– నాలుగున్నరేళ్లుగా అభయహస్తం పెన్షన్ ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
– అసెంబ్లీ సాక్షిగా వాపస్ చేస్తామని ప్రకటించి ఏడాదిన్నర దాటింది
– ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రశ్నించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
– ముదిగొండ మండలం లో మూడో రోజు కొనసాగిన (పాదయాత్ర) పీపుల్స్ మార్చ్
– సీఎల్పీ నేత కు సమస్యలు ఏకరువు పెట్టిన సమభావన మహిళా సభ్యులు
డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్ ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన అభయ హస్తం పథకాన్ని టిఆర్ఎస్ సర్కార్ నిర్వీర్యం చేసి మహిళలను మోసం చేసిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రీమియం డబ్బులు చెల్లించిన వారికి అభయహస్తం పెన్షన్ ఇవ్వలేనందున తిరిగి డబ్బులు వాపసు ఇస్తామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించి ఏడాదిన్నర గడిచిన డబ్బులు వాపసు ఇవ్వలేదన్నారు. 2014 వరకు మహిళలు చెల్లించిన అభయాస్తం ప్రిమీయం డబ్బులు రూ.1500 కోట్లు ఏం చేశారని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు.
ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పై ఒత్తిడి పెంచడానికి భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ పాదయాత్ర మంగళవారం ముదిగొండ మండలం చిరుమర్రి, సువర్ణపురం, న్యూ లక్ష్మీపురం, ఖానాపురం గ్రామాల్లో విజయవంతంగా కొనసాగింది. ఈ క్రమంలో మహిళలు, రైతులు, నిరుద్యోగులు తమ సమస్యలను సీఎల్పీ నేత కు విన్నవించారు.
ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సభలలో భట్టి విక్రమార్క గారు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 2009 లో కాంగ్రెస్ ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు 60 ఏళ్లు దాటిన తర్వాత పింఛన్ ఇవ్వడానికి అభయ హస్తం పథకాన్ని తీసుకురావడంతో 23, 38, 014 మంది మహిళలు రోజుకు రూపాయి చొప్పున ఏడాదికి 365 చెల్లిస్తే అంతే మొత్తంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జమ చేసిందన్నారు.
తెలంగాణ ఏర్పాటు నాటికి 2.20 లక్షల మందికి అభయ హస్తం పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం పెన్షన్ ఇచ్చిందని గుర్తు చేశారు. 2015 నుంచి తెలంగాణ ప్రభుత్వం ఆసరా పెన్షన్ స్కీమ్ పెట్టీ 1,33, 415 మంది అభయ హస్తం సభ్యులను ఆసరా పరిధిలోకి మార్చారన్నారు. మిగతా 86 585 మందికి 2016 అక్టోబర్ నుంచి అభయహస్తం పెన్షన్ నిలిచిపోయిందని వివరించారు. ఐదున్నర ఏళ్లుగా అభయహస్తం పెన్షన్ దారులకు ఎలాంటి పెన్షన్ రాక దీన స్థితిలో ఉన్నప్పటికి టిఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.
2014 సంవత్సరం వరకు డ్వాక్రా మహిళలు చెల్లించిన అభయహస్తం ప్రీమియం డబ్బులు రూ.1500 కోట్లు సర్కార్ వద్దనే ఉన్నాయని, వీటిని వాపస్ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ప్రకటించి ఏడాదిన్నర కావస్తున్నా తిరిగి చెల్లించే లేదన్నారు. ఈ పదిహేను వందల కోట్లు సర్కారు దగ్గరే ఉన్నాయా లేక డ్రా చేసి ఇతర పథకాలకు మళ్ళించారా? అన్నది ప్రభుత్వం ప్రకటించాలని డిమాండ్ చేశారు.
గత నాలుగు సంవత్సరాలుగా మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని విమర్శించారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆమ్ ఆద్మీ భీమా యోజన పథకాన్ని కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకుండా అటకెక్కించడం వల్ల సమ భావన సంఘాల మహిళలు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వీరి సమస్యల సాధన కోసమే తాను పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నానని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
ఎన్నికల హామీలు ఒకటైన అమలు చేశారా?
“ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒకటైన అమలు చేశారా? ప్రతి నియోజకవర్గంలో వంద పడకల ఆసుపత్రి ఏది? లక్షల ఎకరాలకు సాగునీరు ఏది? డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఏవి? కేజీ టు పీజీ విద్య ఏమైంది? రెసిడెన్షియల్ స్కూల్లు ఏమైనాయి? ఇంటికో ఉద్యోగం ఏది? దళితులకు 3 ఎకరాల భూమి పంపిణీ ఎప్పుడు? వీటిలో ఏ ఒక్కటీ అమలు చేయకుండా బంగారు తెలంగాణ ఎలా అయ్యింది అని” సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు.మధిరలో నాలుగు అడుగులతో ప్రారంభమైన పాదయాత్ర పెను ఉప్పెనగా మారి రాష్ట్రాన్ని చుట్టేస్తుందన్నారు.
