అత్యాధునిక సాంకేతికతో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్..

• నవరత్నాలు, ప్రభుత్వ విధానాలను ప్రజల ముంగిట ఉంచడానికి ఏపీఎస్ఎఫ్ఎల్ కృషి
• ప్రతి 5 కిలో మీటర్లకు ఒక టవర్ ఏర్పాటు
• భవిష్యత్ లో ఆర్ధిక వనరు సంస్థగా ఏపీఎస్ఎఫ్ఎల్..
• రాబోయే కాలంలో కేబుల్ రంగంలో విప్లవాత్మక మార్పులు
• ఏడాది కాలంలో సంస్థ పురోగతిని వివరించిన ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ డా. పి. గౌతం రెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నవరత్నాల కార్యక్రమాలను అన్నింటినీ ప్రజల ముంగిట అందించడానికి నెట్ సౌకర్యం ప్రాధాన్యతను గుర్తించి అన్ని గ్రామ పంచాయతీలకు, రైతు భరోసా కేంద్రాలకు అత్యాధునిక సాంకేతికతతో ఇంటర్నెట్ అందించేందుకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) కృషి చేస్తుందని ఆ సంస్థ ఛైర్మన్ డా. పి. గౌతం రెడ్డి తెలిపారు. ఇంటర్నెట్ వైర్ ద్వారానే వెళ్లే ఆనవాయితీ భారత దేశమంతా ఉందని.. కానీ ఆంధ్రప్రదేశ్ లో 5 కిలో మీటర్ల దూరంలో ఒక టవర్ ను ఏర్పాటు చేసి ఆ టవర్ నుంచి మరో టవర్ కి కనెక్ట్ చేసి వైర్ లెస్ ఇంటర్నెట్ అందించే విధంగా ప్రాజెక్టును తీసుకురావడం జరిగిందని, చిత్తూరులో ట్రయల్ రన్ గా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. బాక్స్ సిస్టం ద్వారా నెట్ ను అందించేందుకు.. 4. 5 కంపెనీలు మందుకొచ్చాయన్నారు.

ఇంటర్ నెట్ ను ఇంటింటికీ అందించేందుకు ఫైలట్ ప్రాజెక్టుగా త్వరలో విజయవాడలో మంత్రి ప్రారంభిస్తారని తెలిపారు. దశలవారీగా రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని.. తద్వారా అతి తక్కువ రేట్లలో ఇంటింటికీ నెట్ ను అందజేస్తామన్నారు. విజయవాడలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ భవన్ లో గల ఏపీఎస్ఎఫ్ఎల్ సంస్థ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సంస్థ యొక్క అభివృద్ధి, పురోగతి.. గత ప్రభుత్వం చేసిన విధానాలు, వాటిల్లో వచ్చిన అవతవకలపై జరిగిన సమీక్షా వివరాలను ఛైర్మన్ పి. గౌతంరెడ్డి వివరించారు.

ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్ వర్క్ ఆఫరేషన్ సెంటర్ (ఎన్ఏసీ) చిన్నదిగా ఉండడంతో విశాఖపట్నం ఆంధ్రా యూనివర్సిటీ గ్రౌండ్ ఫ్లోర్ లో ఆధునాతన ఎక్విప్ మెంట్ తో అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. తాను ఛైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన సంవత్సరకాలంలో అత్యధిక కాలం కోవిడ్ సమయమైనా.. సంస్థ అభివృద్ధి చర్యలు ఎక్కడా ఆగలేదన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి, మౌలిక వసతులు కల్పించడానికి కృషి చేశామని ఆయన తెలిపారు.

ప్రభుత్వం యొక్క విధానాలను ప్రజల ముందు ఉంచడానికి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జరిగే సమీక్షా సమావేశాలను SD-WAN సిస్టమ్ ద్వారా రాష్ట్రంలోని అన్ని జిల్లా ఆఫీసులకు, ప్రభుత్వ కార్యాలయాలకు ఏపీఎస్ఎఫ్ఎల్ ప్రసారం చేస్తుందని తెలిపారు. ఎలక్ట్రికల్ సబ్ స్టేషన్లలో OIT లను రింగ్ సిస్టమ్ లో ఏర్పాటు చేశామని, కనెక్టివిటీ ఆగినా 5, 10 నిమిషాల్లోనే పునరద్దరించే విధంగా చర్యలు తీసుకున్నామని చెప్పారు. దీనిని చూసిన కేంద్రప్రభుత్వం భారత్ బ్రాండ్‌బాండ్ నెట్‌వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్) ద్వారా పెద్ద ఎత్తున కనెక్టివిటీ ఆందజేసిందన్నారు. బీబీఎన్ఎల్ ద్వారా భారత్ పేజ్-2 లో రాష్ట్రంలో 55 వేల కిలో మీటర్ల ఆప్టికల్ ఫైబర్ వేయాలని నిర్ణయం జరిగిందన్నారు. దానిలో 11,254 గ్రామ పంచాయతీల్లో ఎలక్ట్రానిక్ సిస్టమ్ ను ఇన్ స్టాల్ చేశామన్నారు. ఇప్పటికే 14,671 కిలో మీటర్లు లైన్ వేశామని, 2,824 గ్రామపంచాయతీలకు డైరెక్ట్ గా కనెక్టివిటీని ఇచ్చామని తెలిపారు.

