇండియా నుంచి వెళ్లినవారు అక్కడ ఉద్యోగాలు చేయడం లేదా? ఇండియాలో చదువుకున్నవారంతా సాధారణ పాఠశాలల్లో చదవలేదా? భాష అనేది కేవలం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించేది.. నాలెడ్జ్ (జ్ఞానం) అనేది చదువుద్వారా వచ్చేది. అలాంటి నాలెడ్జ్ ను బలిపశువుని చేసి, రాబోయే రోజుల్లో పేదపిల్లలు చదువుకునే అవకాశం లేకుండా, వారిభవిష్యత్ ను అంధకారం చేశారు. పేద విద్యార్థల కోసం తాము విదేశీ విద్యను తీసుకొస్తే, దాన్ని తీసేశారు. మీ పిల్లలు మాత్రం ఇంగ్లాండ్ లో, అమెరికాలో చదవాలా… పేద పిల్లలు మాత్రం ఉపాధ్యాయులు, వసతులు లేని పాఠశాలల్లో చదవాలా? ఆఖరికి చిన్న పిల్లలు నాడు-నేడు వద్దు.. మా బడే మాకు ముద్దు అంటూ రోడ్లెక్కే పరిస్థితి వచ్చింది. దానికి కారకులు మీరు కాదా? చిన్నచిన్నపిల్లలు చదువుకోసం మూడు నాలుగు కిలోమీటర్లు నడిచి వెళ్లే పరిస్థితికి కారకులు మీరుకాదా?
రాష్ట్రంలో రోడ్లు, ఇళ్లనిర్మాణంపై ముఖ్యమంత్రి ఏంచెబుతాడు? కాంట్రాక్టర్లు బిచ్చమెత్తుకోవడానికి కారకులు మీరుకాదా? :
పేదలకోసం నిర్మించిన ఇళ్లను వారికి ఇవ్వకుండా పాడుపెట్టి, వారు ఉంటున్నఇళ్లనుంచి ఓటీఎస్ పేరుతో వసూళ్లుచేస్తారా? మీరు నెలకో, సంవత్సరానికో వేసే డబ్బులు ఎవరికికావాలి….రోడ్లు వేయండని ప్రజలు మొత్తుకుంటున్నారు. సాధారణ పౌరుడు రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై వాపోతున్నాడు. రోడ్లు నాగరితకు చిహ్నాలు. రోడ్లు బాగుంటే ప్రజ లఆరోగ్యంతో పాటు, ఇంధన వినియోగం మెరుగవుతుంది. ఎక్కడైనా ఒకరికి ప్రసవం కావాలంటే, ఆసుపత్రికి బదులు ఇప్పుడున్న రోడ్లపైకి తీసుకెళ్లండి అని ప్రజలే ఛలోక్తులు విసురుతున్నారు. రోడ్లు అధ్వాన్నంగా ఉంటే వాహనదారులు నష్టపోరా? రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రావడం లేదు. రూ.70నుంచి రూ.80వేలకోట్లవరకుకాంట్రాక్టర్లకు చెల్లించాల్సింది ఎగ్గొట్టారు. దాంతో కాంట్రాక్టర్లంతా భిచ్చమెత్తుకునే పరిస్థితి వచ్చింది. ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి తాము సంపాదించుకున్న సంపద అంతా ఆవిరైందని… చివరకు మా ఆస్తులు కూడా తాకట్టు పెట్టామని, ఈ ముఖ్యమంత్రి వచ్చాక తమ పరిస్థితి ఇలా అయిందని బావురుమంటున్నారు. వారి వేదనపై, రాష్ట్రంలోని రోడ్ల దుస్థితిపై ముఖ్యమంత్రి ఏంసమాధానం చెబుతాడని ప్రశ్నిస్తున్నాం.
గేటెడ్ కమ్యూనిటీ తరహాలో పేదలకోసం అన్నిహంగులతో అమరావతిలో నిర్మించిన ఇళ్లను వారికి ఇవ్వకుండా ఎందుకు పాడుపెట్టారు? కేంద్ర ప్రభుత్వ పథకంతో కలిపి, రాష్ట్రప్రభుత్వ వాటాగా కొంతవేసుకొని, పేదవాడికి ఒకఆస్తి ఇవ్వాలన్న సదుద్దేశంతో స్లమ్ ఏరియాల్లా ఉండకూడదని, ఒకమంచి ఆలోచనతో గేటెడ్ కమ్యూనిటీ ఇళ్లను తమప్రభుత్వంలో నిర్మించాము. అలాంటి 2లక్షల70వేలఇళ్లు నివాసానికి సిద్ధంగా ఉంటే, వాటిని పేదలకు ఇవ్వకుండా పాడుపెట్టారు. ఆ ఇళ్లనే మీరు కరోనాకేంద్రాలుగా ఉపయోగించుకున్నారు. ఇళ్ల విషయంలో పేదలను ఉద్ధరించి, తానేదో ఇచ్చినట్లుగా ఈ ముఖ్యమంత్రి చెబుతున్నాడు. ఈయన ఇచ్చానంటున్న నవరత్నాలకంటే మేలైన 100రెట్ల నవరత్నాలను టీడీపీప్రభుత్వం పేదలకు ఇచ్చింది. ఆలెక్కలన్నీ వాస్తవాలతో సహా చెబుతాం.. ఈ ముఖ్యమంత్రి తన పాలన లో ఏంచేశాడో చెప్పగలడా? స్వాతంత్ర్యం వచ్చినప్పటినుంచీ పేదప్రజలు పొందినలబ్ధి, వారికోసం అమలుచేసిన సంక్షేమకార్యక్రమాలన్నీ ఈయనే చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నాడు.
