– జూమ్ లో మాట్లాడి విద్యార్థుల యోగ క్షేమాలు తెలుసుకున్న చంద్రబాబు
అమరావతి: ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన తెలుగు విద్యార్థులు దైర్యంగా ఉండాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సూచించారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన విద్యార్థులతో జూమ్ ద్వారా మాట్లాడి యోగక్షేమాలు తెలుసుకున్నారు. 100 మందికిపైగా విద్యార్థులు కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. తెలుగు విద్యార్థులంతా సహకరించుకోవడంతో పాటు…పరిస్థితులపై తటస్థంగా ఉండటం ఎంతో మంచిదని చంద్రబాబు సూచించారు.
స్థానిక పరిస్థితులకు అనుగుణంగా సమయస్ఫూర్తితో వ్యవహరించటం ఎంతో కీలకం అని చెప్పారు. పాస్ పోర్ట్ సహా ఇతర ఆధారాలు ఎప్పుడూ వెంటే ఉంచుకోవడం మంచిదనే సూచనలు పాటించాలని చంద్రబాబు అన్నారు. ఉక్రెయిన్ లో చిక్కుకుపోయిన వారిని టీడీపీ ఎన్ఆర్ఐ సెల్ ద్వారా ఆదుకునేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సహాయం చేసేందుకు టిడిపి ఎన్ఆర్ఐ సెల్ ద్వారా కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆ వివరాలు కూడా విద్యార్థులకు అందించారు. పలువురు విద్యార్థులు ఇప్పుడు స్థానికంగా ఉన్న పరిస్థితులను వివరించారు. ఉక్రెయిన్ లో వేరు వేరు ప్రాంతాల్లో చాలా ఏళ్ల క్రితం స్థిరపడిన కుమార్, దివ్యా రాజ్ లు బాధిత విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఉన్న ప్రాంతాల నుంచి విద్యార్థులు బయటకు రావద్దని వారు విద్యార్థులకు సూచించారు. తమ వద్ద రెండు రోజులకు సరిపోను ఆహారం మాత్రమే ఉందని…బాంబు దాడుల కారణంగా మెట్రో స్టేషన్ లోనే ఉండిపోయామని కొందరు తెలిపారు.
స్వయంగా అక్కడి పరిస్థితిని విద్యార్థులు చంద్రబాబు కు ఫోన్ ద్వారా చూపించారు. పోలెండ్, హంగేరీ బోర్డర్ లకు వెళ్లేందుకు తాము ప్రయత్నాలు చేస్తున్నా….వాహనాలు లేక ఇబ్బందులు పడుతున్నాం అని వివరించారు. తాము ఉన్న ప్రాంతం నుంచి పశ్చిమ ప్రాంతానికి వెళ్ళడం ప్రధాన సమస్యగా మారిందని చెప్పారు. ప్రస్తుతం బంకర్స్ లో తల దాచుకున్నామని విద్యార్థులు చెప్పారు. ఉక్రెయిన్ లో ఉన్న ఇతర దేశాల యువత ను కూడా ఆర్మీ లోకి రమ్మని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.
కేంద్ర విదేశాంగ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడి విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలని కోరుతానని తెలిపారు. ఇప్పటికే విద్యార్థులకు సహాయం కోరుతూ కేంద్రానికి లేఖ రాశానని… కేంద్రంతో సంప్రదింపులు కొనసాగిస్తానని చంద్రబాబు విద్యార్థులకు తెలిపారు.