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన నవరత్నాల కార్యక్రమాలను అన్నింటినీ ప్రజల ముంగిట అందించడానికి నెట్ సౌకర్యం ప్రాధాన్యతను గుర్తించి అన్ని గ్రామ పంచాయతీలకు ఆప్టికల్ ఫైబర్ ను తీసుకెళ్తున్నామన్నారు. రాష్ట్రంలో అన్ని ఆర్బీకేల్లో కనెక్టివిటీని అందజేశామన్నారు. అన్ని గ్రామ, వార్డు సచివాలయాలకు కనెక్టివిటీ ఇవ్వడానికి కృషిచేస్తున్నామన్నారు. పేదవాడి హెల్త్ కండీషన్ మెరుగుపర్చడానికి, ఎప్పటికప్పుడు తెలియజేయడానికి డేటా ఇస్తున్నామన్నారు. సాంఘిక, సంక్షేమ పాఠశాలల్లో మెరుగైన సేవలను అందిస్తున్నామన్నారు. ఎయిర్ టెల్, జియో వారికి ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారానే నెట్ సౌకర్యాన్ని అందజేయడం జరుగుతుందని, తద్వారా కొంత ఆదాయం సంస్థకు వస్తుందన్నారు. చిత్తూరు, కడప, కర్నూలు ప్రాంతాల్లో ఎయిర్ టెల్, జియో టవర్స్ కి ఏపీఎస్ఎఫ్ఎల్ ద్వారా అందజేస్తున్నామన్నారు. 4,415 గ్రామ, వార్డు సచివాలయా, దాదాపు 10వేల ఆర్బీకేల్లో కనెక్షన్లు అందజేశామన్నారు. జగనన్న కాలనీల్లో గృహాల నిర్మాణం కంటే ముందుగానే ఫైబర్ నెట్ కనెక్టివిటికి వీలుగా సౌకర్యం కల్పించామన్నారు. రంపచోడవరం వంటి గిరిజన ప్రాంతాల్లో కూడా నెట్ సౌకర్యాన్ని అందజేయడం జరుగుతుందని తెలిపారు. అలాగే 13 జిల్లాల్లో హైటెన్షన్ టవర్స్ మీదుగా కూడా వైర్ కనెక్టివిటీ ఇస్తున్నామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 60 శాతం వరకూ కనెక్టివిటీ అందచేశామన్నారు.

గత ప్రభుత్వం చేసిన తప్పులు, అవకతవకల వల్ల సంస్థ అప్పులు పాలైన పరిస్థితి అని.. గత అప్పులు తీర్చడానికి ప్రతి నెలా 40 నుంచి 50 కోట్ల వరకూ వడ్డీని చెల్లించాల్సి వస్తుందని గౌతం రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలోని అవకతవకలపై ఇప్పటికే విచారణ జరుగుతుందని, ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. విచారణ మరింత పారదర్శకంగా చేసి.. మిగతా వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ట్రిపుల్ ప్లే బాక్స్ లు కొత్తవి అవసరం ఉందని, దానికి 3 వేల కోట్ల నుంచి 4వేల కోట్ల వరకూ ఖర్చు అయ్యే అవకాశం ఉందని…. ప్రభుత్వంపై ఒక్క రూపాయి కూడా భారం పడకుండా ఎంఎస్ఓలు, ఎల్‌సీవోలు డైరెక్ట్ గా కొనుగోలు చేసుకునే విధంగా ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించామన్నారు. ఇప్పటికే డొమెస్టిక్ కనెక్షన్లు 8లక్షల 80వేల వరకూ ఉన్నాయన్నారు. భవిష్యత్ లో బాక్స్ ల ద్వారా వందల కోట్లు లాభార్జన చేకూరే సంస్థగా ఆర్ధిక వనరుల సంస్థగా ఏపీఎస్ఎఫ్ఎల్ నిలుస్తుందని ఛైర్మన్ ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో కేబుల్ రంగంలో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయన్నారు.

Leave a Reply