పాతసారాను కొత్తసీసాలో పోస్తూ పేదలను నమ్మించి, వారిని మరింత వంచనకు గురిచేస్తున్నాడు. ఎవరైనా ఈ రాష్ట్రంలో, ఆఖరికి దేశంలో పేదలద్రోహి ఎవరైనా ఉన్నాడంటే అది జగన్మోహన్ రెడ్డే అనిచెప్పడంలో ఎలాంటి సందేహంలేదు. పేదలు, సాధారణ, మధ్యతరగతి వారిపై పన్నులబాదుడు. పెట్రోల్, డీజిల్ నిత్యావసరధరలపెంపుతో పాటు, ఆఖరికి చెత్తపై, మరుగుదొడ్లపై, మంచినీటిపై కూడా పన్నులువేశాడు. ఎవరికీ ఇలాంటి ఆలోచనలురాలేదు. రూ.5 అన్నం పెట్టిన అన్న క్యాంటీన్లు ఎందుకు మూసేశాడు? తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రలో పేదలకోసం క్యాంటీన్లులేవా? ఇప్పడు ఆయారాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు, అక్కడ వాటిని మూసేయలేదేం? పేదలు కడుపు నిండా తింటేనే ఓర్చుకోలేని మీరు… పేదలను ఉద్ధరిస్తున్నామని చెప్పుకోవడానికి సిగ్గు అనిపించడంలేదా?
ఈ ముఖ్యమంత్రి పుట్టకముందు ఇచ్చిన ఇళ్లకు కూడా, ఇప్పుడు డబ్బులు కట్టాలా? :-
ఇళ్లపేరుతో దోపిడీకి సిద్ధమయ్యాడు. ఇప్పుడున్న ఈవ్యక్తి పుట్టకముందు ఇచ్చిన ఇళ్లపట్టాలు, స్వర్గీయ ఎన్టీఆర్ గారి హాయాంలో పేదలకు ఇచ్చినఇళ్లు, వాటితాలూకా పట్టాలు.. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చిన పట్టాలు… ఈ ముఖ్యమంత్రి తండ్రి బతికున్నప్పుడు ఆయనిచ్చిన ఇళ్లపట్టాలు అన్నింటినీ కలిపి ఓటీఎస్ పేరుతో దోపిడీకి తెరలేపాడు. ఆదోపిడీపై ఎవరైనా ప్రశ్నిస్తే స్వచ్ఛందమని అబద్ధాలు చెప్పడం, ప్రశ్నిం చినవారిపై దాడిచేసేవరకువచ్చారు. దానికి ఏంసమాధానం చెబుతాడు ఈ ముఖ్యమంత్రి? తమప్రభుత్వంలో ఉచితంగా ఇసుకఇస్తే, దానిపై నోటికొచ్చినట్లు విమర్శలు చేశారు. మరిప్పుడు మీరు అదే ఇసుకను అడ్డగోలుగా దోపిడీ వనరుగా మార్చుకున్నారు. పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు మొదలు కింది స్థాయి వైసీపీ నేతల వరకు దోపిడీలో మునిగి తేలుతున్నారు.
తమ హయాంలో లారీ ఇసుక రూ.10వేలు అమ్మితే, ఇప్పుడు అదే లారీ ఇసుకను రూ.50వేలకు అమ్ముతున్నారు. 5 రెట్ల వరకు ధర పెంచి దోపిడీ చేస్తున్నది నిజంకాదా? దీనిపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నిస్తున్నాం? దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి విద్యుత్ అనేది లెక్కకట్టి, ఇప్పుడు విద్యుత్ ఛార్జీల పేరుతో బాదేస్తున్నాడు. ఇప్పటివరకు ఆరుసార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాడు.. రేపోమాపో మరోసారి పెంచబోతున్నాడు. శ్లాబులు అని, యూనిట్లు అని కొత్త కొత్త ఆలోచనలతో పెంచుకుంటూ పోతున్నాడు.
ఒక్కరోజే రూ.124కోట్ల మద్యం అమకాలు జరపడమేనా మద్యపాన నిషేధం అంటే? :-
మద్యం ధరలు చూస్తే రూ.60లు అమ్మే సీసాను రూ.270కి అమ్ముతున్నారు. జగన్ రెడ్డి పేరుతో ప్రైవేట్ బ్రాండ్లు తీసుకొచ్చారు. మద్యం డిస్టిలరీలన్నీ వీరికి, వీళ్లమనుషులకు చెందినవే. మద్యంతయారీ, రవాణా, అమ్మకాలు అంతావీళ్లే చేస్తున్నారు. మద్యంపై అయిన కాడికి దోచుకోవాలనే ఉద్దేశంతోనే దుకాణాల్లో ఆన్ లైన్ చెల్లింపులు లేకుండాచేశారు. డిజిటల్, ఆన్ లైన్ చెల్లింపులుఉంటే దోపిడీలెక్కలు తెలుస్తాయని అవిలేకుండా చేశారు. కిరా ణాకొట్లు, ఆఖరికి టీబంకుల్లో కూడా ఆన్ లైన్ చెల్లింపులు ఉన్నాయి. ఈ ముఖ్యమంత్రి మాత్రం మద్యం దుకాణల్లో వాటిని లేకుండాచేశాడు. నిన్నా..మొన్నా ఏదో న్యూఇయర్ గిఫ్ట్ అంటూ వేరేరాష్ట్రాల్లోని మద్యంబ్రాండ్లను తీసుకొచ్చి, ఇక్కడ అమ్మమనిచెప్పాడు.
ఇప్పుడు కొత్తగా న్యూఇయర్ అని తీసుకొచ్చిన బ్రాండ్లను ఇన్నాళ్లు ఎందుకు బ్యాన్ చేశారు? ఇప్పుడెందుకు తీసుకొచ్చారు? మీరు దోచుకోవాల్సింది దోచుకొని లెక్కలన్నీ సరిపోయాయ ని నిర్ధారించుకున్నాక , ఇప్పుడు వాటిని అమ్ముతారా? నాసిరకం మద్యంతో ఎంతనాశనం చేశారో తెలుసా? కల్తీ, నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడి, వారి జీవితాలు నాశనం చేశాక, దోచుకున్నది దోచుకున్నాక, ఇప్పుడు అన్నిరకాల బ్రాండ్లు అమ్ముతామం టారా? నాసిరకం మద్యం అమ్మకాలరూపంలో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సొమ్మంతా ముఖ్యమంత్రి ఇంటికే చేరింది. మద్యపాన నిషేధం అన్నాడు.. దశలవారీగా చేస్తానని ఆడబిడ్డలను నమ్మించి, వంచించాడు. మొన్న కొత్తసంవత్సరం ఒక్క రోజునే దాదాపు రూ.124 కోట్ల వరకు తాగారు. అదేనా మద్యపాననిషేధం?
ఒక్కరోజులో రూ.124కోట్ల విలువైన మద్యం తాగితే సిగ్గు అనిపించలేదా మీకు? కరోనా సమయం కంటే మంచి సమయం మద్యపాన నిషేధానికి ఉందా? కానీ ఆ సమయంలో ఉపాధ్యాయులను మందుషాపుల ముందుపెట్టి, మద్యం తాగే వారిని నియంత్రించమని చెబుతారా? ఏంపనులు అంతకంటే నీచమైంది ఇంకోటి ఉందా?… సిగ్గుందా మీకు?
మద్యం దోపిడీ అలా ఉంటే, మరోపక్కన గంజాయి, మాదకద్రవ్యాలఅమ్మకాలు స్మగ్లింగ్. మొన్నటికి మొన్న కూడా తమిళనాడులో ఒకకేసు నమోదైతే, దానివిచారణ కోసం ఏపీకి వచ్చారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ గంజాయిసాగు, అమ్మకాలుజరుగుతున్నాయో చూసే పరి స్థితికి వచ్చారు. వాటిపైనే కదా తాముప్రశ్నించాము.
గంజాయి, హెరాయిన్, ఇతర మాదక ద్రవ్యాలను నియంత్రించండి…యువత నాశనమవుతున్నారని ప్రశ్నిస్తే, మాకార్యాలయంపై నా, నాయకులపైనా దాడులుచేస్తారా? చివరకు రాష్ట్రాన్ని డ్రగ్సాంధ్రప్రదేశ్ గా మారుస్తారా? అడిగేవాళ్లు లేరని, ఏంచేసినా చెల్లుబాటు అవుతుందని ఇష్టానుసారం ప్రవర్తిస్తారా? మీ విధానాలు, దోపిడీతో రాష్ట్రంపరువుపోతుంటే, మేం, ప్రజలు సిగ్గుతో తలవంచుకుంటున్నా.. మీకు మాత్రం సిగ్గులేదు.
