Srinivas Jilukara వాల్ నుంచి..
నాగసాధువులు కుంభమేళకు దిగంబరంగా వస్తారు..
మీ లింగాలను మాకు చూపిస్తారా? అని ఎవరూ గాయపడలేదు… పైగా వాళ్ల లింగాలకు భక్తులు పూజలు చేస్తారు..!
ఆ పనిని ఎవరూ వ్యతిరేకించలేదు. నాగసాధువులకు వస్త్రధారణ వుండాలని ఎవరూ ఉద్యమం చేయలే.
జైన మతంలో దిగంబరులు, శ్వేతాంబరులు అనే శాఖలు వున్నాయి. దిగంబరులు నగ్నదేహంతో సంచరిస్తారు. ప్రవచనం చేస్తారు. వారి లింగాలకు జైన స్త్రీలు పూజలు చేస్తారు. అది తప్పని, మీరు బట్టలు ధరించాలని ఏ సంస్థా ఉద్యమించలేదు. అది వారి సంప్రదాయం అని గౌరవించాము.
బౌద్ధులు కాషాయాంబరం ధరిస్తారు. బౌద్ద సన్యాసులు ధరించే చీవరాలు కొద్దిగా నిండుగానే వుంటాయి కానీ అవి కూడా స్త్రీల వస్త్రధారణను స్ఫురిస్తాయి.
చినజీయరు, పరిపూర్ణానంద ఇద్దరూ ఆడవాళ్ల మాదిరి చీరలు చుట్టుకుంటారు. మాటిమాటికి పైటను సర్దుకుంటారు. ఏకంగా రామానుజుల వారి విగ్రహాన్ని చూడ్డానికి వొచ్చిన దేశ ప్రధానికి పసుపురంగు చీర కట్టించి దర్శనం చేయించాడు జీయర్. అదీ వారి సంప్రదాయం అని అంతా గౌరవించాము. ఆ చీర ధరించడానికి అన్ని అర్హతలు వారికి వున్నాయని అంగీకరించాము.
గర్భగుడిలోనే కాదు, కల్యాణ మండపంలో కూడా పూజారి పెళ్లి కూతురి ముందు అర్ధనగ్నంగా కూచొని వివాహం జరిపిస్తాడు. అది సంప్రదాయం అని వధూవరుల తల్లిదండ్రులు ఆయన్ని అమితంగా గౌరవిస్తారు. అనాచారం అని ఎవరూ అనుకోరు.
రాజస్థాన్ మార్వాడీ స్త్రీలు ముఖం కనిపించకుండా ముసుగు ధరిస్తారు. రాజస్తాన్ గాయని భన్వరీదేవికి ప్రపంచ స్థాయి గుర్తింపు ఉంది. అమె ముసుగుతోటే పాటలు పాడుతుంది. ఆమెతో కలిసి పాప్ పాడిన కౌర్ పూర్తిగా షాట్స్, స్లీవ్ లెస్ టాప్ వేసుకొని పాడింది. ఆ వీడియో సాంగ్ ను కోట్లాది మంది చూశారు.
విశ్వనాథ సత్యనారాయణ రాసిన ఏకవీర నవలలో హీరోయిన్ ముసుగులేకుండా మగాళ్ల ముందు ధర్మప్రశస్తి గురించి వాదించి, ముసుగు వేసుకోనందుకు పశ్చాత్తాపంతో అగ్నిప్రవేశం చేసి ఆత్మహత్య చేసుకుంటుంది. అది సనాతన ధర్మ గొప్ప తనమని పండితులు గర్వించారు.
ఒంటికి సూర్యరశ్మి తాకితేనే ఏ అనారోగ్యం రాదని గ్రహించిన పాశ్చాత్యులు బీచులలో దిగంబరంగా తిరుగుతారు. అది ఆధునికత దుష్ప్రభావం అనుకుంటారు. ఆర్నెళ్లు గడ్డగట్టే చలికాలంలో యూరపు, అమెరికాలో దళసరి వస్త్రాలు, గొడ్డుచర్మాలతో తయారు చేసిన బట్టలు వేసుకుంటారు.
