Suryaa.co.in

Andhra Pradesh

అప్పులు తెచ్చిన సొమ్ము ముఖ్యమంత్రి లూఠీకే సరిపోతోంది

•అప్పులు తెచ్చిన సొమ్ము, ప్రజలపై వేస్తున్న పన్నుల భారమంతా ముఖ్యమంత్రి లూఠీకే సరిపోతోంది •దిగజారిన ఏపీ ఆర్థికపరిస్థితి, కేంద్రప్రభుత్వాన్ని ఆర్టికల్ 360 అమలుదిశగా ఆలోచింపచేస్తోంది
• ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలుఎవరిస్థాయిలో వారు యథేచ్ఛగా ప్రజాధనాన్ని లూఠీచేస్తున్నారు
• ఏపీకి అప్పులివ్వడానికి ఎవరూ ముందుకురాని పరిస్థితి. కాంట్రాక్టర్లకు ఈ ప్రభుత్వం రూ.80వేలకోట్లవరకు చెల్లించాల్సిఉంది.
• అభివృద్ధి, సంక్షేమానికి టీడీపీప్రభుత్వంలో చేసిన ఖర్చుకంటే జగన్ ప్రభుత్వం చాలా తక్కువే ఖర్చుచేసింది.
•టీడీపీ జాతీయఅధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి

రాష్ట్రంలో ఆర్టికల్ 360 పెట్టమని ఎవరూ అడగరుగానీ, పెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయని, దిగజారిన ఏపీ ఆర్థికపరిస్థితి కూడా వాటిలో ఒకకారణమని, కేంద్రం రాష్ట్రంలో ఆర్టికల్ 360 పెట్టాలంటే ఉన్న నిబంధనలు ఏమిటో కూడా ప్రతిఒక్కరూ తెలుసుకోవాలని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి జీ.వీ.రెడ్డి సూచించారు.బుధవారం ఆయన జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లో నే క్లుప్తంగా మీకోసం…!

“ రాష్ట్రఆర్థికపరిస్థితి సరిగా లేకపోవడం, రాష్ట్రానికిచెందిన క్రెడిట్ రేటింగ్ సరిగా లేకపోవడం, తీసుకున్న అప్పులు సరిగా చెల్లించనప్పుడు కేంద్రం సాధారణంగా ఆర్టికల్ 360 అమలుకు సిద్ధమవుతోంది. ఈ మూడు కారణాలు ఏపీకి ఉన్నాయి. ఏపీ అప్పులకోసం వెళితే సంస్థలు, వ్యక్తులు పారిపోయే పరిస్థితి ఉంది. అలానే ఏపీప్రభుత్వం దారుణంగా క్రెడిట్స్ బకాయిలుపడింది. కాంట్రాక్టర్లకే దాదాపు రూ.80వేలకోట్లవరకు చెల్లించాల్సి ఉంది. అలానే ఉద్యోగులకు ఇవ్వాల్సిన వాటివిషయంలో కూడా అనేకమెలికలు పెట్టారు. రాష్ట్రంలో ఆర్టికల్ 360 అమలైతే దానికి ప్రధానకారణం అసమర్థపాలన, ప్రభుత్వంచేసిన లూఠీ. విపరీతమైన నిర్ణయాలు, అమలుకాని, ఆచరణసాధ్యంకాని నిర్ణయాలతో పాలకలు ఏపీ కొంపముంచారు. రంగులకోసం రూ.3వేలకోట్లు తగలేయడం సమర్థనీయమా? గ్రామాల్లో ఇంటింటికీ రేషన్ సరఫరా పేరుతో అనాలోచిత నిర్ణయం అమలు చేసి వృథా ఖర్చు చేశారు. ఇలాంటి నిర్ణయాలు వందల్లో ఉంటే, జరిగిన నష్టం వేలకోట్లలో ఉంది. ప్రభుత్వ నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ కు అభివృద్ధిని కూడా దూరంచేశాయి. రాష్ట్ర ఆదాయం పెంచడానికి ఇదిగో ఈ నిర్ణయం తీసుకున్నామని, దానివల్ల పలానావర్గాలకు మంచిజరుగుతుందని ప్రభుత్వం చెప్పగలదా? అలాంటి నిర్ణయం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? పరిశ్రమలువస్తేనే రాష్ట్రఆదాయం పెరుగుతుంది.