భారతి సిమెంట్ ధరల సంగతేమిటి? ఎందుకు రేట్లు పెంచుకున్నాడు ఈముఖ్యమంత్రి? రూ.250 నుంచి రూ.450లకు పెంచుకున్నాడు ఈ ముఖ్యమంత్రి. మద్యం దుకాణాల్లో ఎందుకు కాక్ టెయిల్ తీసుకొచ్చాడు? చీప్ లిక్కర్ ను ఎందుకు రూ.50కు అమ్మడంలేదు? తక్కువధరకు సరఫరా చేయొచ్చుకదా? పవర్ ప్రాజెక్ట్ ఉంది కదా…దాన్నుంచి వచ్చే విద్యుత్ ను ప్రజలకు ఉచితంగా ఇవ్వవచ్చు కదా? సాక్షిపేపర్ ను ఉచితంగా ఎందుకు ఇవ్వ రు? రాష్ట్రంలో ఏంజరిగినా సరే సాక్షిపత్రికకు, ఛానల్ కు ప్రకటనలు ఇవ్వాలా? ఎంత దోచిపెడతారుఅలా? అధికారంలోకి వచ్చినప్పటినుంచి నిత్యావసరాలధరలు విపరీతంగా పెంచారు. ప్రజలు సంక్రాంతిపండుగ చేసుకోలేని స్థితిలో ఉన్నది నిజంకాదా?
ధైర్యముంటే నిత్యావసరాలు, పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించండి :-
కందిపప్పు రూ.74నుంచి రూ.110కి, పెసరపప్పు రూ.75నుంచి రూ.110కి, మినప్పప్పు రూ.65నుంచి రూ.125కి, వేరుశనగపప్పు రూ.80 నుంచి రూ.140కి, వేరుశనగనూనే రూ. 106 నుంచి రూ.180కి, పంచదార రూ.25నుంచి రూ.50కి, చింతపండు రూ.122నుంచి రూ.350వరకు పెంచారు. పెట్రోల్ రూ.76 నుంచి రూ.110కి, డీజిల్ రూ.70నుంచి రూ.102 కు పెంచారు. గ్యాస్ సిలిండర్ ధర రూ.724 నుంచి రూ.874కు పెంచారు. మద్యం సీసా రూ.60 నుంచి రూ.160కి, లారీ ఇసుక రూ.10వేలనుంచి రూ.50వేలకు పెంచారు. ఆఖరికి ఏపీ ఫైబర్ నెట్ ఛార్జీలను కూడా పెంచారు. తమప్రభుత్వంలో నెలకు రూ.49అయితే, దాన్ని రూ.350కు పెంచారు. ఇదంతా ఏమిటి..దోపిడీకాదా? ఇప్పుడు చెప్పండి ఎవరుప్రజా ద్రోహులో? ఏమైనా ప్రశ్నిస్తే కేసులుపెడతారా? మీకు ధైర్యముంటే నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించండి. అంతేగానీ కేసులుపెట్టి భయపెట్టాలనిచూస్తే ఊరుకోము.
రాష్ట్రంపై 7లక్షలకోట్ల అప్పుచేశారు, ఎంతఅప్పుతెచ్చి, ఎంత ప్రజలకు ఇచ్చారో చెప్పండి :-
ఇంకో పక్క రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఇష్టమొచ్చినట్లు అప్పులు చేయడం.. సీఏజీ (కాగ్) అడిగితే లెక్కలుచెప్పకుండా తప్పించుకోవడం. ఈరోజుకి రూ.7లక్షలకోట్లవరకు అప్పు రాష్ట్రానికి ఉంది. 2019నాటికి రూ.3లక్షల14వేలకోట్ల అప్పులుంటే, ఇప్పుడు దాన్ని ఈముఖ్యమంత్రి, ప్రభుత్వం కలిసి రూ.7లక్షలకోట్లకు చేర్చే పరిస్థితికివచ్చారు. 4వ తేదీ వచ్చినా ఉద్యోగులకు జీతాలు, పింఛన్ దారులకు పింఛన్లు లేవు. ఆఖరికి రోడ్లు వేయడానికి కూడాడబ్బులులేవు. అప్పులివ్వడానికి బ్యాంకులు బెంబేలెత్తుతున్నాయి. ఇంతఅప్పు చేసి ఏంచేశారయ్యా అంటే ప్రజలకు ఇచ్చాము.. సంక్షేమం చేశామని చెప్పుకుంటున్నారు.
ఇప్పటివరకు ఎంత అప్పుతెచ్చారో.. ఎంత ప్రజలకు ఇచ్చారో లెక్కలు చెప్పండి. అప్పులు, వాటిఖర్చుల తాలూకా వివరాలపై తక్షణమే ఈ ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదలచేయాలి. ఇష్టమొచ్చినట్లు చేసిన అప్పులను జగన్ రెడ్డి తీరుస్తాడా? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు తీరుస్తారా? ప్రజలే కదా తీర్చాల్సింది. రాబోయే రోజుల్లో పుట్టబోయే పిల్లలను కూడా అప్పులతో పుట్టే పరిస్థితికి కారకులు మీరుకాదా? ఈ ముఖ్యమంత్రి చేసిన, చేస్తున్న అప్పులను ప్రజలే తీర్చాలి. వారినుంచే వసూలుచేస్తున్నారు. ఆ విషయం ప్రజలకు ఎందుకు అర్థంకావడంలేదని ప్రశ్నిస్తున్నాం. సాధారణంగా జీఎస్డీపీపై వ్యక్తులు, వారికివచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకొని ట్యాక్సులు వేస్తాం. దానిద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తూంటుంది.