సీఎల్పీ నేతకు సమస్యల ఏకరువు
రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం లేదని చిరుమర్రి గ్రామంలో సీఎల్పీ నేత విక్రమార్క నిర్వహించిన పాదయాత్ర వద్దకు కృషి సంఘ బంధం డ్వాక్రా మహిళా సభ్యులు వచ్చి తమ ఇబ్బందులు ఏకరువు పెట్టారు. పావలా వడ్డీ రుణాలు కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వడం లేదని, అధికార పార్టీలో ఉన్న వారికి మాత్రమే రుణాలు ఇస్తున్నారని సంఘ బంధం లీడర్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. రూ. 50 వేల రుణం తీసుకుంటే ఇప్పుడు 20 వేల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. స్త్రీ నిధి కింద ఇచ్చే రుణానికి రూపాయి చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారని, తీసుకున్న రుణానికి వడ్డీ సరిసమానం కావడంతో నెల, నెల కిస్తులు చెల్లించడానికి మళ్లీ అప్పు చేస్తున్నామన్నారు. చిరుమర్రి గ్రామం నుంచి గత ఐదేళ్ల లో అభయ హస్తం ప్రీమియం డబ్బులు ఐదు లక్షల రూపాయలు చెల్లించిన తమకు పెన్షన్ ఇవ్వడం లేదన్నారు. తాము చెల్లించిన ప్రీమియం డబ్బులు అడిగినప్పటికీ అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా గ్రామ దీపికలు క్షేత్ర స్థాయిలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. చాలీచాలని గౌరవ వేతనం ఇచ్చి తమతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటున్నదని ఏకరువు పెట్టారు. ఈ క్రమంలోనే లక్ష్మి అనే మహిళ వచ్చి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు దరఖాస్తు చేసుకుని నాలుగేళ్లు అవుతున్న ఇంతవరకు రాలేదని, తనకు ఇళ్లు ఇప్పించాలని వేడుకుంది. ఆనంద్ రావ్ అనే రైతు ప్రత్యేకంగా నాగలిని తయారుచేయించి భట్టివిక్రమార్క కు బహుకరించారు.
ఈ సందర్భంగా రైతులు పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకు వచ్చారు. రైతు సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరారు. పీజీ పూర్తి చేసిన ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్ వేయకపోవడంతో ఆరేళ్లుగా నోటిఫికేషన్ కోసం ఎదురుచూసి…ఎదురుచూసి కుటుంబ సభ్యులకు భారమవుతున్న క్రమంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్తున్నానని శ్రీకాంత్, రోడ్డుపైన వెల్డింగ్ షాప్ పెట్టుకుని బతుకుతున్నానని సువర్ణపురం లో మరో నిరుద్యోగి భట్టి విక్రమార్క ముందు వాపోయారు. “మీ అందరి సమస్యల పరిష్కారం కోసమే పీపుల్స్ మార్చ్ నిర్వహిస్తున్నామని, ప్రతి సమస్యను అసెంబ్లీలో ప్రజల గొంతుకగా తన గళం వినిపిస్తానని” భట్టి విక్రమార్క వారికి భరోసా ఇచ్చారు.
పోటెత్తిన జనాభిమానం
మూడవరోజు మంగళవారం and చిరుమర్రి సువర్ణపురం, న్యూ లక్ష్మీపురం, ఖానాపురం గ్రామాల్లో నిర్వహించిన పాదయాత్ర జనాభిమానంతో పోటెత్తింది. దారి పొడవునా ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పట్టారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పై బంతిపూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఎన్టీఆర్ విగ్రహానికి భట్టి నివాళి
ముదిగొండ మండలం చిరుమర్రి గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పాదయాత్రకు తెలుగుదేశం పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. అనంతరం గ్రామంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులు అర్పించారు. ఈ సమయంలో తెలుగుదేశం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ నినాదాలు చేశారు.
చిరుమర్రి గ్రామంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి పాదయాత్రను ప్రారంభించిన సీఎల్పీ నేత ఆయా గ్రామాల్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
శివాలయంలో భట్టి విక్రమార్క దంపతుల పూజలు
మహాశివరాత్రి పురస్కరించుకొని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆయన సతీమణి నందిని విక్రమార్క చిరుమర్రి గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. విక్రమార్క దంపతులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి ఈశ్వర దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేశారు.