Suryaa.co.in

Features

కాషాయ కండువాల పిల్లలకు ఉత్తరం

కర్నాటకలో హిజాబ్ ధరించిన సహ విద్యార్థుల మీద కాషాయ కండువాలు కప్పుకున్న కొందరు విద్యార్థులు జరిపిన దౌర్జన్యాల నేపథ్యంలో వారిని ఉద్దేశించి హితవు పలుకుతున్నారు మీనా కందసామి

ప్రియమైన కాషాయ కండువాల బాల బాలికల్లారా,
నమస్కారం!
మిమ్మల్ని ఎప్పుడూ కలవకపోయినా మీకు ఉత్తరం రాసే చనువు తీసుకుంటున్నాను. మీ వీడియోలు మొదటిసారి చూసినప్పుడు నాకు చాల భయం కలిగిందని మీకు చెప్పకతప్పదు. మనందరి ఉమ్మడి దేశమైన భారతదేశంలో ఇటువంటిది జరుగుతుందని నేను నమ్మలేకపోయాను. నా భయం మీరేదో ప్రమాదకరమైనవాళ్లని కాదు, నా దృష్టిలో మీరింకా చిన్నారి పిల్లలే. కాని అత్యంత విచ్ఛిన్నకర శక్తులు మిమ్మల్ని వాడుకుంటున్నాయని చూసి నాకు భయం వేసింది. నాకు అక్కడికి వచ్చి మిమ్మల్ని కలవాలని, మీతో కలిసి కూచుని మాట్లాడాలని ఉంది. కాని ఈలోగా, మీతో సంభాషించడానికి ఒక ఉత్తరం రాయడమైనా మేలని అనిపించింది.

ప్రియమైన విద్యార్థులారా, నా వయసు ముప్పై ఏడేళ్లు. అంటే మీ వయసుకు రెట్టింపు కన్న ఎక్కువ. మీకు ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చిన మరో పెద్ద మనిషిగా నన్ను కొట్టిపారెయ్యరని ఆశిస్తున్నాను. నేనేమీ మీకేదో సలహా ఇవ్వడానికి రాలేదు. నేను చేయదలచినదల్లా మన దేశ చరిత్ర గురించి నాతో పాటు ఆలోచించమని, అనుభూతి చెందమని, పునస్సమీక్షించమని అడగడం మాత్రమే.

మీకు చరిత్ర బోధించినవాళ్లు బ్రిటిష్ వారి గురించీ, వలసవాదం గురించీ, ప్రపంచ యుద్ధాల గురించీ, స్వాతంత్ర్యోద్యమం గురించీ చెప్పే ఉంటారు. నా పాఠశాలలో నేను కూడా అదే చరిత్ర నేర్చుకున్నాను. అయితే కథలో అది ఒక భాగం మాత్రమే. మన నుంచి దూరంగా ఉంచబడిన మరొక చరిత్ర ఉంది. అది భారతదేశంలో విద్య చరిత్ర. ప్రత్యేకించి భారతదేశపు హిందువులలో విద్య చరిత్ర.
అది మొదలైన చోటనే మొదలుపెట్టాలంటే, విద్య అనేది ప్రతి ఒక్కరికీ సంబంధించిన ఉమ్మడి అంశమని హిందూ సమాజం అనుకోనే లేదని గుర్తు పెట్టుకోండి. విద్యా పొందడం ప్రతి ఒక్కరి హక్కు అని హిందూ సమాజం అంగీకరించలేదు. బ్రాహ్మణులూ, ద్విజులూ మాత్రమే విద్య పొందగలిగేవారు. శూద్రులను చదువు నుంచి దూరం పెట్టారు. శూద్రులు వేదాన్ని కనీసం వింటే కూడా వారి చెవుల్లో సీసం కరిగించి పోయాలని మనుస్మృతి ఆదేశించింది.

శూద్రులు వేదాలను ఉచ్చరిస్తే వారి నాలుకను కత్తిరించాలని మనుస్మృతి ఆదేశించింది. అయితే బ్రాహ్మణులలో, సవర్ణులలో కూడ అందరూ విద్య నేర్చుకునే అవకాశమేమీ లేదు. స్త్రీలను పూర్తిగా చదువుకు బైటనే ఉంచారు. చివరికి ఒక వంద సంవత్సరాల కింద కూడా, వందమంది స్త్రీలలో ఇద్దరికో, అంతకన్న తక్కువకో మాత్రమే చదువూ రాతా వచ్చేవని జనగణన నివేదికలు మీకు తెలియజెపుతాయి.