అలాకాకుండా దేశంలోనే అప్పులతో నెట్టుకొచ్చే రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉంది. 36.46శాతం అప్పులతో అన్ని రాష్ట్రాల కంటే ఏపీనే దేశంలో ముందుంది. వీళ్లుచేసిన అప్పులదెబ్బకు కేంద్రప్రభుత్వం కూడా ఇష్టానుసారం పన్నులువేయకుండా జీఎస్డీపీని రేషనలైజ్ చేసింది. దాంతో ఈ ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు. అందుకే ఆఖరికి విద్యుత్ ఛార్జీలు పెంచడం, పెట్రోల్, డీజిల్ ధరలుపెంచడం, చెత్తపై, మరుగుదొడ్లపై, ఇళ్లపై, మంచినీళ్లపై పన్నులేస్తూ, బాదుడే బాదుడు అంటూ ప్రజలను రెండుచేతులతో బాదేస్తున్నా రు. ఇలా చేస్తే ఏవిధంగా సస్టెయినబులిటీ వస్తుందని ప్రశ్నిస్తున్నాం. ముఖ్యమంత్రికి మాత్రం కోట్లకుకోట్లు ఆదాయంరావాలి.. బ్లాక్ మనీ అంతాపోగేసుకోవాలి.. ప్రజలు మాత్రం అప్పులు తీరుస్తూ, సర్వనాశనం కావాలా? ఇదేమిన్యాయమని ప్రశ్నిస్తున్నాం?
2017-18లో రెవెన్యూలోటు రూ.22వేల కోట్లు ఉంటే, దాన్ని ఎఫ్ఆర్ బీఎం ప్రకారం ఇంకా తగ్గించి, భవిష్యత్ లో ఆర్థిక విషయాల్లో పద్ధతి ప్రకారం నడుచుకున్నాం. రాష్ట్రానికి సంపదసృష్టించడంకోసం అమరావతి, పరిశ్రమలను తీసుకొచ్చాం. రాష్ట్రంలోని వనరులను ఉపయోగించుకొని సంపద సృష్టించే మార్గాలను తెలుగుదేశంప్రభుత్వం చేస్తే, ఈ ముఖ్యమంత్రి వచ్చాక రాష్ట్రంలో విధ్వం సం అప్పులు తప్పమరోటి కనిపించడంలేదు. ఈయన చేసే అప్పులు ఎవరుతీర్చాలి.. చదువుకున్నవారంతా ఉద్యోగాలు, ఉపాధికోసం బయటకు వెళ్లిపోతారు. అంతిమంగా ఇక్క డ ఉండే పేదలేకదా నష్టపోయేది. ఆఖరికి మీరుతినేతిండి గింజలుసహా, వాడుకునే వస్తువులు, విద్యుత్, బస్సుఛార్జీలపై, విద్యపై, వైద్యంపై పన్నులేసి దోపిడీచేస్తారు. ఈ విధంగా దుర్మార్గంగా దోచుకోవడానికి సిద్ధమయ్యారు.
ఈ ముఖ్యమంత్రి ఒక ప్రొఫెషనల్ లయ్యర్ :-
ఈ ముఖ్యమంత్రి ప్రతీది క్రిమినలైజేషన్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. పెద్ద ప్రొఫెషనల్ లయ్యర్ గా మారాడు. క్రిమినలైజేషన్ చేస్తూనే దానిపై మాట్లాడేవారిపై దాడిచేయడం, కేసులుపెట్టడం. ఈ ముఖ్యమంత్రి ఏంచేస్తున్నాడో, ఎంత అప్పుచేస్తున్నాడో కేంద్ర ప్రభుత్వానికి, కాగ్ కి కూడా చెప్పడు. అన్నీ అసత్యాలుప్రచారంచేయడం.. పూటకో రకంగా మాట్లాడటం చేస్తున్నాడు. అన్నీ తప్పుడు లెక్కలే, ఎక్కడా వాస్తవాలు చెప్పడు. నిన్ననే ఈ ముఖ్యమంత్రి చెప్పాడు.. మాకు రూ.45వేలకోట్లు ఇస్తామనిచెప్పి రూ.17వేలకోట్లే ఇచ్చారని, మిగిలింది కట్ చేశారని. దేనికి కట్ చేశారో మాత్రంచెప్పడు. ఎందుకు కట్ చే శారో చెప్పాలి కదా? ఏదైతే ఎఫ్ఆర్ బీఎం నిబంధనలు వయలేట్ చేస్తూ, అప్పులకు సంబంధించిన నిబంధ నలన్నీ ధిక్కరించి రూ.45వేలకోట్లు అప్పులుతెస్తే, దానిపై కేంద్రానికిఫిర్యాదులు వెళ్లాయి.