ఎడారి వేడితాపానికి తాళలేక సౌదీ అరేబియా దేశంలో మగాళ్లు నిండైన దవళ వస్త్రాలు, నెత్తిమీద టర్బన్ ధరిస్తారు. ఆడవాళ్ళ గురించి చెప్పక్కర్లేదు.
సిక్కు మగాళ్లు తలపాగా ధరిస్తారు. సిక్కు ఆడవాళ్లు నెత్తిమీద ముసుగు వేసుకుంటారు. అది వారి సంప్రదాయం.సిక్కోలు (శ్రీకాకుళం) స్త్రీలు రవికెలు వేసుకోరు. చీరెపైటను ఎదమీద నిండుగా కప్పుకుంటారు. దాన్ని ఎవరూ తప్పుపట్టడం లేదు.
కేరళలో నంబూద్రి బ్రాహ్మణులు ట్రావెంకోర్ రాజుల సహకారంతో స్త్రీలు రవికె ధరించడాన్ని నిషేధించడమే కాదు, వాళ్ల రొమ్ముల మీద పన్నులు వేశారు. అమ్మ నంగేళి ఆ రెండు వక్షోజాలను కోసి పన్ను వసూలు చేయడానికి వచ్చిన వాళ్ల చేతిలో పేట్టి కన్నుమూసింది. ఆ దెబ్బతో నాడార్ జాతి సాయుధ పోరు చేసి ఆ దుర్మార్గానికి చరమగీతం పాడింది. అయినా ఇప్పటికీ కేరళ స్త్రీలలో సంప్రదాయవాదులు పైటను వేసుకోరు.
నేను ముప్పై యేళ్ల కింద చత్తీస్గఢ్ అడవులలో పర్యటించినప్పుడు కోయ, గుత్తికోయ స్త్రీలను మొలకు చిన్న గుడ్డతో, పురుషులను కూడా అలాగే చూశాను. ఇప్పుడు మావోయిస్టుల వల్ల వాళ్లు నిండుగా బట్టలు వేసుకుంటున్నారు.
ఆఫ్రికా దేశాలలో బట్టలు వేసుకోవడం తెలియని జాతులు చాలా వున్నాయి. ఆడవాళ్లు పైభాగాన్ని అనాఛాదితంగా వుంచుకొని సామూహికంగా నర్తించే వీడియోలు ఎన్నో చూశాము. ఆదిమ తెగల సంప్రదాయాలు ఆధునిక కాలంలో కూడా కొనసాగుతున్నాయి.
కాబట్టి బహుళ సంస్కృతుల బహుళవస్త్రధారణ సంస్కృతులను గుర్తించే ఒక పరంపర వేల యేళ్లుగా కొనసాగుతుంది. రాజకీయ ప్రయోజనాల కోసం, ఒక రాష్ట్రంలో ఎన్నికలలో గెలుపు కోసం హిజాబ్ మీదనో నఖాబ్ మీదనో వివాదం రేపి లబ్ధి పొందాలని చూసే పద్ధతి సమాజానికి మేలు చేయదు. దేశ నిర్మాణం మతాల వారి విభజన వల్ల జరగదు. ఆర్ఎస్ఎస్ వాదనలు, బిజెపి వాదనలు దేశాన్ని అనేక ముక్కలుగా చేసి, అరాచకం ప్రబలడానికి దోహదం చేస్తుంది. హిందూ ఇండియా, ముస్లిం ఇండియా, దళిత్ ఇండియా, బిసి ఇండియా, ట్రైబల్ ఇండియా, వుమెన్ ఇండియా, క్రిస్టియన్ ఇండియా అని విడగొట్టాలని ఆ పార్టీ లక్ష్యం లా వుంది.
నాకేమనిపిస్తుంది అంటే, రాజ్యాంగ వ్యతిరేకులకు, సనాతనవాదులకు ఒక ప్రత్యేక భూభాగాన్ని ఒక దేశంగా ఇచ్చేస్తే బిజెపి శాంతించేలా వుంది. నిత్యానంద కైలాసాన్ని ఏర్పాటు చేసుకున్నట్టు ఆర్ఎస్ఎస్ కు ఒక దేశాన్ని ఇస్తే సమస్య పరిష్కారం అవుతుందేమో ఆలోచించండి.
– డా. జిలుకర శ్రీనివాస్
ద్రవిడ బహుజన సమితి