కొంత మంది ప్రజలను విద్యకు దూరంగా ఉంచడం, అది కూడా అత్యంత భయానకమైన హింస బెదిరింపులతో వారిని విద్యకు దూరం చేయడం అనేది మన మతపు మూల రహస్యాలలో మిళితమై ఉంది. ఇటువంటి విద్య నిరాకరణకు వ్యతిరేకంగానే మన మహత్తరమైన విప్లవకారులెందరో పోరాడారు. ప్రతి ఒక్కరికీ విద్య ద్వారాలను తెరవడం ద్వారా వారు ఉదాహరణప్రాయంగా నిలిచారు.

మహారాష్ట్రలో సావిత్రీబాయి ఫూలే, జోతీరావు ఫూలే శూద్ర, అతిశూద్ర బాలికల కోసం 1848 లోనే మొట్టమొదటి పాఠశాలను స్థాపించారు. స్త్రీలు విద్య నేర్చుకోవడానికి వీలులేదని నిషేధం విధించిన బ్రాహ్మణీయ పితృస్వామ్యానికి అది ఒక సవాల్. సావిత్రీబాయి ఫూలే తన పాఠశాలలో బోధించడానికి వెళ్తున్నప్పుడు ప్రత్యర్థులు ఆమె మీద పేడ విసిరే వారు. స్త్రీ విద్య అంటే మన సమాజానికి ఎంత వ్యతిరేకతో అది చూపుతుంది. క్రాంతిజ్యోతి సావిత్రీబాయితో పాటు నడిచి, ఆ దాడులను ఎదుర్కొని పాఠశాలకు వెళ్లి బోధించిన మరొక వ్యక్తి ఎవరో మీకు తెలుసా? ఆ వ్యక్తి ఫాతిమా షేక్, ఒక ముస్లిం మహిళా ఉపాధ్యాయురాలు.

కేరళలో మరొక భిన్నమైన కథ ఉంది. మహాత్మా అయ్యంకలి 1904లో వెంగనూరులో దళిత పిల్లల కోసం పాఠశాల ఏర్పాటు చేయడానికి ప్రయత్నించినప్పుడు, అదే రోజు సవర్ణ హిందువులు ఆ పాఠశాలను తగులబెట్టారు. ఆయనే బలరామపురం లోని ఉరుత్తంబలం పాఠశాలలో దళిత బాలిక పంచమిని చేర్చడానికి 1910లో ప్రయత్నించినప్పుడు, హెడ్ మాస్టర్ ఆమెను చేర్చుకోవడానికి నిరాకరించాడు. ఆ పరిణామం దళిత వ్యతిరేక హింసాకాండకు దారి తీసింది.

నాయర్లు పులయార్ల ఇళ్లు తగులబెట్టారు. వారి పశువులను ఎత్తుకుపోయారు. దళిత స్త్రీలమీద అత్యాచారాలు చేశారు. దళిత పురుషులను కొట్టారు. దక్షిణ తిరువాన్కూరు లోని పాఠశాలల్లో పులయార్ పిల్లలను చేర్చుకోవడానికి వీలులేదని నాయర్లు అడ్డుకున్నారు. ఈ మూకుమ్మడి నిషేధానికి వ్యతిరేకంగా పోరాడుతూ అయ్యంకలి వ్యవసాయ కూలీల సమ్మెకు పిలుపు ఇచ్చాడు. తన జాతి ప్రజలను నాయర్ల వ్యవసాయ క్షేత్రాల్లో పని మానెయ్యమని అడిగాడు. ఒక్క పులయార్ స్త్రీ చేసే పని చేయడానికి ఆరుగురు నాయర్ పురుషులు అవసరమయ్యారని వార్తాపత్రికల్లో వార్తలు వచ్చాయి. శారీరక శ్రమ అనేది అగ్రవర్ణాలకు ఎంత తెలియని పనో అది చూపింది. నాయర్లు దిగివచ్చి, ప్రభుత్వ, సాముదాయక పాఠశాలల్లో దళిత పిల్లలు చదువు నేర్చుకోవడానికి ఆమోదించారు.

ఆధునిక భారత పిత, భారత రాజ్యాంగపు ప్రధాన నిర్మాత డా. అంబేడ్కర్ ఈ విద్యా హక్కును ఈ దేశపు చట్టంలో ప్రవేశపెట్టారు. మనలో ఏ ఒక్కరి పైనా మన మతం ప్రాతిపదికనో, మన కులం ప్రాతిపదికనో వివక్ష చూపడానికి వీలు లేదని సమానత్వ హక్కు చెపుతుంది.

