– గతంలో కృష్ణాకు ఎన్టీఆర్ పేరు పెడతామన్న జగన్
– విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్న పాత డిమాండ్
– ప్రత్యామ్నాయంగా నర్సరావుపేటకు కన్నెగంటి హనుమంతు జిల్లా?
– వైసీపీ సర్కారుకు కొత్త జిల్లాల పేర్ల పరేషానీ
( మార్తి సుబ్రహ్మణ్యం)
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటులో పేర్ల వివాదం వైసీపీ సర్కారుకు శిరోభారంగా మారింది. రాష్ట్రవ్యాప్తంగా సమరయోధులు, రాజకీయ ప్రముఖుల పేర్లు తమ జిల్లాలకు పెట్టాలన్న డిమాండ్‌కు తోడు.. కృష్ణా జిల్లాలో రెండు కీలక సామాజికవర్గాలకు చెందిన ప్రముఖుల పేర్ల వ్యవహారం, ఇప్పుడు జగన్ సర్కారును చిక్కుల్లో నెట్టింది. ఈ వ్యవహారంలో జగన్ సర్కారు తీసుకునే నిర్ణయంపై కమ్మ-కాపు సామాజికవర్గంలోని ఎన్టీఆర్, వంగవీటి రంగా అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రాజకీయంగా చైతన్యమైన కృష్ణా జిల్లాలోని రెండు కొత్త జిల్లాల పేర్ల వ్యవహారం, ఇద్దరు ప్రముఖ నేతల పేర్లపై పీటముడి నెలకొంది. సీఎం జగన్ గతంలో గుడివాడ పర్యటనకు వెళ్లిన సందర్భంలో, కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని హామీ ఇచ్చారు. గుడివాడలోని నిమ్మకూరు దివంగత ఎన్టీఆర్ పుట్టిన ప్రాంతం కావడం గమనార్హం. తాజాగా ప్రభుత్వ నిర్ణయం ప్రకారం కృష్ణా జిల్లాను రెండుగా విడదీసి కొత్త జిల్లాలు ఏర్పాటుచేస్తున్న నేపథ్యంలో, సీఎం జగన్ గతంలో హామీ ఇచ్చినట్లు ఎన్టీఆర్ పేరు పెడతారా లేదా అన్న మరో చర్చ తెరపైకి వచ్చింది.
అదే సమయంలో కొత్తగా ఏర్పాటుచేయనున్న మరొక జిల్లాకు మాజీ ఎమ్మెల్యే, కాపునేత దివంగత వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలన్న డిమాండ్ తెరపైకి రావడంతో కొత్త జిల్లాల పేరు వ్యవహారం ఆసక్తికరంగా మారింది. తాము గతంలో విజయవాడకు వీఎంరంగా జిల్లా పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరినట్లు ఆయన సమీప బంధువయిన వంగవీటి నరేంద్ర గుర్తు చేశారు. ‘కృష్ణా జిల్లాను రెండుగా విడదీస్తే అందులో విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలని మేం గతంలోనే ప్రభుత్వాన్ని కోరాం. కానీ ఇప్పుడు జరుగుతున్న ప్రక్రియ చూస్తుంటే, ఆయన పేరు పెట్టే ఉద్దేశం ప్రభుత్వానికి ఉన్నట్లు కనిపించడం లేద’ని వంగవీటి నరేంద్ర విడుదల చేసిన ఓ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే కొత్తగా ఏర్పాటుకానున్న మచిలీపట్నం జిల్లాలోనే కాపుల సంఖ్య అధికంగా ఉన్నట్లు కాపువర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో విజయవాడ కొత్త జిల్లాలో కాపు-కమ్మ సామాజికవర్గాల సంఖ్య దాదాపు సమానంగానే ఉంటుంది. మచిలీపట్నం-విజయవాడ జిల్లాల్లోని కాపు-కమ్మ ఓటర్ల సంఖ్య పరిశీలిస్తే, 50 వేలు కాపుల ఓట్లే కమ్మ వర్గం కంటే ఎక్కువగా ఉంటాయన్నది ఒక అంచనా. అంటే మచిలీపట్నం జిల్లాలో రెండున్నర లక్షల మంది కాపులు ఉంటే, విజయవాడ జిల్లాలో 2 లక్షల మంది ఉండవచ్చన్నది ఒక అంచనా. విజయవాడ జిల్లాలో కమ్మలు కూడా, దాదాపు కాపులకు సమానంగానే ఉంటాయని చెబుతున్నారు.
ఎన్టీఆర్ గుడివాడలో జన్మించినందున మచిలీపట్నం జిల్లాకు ఆయన పేరు పెట్టాలన్న డిమాండ్ వినిపిస్తున్న క్రమంలో, కులపరంగా ఎక్కువ జనాభా ఉన్నందున వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్ కూడా ఆసక్తికరంగా మారింది. ఒకే జిల్లాకు ఇద్దరి పేర్లు పెట్టడం అసాధ్యమయినందున, ప్రభుత్వం ఎవరి పేరు పెడుతుందో చూడాలి.
కొత్త జిల్లాకు పేర్లపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. రెండు జిల్లాల్లో ఒకదానికి రంగా పేరుపెట్టాలన్న డిమాండ్‌తో.. కాపునాడు రేపటి నుంచి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభిస్తుండటంతో, ఈ వ్యవహారం కొత్త మలుపు తిరగనుంది. ‘మామూలుగా అయితే కాపుల సంఖ్య ఎక్కువగా ఉన్న మచిలీపట్నం జిల్లాకే రంగా పేరు పెట్టాల్సి ఉంది. కానీ అక్కడ ఎన్టీఆర్ కూడా పుట్టారు కాబట్టి ఆయన పేరు పెట్టాలంటున్నారు. అయితే మేం ఏదో ఒక జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలన్న డిమాండ్‌తో రేపటి నుంచి సంతకాల ఉద్యమం ప్రారంభించనున్నారు. ముఖ్యమంత్రి జగన్, కలెక్టరుకు ఆమేరకు వినతిపత్రం కూడా ఇవ్వబోతున్నా’మని కాపునాడు జాతీయ అధ్యక్షుడు గాళ్ల సుబ్రమణ్యం వెల్లడించారు.