వారు అంతా పరిశీలించి, మీరుచేసింది కరెక్ట్ కాదు.. తప్పనిచెప్పి రుణాల్లోకోతపెడితే, కాదు కుయ్యో…మొర్రో అంటూ కొత్తనాటకాలు ఆడుతున్నారు. చివరకు కాళ్లావేళ్లా పడి రెండు, మూడేళ్లలో సర్దుబాటు చేస్తామనిచెప్పుకునే పరిస్థితికవచ్చారు. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మోసంచేసి అప్పులుతెచ్చేవరకు వచ్చారు. ఒక అబద్ధాలకోరు ముఖ్యమంత్రి, లెక్కలేని తనం ఎలా ఉంటుందో చూడండి.
వివేకానందరెడ్డి హత్యజరిగినప్పుడు దాన్ని గుండెపోటుగా చూపించింది అబద్ధాలు, అసత్యాల అసాక్షి. ఇప్పుడుఏమైంది? ఆనాడు తాము విచారణకోసం సిట్ ను నియమిస్తే, సీబీఐ విచారణ కావాలని కోర్టుకువెళ్లారు. అప్పుడు చెల్లితో ఉన్నట్టు నటించి, ఆమెను మభ్య పెట్టి, ఎన్నికలు అయ్యాక సీబీఐ విచారణ అవసరంలేదని కోర్టుకుచెప్పి తప్పుకున్నారు. అధికారంలోకి వచ్చాక తామువేసిన సిట్ ను కాదని, మరో సిట్ వేయడం, పదేపదే విచారణ అధికారులను మార్చడం చేశారు. ఇదంతాచూశాక ఆయన చెల్లెలు కోర్టుకువెళ్లి సీబీఐ విచా రణ జరిగేలాచేస్తే, ఆచెల్లెలపై చనిపోయినవ్యక్తి కుటుంబసభ్యులపై కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. దోషులకు రాష్ట్రప్రభుత్వమే రక్షణకల్పించడం, సీబీఐపైఎదురుదాడిచేయడం … ఏమిటి ఇవన్నీ?
ఎక్కడైనా..ఏనాడైనా చూశామా? భయంకరంగా గొడ్డళ్లతో ఇష్టానుసారం దారుణంగా చంపేస్తే, అలాంటి వ్యక్తులను సమర్థిస్తారా? నిన్నఢిల్లీకి వెళ్లారు దేనికోసం వెళ్లా రు? వివేకానందరెడ్డిహత్యకేసు నుంచి ఎలాతప్పించుకోవాలనే దానికోసం ఢిల్లీ వెళ్లారు.. మీపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులనుంచి తప్పించుకునే ప్రయత్నాల్లోభాగంగా వెళ్లారు.నేను అడుగుతున్నా ఈముఖ్యమంత్రిని.. ప్రత్యేకహోదా ఏమైంది.. పోలవరంఏమైందని? అదే సమయంలో అమరావతిని ఏంచేశారు? కేంద్రప్రభుత్వం మెడలువంచి రాష్ట్రానికి రావాల్సిన వాటిని తీసుకొస్తామన్నారు.
ఈ రెండున్నరేళ్లల్లో ఏం తీసుకొచ్చారు… రాష్ట్రానికి ఏం ఒరగబెట్టారో శ్వేతపత్రం విడుదలచేయగలరా అని ఈ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తున్నాం. విశాఖ పట్నానికి రైల్వేజోన్ రాకపోయినా, ఉక్కుఫ్యాక్టరీ అమ్మేస్తున్నా దానిపై స్పందించలేని దుస్థి తిలో ఉన్నారు. అబద్ధాలతో ప్రజలను మోసగించడం కాదా?. మీది రాజకీయ అవకాశవాదం కాదా? వీటన్నింటిపై సమాధానం చెప్పాల్సిందేనని ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా.
అప్పుడేమో సీపీఎస్ వారంలో అవుతుందని… ఇప్పుడేమో రాష్ట్రబడ్జెట్ చాలదంటారా?:-
అమరావతిపై ఎన్నిసార్లు మాటమార్చాడు ఈముఖ్యమంత్రి. అలానే సీపీఎస్ రద్దు గురించి ఏవేవో చెప్పారు.. అదెంతపని సింపుల్ .. వారంలో అవుతుంది అన్నారు. ఇప్పుడేమో సాక్షి గుమాస్తా చెబుతాడు.. రాష్ట్ర బడ్జెట్ మొత్తంకూడా దానికి సరిపోదంటున్నాడు. ఇది మోసం కాదా.. దగాచేయడంకాదా? వీళ్లంతా అబద్దాలకోరులుకారా? ప్రజలు వీళ్లను ఎలానమ్మాలి అని ప్రశ్నిస్తున్నాం.