డా. అంబేడ్కర్ మౌలిక భావనల అడుగుజాడల్లో నడుస్తూ తంతై పెరియార్ తమిళనాడులో 1951లో జరిపిన నిరసన ప్రదర్శనలు భారత రాజ్యాంగంలో మొదటి సవరణకు దారి తీశాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల, లేదా షెడ్యూల్డ్ కులాల, షెడ్యూల్డ్ తెగల ప్రగతి కోసం రిజర్వేషన్ వంటి సానుకూల చర్యలు తీసుకోవడానికి రాజ్యానికి మొదటి రాజ్యాంగ సవరణ అవకాశం ఇచ్చింది. పెరియార్ మరొక చిరస్మరణీయమైన పోరాటానికి కూడా నాయకత్వం వహించారు.
పాఠ్యాంశాలలో వంశ పారంపర్య విద్యను తిరిగి ప్రవేశపెట్టాలనే ప్రయత్నాలను ఆయన అడ్డుకున్నారు.
కులకల్వి తిట్టం, వంశ పారంపర్య వృత్తి, కుల వృత్తుల విద్య కొనసాగితే మనందరమూ మన తల్లిదండ్రుల సాంప్రదాయిక వృత్తిని మాత్రమే నేర్చుకోవలసి ఉండేది. అది ఒక చెరసాల లాంటి కట్టుగొయ్య. అది కొనసాగితే భయానక కుల వ్యవస్థ నుంచి బైటపడే అవకాశాన్ని విద్య మనకు ఎప్పటికీ ఇవ్వగలిగేది కాదు.

భారతీయ విద్యకు ఉండిన ఈ బ్రాహ్మణీయ పితృస్వామిక స్వభావాన్ని బద్దలు గొట్టడానికి జరిగిన ఈ పోరాటం, విద్య మనందరికీ చెందినదని మన హక్కును నిలుపుకునే పోరాటం ఇవాళ్టికీ కొనసాగుతూనే ఉంది. విద్యారంగంలో మండల్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలనే పోరాటమైనా, వైద్య కళాశాల సీట్లలో వెనుకబడిన కులాల రిజర్వేషన్ అమలు చేయాలనే పోరాటమైనా, నీట్ కు వ్యతిరేక పోరాటమైనా, నూతన విద్యా విధానానికి వ్యతిరేక పోరాటమైనా, రోహిత్ వేముల ఉదంతమైనా, ఫాతిమా లతీఫ్ ఉదంతమైనా మనకు చూపుతున్నదేమంటే ఆ పోరాటం ఇంకా ముగిసిపోలేదు.

భారతదేశంలో ప్రభుత్వ విద్యా రంగం ఉన్నదంటే అణగారిన కులాలకూ, మత మైనారిటీలకూ చెందిన ప్రజలు సమీకృతమై దాని కోసం పోరాడారు గనుక మాత్రమే. విద్యా శిక్షణ, నూత్న భావాల సృష్టి అనేవాటిలో ఏ ఒక్క వ్యక్తినీ పక్కన పెట్టడానికి వీలులేదని వారు పోరాడారు. ప్రభుత్వ విద్యా రంగం అనే భావనకు కచ్చితమైన అర్థం అదే. ఏ ప్రాతిపదికనగానీ ఏ ఒక్కరినీ విద్యకు దూరం చేయగూడదనేదే.

