గత రెండు, మూడు నెలలుగా దాగుడు మూతలాట గా సాగుతున్న పీఆర్సీ వ్యవహారం ;ఇప్పుడు అటు ప్రభుత్వానికి , ఇటు ఉద్యోగుల సంఘాల నేతలకు ప్రతిష్టాత్మకం గా మారిందని అంటున్నారు . ముఖ్యమంత్రి సమక్షం లో ఒప్పుకుని , చప్పట్లు కొట్టి ,ఇప్పుడీ ఆందోళన ఏమిటి అనేది ప్రభుత్వ భావనగా ఉన్నట్టు – మంత్రి పేర్ని నాని మాటలను బట్టి అర్ధం చేసుకోవచ్చు . ’23 % ఫిట్మెంట్ కు , ఇతర ఆర్ధిక ప్రయోజనాల కోతకూ ఉద్యోగ సంఘాల నాయకులు ఒప్పుకుంటే …’వారి సంగతి చూస్తాం”అంటూ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సంఘాలకు చెందిన ఉద్యోగులు అల్టిమేటం జారీ చేయడంతో ; గతిలేని పరిస్థితుల్లో సమ్మెకు తయారయ్యారు.
దీనితో రాష్ట్ర వ్యాప్తం గా ఉద్యోగులు -తమ ఆందోళన తో రాష్ట్రాన్ని హోరెత్తించారు . సమ్మెకు ఇంకా 15 రోజుల పైబడి సమయం ఉన్నప్పటికీ ; తమ ఆందోళనలతో అతలాకుతం చేయగలమని వారు గురువారం నటి కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం లోనే చూపించారు.
పీఆర్సీ పై పునః పరిశీలనా ఉంటుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రకటించినప్పటికీ ; ఎప్పుడు ….,ఎలా ….,ఎక్కడ ….., ఏ స్థాయిలో అన్న వివరాలు లేవు . ఉద్యోగుల ముందు తలలు వంచుకోవాల్సి వచ్చిన ఉద్యోగ సంఘాల నేతలు – తాము ఉద్యోగుల వైపే ఉన్నామని చెప్పుకోవడం కోసం దూకుడు పెంచుతున్నారు . విజయవాడలోని స్వర్ణ ప్యాలస్ హోటల్ లో బొప్పరాజు వెంకటేశ్వర్లు , బండి శ్రీనివాస్ , వెంకట్రామి రెడ్డి , సూర్యనారాయణ వంటి నేతలు రహస్యంగా సమావేశమయ్యారంటూ వచ్చిన వార్తలను బట్టే ; వారు ఎంత దూకుడుగా ఉన్నారో అంచనా వేయవచ్చు .
ప్రభుత్వం కూడా అంతే దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు కనబడుతున్నది . కొత్త పీఆర్సీ ప్రకారమే ఉద్యోగుల వేతనాల బిల్లులను ప్రాసెస్ చేయాలంటూ ట్రెజరీ కి జారీ చేసిన ఆదేశాలను ఆ శాఖ ఉద్యోగుల సంఘం నిరసించింది . తామూ ఉద్యోగుల ఆందోళనలో భాగమే అని తేల్చి చెప్పింది .ఇలా ..,ఉద్యోగ సంఘాల నేతలకు , ప్రభుత్వానికి మధ్య తలెత్తిన సమస్య మెల్లగా బిగుసుకుంటున్న సూచనలు కనపడుతున్నాయి .
నిజానికి , ఉద్యోగులు -టీడీపీ కంటే ; వైసీపీకి (అంటే ముఖ్యమంత్రి జగన్ కు)దగ్గరి వారు అనే భావం ఉంది . గత ఎన్నికల్లో టీడీపీ ని ఓడించి , జగన్ ను గెలిపించడానికి ఎన్ని మార్గాల్లో కృషి చేయవచ్చో ….అన్ని మార్గాల్లోనూ కృషి చేశారనే భావం రాష్ట్ర రాజకీయాలను ఆసక్తిగా పరిశీలించే వారిలో వుంది . జగన్ కు 151 సీట్లు ;చంద్రబాబుకు 23 సీట్లు రావడం లో కూడా ఉద్యోగుల పాత్ర ఉన్నదని కూడా చెబుతారు.