మోసాలకు, అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ ఈ ముఖ్యమంత్రి :-
వ్యక్తులు కాదు.. ముఖ్యమంత్రి హోదా ముఖ్యం. అబద్ధాలకు, మోసాలకు బ్రాండ్ అంబాసిడర్ ఈ ముఖ్యమంత్రి. ఇలాంటి వ్యక్తి వల్ల రాష్ట్రం బ్రాండ్ ఏమవుతోంది? మాట్లాడేవారందరిపై కేసు లు పెట్టుకుంటూ, జైళ్లలో వేస్తూపోతారా? నిన్న ఎన్టీఆర్ విగ్రహంపై దాడి. అక్కడజరిగిన దానికి నిరసనతెలియచేయడానికి వెళ్లిన మావాళ్లను అరెస్ట్ చేస్తారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని వదిలేస్తారా? ధ్వంసంచేసిన వారిపైఏం చర్యలు తీసుకున్నారో చెప్పండి. మా పార్టీ కార్యాలయంపై దాడిచేసినవారే వంగవీటి రాధా ఇంటిదగ్గర రెక్కీ నిర్వహిస్తే ఏం లేదని చెబుతారా?
మాపార్టీ కార్యాలయంపై దాడిచేసినవారి వివరాలు, వీడియోలు, ఇతర ఆధారా లను డీజీపీకి ఇస్తే ఆయనేంచేశారు? ఈడీజీపీ బెస్ట్ ఇండియాలోనే బెస్ట్ డీజీపీనా? ఇలాంటి బ్రహ్మండమైన డీజీపీకి మేమంతా సన్మానంచేయాలి. ఐపీఎస్ కు అర్హుడుకాడు ఈ డీజీపీ?
ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్నవారంతా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి దుర్మార్గులు పదవు ల్లోకి వస్తారని గ్రహించే,ఆనాటి రాజ్యాంగనిపుణులు బాగాఆలోచించి, బ్రిటీష్ విధానాలను కొన సాగిస్తూనే ఆల్ ఇండియా సర్వీసులను తీసుకొచ్చారు. అడ్మినిస్ట్రేషన్ కోసం ఐఏఎస్, లా అండ్ ఆర్డర్ కోసం ఐపీఎస్, ఫారెస్ట్ మేనేజ్ మెంట్ కోసం ఐఎఫ్ఎస్, రెవెన్యూకోసం ఐఆర్ ఎస్ వంటి వ్యవస్థలను తీసు కొచ్చారు. అలాంటి అధికారులే ఈనాడువెన్నెముక లేకుండా ప్రవర్తి స్తున్నారు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఊడిగం చేస్తారా? చట్టాన్ని రాజ్యాంగాన్ని లెక్కచేయరా?
దేవాలయాలపై దాడులు చేస్తారా మీరు? దానికి సమాధానంచెప్పరా? వంశపారంపర్యంగా ఆస్తులు ఇచ్చి, దేవాలయాలను కాపాడుతున్నవారిపై దాడులుచేస్తారా? రేపు భవిష్యత్ లో ఎవరైనా సరే ఆలయాలకు భూములిస్తారా? ఆఖరికి మదరసాలపై కూడా దాడులు చేస్తారా? ప్రశ్నించేవారిని చంపేస్తారా? అవినీతికోసమే అప్పులు చేస్తున్నారు. అవినీతికోసం అప్పులు చేస్తున్న ఏకైక రాష్ట్రం ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ ఒక్కటే. ప్రమాణస్వీకార సమయంలో ట్రాన్స్ పరెంట్ ప్రభుత్వం తీసుకొస్తామని పెద్దపెద్ద మాటలుచెప్పారు. ఆఖరికి జీవోలు కూడాబయట పెట్టలేని స్థితికి వచ్చారు. మీ జీవోల్లో రహస్యం ఉంటే మీరు తప్పుచేస్తున్నట్లే లెక్క. దొంగ పనులు చేస్తేనే జనాలకు తెలియకుండా జీవోలు దాచేస్తారు. కోర్టులు మొట్టికాయలు వేసేవరకు జీవోలు బయటపెట్టలేదంటే మీరు ఎంతబరితెగించారో అర్థమవుతోంది.
రాష్ట్ర విభజన కంటే జగన్ రెడ్డి పాలనవల్లే ఏపీకి ఎక్కువనష్టం జరిగింది: –
రాష్ట్ర విభజనవల్ల జరిగిన నష్టంకంటే, జగన్మోహన్ రెడ్డి ఈ 30నెలల్లో చేసిన అవినీతి, లూఠీతో నే రాష్ట్రం ఎక్కువగా నష్టపోయింది. విధ్వంసకుల పాలనలో ప్రజలు ఎంత దగాపడ్డారో అంత దగాపడ్డారు. వ్యవస్థలన్నీనిర్వీర్యమైపోయాయి. కోలుకోలేని విధంగా ప్రజలందరం దారుణం గా దెబ్బతిన్నాం. రాష్ట్రానికి ఇప్పుడొచ్చిన బ్రాండ్ దెబ్బకు ఎవరూకూడా ఏపీవైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. ఇలాంటి రాష్ట్రం అనితెలిశాక ఎవరైనాసరే భయపడిపోతున్నారు. ఈ విధంగా రాష్ట్రం ఇంతదారుణంగా నాశనం కావడానికి ప్రథమముద్దాయి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 5కోట్లమంది ప్రజలను మోసంచేసిన, దగాచేసిన వ్యక్తి జగన్ రెడ్డి. మేథావు లు, చదువుకున్నవారు, యువత, మహిళలు అందరూ ఉన్నారు. దీనిపై ఆలోచించండి.