ఇవాళ ఏమి జరుగుతున్నదో మీరు తెలుసుకోవాలనే కోరికతోనే ఇంత సుదీర్ఘమైన, కష్టతరమైన చరిత్రను చెప్పాను. హిజాబ్ ధరించిన ముస్లిం మహిళలకు విద్యారంగపు తలుపులు మూసివెయ్యడమనే పరిణామం నేను పైన చెప్పిన పీడక వ్యవస్థలో భాగమే.
మీతో ఏమేమి చేయించారో చూడండి. మీతో కాషాయ కండువాలు ధరింపజేశారు. మిమ్మల్ని విద్యాలయాలలోకి కవాతు చేయించారు. నేను ఒక హిందూ మహిళగా పుట్టాను. నా జీవితంలో ఇన్ని సంవత్సరాలలో మా ఇంట్లో ఒక కాషాయ కండువా నేనెప్పుడూ చూడలేదు. మా నాన్న ఒకప్పుడు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ పూర్తి కాలం ప్రచారక్ గా ఉండేవారు. ఆ సంస్థలో అమలయ్యే మనువాద కుల ఆధిక్యతను, మైనారిటీల పట్ల ద్వేషాన్ని, ప్రాంతీయ భాషల పట్ల ద్వేషాన్ని చూసి ఆయన ఆ సంస్థను వదిలేశారు.
పూర్తిగా మెదడు నిండా ఆ భావాలు నింపుకున్న సంఘీ కూడ ఆ ద్వేషాన్ని వదిలే అవకాశం వచ్చినప్పుడు ఎట్లా ప్రవర్తించాడో నా కళ్లారా చూశాను గనుక మీకు రాస్తున్నాను. మీరు కూడ ఒక కొత్త మనిషి కాగలరు. మీరు కూడ ఒక మెరుగైన వ్యక్తి కాగలరు. ద్వేష రాజకీయాలకు మీరు ముగింపు పలకగలరు.

మన దేశంలో విద్యారంగంలో వేలాది సంవత్సరాల పాటు వ్యాపించిన బ్రాహ్మణాధిక్యత మీద మీరు ఎందుకు పోరాడవలసి ఉంది?ఈ వ్యవస్థ పర్యవసానాలు సుదీర్ఘమైనవి, విస్తారమైనవి. మనువాద కులాధిక్య అవగాహన కేవలం బ్రాహ్మణ పురుషుడిని మాత్రమే మేధావిగా చూస్తుంది. అతనికి మాత్రమే విద్య పొందే యోగ్యత ఉందనుకుంటుంది. అతడు మాత్రమే మేధస్సుకూ, ఆలోచనకూ సమర్థుడంటుంది. మిగిలినవాళ్లందరమూ తెలివికీ, విద్యకూ సమర్థత లేనివాళ్లంగా చూసే ఈ కుల వ్యవస్థ మనను ఆలోచన లేని మనుషులుగా, అహేతుకమైన దద్దమ్మలుగా, మందలోని పశువులుగా భావిస్తుంది. మిమ్మల్ని ఈ వ్యవస్థ కాల్బలపు సైనికులుగా భావిస్తుంది.

మీరు ఆ కాషాయ కండువాలు వేసుకుని, ఆ కవాతుల్లో పాల్గొన్నప్పుడు, గుర్తుపెట్టుకోండి, మీరు సరిగ్గా ఆ మంద లోని పశువులుగానే ఉన్నారు. స్వతంత్ర ఆలోచనకు శక్తి లేనివారుగానే ఉన్నారు. మానవ సహజమైన స్పందనలు లేనివారుగా ఉన్నారు. ఆధునిక కాలపు హిట్లర్లు ఇచ్చే ఆదేశాలను గుడ్డిగా అనుసరించి కవాతు చేసే మెదడు లేని తెలివితక్కువ దద్దమ్మలుగా ఉన్నారు. మిమ్మల్ని మీరు ఇలా చూసుకోవడం మీ మేధాశక్తికే అవమానం. మీ తాతముత్తాతలు గాని, అమ్మమ్మ నాయనమ్మలు గాని ఈ మిలమిల మెరిసే కండువాలు కప్పుకుని పాఠశాలలకో, కళాశాలలకో వెళ్లడం మీరు ఎప్పుడైనా చూశారా? ఈ కొత్త దుస్తులు పుట్టగొడుగుల్లాగ ఎక్కడినుంచి పుట్టుకొస్తున్నాయి? ఏ ప్రయోగశాలల్లో అవి తయారయ్యాయి?

విద్య అంటే ఒక సమష్టి శిక్షణ, జీవిత పర్యంతం కొనసాగే సహకార, ఆదాన ప్రదాన బంధాలను రూపొందించుకునే కార్యాచరణ. అటువంటి విద్యను పొందే బదులు, మిమ్మల్ని ఈ విచ్ఛిన్నకర శక్తులు కాషాయ కండువాలు మెడలో వేసుకుని, మరొక రకమైన దుస్తులు ధరించే కొందరు విద్యార్థులను వ్యతిరేకించేలా చేస్తున్నాయి. ప్రస్తుతం ఆ వ్యతిరేకించే దుస్తులు హిజాబ్ కావచ్చు, కాని రేపు అది మరేమైనా కావచ్చు. ఈ మతోన్మాద శక్తులు మిమ్మల్ని ఏకాకి జీవితానికి, ద్వేషం నిండిన జీవితానికి కట్టిపడేయడానికి ప్రయత్నిస్తున్నాయి. అక్కడ నేర్చుకునే పాఠాలలో ఏ ఒక్కటీ ఉత్పత్తిదాయకమైనది కాదు, ప్రాముఖ్యత కలిగినది కాదు. అది నిజమైన విద్యకు పూర్తిగా విరుద్ధమైనది.