వ్యవసాయరంగం బలోపేతమైతైనే ఆదాయం పెరుగుతుంది. ముఖ్యమంత్రి ఏనాడైనా అలాంటి ఆలోచనలు చేశారా? అధికారంలోకి వచ్చీరాగానే ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంసానికి శ్రీకారంచుట్టారు. దానితర్వాత రాష్ట్రవ్యాప్తంగా, బయటిప్రపంచానికి తెలియకుండా చాపకింద నీరులా బడుగు, బలహీనవర్గాలు, దళితుల ఆస్తులు, పంటపొలాల నాశనానికి పాల్పడ్డారు. తరువాత ప్రతిపక్షనేతల ఇళ్లు, వ్యాపార సంస్థలపై, దేవాలయాలపైదాడులు చేశారు. ఇలాజరుగుతుంటే రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఎవరైనా ముందుకువస్తారా? మద్యపాననిషేధం పేరుచెప్పి, విపరీతంగా నాసిరకం మద్యాన్ని విక్రయించి సంవత్సరానికి రూ.30వేలకోట్ల ఆదాయం పోగేసుకున్నారు. పెట్రోల్ డీజిల్ పై ఏటా రూ.12వేలకోట్ల వరకు ప్రజలముక్కుపిండీ వసూలు చేస్తున్నారు. ఆఖరికి చెత్తపన్ను, మరుగుదొడ్లపై కూడా పన్నులువేసిఆదాయం పెంచుకునే నిర్ణయాలు తీసుకున్నారు. ఇంతాచేసింది చాలక ఎర్రచందనం, ఇసుక, ఇతరత్రా ఖనిజసంపదను యథేచ్ఛగా దోచుకుంటూ లక్షలకోట్ల లూఠీకి పాల్పడ్డారు. ఇంతాచేసి, ప్రజలకు ఏమైనా మంచి చేశారా.. సంక్షేమకార్యక్రమాలు ఏమైనా గొప్పగా అమలుచేశారా అంటే అదీలేదు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నవరత్నాల పేరు చెప్పి ఏటా సంక్షేమానికి రూ.42వేలకోట్లు ఖర్చుచేయడానికే నానా గడ్డీ కరుస్తోంది. కానీ టీడీపీప్రభుత్వంలో చంద్రబాబునాయుడు గారు ప్రజల్లోని అన్నివర్గాలకు ఉత్తమమైన సంక్షేమాన్ని అమలుచేశారు అని ఘంటాపథంగా చెప్పగలం. టీడీపీప్రభుత్వం 2014-19మధ్యన ఏటా ప్రజలసంక్షేమానికి రూ. 50వేలకోట్ల వరకు ఖర్చుపెట్టింది. ఈలెక్కలు తాముచెప్పడంకాదు ఈప్రభుత్వమే చెప్పింది. అలానే అభివృద్ది విషయంలో కూడా టీడీపీప్రభుత్వం చేసినదానితో పోలిస్తే, జగన్ ప్రభుత్వం వెనకబడే ఉంది. ఒక్కసాగునీటిరంగానికే టీడీపీప్రభుత్వం రూ.64వేలకోట్లవరకు ఖర్చుపెట్టి, పోలవరంప్రాజెక్ట్ ని 70శాతం వరకు పూర్తిచేసింది. జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఏంచేశాడో..ఎంత ఖర్చుపెట్టాడో చెప్పమంటే సమాధానం లేదు. పాఠశాలల్లో నాడు-నేడు పేరుతో భారీస్థాయిలో అవినీతికి పాల్పడ్డారు. భవనాలకు రంగులేస్తే, విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందుతుందా? అవన్నీ ఒకెత్తయితే అధికారపార్టీ ఎమ్మెల్యేల అవినీతి ఆకాశాన్ని తాకుతోంది.