బహుశా ఆ సంతోషం తోనే కావచ్చు ; ముఖ్యమంత్రి జగన్ కూడా – అధికారం లోకి వచ్చేయి రావడం తోనే. 27 శాతం మధ్యతర భృతి ప్రకటించారు .
చంద్రబాబు ప్రభుత్వం లో అందుకున్న హెచ్ ఆర్ ఏ , సీ సీ ఏ వంటి పలు ఆర్ధిక ప్రయోజనాలతో పాటు ;27 శాతం మధ్యంతర భృతి తో ఉద్యోగుల జీత భత్యాలు ఇబ్బడి ముబ్బిడిగా పెరిగి పోయాయి . మధ్యంతర భృతే జగనన్న 27 శాతం ఇస్తే ; ఇక పీఆర్సీ తో జీత భత్యాలు ఎంతగా పెరిగిపోతాయో కదా అన్న ముందస్తు ఆలోచనలతో ఉద్యోగులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు .
తీరా ఆ’ పీఆర్సీ’ ప్రకటించాల్సిన సమయం వచ్చేసరికి ; ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రంగం లోకి దిగి ;ఉద్యోగ సంఘాల నేతలతో పలు దఫాలుగా సమావేశం అయ్యారు . ఉన్నతాధికారులతో సమావేశాలు ఏర్పాటు చేయించారు . రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ని వారికి పదే పదే వివరిస్తూ , వీలైనంత తక్కువ పీఆర్సి సిఫారసులకు ఉద్యోగ నేతలను మానసికంగా సిద్ధం చేశారు . అంతా బాగానే ఉన్నదనే భావం కలిగాక ; ముఖ్యమంత్రి తో సమావేశం ఏర్పాటు చేయించారు .
ముఖ్యమంత్రి కూడా రాష్ట్ర ఆర్ధిక స్థితి గతులను వారికి వివరించి ;ప్రభుత్వం తో ఉద్యోగ సంఘాల నేతలు సహకరించాలంటూ విజ్ఞప్తి చేశారు . ముఖ్యమంత్రి ప్రకటించిన 23 శాతం జీతం పెంపుదలకు ;పెండింగ్ లో ఉన్న అయిదు డీ ఏ లను జనవరి జీతం తో కలిపి ఇస్తామని చెప్పిన మాటకు ఉద్యోగులు -నో చెప్పలేదు . పైపెచ్చు , ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 సంవత్సరాలకు ఎవరూ అడక్కుండానే ముఖ్యమంత్రి ప్రకటించడం తో ఉద్యోగ సంఘాల నేతలు ఉబ్బితబ్బిబ్బయ్యారు .
మొత్తం మీద – ఉద్యోగుల జీత భత్యాల సమస్యను ప్రభుత్వం బాగానే హ్యాండిల్ చేసింది అనిపించింది .
కానీ, గత ప్రభుత్వం లో పొందిన పలు ఆర్ధిక ప్రయోజనాలలో సగానికి సగం కోత పడడం తో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు -తమ నేతలపై తిరగబడ్డారు .ఉద్యోగుల ‘మూడ్”తో షాక్ లోకి వెళ్లిన ఉద్యోగ సంఘాల నేతలు -ప్రభుత్వం పై సమ్మె జండా ఎగరేస్తున్నారు.
ఇప్పుడు , ఈ పరిస్థితుల్లో ఎవరు రాజీ పడతారు ? ఉద్యోగ సంఘాల నేతలు ఏమాత్రం వెనక్కి తగ్గినా….ఉద్యోగులు సహించరు . ముఖ్యమంత్రి జగన్ కూడా వెనక్కి తగ్గక పోవచ్చు . దీనితో , మొత్తం పరిస్థితి ఆసక్తికరంగా మారింది . ఎవరు తగ్గితే వారు – ప్రజల దృష్టిలో ఓడినట్టేనని నెల్లూరు కు చెందిన ‘లాయర్’ వారపత్రిక అభిప్రాయ పడింది.