నా ప్రియమైన చిన్నారులారా, గుర్తుంచుకోండి, ఇంత పెద్ద ఎత్తున ద్వేషాన్ని ఆచరించే సమాజం ఎప్పటికీ తనను తాను ఆరోగ్య సమాజమని చెప్పుకోజాలదు. అది సంతోషంగా, సంతృప్తికరంగా, ఆరోగ్యకరంగా ఉన్న ప్రజలతో కూడిన సమాజం కాజాలదు. ఈ విభజన, ద్వేషం అనే మృతప్రాయమైన అడుగుజాడలనే మీరు అనుసరిస్తే మీ ఊహాశక్తి కురచబారుతుంది. మీ భావాలు వక్రీకరణకు గురవుతాయి. ద్వేషం ఎప్పుడైనా ప్రమాదకరమైనదనే అవగాహన పునాది మీదనే ఆత్మగౌరవపు జీవితం మొదలవుతుంది.

ఆ ద్వేషం ముస్లింలకు, దళితులకు, ఆదివాసులకు, స్రీలకు, ఎవరికి వ్యతిరేకంగానైనా కావచ్చు. విద్య అనేది మనకు ఇవాళ ఉన్న శక్తి సామర్థ్యాలను అధిగమించి చూసే అవకాశాలను ఇస్తుంది. అందువల్ల పూర్తిగా భిన్నమైనదాన్ని ఊహించండి. ఈ ద్వేష, విభజన శక్తులను నిరాకరించే అవకాశం ఇప్పుడు మనకు ఉంది. మనుషులను పక్కనపెట్టే, దూరం చేసే, పీడించే వ్యవస్థలను యథాతథంగా ఉంచాలనుకునే శక్తులను నిరాకరించే అవకాశం ఇప్పుడు మనకు ఉంది. మనం ఒక కొత్త దాన్ని ఊహించగూడదని కట్టడి చేసే శక్తులను నిరాకరించే అవకాశం ఇప్పుడు మనకు ఉంది. వాళ్లు మనను పాత కు బందీలుగా ఉండాలని ఆశిస్తున్నారు. ఆ జైళ్లను బద్దలు కొడితేనే మీరు మెరుగ్గా ఉండగలరు.

హిజాబ్ ధరిస్తున్న మీ అక్కాచెల్లెళ్లతో పాటు నిలబడండి.ముస్లిం స్త్రీలు మీకు శత్రువులు అని వాళ్లు మీకు చెపుతున్నారు. ఆ విద్వేష ప్రచారానికి బలి కాకండి. వాళ్లు మీ దృష్టిని మళ్లించాలని చూస్తున్నారు. వాళ్లు ఇవాళ్టి యువతరం ముందు ఉండవలసిన నిజమైన సమస్యల మీద దృష్టి కేంద్రీకరించకుండా పక్కకు తప్పించదలచారు. మన ఆర్థిక వ్యవస్థకు ఏమవుతున్నది? మన భవిష్యత్తు కోసం మనకు ఉద్యోగాలు ఎక్కడ దొరకనున్నాయి? అనేవే ఆ ప్రశ్నలు. నాణ్యమైన విద్య, ఉచిత విద్య, ఉద్యోగాలు, మంచి భవిష్యత్తుకు హామీ అనే మీ హక్కుల కోసం మీరు సంఘటితం కాకుండా మిమ్మల్ని పక్కకు తప్పించే ఈ ప్రయత్నానికి బలి అయి, ఒక దారితప్పిన తరంగా, ఎక్కడా లేకుండా పోయిన తరంగా మిగిలిపోనున్నారా?
గుర్తుంచుకోండి, భవిష్యత్తు కోసం పోరాడకపోతే, యువతరానికి భవిష్యత్తు లేదు.
(మీనా కందసామి సుప్రసిద్ధ కవి, నవలా రచయిత, పరిశోధకురాలు)

తెలుగు: ఎన్ వేణుగోపాల్ 
వీక్షణం మార్చ్ 2022 సంచిక కోసం

LEAVE A RESPONSE