దేశంలోని మహిళలు, రైతులు వారి పనితీరుతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. రాష్ట్రం లోని యువత అనేకదేశాల్లో మంచిమంచిస్థానాల్లో ఉన్నారు. దానికికారణం టీడీపీప్రభుత్వం లో వారికి అందించిన చేయూత. ఇప్పుడు, అప్పుడు కులాలు, మతాలు, ప్రాంతాలమధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టి, వారిరాజకీయపబ్బం గడుపుకోవాలని కొందరు చూస్తున్నారు. వారుచేస్తున్నది ప్రజలకోసం కాదు.. వారికోసం..వారిస్వార్థ రాజకీయాలకోసం చేశారు, చేస్తున్నారు. దానివల్ల రాష్ట్రం ఎంత నష్టపోతోందో గమనించండి. దానిఫలితాలే నేడు మనం అనుభవిస్తున్నాం. అది ఇంతటితో ఆగుతుందని నేను అనుకోవడంలేదు. ఆగదుకూడా..వీళ్లు ఆపరు కూడా.
కరోనా వల్ల ప్రపంచమంతా నష్టపోతే, ఆంధ్రప్రదేశ్ లో జగ న్మోహన్ రెడ్డి పాలనతో నష్టపోయారని, ఆరెండింటినీ మనం ఏమీచేయలేమని ఈమధ్యనే ఒకరుచెప్పారు. వ్యాక్సిన్ తో, ఇతరత్రా జాగ్రత్తలతో కరోనా బారినపడకుండా ఉండగలంగానీ, జగన్మోహన్ రెడ్డి పాలన నుంచి తప్పించుకోవడంఎవరివల్లా కాదని చెబుతున్నా. ఈ ముఖ్య మంత్రితో ఎవరికీ భవిష్యత్ ఉండదు. రాష్ట్రానికి అసలే ఉండదు. భవిష్యత్ బాగుండేది అతనికి … అతని కుటుంబానికే. ఆ కుటుంబంలో కూడా తల్లి, చెల్లెలు ఉండరు. ఆ పరిస్థితి వచ్చింది చివరకు. ప్రజలందరినీ ఒకటేకోరుతున్నాం. నేను మాట్లాడుతున్నది నాకోసమో…తెలుగు దేశంపార్టీ కోసమో.. ఆపార్టీ కార్యకర్తలకోసమో కాదు.
5కోట్లమంది ప్రజలు నేనుచెప్పింది వాస్తవమో కాదో.. బేరీజు వేసుకొని ఆలోచించుకోండి. ఒక ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్చగా బతికే పరిస్థితి, మాట్లాడేపరిస్థితి లేకుండా పోయిందంటే దానికి కారణంఎవరు? ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో.. బాధలు చెప్పు కోలేక ఎన్నిఅవస్థలు పడుతున్నారో, ఆస్తులు కాపాడుకోవడానికి ఎంత నరకయాతన అను భవిస్తున్నారో మీరే ఆలోచించుకోండి. మీకువచ్చిన సమస్యలకు కాపాడమని ముఖ్యమంత్రిని వేడుకున్నా ఆయన స్పందించడు.
ఒకాయన నా ఆస్తిని కొట్టేస్తున్నాడని చెప్పినా, మరోకాయన తాలిబన్ కంటే మించిపోయి రెచ్చిపోతున్నా, ముఖ్యమంత్రి మాట్లాడడు. ఒంగోలులో వైశ్యవర్గానికి చెందినవ్యక్తి పార్టీని కాపాడుకోవాలని,మీరు మాట్లాడే భాష మంచిదికాదనిచెప్పాడని, మోకాళ్లపై నిలబెట్టి క్షమించమని వేడుకునేవరకు కొడతారా? ఆఖరికి వైశ్యులంతా నేడు సమావేశమై తమను తాము కాపాడుకుంటామనే పరిస్థితికి వచ్చారంటే దానికి కారకులుఎవరు? ఒకవ్యక్తి, ఒక వర్గం తమకు తాము అంటూవిడిపోయి, కాపాడుకునే దుస్థితికి ఈ పోలీస్ వ్యవస్థ కారణం కాదా? ఇలాంటి ఘటనలు ఇంకాఇంకా జరుగుతూనే ఉంటాయి.
మీరు చేయాల్సింది ఈప్రభుత్వంపై పోరాడటం…ప్రశ్నించడం… ఎదిరించడం. పోరాడే వారికి అండగా నిలవడమే. అదికూడా చేయలేకపోతే, రాష్ట్రం ఉండదు..మీరు ఉండరు..ఎవరూ ఉండరు. అందుకే ఈ నూతన సంవత్సరంలో నావంతు బాధ్యతగా వాస్తవాలు చెప్పడానికి, నా ఆవేదన మీతో పంచుకోవడానికి నేను మీ ముందుకు వచ్చాను.