అయితే ఇప్పటిదాకా రంగా కుటుంబం, ఆయన పేరు జిల్లాకు పెట్టాలని ఏనాడూ అధికారంగా ప్రభుత్వాన్ని కోరలేదని దివంగత వంగవీటి రంగా ప్రధాన అనుచరుడయిన సుబ్రమణ్యం చెప్పారు. ‘నిజానికి వంగవీటి పేరుతో చాలామంది ఉనికిలో ఉన్నప్పటికీ వంగవీటి రాధా, శంతన్‌కుమార్ మాత్రమే రంగాకు వారసులు. మాకు తెలిసి ఆ కుటుంబం ఎప్పుడూ రంగా పేరు జిల్లాకు పెట్టాలని కోరింది లేద’ని వివరించారు.
జగన్ ప్రభుత్వం కాపుల కంటే కమ్మలనే రాజకీయంగా ప్రోత్సహించే అవకాశం ఉందన్న భావన కాపువర్గాల్లో ఉందని ఆయన చెప్పారు. ‘రంగాపేరు పెడితే అది రాధాకు రాజకీయంగా లాభం. కాపులకు కొత్తబలం. అలా చేయడం జగన్‌కు ఇష్టం లేని జగన్, కృష్ణా జిల్లాలో కమ్మలను ప్రోత్సహిస్తున్నారని కాపుల అనుమానం. అది అబద్ధమని నిరూపించుకోవలసిన బాధ్యత జగన్‌దే. ఎందుకంటే రంగా బలిదానంతోనే అప్పట్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. వైఎస్ కూడా రంగాను ప్రోత్సహించారు. రంగా కూడా వైఎస్‌కు అంతకంటే దన్నుగా నిలిచారు. కాబట్టి రంగా పేరు ఏదో ఒక జిల్లాకు పెట్టడం ద్వారా వైఎస్‌కు రంగాచేసిన సేవకు గౌరవమివ్వాలి’ని వ్యాఖ్యానించారు.
చిరంజీవి ప్రజారాజ్యం పెట్టినప్పుడు కాపులు మొత్తం ఆయన వెనుక వెళ్లలేదని ఆయన గుర్తు చేశారు. ‘అప్పుడు కూడా కాపులు వైఎస్‌కే పట్టం కట్టారు. అందుకే 25 శాతం ఓట్లే చిరంజీవికి లభించాయి. మొన్న పవన్ కల్యాణ్ జనసేనకూ కాపులు ఓట్లు వేయలేదు. ఆయన పార్టీకి కేవలం 5.3శాతం మాత్రమే వచ్చాయి. అంటే ప్రజారాజ్యం కంటే 20 శాతం ఓట్లు తగ్గాయి. మొన్నటి ఎన్నికల్లో చంద్రబాబు మీద వ్యతిరేకతతో, కాపులు వైసీపీకి ఓట్లు వేశారు. ఇవన్నీ జగన్ పరిగణనలోకి తీసుకుని కొత్త జిల్లాకు రంగా పేరు పెడితే జగన్ గౌరవం పెరుగుతుంద’ని సుబ్రమణ్యం విశ్లేషించారు.
ప్రత్యామ్నాయం నర్సరావుపేట?
కాగా ఎన్టీఆర్-రంగా పేర్లతో కొత్త జిల్లాల ఏర్పాటు రాజకీయంగా చిక్కుముడి నెలకొన్న నేపథ్యంలో, ప్రత్యామ్నాయంగా నర్సరావుపేట జిల్లాకు కాపు వర్గానికి చెందిన ప్రముఖ సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పేరు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు బీజేపీ జాతీయ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తాజాగా ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. పుల్లరి ఉద్యమంతో బ్రిటీషర్లను గడగడలాడించిన కన్నెగంటి హనుమంతు అందించిన సేవలకు గుర్తుగా, నర్సరాపుపేట జిల్లాకు ఆయన పేరు పెట్టాలని కన్నా సూచించారు. తర్వాత పల్నాడు మేధావుల వేదిక అధ్యక్షుడు కోడూరి సాంబశివరావు కూడా నర్సరావుపేట జిల్లాకు ‘కన్నెగంటి హనుమంతు పల్నాడు’ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు.
కాగా నర్సరాపుపేట జిల్లాలో కూడా కాపుల సంఖ్య గణనీయంగానే ఉండటం గమనార్హం. నర్సరావుపేట, సతె్తనపల్లి నియోజకవర్గాల్లో కాపుల సంఖ్య ఎక్కువగా ఉండగా, మిగిలిన నియోజగవర్గాల్లో విజయాన్ని నిర్దేశించే స్ధాయిలో కాపు ఓటర్లున్నారు. అందువల్ల కృష్ణా జిల్లాలో రంగా పేరు పెట్టే అవకాశం లేకపోతే, ప్రత్యామ్నాయంగా నర్సరావుపేటకు ఆ సామాజికవ ర్గానికే చెందిన సమరయోధుడు కన్నెగంటి హనుమంతు పేరు పెట్టడం ద్వారా, కాపులను మెప్పించే అవకాశం లేకపోలేదంటున్నారు.