జగన్ రెడ్డికి కాపులంటే ఎందుకంత కక్ష?

– కాపులకు రిజర్వేషన్లు నిలిపివేసినట్లు పవన్ సినిమాను నిలిపేస్తారా?
– రాష్ట్రంలో ఏ సినిమాకి లేని ఆంక్షలు ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాకే ఎందుకు?
– తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు అనగాని సత్య ప్రసాద్

వైసీపీ పాలనలో కాపులకు జరిగిన న్యాయం కంటే జరిగిన అన్యాయమే ఎక్కువ. జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాపులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ సినిమాపై ప్రభుత్వం కక్ష సాధిస్తోంది.

రాష్ట్రంలో కాపు రిజర్వేషన్లు, కాపు భవన్ లు నిలిపివేసినట్లుగానే పవన్ కళ్యాణ్ సినిమాను కూడా నిలిపివేస్తారా? రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి, కానీ ఏ సినిమాకి లేని ఆంక్షలు ఒక్క పవన్ కళ్యాణ్ సినిమాకు మాత్రమే ఎందుకు ? వైసీపీ ప్రభుత్వం ఒక్క పవన్ కళ్యాణ్ ని ఇబ్బంది పెట్టేందుకు వేలాదిమంది సినీ కార్మికుల జీవితాల్ని ఇబ్బందులకు గురి చేస్తోంది. కాపులకు ప్రభుత్వం అందించే పధకాల నుంచి పవన్ కళ్యాణ్ సినిమా వరకు అన్నింటిపై జగన్ రెడ్డి కక్షసాధింపు చర్యల్ని బట్టి ఇది కాపు వ్యతిరేక ప్రభుత్వమని కాపులు గ్రహించాలి.

చంద్రబాబు నాయుడు కాపులకు పెద్దపీట వేస్తే జగన్ రెడ్డి కత్తిపీట వేశారు. టీడీపీ హయాంలో కాపు విద్యార్థులకు విదేశీ విద్యకోసం ఏటా రూ.1,500 కోట్ల నిధులను ఖర్చు చేస్తే… వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ‎ విదేశీ విద్యను రద్దు చేసి.. విదేశాల్లో చదువుకుంటున్న ‎కాపు విద్యార్ధుల భవిష్యత్‌ను అగమ్యగోచరంగా మార్చింది. పోటీ పరీక్షలకు సిద్దమయ్యే కాపు విధ్యార్దులకు డిల్లీలోని ఏపీ భవన్ లో వసతి ఏర్పాటు చేస్తే జగన్ రెడ్డి దాన్ని రద్దు చేసి ఏపీ భవన్ ని వైసీపీ భవన్ గా మార్చారు.

మరోవైపు.. కాపు కార్పొరేషన్‌ను అలంకార ప్రాయంగా మార్చి ‎కాపు యువతకు ఉపాధి అవకాశాల్లేకుండా అన్యాయం చేశారు. ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలె స్ మీద పెట్టిన శ్రద్ద కాపు కార్పోరేషన్ మీద ఎందుకు పెట్టడం లేదు? ఒక్క రోజైనా కాపు కార్పోరేషన్ పై సమీక్ష చేశారా? వైసీపీ పాలనలో కాపులకు ఏం చేశారో గుండెమీద చేయివేసుకుని ముఖ్యమంత్రి చెప్పగలరా? చంద్రబాబు నాయుడు కాపులకు అన్నంపెడితే జగన్ రెడ్డి వారి కడుపు కొడుతున్నారు. టీడీపీ ప్రభుత్వం బీసీలకు అన్యాయం జరగకుండా కాపులకు ఐదు శాతం రిజర్వేషన్లను కల్పిస్తే వాటిని కూడా జగన్‌ రద్దు చేసి కాపులపట్ల తనకున్న ధ్వేషాన్ని బహిరంగంగానే చాటుకున్నారు.

కాపు భవన్‌లు రద్దు చేశారు. నామినేటెడ్ పోస్టుల్లో సైతం కాపులకు ప్రాధాన్యత ఇవ్వకుండా వారిని రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అణగద్రొక్కుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాపై ఆంక్షలు విధించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారు. ఇది కాపు వ్యతిరేక ప్రభుత్వమని కాపులు గుర్తించాలి.

Leave a Reply