ముఖ్యమంత్రి ఆయన స్థాయిలో లూఠీ చేస్తుంటే, ఎమ్మెల్యేలు మంత్రులు వారిస్థాయిలో వారు లూఠీకి పాల్పడుతున్నారు. ఇంతచేస్తున్నా చాలక ప్రజలనుంచి దారుణంగా దోచుకుంటున్నారు. అదేమంటే కరోనా పేరుచెప్పి తప్పించుకుంటున్నారు. దేశమంతా కరోనాఉంటే, ఒక్క ఏపీలోనే ఉన్నట్లుగా కబుర్లుచెబుతారు. దేశంలో ఏరాష్ట్రంలో లేనివిధంగా ప్రజలపై వివిధరకాల పన్నులేస్తూ దోచుకుంటన్నారు. రాష్ట్రంలోని విలువైన సహజసంపదను కొల్లగొడుతున్నారు. ఆఖరికి పల్లెల్లో ట్రాక్టర్ మట్టికూడా దొరకని పరిస్థితి. కరోనా కష్టాలు, ఆదాయం పడిపోవడం ప్రభుత్వానికేగానీ, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలకు లేదు. ప్రజలకు కూడా కరోనాతో ఉపాధిలేదని, ఆదాయం తగ్గిందని ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించదు? వ్యాపారులు, ఉద్యోగులు, కూలీలు, కార్మికులు కరోనాతో నానాఅవస్థలు పడలేదా? వారుపడరానిపాట్లు పడుతున్నా కూడా ముఖ్యమంత్రికి కనికరం లేదు, వాళ్ల ముక్కుపిండి మరీ వసూలుచేస్తున్నారుకదా! ప్రజలను ఆదుకోవడం, వారికి సంక్షేమపథకాలు అందించడంలో వెనుకబడిన రాష్ట్రం అప్పుల్లో మాత్రం దేశంలోనే అగ్రస్థానంలోఉంది.

రాష్ట్రం పుట్టినప్పటినుంచీ ఏప్రభుత్వం చేయనంత అప్పుని ఈ రెండేళ్లలో చేశారు. రాష్ట్రాన్ని అధికారపార్టీనేతలు సెటిల్ మెంట్ల అడ్డాగా మార్చారు. కనిపించిన భూములను, స్థలాలను కబ్జాచేస్తూ, వాటిహక్కుదారులను భయపెట్టి, వసూళ్లుచేస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు వారిస్థాయిలో వారు లూఠీచేస్తుంటే, ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన భారీ లూఠీకి పాల్పడుతున్నారు. ఒక పక్కప్రభుత్వంచేస్తున్న దుబారా, మరోపక్క పాలకుల లూఠీ, రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, యువతకు ఉద్యోగాలు,ఉపాధిలేకపోవడం వంటి కారణాలన్నీ రాష్ట్రంలో ఆర్టికల్ 360అమలుకు ప్రేరకాలుగా నిలిచాయి. ప్రజలపై వేస్తున్న పన్నులభారం వాటికి అదనం.

దేశంలో ఒక్క ఏపీకి తప్ప, మరే రాష్ట్రంలో ఆర్టికల్ 360 పెట్టే పరిస్థితిలేదు. రాష్ట్రం పుట్టినప్పటినుంచీ ఏప్రభుత్వం చేయనంత అప్పుచేశారు. 63 ఏళ్లలో అయినఅప్పుకంటే, ఈ రెండున్నరేళ్లలో, జగన్ రెడ్డి చేసిన అప్పులే అధికం. 3లక్షలకోట్ల పైచిలుకు అప్పులుచేసి, రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్ గా మార్చారు. అప్పుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో మాత్రం అట్టడుగుకి చేరారు. తీసుకొచ్చిన అప్పులసొమ్ము అంతా ఏంచేశారంటే ఆర్థికమంత్రి బుగ్గన కాకిలెక్కలు చెబుతాడు. రాష్ట్రఆర్థికపరిస్థితి పై శ్వేతపత్రం విడుదలచేయగల దమ్ము ఈ ప్రభుత్వానికి ఉందా? ఆఖరికి పోలవరం కేంద్రం నిర్మిస్తే తప్ప, మీరు సెంటిమీటర్ పనిచేయలేని దుస్థితికి వచ్చారు. ఉద్యోగులకు పేరివజన్ కుబదులు పే రివర్స్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్రాన్ని నడపడం తనవల్లకాదని ముఖ్యమంత్రి కేంద్రానికి లేఖరాసి, ఆర్టికల్ 360 అమలుకాకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తాను హ్యాండిల్ చేయలేనని ముఖ్యమంత్రి , కేంద్రప్రభుత్వాన్ని అభ్యర్థించక పోతే రాష్ట్రం కోలుకోలేనివిధంగా దెబ్బతినడంఖాయం. ”

LEAVE A RESPONSE